STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 12వ భాగం

మనసు చేసిన న్యాయం - 12వ భాగం

3 mins
13

మనసు చేసిన న్యాయం - 12వ భాగం


ఆ రెండు నెలలూ దాదాపుగా అత్తయ్యగారు రాలేదు. మావయ్యగారు సెలవు రోజుల్లో రెండు సార్లు వచ్చారు. తన కూతురు అల్లుడితో నవ్వుతూ మాట్లాడి, నాన్నగారు అమ్మతో ఎంతో చక్కగా తన ఉద్యోగంలో ఎదురయ్యే మనుషుల మనస్తత్వాల గురించి చెబుతూ బోలెడు జోకులు వేసి నవ్వించారు.  


వదిన ఆయన కిష్టమైనవి అని చేసిన పనసపొట్టు కూర, గుత్తి వంకాయ కూర తిని ''నువ్వే చేసావురా బంగారం?'' అని అడిగి వేయించుకుని మరీ తిన్నారు.


 ''మీకు ఇవి ఇష్టమని అత్తయ్యగారికి చెప్పాను డాడీ. అత్తయ్యగారు దగ్గరుండి చేయించారు.'' అంది వదిన.


 '' ఏమయ్యా...బాగా చదువుతున్నావా?'' అని నన్ను పలకరించారు. 


భోజనాలు అయ్యాకా హాల్లో సోఫాలో కూర్చున్నాం అందరమూ.


 ''జులై 15 వ తేదీన సీమంతం ముహూర్తం నిర్ణయించారు బావగారు.ఇదుగో ముహూర్తం కాగితం. నాదగ్గర ఇంకో కాపీ ఉంచుకున్నాను. ఆరోజు కార్యక్రమం అయ్యాకా అమ్మాయిని కారులో తీసుకువెళతాం. అల్లుడూ ...నీకు కూడా ఇదే చెబుతున్నా..ఆరోజు నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టుకో...మర్చిపోకు '' అని అన్నయ్యకి పాకెట్ సైజు టేప్ రికార్డర్ ,ఖరీదైన సెంట్ బాటిల్ బహుమతిగా ఇచ్చారు మామయ్యగారు. వదినకి పళ్ళు, స్వీట్స్ ఇచ్చారు.


''చెల్లెమ్మా......మా ఆవిడ పాపం పిచ్చిది...చిన్నప్పటినుంచీ తాను అనుకున్నది జరగాలని పట్టుదల, పెంకితనం. మా మావగారి పెంపకం అది.ఒక సంసారంలో గొడవలు రాకుండా ఉండాలంటే భార్యా భర్తల్లో ఎవరో ఒకరు రెండోవారిమాట వినేస్తే సరిపోతుంది. నేను ఆ సిద్ధాంతమే పాటిస్తాను. తానేమో ఎవరింటికి వెళ్లినా అది తన ఇల్లే అన్నట్టుగా ప్రవర్తించేసి తరువాత జరిగే పరిణామాలకు నోరుపారేసుకుని బాధపడుతుంది. నువ్వు కూడా రా ..ఇద్దరం వెళ్లి ఈ శుభవార్త చెబితే వాళ్ళు సంతోషిస్తారు అని అడిగాను. మీరు వెళ్తే అమ్మాయి సంతోషిస్తుంది అంది ...అందుకని నేనే వచ్చి పిలుస్తున్నాను. తాను రాలేదని ఏమీ అనుకోకండి. మరి వెళ్ళొస్తానమ్మా..వెళ్ళొస్తా అల్లుడూ..బావగారు..చెల్లెమ్మ..''అంటూ ప్రతీ ఒక్కరికి చెప్పి మావయ్యగారు వెళ్లిపోయారు.ఆయన పద్ధతికి, మర్యాదకి ఇంటిల్లిపాది సంతోషించాము.  


*****************


వదిన సీమంతం ఘనంగా జరిగింది. ముఖ్యమైన బంధువులు అంతా వచ్చారు. అత్తయ్యగారు ప్రతీక్షణమూ కూతురిని అంటిపెట్టుకునే ఉంది. అమ్మతో ముక్తసరిగా మాట్లాడింది.కేవలం అడిగిన దానికి సమాధానం చెప్పింది తప్పితే పెడార్ధాలు తీయడం లాంటి పనులు చేయనే లేదు. వదినను చూస్తుంటే చాలా ముచ్చటేసింది. సాక్షాత్తూ లక్ష్మీదేవిలాగే ఉంది...ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మీ కళ అని ఎందుకన్నారో అర్ధమైంది. మాఇంట్లో ఆడపిల్ల లేని లోటు బాగా తెలిసివచ్చింది మాకు. 


కార్యక్రమం పూర్తి అయ్యాకా వదిన అందరి దగ్గరా ఆశీర్వచనాలు తీసుకుని కారెక్కుతుంటే ఎవరో మానుంచి శక్తినంతటినీ తీసుకెళ్ళిపోతున్నట్టనిపించింది . అమ్మ వదినకు ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పింది.

"క్షేమంగా వెళ్లి మహాలక్ష్మి లాంటి బిడ్డతో లాభంగా రామ్మా"అని మరీ మరీ చెప్పింది.

వదినకూడా వెళ్ళక తప్పదన్నట్టే వెళ్ళింది.

 ''వెళ్ళొస్తాను బుజ్జీ..'' వదిన వెళ్ళేటప్పుడు నాకు ప్రత్యేకించి చెప్పింది.


 **************      


వదిన వెళ్లిన రెండు మూడు రోజులు అన్నయ్య బాగానే ఉన్నాడు.నాలుగవ రోజు నుంచి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడం, సరిగ్గా భోజనం చేయకపోవడం...మొదలెట్టాడు.


"ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావురా?"అని అడిగితే "రైల్వేస్టేషన్లో కూర్చుంటున్నానమ్మా"అని జవాబిచ్చాడట.


ఒక్కో రోజు రాత్రిపూట ఇంటికి రాకుండా ఉదయం వచ్చి స్నానం చేసి మళ్లీ డ్యూటీకి వెళ్లిపోవడం..'ఏమిట్రా ఇది'అని అడిగితే 'మనసు బాలేదమ్మా' అని చెప్పడం.... ఇలాంటివి చేయడం మొదలెట్టాడు.


నాన్నగారు, అమ్మ భార్య మీద బెంగతో అలా ఉన్నాడేమో అనుకున్నారు.వాడిని కూర్చోబెట్టి మంచి చెడు అన్నీ చెప్పారు. అయినా అన్నయ్య తన ప్రవర్తన మార్చుకోలేదు.


ఒకరోజు అన్నయ్య రైల్వేస్టేషన్ లో ప్లాట్ఫార్మ్ మీద కూర్చుని ఉండగా ఎవరో నలుగురు మధ్యవయసు వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుని అన్నయ్యని బాగా కొట్టారు. అన్నయ్యకు దెబ్బలు బాగా గట్టిగా తగిలాయి. నాన్నగారు అమ్మ చాలా కంగారు పడిపోయారు. హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయిస్తే మళ్లీ 15 రోజులకు కానీ మామూలు మనిషి కాలేకపోయాడు.


నెమ్మదిగా సిగరెట్ అలవాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడేమో నాకు తెలీదు. అమ్మ, నాన్నగారు మధనపడటం నేను గమనిస్తూనే ఉన్నాను.ఒకరోజు అమ్మ ఒక ఉత్తరం తీసుకుని వచ్చి నాకు చూపించింది.


"చిన్నాడా..ఈ ఉత్తరంలో అక్షరాలు నాకు సరిగా కనిపించడం లేదు. అన్నయ్య బట్టలు ఉతుకుతుంటే దొరికింది. ఒకసారి చదువు."అంది.


"హాయ్...డియర్.బాగున్నావా...ఏమిటి?నేను సింగపూర్ వెళ్ళినప్పుడు విజయని పెళ్లి చేసుకున్నావట. ఇపుడు తాను గర్భవతి కూడానట. దానికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఉండక్కర్లేదా?అయినా ఎవడో ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడానికి నీకు సిగ్గు ఉండక్కర్లా? వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళ అమ్మని బెదిరించి కూడా వచ్చాను. ఎందుకంటే మా ప్రేమకి ప్రతిబంధకం ఆవిడే.అయినా నీకు ఎంత ధైర్యం చేసుకోవడానికి? పెళ్లిచేసుకునే ముందు దానికి ఎవడైనా లవర్ ఉన్నాడో లేదో...తెలుసుకోనక్కర్లేదా?


హఠాత్తుగా ఈ వార్త తెలిసి దాదాపుగా పిచ్చివాడినైపోయాను. నా బాధ చూసి నా స్నేహితుడు సహాయం చేశాడు. గుర్తు వచ్చిందా అది ఏంటో? రైల్వే స్టేషన్ లో నలుగురు తగులుకొని బాగా వడ్డించారంట కదా.అదే వాడు నాకు చేసిన సాయం. నేను తొందరలో అక్కడికి రాబోతున్నానురా. వచ్చాక నీ సంగతి, దాని సంగతి తేలుస్తాను ఖబడ్దార్" అని ఉంది అందులో.


అన్నయ్య కి ఆ దెబ్బలు ఎందుకు తగిలాయో, అన్నయ్య ఎందుకలా ఉంటున్నాడో, అప్పుడు అర్థమైంది అమ్మకి, నాకు.నాన్నగారు కూడా వచ్చాక ఆ ఉత్తరం చదివి ఆయన కూడా ఖంగు తిన్నారు.


ఏంచేయాలో అర్ధం కాని ఆలోచనలో పడిపోయారు అమ్మా,నాన్నా.


(మిగతా 13వ భాగంలో)



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama