gowthami ch

Drama

2.8  

gowthami ch

Drama

ప్రేమ - పగ

ప్రేమ - పగ

3 mins
337


బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతున్నారేంటి రాత్రంతా కబురులు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకూ మేల్కోవడం , ఉదయం ఇదిగో ఇలా ఎంతసేపైనా లేవకపోవడం బాగా అలవాటు అయిపోయింది మీకు , నేను ఇంతలా అరుస్తున్నా లేవరేంటి అంటూ గదిలోకి వచ్చి దుప్పటి ముసుగుని తొలగించి చూసింది శ్యామల .


అక్కడ ఎవ్వరూ లేరు కేవలం దిండ్లు మాత్రమే ఉన్నాయి. అదేంటి ఎవ్వరూలేరు! ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళిద్దరూ! అంటూ బయటకి వచ్చిన శ్యామలా ఎదురుగా ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరూ టిఫన్ చేస్తూ ఉండడం చూసి , "నన్నే ఆటపట్టిస్తారా చెప్తాను ఉండండి మీ సంగతి" అంటూ దగ్గరికి వెళ్లి ఇద్దరి చెవులూ మెలిపెట్టింది నవ్వుతూ .


"అమ్మ ఇంక వదలవే నొప్పిగా ఉంది అనడంతో సరే ఇంక త్వరగా తినండి కాలేజ్ కి టైం అయింది." అంటూ వాళ్లకి మధ్యాహ్న భోజనాలు సిద్ధంచేయడానికి వంటింటిలోకి వెళ్లింది శ్యామల.


వీళ్ళిద్దరూ ఒకరిమొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.


విరోనికా మరియు వికాస్ అన్నా , చెల్లెలు , ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ప్రతి విషయం చెప్పుకునేవారు , ప్రతిరోజు చెల్లిని కాలేజీలో వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్లడం వికాస్ కి అలవాటు , చెల్లి ఏది అడిగినా కాదనేవాడు కాదు , అప్పుడప్పుడూ చెల్లి ని తీసుకొని బయటికి వెళ్లడం , సినిమాలకి వెళ్ళడం , కలిసి కబుర్లు చెప్పుకోవడం వీళ్ళకి అలవాటు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వికాస్ ఆఫీస్ లోకి కొత్తగా చేరింది మనస్విని.


తొలిచూపులో నే ప్రేమలో పడిపోయాడు వికాస్. వెంటనే తన విషయం తన చెల్లి కి చెప్పాడు , తను కూడా సరే అన్నట్లు ప్రోత్సహించింది. ఇలా తనని పరిచయం చేసుకోవడానికి , తనని ఆకట్టుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాడు వికాస్. 


"తను మాత్రం నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు దయచేసి నా వెంట పడకు అని చాలా సార్లు చెప్పింది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచి పోయింది .


మనస్విని విషయంలో పడి తన చెల్లితో సమయం గడపడం పూర్తిగా మానేసాడు. తన ప్రేమ విషయం లో కూడా తన చెల్లికి ఏమి చెప్పేవాడు కాదు . తను ఛీ కొట్టిన ప్రతిసారి ఆ కోపం చెల్లి మీద చూపించేవాడు, తను ఏమి అడిగినా కాదు అనడం, విసుక్కోవడం గమనించి తనే సర్దుకుపోయేది.


ఒకరోజు తన స్నేహితుడి నుండి ఫోన్ రావడం తో ఎవ్వరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు వికాస్. ఇంక చేసేదేమిలేక ఒంటరిగా కాలేజ్ కి బయలుదేరింది విరోనిక , కాలేజ్ కి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఒక స్కూటర్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చి, కొంత దూరంలో స్కూటర్ ఆపి ఒక వ్యక్తి దిగి , మాట్లాడి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి విరోనికా దగ్గరకి వచ్చి కొంచెం సేపు ఏదో మాట్లాడాడు.


విరోనికా ఛీ కొట్టడంతో కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఆసిడ్ బాటిల్ తీసి విరోనికా పైన పోసి వెంటనే వెళ్ళిపోయాడు. అన్నయ్యా... అని అరవడంతో వెంటనే ఆ స్కూటర్ లో ముందు ఉన్న వ్యక్తి వెనక్కి చూసి పరిగెత్తుకుని వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.


అన్నయ్యా.. మంటగా ఉంది , మొహం అంతా కాలిపోతుంది , భరించలేకున్నాను , నేను ఇంక బ్రతకనేమో అన్నయ్య అని ఏడ్చింది. ఆలా అనకు చెల్లి నీకేమి కాదు నేను ...నేను ..ఉన్నాను అన్నాడు వికాస్ ఏడుస్తూ.


ఆ స్కూటర్ నడిపింది తానే , కానీ తన స్నేహితుడు ఇలా చేస్తాడని కానీ తన చెల్లి కే ఇలా అవుతుందని కానీ ఊహించలేదు వికాస్. తను తెలియక చేసిన తప్పుకి తన చెల్లికి ఎంత శిక్ష పడిందో అని తలుచుకొని కుమిలిపోయాడు. నా మూలంగానే ఇదంతా జరిగింది నా స్నేహితుడు రమ్మని పిలవగానే వెళ్ళిపోయాను కానీ ఎందుకు పిలిచాడో కూడా అడగలేదు. కనీసం ఏం చేయబోతున్నాడో కూడా తెలియలేదు. ఒకవేళ అప్పుడే తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు.


నేనే కావాలని నా చెల్లిని పట్టించుకోలేదు 2 సంవత్సరాలుగా , అయినా కూడా నన్ను ఎన్నడూ కోప్పడలేదు , నా బాధని అర్ధంచేసుకుంది. ఎన్ని సార్లు నేను తనని బాధపెట్టినా ఏనాడు నన్ను ప్రశ్నించలేదు , నేను చెప్పకపోయినా నా చెల్లి నా మనసుని అర్ధంచేసుకుంది. కానీ నేను ..తను నాతో ఏదో చెప్పాలని వచ్చిన ప్రతిసారి తనని కసురుకున్నాను అదే నేను చేసిన పెద్ద తప్పు .


అప్పుడు నేను కొంచెం ఓపికగా నా చెల్లి చెప్పిన మాటలు వినుంటే తన బాధని పంచుకొని ఉంటే ఇప్పుడు నా చెల్లికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అని తన చెల్లితో గడిపిన తీపి జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చుకొని బోరున ఏడ్చాడు . ఇప్పుడు ఎన్ని అనుకోని ఏం లాభం జరగవలసిన ఘోరం జరిగిపోయింది , చూస్తుండగానే తన చెల్లి తనకి దూరమైపోయింది . మనం తెలియక చేసిన చిన్న తప్పుకి మనం ఎంతగానో ప్రేమించే మనుషులు దురమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఆడపిల్లల మీద ప్రేమ పేరుతో జరిగే ఈ అరాచకాలకు చలించి రాసిన కథ. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి సంతోషాన్ని కోరుతుందే తప్ప చావుని కాదు.


Rate this content
Log in

Similar telugu story from Drama