Rama Seshu Nandagiri

Drama

4.5  

Rama Seshu Nandagiri

Drama

మొదటి ప్రయాణం (non stoN Novemb

మొదటి ప్రయాణం (non stoN Novemb

3 mins
465


"శాంతా, శాంతా, ఎక్కడున్నావ్, ఏం చేస్తున్నావ్?" భర్త గట్టిగా

పిలుస్తూ వస్తుంటే 'ఏమైందా' అనుకుంటూ కిచెన్ లో నుండి హాల్లోకి వచ్చింది శాంత.


"ఏమిటండీ హడావుడి? ఎప్పుడూ ఏదో అర్జెంట్ అయినట్లు అరుస్తారు. తీరా ఏముండదు అక్కడ. ఇంతకీ ఏమిటట? ఒక విధంగా దెప్పుతూ, ఆరాగా అడిగింది శాంత భర్త శ్రీనివాస్ ని.


"నువ్వన్నీ తీసిపారేస్తావ్. నీకు నా మీద ప్రేమ లేదు." అన్నాడు

అలిగినట్లు ముఖం పెట్టి.


అతని మాటలకి నువ్వు వచ్చినా ఆపుకొని మంచినీళ్ళు తెచ్చి

ఇస్తూ "చెప్పండి, ఊరికే అన్నాను." అంది అనునయంగా.


"శాంతా, పెళ్ళైన ఇన్నేళ్ళ కి నీ కోరిక తీర్చబోతున్నాను. నాకు

శెలవు తో పాటు ఈసారి బోనస్ దొరికింది. ఇప్పుడు మనకు ఏమీ ముంచుకు వచ్చే ఖర్చులు లేవు కదా. అందుకే ఈ సారి తప్పకుండా ఢిల్లీ, మథురా, బృందావన్, ఆగ్రా టూర్ కి ‌ప్లాన్

చేద్దామని అనుకుంటున్నా. ఏమంటావ్?" ఆతృతగా అడిగాడు

శ్రీనివాస్.


ఎందుకో శాంతకి ఉత్సాహంగా అనిపించలేదు. అయినా అతని

మాటల్ని కొట్టి పారేయలేక "అలాగే లెండి." అంది.


"ఏంటోయ్, నేను అంత ఉత్సాహం చూపిస్తుంటే, నువ్వేమిటి

అంతలా చప్పగా మాట్లాడుతున్నావ్. నీ కోరిక తీర్చాలనే కదా

నేను తాపత్రయ పడేది." అన్నాడు నిష్టూరంగా.


"అయ్యో అదేం లేదండీ. నేను కలలుగన్న చోటికి తీసుకెళ్తాను అంటే నాకెందుకు ఆనందంగా ఉండదు? అదేం లేదు. కొంచెం

తలనొప్పి గా ఉంది. అందుకే అలా ఉన్నాను. ఉండండి, కాఫీ

తెస్తాను." అంటూ లేవబోయింది.


శ్రీనివాస్ ఆమె చేయి పట్టుకొని కూర్చో పెడుతూ "తలనొప్పి అన్నావు కదా. నువ్వు కూర్చో. నేను తెస్తాను కాఫీ." అంటూ

లేచాడు.


"పర్వాలేదు. నేను పెడతాను లెండి. మీరు బట్టలు మార్చుకుని

రండి." అంటూ లేచి కిచెన్ లోకి వెళ్ళింది శాంత.


ఆమెను చిరునవ్వు తో చూస్తూ గదిలోకి దారి తీశాడు శ్రీనివాస్.


ఒక వారం తరువాత అన్నీ ప్లాన్ చేసి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు తో కూడా మాట్లాడాడు శ్రీనివాస్. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఉద్యోగ రీత్యా కొడుకు, కోడలు, మనవలు బెంగళూరు లోను, కూతురు, అల్లుడు, మనవలు ముంబై లోను

ఉంటారు. తామిద్దరూ కూడా ఉద్యోగరీత్యా వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. పిల్లల చదువులు ఇక్కడే జరిగాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి స్థిరపడటం తో తమకు బాధ్యతలు తగ్గాయి.


శ్రీనివాస్ కి శాంత ఎందుకో ప్రయాణానికి విముఖత చూపక పోయినా సుముఖం గా ఉన్నట్లు కూడా అనిపించడం లేదు.

కారణం ఏమీ కనపడలేదు. అడిగితే ఏం లేదంటుంది. ఎలాగైనా ఈ రోజు తెలుసు కోవాలని ఆమెను పార్కుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ పచ్చికలో కూర్చున్నారు


ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని "శాంతా, ఏమైంది? నాతో చెప్ప కూడదా. ఈ ప్రయాణం నీకు నేను అనుకున్నంత ఆనందాన్ని కలుగ చేయడం లేదు అన్నది అర్థం

అవుతోంది. కానీ, ఎందుకు? నీకు ఆ ప్రదేశాలన్నీ చూడాలని ఎప్పటినుండో కోరిక కదా." అడిగాడు శ్రీనివాస్.


ఇంక తన మనసులో మాట చెప్పక తప్పదు అనిపించింది శాంత కి. ఒక్కసారి గతం గుర్తుకు వచ్చింది. తామిద్దరూ దగ్గర బంధువులు. వారిద్దరి వివాహం పెద్దల ఇష్టంతో జరిగింది.

అయినా పెళ్ళి కి ముందే తన భర్త తనతో మాట్లాడి తన ఇష్టాఇష్టాలు తెలుసు కున్నారు. తనకు బిడియం ఎక్కువ కావడం తో ఎక్కువగా మాట్లాడేది కాదు. అయినప్పటికీ ఎంతో

ప్రయత్నించి తనకు ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలని చిన్ననాటి నుండి కోరిక అని తెలుసు కొన్నారు.


మళ్ళీ శ్రీనివాస్ పిలుపుకు ఈ లోకం లోకి వచ్చింది శాంత.


" మీకు తెలియని విషయాలు ఏమీ లేవండీ. మీకు మాత్రం తెలియదా మన మొదటి ప్రయాణం ఎలా అయిందో." అంది

శాంత తలవంచుకుని.


"అదా. నీకు ఢిల్లీ, చుట్టుపక్కల చూపించుదామన్న ఉద్దేశ్యం తో మన హనీమూన్ అక్కడికే ప్లాన్ చేశాను. ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. అలాగే ఎక్కడికి అని చెప్పకుండా ట్రైన్ ఎక్కించి అప్పుడు నీకు చెప్తే చాలా సంతోషించావు కదా." అన్నాడు శ్రీనివాస్.


"మరి తర్వాత ఏమైంది? మనం ఢిల్లీలో అడుగు పెట్టాం, తాతగారు చనిపోయారు అని వార్త. ఇంక అంతే. అన్నీ కాన్సిల్

చేసుకొని వెనక్కి వచ్చెశాం." అంది శాంత దిగులుగా.


"అలా జరుగుతుంది అని అనుకున్నామా. అలా జరిగి పోయింది. ఇందులో నా తప్పేముంది." అన్నాడు శ్రీనివాస్.


"అయ్యో, మీ తప్పు అని కాదండీ. నాకు అదృష్టం లేదు అని.

రెండో సారి ప్రయత్నిస్తే మీ శెలవు కాన్సిల్ అయింది. అందుకే నాకు చూసే అదృష్టం లేదని నిర్ణయించుకున్నా." అంది శాంత.


" పిచ్చిదానా, అలా ఎందుకు అనుకున్నావ్. సమయం వచ్చి నప్పుడు తప్పకుండా చూస్తామనే నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ మధ్య ప్రయత్నించినా పిల్లల చదువులు, ఖర్చులు ఎక్కువ కావడం తో నేనే ధైర్యం చేయలేదు. నీకు ముందుగా చెప్తే అప్పటి లాగా డిజప్పాయింట్

అవుతావని, ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు పూర్తిగా, పక్కా గా

ప్లాన్ చేశాను కాబట్టి ధైర్యంగా నీకు చెప్పాను." అన్నాడు శ్రీనివాస్.


"అయితే ఈ సారి తప్పకుండా వెళ్తామా." ఆశగా అడిగింది శాంత.


"తప్పకుండా వెళ్తాం. కాదు వెళ్తున్నాం." చెప్పాడు శ్రీనివాస్ నమ్మకంగా, ఆమె చేతిని పట్టుకొని.


"అయితే ఇది మన మొదటి ప్రయాణం లాగా ఆవదు కదా" ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతూండగా చిన్నపిల్లలా

అతని చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది.


"కాదు ఈ ప్రయాణం మన మొదటి ప్రయాణం లాగా ఆవదు. సరేనా." నవ్వుతూ అభయం ఇచ్చాడు శ్రీనివాస్.


చీకటి పడుతూ ఉండటం తో ఇద్దరూ లేచి ఆనందంగా ఇంటి ముఖం పట్టారు.



Rate this content
Log in

Similar telugu story from Drama