శ్రీవారికి ప్రేమలేఖ
శ్రీవారికి ప్రేమలేఖ


ప్రియమైన శ్రీవారికి,
మీ భార్య రాస్తున్న మొదటి ప్రేమ లేఖ. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నీవు క్షేమమే అని తలుస్తాను.
నువ్వు లేని రోజు గడవటం చాలా కష్టం నాకు, ఊపిరి ఆగిపోయిందా అనిపించేలా, గుండె ఎంతో వేగంగా కొట్టుకునే లా, నా మనసు ఎంతో మధనపడెలా...
ఎప్పుడూ భగవంతుడిని ఒకటే కోరుకుంటాను, నిన్ను క్షేమంగా ఉంచమని. దేశ రక్షణ లో నువ్వుంటే, నీ తలపులలో నేను ఉంటున్నా, కానీ ఇది ఎంత కష్టమో కదా నీకు దూరంగా ఉండటం అనేది.
అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఎప్పుడయితే వాళ్ళు నిన్ను రమ్మని కబురు పెట్టారో అప్పుడు నిన్ను అక్కడకి పంపించకుండా ఉండవలసింది అని..
మొదట నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలియదు, ఎందుకంటే అప్పుడే కదా మన పెళ్ళి అయ్యింది, కనీసం కాళ్ళ పారాణి అయిన ఆరకుండా నిన్ను అంత దూరం ఎలా పంపగలను.
ఇంకా మన జీవితం కూడా మొదలు పెట్టలేదు.
అప్పుడే ఆ దైవం మన ఇద్దరిని దూరం పెట్టాలని అనుకుందా అని ఎంత బాధ పడ్డానో తెలుసా...
కానీ అప్పుడే తెలిసింది, ఛా నేనెంత స్వార్థంగా ఆలోచిస్తున్నాను అని. సైనికుడు అవ్వటానికి నువ్వు ఎంత కష్టపడ్డావో కదా, ఎంత శ్రమించావో కదా, అది మీ జీవితాశయం కదా...
మరి దానికి నేను నీ వెంటే ఉండాలి కదా, నీ ఆశయం నెరవేర్చటానికి నీకు సహాయ పడాలి కదా.
కానీ నిన్ను దూరం చేసుకోకుండా ఉండాలంటే నేను ఏం చేయగలను, గాఢంగా నిన్ను హత్తుకొని, నీ పెదాలని నా పెదాలతో బంధించి, ఎప్పుడూ ఇలాగే ఉండిపొమ్మని అడగాలని ఉంది...
ఏ చీకూ చింతా లేకుండా, ఏ బాదరా బందీలు లేకుండా హాయిగా నువ్వు రాత్రిళ్ళు నిద్రపోవాలి అనిపిస్తుంది,, కానీ నువ్వు మేల్కొని ఉండటం వలన నే కదా ఎంతోమంది ఇక్కడ ఏ భయం లేకుండా హాయిగా నిద్రపో గలుగుతున్నారు...
నీవు దేశ సేవకై సన్నద్ధం కావటం వల్లనే కదా చిన్న పిల్లల దగ్గరనుంచి వయసు మళ్ళిన వారి దాకా అందరూ మనస్పూర్తిగా గుండెలపై చేయి వేసుకుని మరీ ఉంటున్నారు.
అలా అనుకున్నప్పుడు నేను కూడా నా గుండెలపై
చేయి వేసుకొని చెప్పగలను సగర్వంగా నేనొక సిపాయి భార్యని అని...
అందుకే ఒకే ఒక్కటి నేను కోరుకునేది, నేను చేయగలిగింది...
అది నీకోసం ఎదురు చూస్తూ, నీ ప్రేమలో మునిగి తేలటమే. నీ కర్తవ్యం నువ్వు పూర్తి చేసేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.
నీకోసం, నీ రాకకోసం నిరీక్షించే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారని మాత్రం గుర్తుంచుకో ప్రియా...
అది ఎన్నాళ్ళు అయిన సరే, నీ రాక కోసం, వేయి కన్నులతో ఎదురుచూస్తూ, రోజులు లెక్కపెట్టుకుంటు ఉంటాను, ఎప్పుడూ వచ్చి నా బాహువుల్లో
చేరుతావో అని...
ఇట్లు
మీ ప్రేమదాసి
మీ భార్య