శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational Others

2.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational Others

శుభమస్తు

శుభమస్తు

2 mins
402


             శుభమస్తు

             -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   సాగరికి పెళ్లీడు దాటిపోతున్నా... పెళ్లిచేసుకోవాలంటే భయపడుతుంది. మనసులో ఏదో సంఘర్షణ. ధ్యాస పెళ్లి మీదకు మళ్లడం లేదసలు. పెళ్లికి ప్రాముఖ్యత ఇవ్వాలో మానాలో తెలియని సందిగ్థతతో సతమవుతూనే ఉంది.

   ఇంట్లో చూస్తే తన తల్లిదండ్రులు పోరు ఎక్కువయ్యింది. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి...కాదనకంటూ.

   మరోపక్క...తనని మూడేళ్లుగా ఎంతగానో ఇష్టపడుతున్న కొలీగ్ సారధి నిన్నే ప్రేమిస్తున్నా...పెళ్లిచేసుకుంటాను అంటూ వెంటపడటం. 

   తన ప్రమేయం లేకుండా...ఓ మగాడితో తన జీవితం ముడిపడితే...ఆతర్వాత పరిస్థితి ఎలాసాగుతుందో అనే భయం పీడిస్తూనే ఉంది. తాను...ప్రేమ వివాహానికా..పెద్దలు కుదిర్చిన వివాహానికా...ఎటు వైపు మొగ్గు చూపాలి...? మనసులో ఎన్నో సందేహాలు వస్తూ...ఆరాత్రి నిద్రపట్టడం లేదు సాగరికి.

   పెళ్లిచేసుకున్న స్నేహితురాళ్లిద్దరూ కళ్ళముందు మెదిలారు. 

  లావణ్యది ప్రేమ వివాహం.

  శరణ్యది పెద్దలు కుదిర్చిన వివాహం.

   ఎందుకో వాళ్ళిద్దర్నీ కలిసిరావాలనిపించింది. అలా అనిపించాకా నెమ్మదిగా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.

         ***     ***    ***

   తెల్లారింది...

  ముందుగా ప్రేమ వివాహం చేసుకున్న లావణ్యని కలిసింది సాగరి. "ముందు నీ సంసారం ఎలా సాగుతుంది చెప్పు"..అంటూ కుశలప్రశ్న వేసింది.

   లావణ్య ముఖం పెద్దగా వెలగలేదు. "చెప్పడానికి ఏముంది...? ఏదో భయపడుతూ బ్రతుకుతున్నాం. మామధ్య ప్రేమ వున్నా...స్వేచ్ఛగా వుండలేకపోతున్నాం. పెద్దవాళ్లను కాదని వచ్చేసి పెళ్లిచేసుకున్నాం. ఇద్దరివైపూ పుట్టింటివాళ్ళు దూరమయ్యారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఎవరి ఆదరణా లేదు. ఎదురైనా ముఖం తిప్పుకుంటున్నారు. మంచికీ చెడుకీ కూడా ఇంటి గుమ్మం తొక్కే బంధుత్వం లేకపోతే ..పెద్దల ఇష్టం లేకుండా ఈపెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసామేమో అనిపిస్తూ ఉంటుంది" అంది ఎంతో అనుభవంతో.

   లావణ్య నుంచి సెలవు తీసుకుని... శరణ్య ఇంటికెళ్లింది.

   లావణ్యని అడిగినట్టే శరణ్యని కూడా అడిగింది సాగరి.

   శరణ్య ముఖం కూడా చిన్నబోయింది.

  " పెద్దలు ఈ పెళ్లిళ్లు ఎందుకు చేస్తారో తెలీదు. ముక్కూ మొఖం తెలియని వాడికిచ్చి తాళి కట్టించేస్తారు. ఆస్తిపాస్తులుంటే సరిపోదు కదా. మనసుల్లో ప్రేమ ఉండాలి. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకరికొకరికి అసలు నప్పలేదు. పైగా ఈ ఇంటి పనిమనిషినైనట్టు పనులు చక్కబెడుతూ కోడలు అణిగిమణిగి వుండాలంటారు. నావల్ల కావడం లేదు. పిల్లల్ని కనడం వల్ల వారికోసం ఏదో తప్పక సంసారం చేస్తున్నాను గానీ...ఎవరినైనా ప్రేమించి పెళ్లిచేసుకుంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది" అంది ఎంతో జీవితం వడబోసినదానిలా.

    సాగరి శరణ్య నుంచి కూడా సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరింది. 

         ***     ***    ***

  సాగరికి స్నేహితురాళ్ల ఇద్దరి మాటలూ విన్నాకా బాగా ఆలోచించింది . అటు ప్రేమ వివాహంలోనూ ఇటు పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా అసంతృప్తి అనేది కామన్ అని తెలిసిపోయింది. ఏ పెళ్లిచేసుకున్న...భార్యాభర్తల మధ్య సర్దుబాటుతనం, అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ వివాహానికి అర్థం పరమార్థం అనుకుంది.

   పెళ్లి చేసుకోకుండా ఇలా కన్యగానే ఉండిపోయి నా బ్రతుకేదో నేను బ్రతుకుతానన్న సాగరి మాటలని కొట్టి పడేసారు తల్లీదండ్రీ. ఆడదన్నాకా ఒక మగతోడు ఉండాలి. మేము రేపోమాపో హరీమంటాము. అప్పుడు నీవు ఒంటరిదానివైపోతావు. మనిషై పుట్టాకా...ఒక కుటుంబాన్ని ఏర్పర్చుకున్నప్పుడే జీవితాంతం తోడుగా వుంటారు అంటూ క్లాసు పీకారు. 

   సాగరికి ఆలోచిస్తే తల్లీతండ్రీ చెప్పింది కూడా నిజమే అనిపించింది. తాను వివాహం చేసుకుని జీవితాంతం సంతృప్తిగా జీవించాలంటే...అటు ప్రేమ వివాహానికి, ఇటు పెద్దల ఆశీర్వాదంతో కుదిర్చే వివాహం తోడవ్వాలనుకుంది.

అదే విషయం తల్లీదండ్రులతో చెప్పి...సారధి విషయం బయటపెట్టింది. తన నిర్ణయంలో తప్పు కనిపించని విధంగా తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేసింది.

    కూతురు తన భవిష్యత్తుకు ..ఎవరినీ నొప్పించక చక్కటి ప్రణాళిక వేసుకున్నందుకు హర్షించారు. సారధికి ఆస్తి లేకపోయినా పర్లేదు. ఆ ఆస్తి మాదగ్గరుంది. మంచివాడై అమ్మాయిని ప్రేమించగలిగే మనసుంది. ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. కులం గోత్రం ఏదైతేనేమి...? అనే స్థిరమైన నిశ్చయానికి వచ్చాకా...శరణ్య తల్లీ తండ్రీ సారధి తల్లిదండ్రులను కలిసి ఒప్పించి...ఇద్దరికీ వివాహం చేసి ...ఆజంటను దీవించి శుభమస్తు చేశారు....!!*


     ****      ****      *****

( పేమ వివాహాల్లో సుఖపడిన వాళ్ళకంటే...కష్టపడిన వాళ్లే ఎక్కువ. అలాగని పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కష్టాలు లేవని కాదు. రాజీపడి సర్దుకుపోయేవాళ్ళు ఎక్కువ. 

ప్రేమ వివాహం కూడా పెద్దల సమ్మతంతో వారి సమక్షంలో పెళ్లి జరిగితే సంతోషాలు వెదజల్లచ్చేమో కదా...)

 



Rate this content
Log in

Similar telugu story from Inspirational