gowthami ch

Drama

4.6  

gowthami ch

Drama

నా గతం

నా గతం

2 mins
656


"అమ్మా..... కరుణా... ముహూర్తానికి టైం దగ్గర పడింది అమ్మాయిని త్వరగా తయారు చెయ్యమ్మా "అని అరుస్తూ గదిలోకి వచ్చింది హిమజ వాళ్ళ అమ్మ.


"అలాగే అంటీ , ఇంకొక్క 10 నిమిషాలలో తయారయిపోతుంది మీరేమి కంగారు పడకండి." అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది కరుణ.


"అలాగే కరుణ , త్వరగా కానివ్వు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి , నేను వెళ్తాను. "అంటూ హడావిడిగా బయటకి వెళ్లబోతూ వెనక్కి తిరిగి ఒక్కసారి కూతుర్ని తనివితీరా చూసుకొని కూతురి నుదుటన ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్లి పోయింది హిమజ వాళ్ళ అమ్మ.


"ఏమే హిమజ ,ఈ పెళ్లి నిజంగా నీకు ఇష్టమేనా" హిమజకి జడ వేస్తూ అడిగింది కరుణ.


కరుణ మాటలకి ఆశ్చర్యపోయిన హిమజ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది కళ్ళనిండా నింపుకున్న నీటితో.


"హేయ్!!.... హిమజ ఆ కళ్ళలో నీరేంటి...అంటే నేను అనుకున్నది నిజమేనన్నమాట." ఆశ్చర్యంగా అంది కరుణ.


ఆ మాట విన్న హిమజకి ఇంతసేపు కళ్ళలో మౌనంగా దాగిన నీరు కట్టలు తెంచుకున్నట్లుగా బయటకి వచ్చాయి.


ఒక్కసారిగా తన స్నేహితురాలికి పట్టుకొని ఏడ్చింది.

తన చేతులతో హిమజని పైకి లేపి కళ్ళు తుడుస్తూ. "ఊరుకో హిమజా, ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంటి ఇది. ఇలా ఏడుస్తున్నావని ఎవరికైనా తెలిస్తే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటారు. ముందు ఆ కళ్ళు తుడుచుకో "అంటూ తాగడానికి నీరు అందించి పక్కనే ఉన్న మంచం మీద కూర్చోబెట్టింది కరుణ.


నెమ్మదిగా హిమజ పక్కన కూర్చొని తన భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ. "చూడు హిమజా... జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఒక కొత్త జీవితం , అందమైన జీవితం నీ ముందు నించుని ఉంది. లేచి ఆ అందమైన జీవితాన్ని స్వీకరించు ,అంతేకాని జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ముందున్న భవిష్యత్తుని పాడుచేసుకోకు" అంది.


"అది కాదు కరుణ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఇప్పుడు ఈ పెళ్ళికొడుకు స్థానంలో నా కార్తిక్ ఉండేవాడు కదా...నీకు కూడా తెలుసు కదా నేను కార్తిక్ ఎంతగా ప్రేమించుకున్నామో. భౌతికంగా తను నా దగ్గర లేకున్నా తన జ్ఞాపకాలు ఇంకా నాతోనే ఉన్నాయి." అంటూ కంటతడి పెట్టుకుంది హిమజ.


"అవును ...నువ్వు చెప్పింది నిజమే, కానీ అది జరిగి చాలా కాలం అవుతుంది. అయినా నువ్వు ఇంకా అదే తల్చుకుంటూ అక్కడే ఉండిపోయావు. కాలంతో పాటు మనము ముందుకు వెళ్ళాలి అంతేకానీ , ఆ కాలంలో జరిగిన చేదు జ్ఞాపకాలని తలుచుకుంటూ అలానే కూర్చోకూడదు. అది నీ భవిష్యత్తుకే నష్టం ." అంది కరుణ.


"అవి చేదు జ్ఞాపకాలు కావు కరుణ, నా గతం నాకు మిగిల్చిన గాయాలు. మనిషి మారినంత త్వరగా మనసు కి తగిలిన గాయాలు మానిపోవుగా!!"


"అది నిజమే హిమజ కానీ మనం ఇష్టపడ్డ వాళ్ళు మన ముందు లేకున్నా , వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకుంటాం కదా , అలానే నీ కార్తీక్ కూడా ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు అని నువ్వు నమ్మితే దయచేసి సంతోషంగా ఈ పెళ్లి చేసుకో. కొత్త జీవితంలోకి అడుగుపెట్టు. "అంటూ హిమజ కళ్ళు తుడిచి తయారు చేసి పెళ్లి పీటల మీదికి తీసుకెళ్లింది కరుణ.


పీటల మీద కూర్చొని పక్కనే ఉన్న పెళ్లి కొడుకుని చూసి ఒక నవ్వు నవ్వింది హిమజ. పక్కనే ఉన్న పెళ్ళికొడుకు "కరుణ నాకు అంతా చెప్పింది మీకు నేనున్నాను" అని నవ్వుతూ హిమజ వైపు చూసాడు.

అలా హిమజ తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. పెళ్లి తరువాత, ఆ అందమైన జీవితం మరింత అందంగా మారి , హిమజ గతం తాలూకు గాయాలని మానిపోయేలా చేయాలని ఆశిద్దాం.


Rate this content
Log in

Similar telugu story from Drama