లాటరి టికెట్
లాటరి టికెట్


మంచం మీద నుంచే బయట ఏదో గొడవగా, సందడిగా అనిపించింది సడన్ గా నిద్ర లేస్తాడు ప్రకాశం.
బయటకి వచ్చి "ఏంటబ్బా పొద్దునే గోల" అనుకుంటూ తలుపు తెరచి చూసేసరికి తన ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు.
అరడజను టీవీ ఛానెళ్ల బళ్ళు, ఇరవై మంది దాకా మీడియా వాళ్ళు మైకులు పట్టుకొని నిల్చున్నారు.
ఊర్లో ఉన్న జనం అంతా వాళ్ళ వెనుక ప్రకాశం ఇంటిముందే ఉన్నారు. ఎప్పుడూ బయటకి వస్తారా అని కాపు కాసుకొని కూర్చున్నారు అందరూ.
ప్రకాశం బయటకి రాగానే ప్రెస్స్ వాళ్లంతా ఒకేసారి తనమీద పడిపోతూ "congratulations Sir",,,, " ఎలా జరిగింది",,,,. "ఎలా అనిపిస్తుంది సర్ మీకు ఇప్పుడు",,,, "మీరు ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారు" అని ప్రశ్న వర్షం కురిపించారు.
డబ్బు అన్న మాట దగ్గరే ఆగిపోయాడు ప్రకాశం.
"ఆగండాగండి డబ్బు ఏంటి, నాకు రావటం ఏంటి, ఏ డబ్బు" అని అడుగగా
"మీకు లాటరీ తగిలిందటండి.. కోటిరూపాయల ప్రైజ్ మనీ అట" అంటూ వచ్చిని ప్రకాశం భార్య సుగుణ.
"ఇదుగో ఇలా ఈ కుర్చీలో కూర్చొని వాళ్ళతో మాట్లాడండి" అంటూ కుర్చీ తెచ్చి ఇచ్చింది.
భార్య సుగుణ చేసిన పనికి, మాట్లాడిన మాటల్లోని గౌరవానికి, మాట తీరుకి ఆశ్చర్యపోయాడు ప్రకాశం.
"తరువాత అలోచిద్దురూ! ముందు వాళ్ళతో మాట్లాడి పంపించి రండి లోపలకి" అని లోపలకి వెళ్లిపోయింది.
కాసేపటికి తేరుకున్న ప్రకాశం మీడియా వాళ్ళ దగ్గరకి వెళ్లి, ప్రెస్స్ వాళ్ళతో
ఇప్పుడు అడగండి బాబు మీ ప్రశ్నలు, అంత ఒక్కసారిగా కాదు ఒక్కొక్కరిగా అంటూ వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి "అది, ఇది, అలా కాదు ఇలా, ఇలా కాదు అలా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను" అంటూ ఏదో తనకి తోచిన విధంగా సమాధానాలు చెప్తూ వచ్చాడు. వాళ్ళు కూడా ఏవో వాళ్ళకి తోచినట్టు, నచ్చినవి రాసుకున్నారు.
ఒక పది నిముషాల తర్వాత ఇక బయలుదేరండి అని వాళ్ళని పంపించేసి లోపలకి వచ్చాడు ప్రకాశం.
లోపలకి వస్తూనే ఇంట్లో వాళ్ళు చేసే అతి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయాడు...
"ఏమండీ! మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి తిండురుగాని" అంది.
బాత్రూమ్ లోకి వెళ్లి రాగానే
"అల్లుడుగారు ఇలా కూర్చోండి" అంటూ కుర్చీని తన పై కండువా తో తుడిచి చూపించాడు ప్రకాశం మామగారు ప్రసాదరావు గారు.
కుర్చీ లో కూర్చోగానే కాఫీ తో వచ్చి "ముందు ఈ కాఫీ తాగండి అల్లుడుగారు చల్లారిపోతుందీ" అంది ప్రకాశాన్ని అత్తగారు సుగుణ తల్లి అయిన కామాక్షమ్మ..
వాళ్ళు చూపిస్తున్న అతి వినయం, మర్యాదలకు ఆశ్చర్యపోయి కుర్చీలో కూలబడ్డాడు...
ఒకసారి లాటరీ రిజల్ట్స్ చూసుకోవాలి అని పేపర్ లో తన లాటరీ టికెట్ నంబర్ చెక్ చేసుకొని, ప్రశాంతం గా నడుము వాల్చాడు.
అలా పడుకోగానే మగతలా నిద్ర పట్టేసింది.
అలా గతం లోకి వెళ్ళాయి నిద్రలో తన ఆలోచనలు....
*************
ప్రకాశం మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తన కుటుంబాన్ని పోషించటనికి సరిపడా జీతం, ఒక చిన్న ఇల్లు సమకూర్చుకొని తనకు తగిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.
తన స్నేహితుడి పెళ్ళిలో సుగుణ ని చూసాడు. కుందనపు బొమ్మలా ఉంది. మాట కూడా చాలా నెమ్మదస్తురాలు లా ఉండడం తో తనకి తగిన అమ్మాయి అనుకోని వెళ్లి సుగుణ కి చెప్పాడు.
సుగుణ సిగ్గుతో మెలికలు తిరుగుతూ తన తల్లితండ్రుల తో మాట్లాడమని అంది..
మరునాడే వెళ్ళి సుగుణ తల్లితండ్రులు అయిన కామాక్షమ్మ, ప్రసాదరావు గార్లతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నాడు.
పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉంది. రెండేళ్లు కాగానే సుగుణ లో మార్పులు రాసాగాయి. సుగుణ లో కల సుగుణాలు అన్నీ ఒక్కొక్కటి గా మాయమైపోతాయి...
సుగుణ తల్లితండ్రులు కూడా తనతో తెచ్చిపెట్టుకున్నది.
సుగుణ ఒక్కతే కూతురు కావటం, ప్రకాశానికి ఎవరు లేకపోవటం తో కాదనలేక పోయాడు ప్రకాశం.
అప్పటినుంచి మొదలయ్యాయి అతనికి చిక్కులు. తెచ్చిన సరుకులు రెండు రోజులకే నిండుకున్నాయి అని మళ్లీ, మళ్ళీ తెప్పించడం...
సుగుణ తన తల్లితండ్రులను ఊరంతా తిప్పటం, నెలకి రెండు సినిమాలు, హోటల్ భోజనాలు, అవి ఇవీ అంటూ ఖర్చులు పెరిగిపోయాయి...
ప్రకాశానికి ప్రమోషన్ రాకపోవటంతో జీతం పెరగలేదని, ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టలేక పోతున్నాడు అనీ ఆదిపోసుకోవటం మొదలుపెట్టారు.
ప్రకాశానికి తన ఇంటికి అత్తమామలు వచ్చారా లేదా తనే వాళ్ళింటికి ఇల్లరికం వెళ్ళాడా అనేంత అనుమానం వచ్చేలా రోజూ ఏదోకటి అంటుండేవారు.
ఈ లోగా సుగుణ తల్లి అయ్యింది. పాప పుట్టింది. పాప రూపులోనే కాదు నెమ్మదిగా బుద్ధిలో కూడా తల్లి పోలికలే సంపాదించింది.
పాపకి సంబంధించిన అన్ని ఫంక్షన్ లు గ్రాండ్ గా చేయాలని సుగుణ పట్టుబట్టడం తో అప్పుచేసి మరీ పాప బారసాల, బొబ్బట్లు ఫంక్షన్, మొదటి పుట్టిన రోజు ఇలా అన్నీ గ్రాండ్ గా చేశాడు ప్రకాశం..
వచ్చిన జీతం లో సగం ఆ చేసిన అప్పు తీర్చటానికి పోతుంది, మిగతా సగంలో ఎలా ఇంతమందిని పోషించాలి అని తల పగలగొట్టుకుని మరీ ఆలోచించేవాడు.
ఆఫీస్ లో ఎక్స్ట్రా టైమ్, శెలవు రోజుల్లో కూడా OT లు చేసి డబ్బు కొద్ది కొద్దిగా కూడబెట్టేవాడు.
ఒకరోజు టీవీ చూస్తుండగా అందులో వచ్చిన ఒక ప్రకటన ప్రకాశం జీవితాన్నే మార్చేసింది..
ఆ ప్రకటన చూసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిసైడ్ అయ్యాడు.
ఆ ప్రకటన సారాంశం ఇది...
"Lucky lottery వారి లాటరీ టికెట్. ఇది కొన్నారంటే మీ జీవితం మలుపు తిరిగినట్టు. మిమ్మల్ని అదృష్టం వరించినట్టె. తప్పక కొనండి Lucky Lottery వారి లాటరీ టికెట్".
ఎలా అయిన సరే లాటరీ టికెట్ కొని, లాటరీ కొట్టాలని నిశ్చయించుకొని ప్రకటన లో ఇచ్చిన షాప్ కి వెళ్లి లాటరీ టికెట్ పదివేలు పెట్టి మరీ కొన్నాడు.
"కోటి రూపాయలు దాకా ప్రైజ్ మనీ సర్" అన్న షాప్ వాడి మాటలతో ఉబ్బితబ్బిబ్బై పదివేలు పోసి ఆ టికెట్ కొనేసి ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇంటి ఖర్చులకి డబ్బుకి లేవని భార్య అడగటం తో తను జరిగిందంతా చెప్పి టికెట్ చూపించి మళ్లీ దాన్ని జాగ్రత్తగా బీరువా లో పెట్టాడు.
"డబ్బులన్నీ ఇలా పిచ్చిపిచ్చిగా తగలేస్తే ఇంటిల్లపాది రేపు రోడ్డున పడాల్సి వస్తుంది, కాస్త ఇటువంటి అనవసరపు ఖర్చు తగ్గించండి" అని ఇంట్లో అందరూ పోరారు..
కానీ అవేమీ ప్రకాశం చెవికి ఎక్కనేలేదు. తన కళ్ళముందు మాత్రం తనకి ఆ లాటరీ తగిలిన దృశ్యమే కనపడుతోంది.
*********
"ఏమండీ టిఫిన్ చేసి పెట్టి ఇంతసేపు అయ్యింది, చల్లారిపోతోంది తినరెంటండీ! పొద్దునే పగటికలలు గానీ కంటున్నారా??!!" అన్న సుగుణ పిలుపుతో మెలకువ వచ్చి టిఫిన్ చేసి కూర్చున్నాడు.
"అల్లుడుగారు ఈ రోజు వంట ఏం చేయమంటారు. స్వీట్స్ స్పెషల్ ఏం కావాలన్న చెప్పండి నేను, అమ్మాయి క్షణాల్లో చేసి పెడతాం" అన్నది కామాక్షమ్మ.
ఆ మాటకి మళ్ళీ ఒకసారి గతం గుర్తువచ్చింది.
----------------------
"ఎప్పుడూ ఈ బీరకాయ, పొట్లకాయ ఏనా గుత్తి వంకాయ కూర చేయరాడూ, వారానికి ఒక్కసారి చేసే చికెన్ అయినా ఎప్పుడైనా నాకు రుచి చూపించారా?, చికెన్ పీస్ లేని చికెన్ బిర్యాని నాకు పడేసి చికెన్ పీస్ లు అన్ని మీరే తింటున్నారు" అని ఉక్రోషం తో అన్నాడు ఒకరోజు ప్రకాశం.
ఆ దెబ్బకి వాళ్ళింట్లో చిన్న కురుక్షేత్రమే జరిగింది...
"చాల్లేండీ! ఏంటి మా వాళ్ళ మీద ఆడిపోసుకుంటున్నారు... మీరు తెచ్చే ఆ చికెన్ ముక్కలు ఎవరికి సరిపొనే సరిపోవు. నాలుగు
డబ్బులు సంపాదించటం రాదు...
రెండు చేతులా, నాలుగు రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు అంతా, మీరు మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నారు...
మీ కొలీగ్ నారాయణ రావు చూడండి, మొన్ననే ఒక ఫ్లాట్ కొన్నాడు అని మీరే చెప్పారు.
రెండు ఇల్లు ఉండి ఇంకా ఎందుకురా ఫ్లాట్ అంటే "ఆ అలా పడి ఉంటుంది అని కొనేశా" అన్నాడని చెప్పారు..
పక్కింటి పంకజం గారిని చూడండి, ఏడాదికి ఒక నగ చేయిస్తూన్నాడు వాళ్ళ ఆయన, మొన్ననే ఒక డైమండ్ నెక్లెస్ కి ఆర్డరు ఇచ్చారట.
మీరు మాత్రం ఇదుగో ఈ పుస్తెల తాడు తప్ప
ఇంకేమీ కొనలేదు నా మొహానికి" అంటూ ఉపోద్ఘాతం మొదలు పెట్టింది.
"ఆపుతావా! ఇప్పుడు నేను ఏమన్ననాని ఇంత చదువుతున్నావు, చాలు ఇక ఆ మజ్జిగ తగ్గలేయ్యి"
అని మజ్జిగ తిని లేచాడు ప్రకాశం.
-----------------
ఇప్పుడు తనకి కావాల్సినవి అన్ని వెరైటీ లు అడిగి మరీ లిస్ట్ రాసుకొని సరుకులు తేవటానికి మామగారిని పురమాయించారు.
లాటరీ తగలగానే తన స్థితిగతులు ఇలా మారిపోయినందుకు చాలా సంతోషించాడు ప్రకాశం...
అలా తనకి ఇష్టమైన వంటలు, పిండివంటల భోజనంతో ఆ పూట గడచిపోయింది.
ప్రకాశం కూతురు కూడా "నాన్నా నాన్నా నాకు అది కావాలి, ఇది కొంటావా" అంటూ తనకి అతుక్కుపోయింది...
"నా చిట్టి తల్లి నీకు కావాల్సినవి అన్నీ కొంటాను, నువ్వు చక్కగా చదువుకో, ఆడుకో!" అంటూ బుజ్జగించి పడుకోబెట్టాడు కూతురిని.
మరొకసారి పేపర్ లో లాటరీ రిజల్ట్స్ పేజీ తెరచి తన లాటరీ టికెట్ ని చూసుకొని నంబర్ మళ్లీ సరిచూసుకుని గుండెలమీద చెయ్యి వేసి ఆనందంగా పడుకున్నాడు.
అలా ఆరోజు గడచిపోయింది...
మర్నాడు ఉదయం లేచి బ్రష్ చేసుకొని కాఫీ తాగుతూ ఆ రోజు పేపర్ చూడగానే పేపర్ లో వచ్చిన వార్త కి వేడి వేడి కాఫీ గొంతులోకి పోయి మంట మొదలైంది
రెండు నిముషాలు దగ్గి ఉక్కిరిబిక్కిరి నుంచి తేరుకొని మళ్ళీ పేపర్ చూసాడు.
చూడగానే షాక్ కొట్టినట్టు శిలలా ఉండిపోయాడు.
"ఏమైందండి!" అంటూ వచ్చిన సుగుణ భర్త చేతిలో ఉన్న పేపర్ తీసుకొని చూసింది. అంతే.....
ఆ పేపర్ లో ఇలా ఉంది.....
"పాఠకులకు ముఖ్య గమనిక! నిన్నటి పత్రిక లో ప్రచురింపబడిన లాటరీ రిజల్ట్స్ లో చిన్న తప్పు జరిగింది. ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ తప్పుగా ప్రచురితమైంది.
సరి అయిన టికెట్ నంబర్ ఇది *****
గమనించగలరు.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము". అని ఉంది....
అది చదివిన సుగుణ కూడా అలా సోఫాలో కూలబడి పోయింది... పది నిముషాలు పట్టింది ప్రకాశానికి షాక్ నుంచి తేరుకోవడానికి...
లేవగానే భర్యవైపు చూసాడు...
చేతిలో చల్లారిన కాఫీ తో సుగుణ తో "కాఫీ చల్లగా అయిపోయింది, కొంచెం వేడిచేసి తేరాదూ" అన్నాడు.
సుగుణ పైనుంచి కిందదాకా చూసి "హా! నా ఆశలు, కోరికలు కూడా ఈ వార్త చూసి అలాగే
చల్లారిపోయాయి..
ఏమీ కాదు తాగండి. కాఫీ తాగి వెళ్లి ఇదుగో ఈ సరుకు తీసుకురండి" అని చేతికి సంచి, సరుకుల లిస్ట్ ఇచ్చింది..
ఇంకేముంది మన ప్రకాశానికి షరా మామూలే.
తన ప్రారబ్ధానికీ తానే సిగ్గుపడి, బాధపడి, సంచి తీసుకొని షాప్ కి బయలుదేరాడు...
*************
సమాప్తం
*********