"Tirumalasree" (pen-name) PVV Satyanarayana

Drama

3  

"Tirumalasree" (pen-name) PVV Satyanarayana

Drama

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు

7 mins
365


ఏయ్, పిచ్చిపిల్లా! అర్థరాత్రి అవుతున్నా పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావ్? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా?" - పడగ్గదిలోంచి అరిచాడు విష్ణు.

"లేదు. ముసలి గుర్రానికి రేపటి దాణా కోసమని మినప్పప్పు నానబోస్తున్నాను," వంటింట్లోంచే జవాబు ఇచ్చాను నేను. 

ఉడుక్కున్నట్టున్నాడు, "నేను ముసలి గుర్రాన్ని ఐతే...నువ్వు ఏమవుతావట?" అడిగాడు చిరుకోపంతో.

"నీకంటే మూడేళ్ళు పడుచుదాన్ని అవుతాను నేను," బదులు ఇచ్చి కిసుక్కున నవ్వాను. 

"పడక ఎక్కు చెబుతాను...ఎవరు ముసలో, ఎవరు పడుచో!" మరింత ఉడుక్కున్నాడు తాను.

ఇలాంటి చతుర్లు, విసుర్లు మామూలే మాకు. తెల్లవారి లేస్తే లెక్కలేనన్ని. ఎవరికి వాళ్ళమే మాటల చాతుర్యంతో ఎదుటివారిని చిత్తుచేయాలన్న ఓ చిలిపి ఆలోచన. అంతే! 

విశ్రాంత ఉద్యోగులమే ఇద్దరమూను. విష్ణు పదవీ విరమణ చేసి నాలుగేళ్ళైతే, నేను ఏడాది క్రితం సర్వీసు నుండి రెటైర్ అయ్యాను. విశేషమేమిటంటే, మా గేమ్ లో గెలుపు ఇద్దరిదీను! ఎందుకంటె, మామధ్య గెలుపే కాని ఓటమి లేదు. అదే మా అన్యోన్య దాంపత్య రహస్యం. మా కాపురానికి ’జీవన్ టోన్’! 

"మనం ఒకరి కోసం ఒకరం! బోర్న్ ఫర్ ఈచ్ అదర్. మన బంధం జన్మ జన్మలకూ ఇలాగే ఉండాలి" అన్నాను నేను, విష్ణు ఒడిలో పడుకుని, తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ.

విష్ణు నవ్వాడు. "మనిషి పుట్టుక, గిట్టుట ఓ సృష్టి రహస్యం. బంధాలూ, అనుబంధాలూ ఈ జన్మ వరకే. కనుక మరీ అత్యాశలు పెట్టుకోకూడదే, పిచ్చిపిల్లా!" అన్నాడు.

"కాదన్నావంటే చంపేస్తాను!" అన్నాను ఉక్రోషంగా.

"కాస్త ముందు వెనుకలుగా అందరూ ఈ లోకం నుండి నిష్క్రమించవలసిందే. అది ప్రకృతి ధర్మం," వేదాంతం వల్లించాడు. 

“మనిద్దరమూ ఒకేసారి పోవాలి!" మొండిగా అన్నాను.

మళ్ళీ అదే నవ్వు. "నిన్న- నేటి స్మృతి. నేటికి - రేపు అనేది ఓ కల. మనలో ఎవరు మిగిలినా...నిన్నటి స్మృతులను నెమరువేసుకుంటూ, రేపటి గురించి కలలు కంటూ మనడం ధర్మం," అన్నాడు. 

చటుక్కున ఒళ్ళోంచి లేచి గాఢంగా కౌగలించేసుకున్నాను సజలనయనాలతో. 

విష్ణు ఇప్పుడు లేడు. చనిపోయి మూడేళ్ళు అయింది. దుర్మార్గుడు! నన్ను ఒంటరిదాన్ని చేసి నిర్దయగా వెళ్ళిపోయాడు. మాయదారి క్యాన్సర్ విష్ణును పొట్టను పెట్టుకుంది. 

తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు విష్ణు ఏనాడూ చూచాయగానైనా నాకు తెలియనివ్వలేదు. నేను ఎక్కడ తల్లడిల్లిపోతానోనని, అంతటి బాధనూ తనలోనే అణచుకుని నిశ్శబ్దంగా అనుభవిస్తూ వచ్చాడు.

ఓరోజున నాగార్జున సాగర్ డ్యామ్ కి వెళ్ళాం మేము. సాగర్ లో బోటింగు, సుందర ప్రకృతిలో వాహ్యాళి ఎంతో సరదాగా, సంతోషంగా గడచిపోయింది...తిరుగు ప్రయాణంలో హఠాత్తుగా వాంతి చేసుకున్నాడు విష్ణు. నోటమ్మట రక్తం పడడంతో కంగారుపడిపోయాను నేను. ఛాతీని చేత్తో అదిమిపడుతూ తాను పడుతూన్న బాధ ముఖంలో స్పష్టంగా గోచరిస్తోంది. 

హైదరాబాద్ చేరుకోగానే కేర్ ఆసుపత్రిలో చేర్పించాను. వైద్య పరీక్షలన్నీ చేసాక డాక్టర్స్ చెప్పిన విషయం నన్ను నిర్ఘాంతపరచింది. 

విష్ణుకి క్యాన్సర్! అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది!!

’నో! నా విష్ణు హృదయం లేని ఆ క్యాన్సర్ రాకాసికి బలికాకూడదు. ఏ శక్తీ తనను నానుండి వేరు చేయలేదు. ఎలాగైనాసరే అతన్ని కాపాడుకుంటాను’ అన్న దృఢనిశ్చయంతో, గుండె నిబ్బరం చేసుకుని, పేరున్న ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి నిపుణులచేత వైద్యం ఆరంభింపజేసాను.

విష్ణు ఆజానుబాహువు. అరవై నాలుగేళ్ళ వయసులో కూడా యాభై ఏళ్ళ వాడిలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. నెరసీ నెరవని ఒత్తైన జుత్తు హుందాతనాన్ని ఆపాదించితే, గాంభీర్యమైన వదనం చూపరుల గౌరవాన్ని చూరగొనేది. అటువంటిది - క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆరంభించాక కొద్ది రోజులలోనే మనిషి రూపంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. కెమొథెరపీ కారణంగా ఒత్తైన జుట్టంతా రాలిపోయి తల బోడి అయిపోయింది. పాలిపోయిన వదనం...లోతుకు పోయిన కళ్ళు...పేలవమైన చూపులు...మూగబోతూన్న గొంతు...నానాటికీ శుష్కించిపోతూన్న దేహమూ - అతన్ని చూస్తుంటే దుఃఖం ముంచుకువచ్చేది నాకు.

ఒక్కోసారి అతను పడే బాధ చూళ్ళేక నాకు చచ్చిపోవాలనిపించేది. నన్ను విడిచి వెళ్ళిపోతాడేమోనన్న భయం! ఐతే నేను లేకపోతే ఆ దైన్యస్థితిలో మృత్యువుతో పోరాడుతూన్న నా విష్ణువును చూసేదెవరు?...అందుకే మనసు నిలదొక్కుకునేదాన్ని. విష్ణు చూడకుండా చాటుగా విలపించేదాన్ని. ఎన్నో రాత్రులు పీడకలలతో నిద్రపట్టక బెంగతో ఏడుస్తూ కూర్చునేదాన్ని. 

నా పరిస్థితిని గ్రహించిన విష్ణు నన్ను గుడ్ హ్యూమర్ లో ఉంచడానికి ప్రయత్నించేవాడు. ఎదురు నన్ను ఓదార్చేవాడు. మనోవ్యథతో తిండి, నిద్ర కరవై నీరసిస్తూన్న నన్ను చూసి కంటతడి పెట్టుకునేవాడు. 

’నాకు త్వరలోనే నయమయిపోతుందే, పిచ్చిపిల్లా! అతిగా ఆలోచిస్తూ బెంగతో నువ్వు కృషించిపోకు. ఇంటికి తిరిగి వచ్చాక నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలంటే...అమృతంలాంటి నీ చేతి వంట తినాలి కదా! నువ్వు మంచం ఎక్కితే నీకు చాకిరీ చేయడం నావల్ల కాదు సుమా!’ - ఓపక్క నాకు ధైర్యం చెబుతూనే, నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవాడు.

’ఉన్న డబ్బంతా నా కోసం ఊడ్చిపెట్టేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావు. ఒకవేళ నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతుకుతావే, పిచ్చిపిల్లా?’ అన్నాడు ఓసారి. 

చటుక్కున అతని నోరు మూసేసాను. ’నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చంపేస్తాను, జాగ్రత్త!’ అన్నాను తీవ్రంగా. అలా అంటుంటే దుఃఖం సునామీలా పొంగుకువచ్చింది నాకు. ఒకరి నొకరం పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాము చాలాసేపు.

విష్ణుకి రెండు మూడు రోజులుగా బాధ కాస్త నెమ్మదించినట్టే కనిపిస్తోంది. మనిషి నీరసంగానే ఉన్నా, మెల్లగా మాట్లాడుతున్నాడు. 

’కళ్ళు లోతుకు పోయి, ముఖం పీక్కుపోయి చూడ్డానికి హారర్ మూవీస్ లో దయ్యంలా ఉన్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకు కాస్త కాస్త సులువుగానే ఉంది కదా!’ అన్నాడు విష్ణు ఆ రోజు సాయంత్రం, ఎముకల్లాంటి చేతితో ప్రేమగా నా తల నిమురుతూ. 

ఓ క్షణం కూడా అతన్ని విడిచి ఉండాలని లేదు నాకు. ఐనా ఇంటి నుండి తెచ్చుకోవలసిన బట్టలు, వస్తువులు కొన్ని ఉన్నాయి. అందుకే చీకటి పడ్డాక ఇంటికి బయలుదేరాను.

చానాళ్ళ తరువాత ఆ రోజు రాత్రి బాగా నిద్ర పట్టింది నాకు. బహుశా మానసికంగా బాగా అలసిపోయి ఉన్నందునేమో! నిద్రలో చక్కటి కల...విష్ణుకు పూర్తిగా నయమయిపోయింది. డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చేసాడు...

’ఏయ్, పిచ్చిపిల్లా!’ అన్న విష్ణు పిలుపు వినపడినట్లయి, ’ఆఁ, వస్తున్నా!’ అంటూ బదులు పలికాను.

హఠాత్తుగా మెలకువ రావడంతో బెడ్ మీద చటుక్కున లేచి కూర్చున్నాను నేను.

గదిలో బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. టీపాయ్ మీదున్న నా సెల్ ఫోన్ విడవకుండా మ్రోగుతోంది.

గడియారం వంక చూసాను. తెల్లవారు ఝామున నాలుగు గంటలు కావస్తోంది.

గబుక్కున ఫోన్ అందుకుని, ’హలో!’ అన్నాను.

ఆసుపత్రి నుండి అది. 

నా నిద్రమత్తు వదలిపోయింది. ఊపిరి బిగబట్టి వింటూ ఉండిపోయాను.

నా చేతిలోని సెల్ జారిపోయింది. కొయ్యబారిపోయాను నేను.

పావుగంట క్రితం విష్ణు తుది శ్వాస విడిచాడు...!

అదంతా జరిగి మూడేళ్ళయిపోయినా, మూడు రోజుల క్రితం జరిగినట్టుంది.

ఆ రోజు మా పెళ్ళిరోజు...విష్ణు మరీ మరీ గుర్తుకు వస్తున్నాడు.

భోషాణం పెట్టె తెరచి అందులోని వస్తువులన్నిటినీ బైటకు తీసి ముందు వేసుకుని కూర్చున్నాను.

అవి - నా జ్ఞాపకాలు! మధుర స్మృతులు!

విష్ణును నేను మొదటిసారి కలసినప్పట్నుంచీ, చివరి దశ వరకు నా మదిలో పదిలపరచుకున్న అతని జ్ఞాపకాల చిహ్నాలు - నేను సేకరించి దాచియుంచిన ఆ వస్తువులన్నీను!!

వాటన్నిటినీ భోషాణం పెట్టెలో భద్రంగా దాచుకునేదాన్ని. నా మూడ్ పాడయినపుడల్లా వాటిని తీసి చూసుకోవడం అలవాటు నాకు. దాంతో మళ్ళీ మనసంతా సంతోషం పులుముకునేది.

విష్ణు వాటిని చూసి నవ్వేవాడు. ఆ భోషాణం పెట్టెను ’పండోరాస్ బాక్స్’ అని పిలిచేవాడు.

అతను తిని పడేసిన ఐస్ క్రీమ్ కప్పులు, స్పూన్లు మొదలుకుని...అతను వాడిన, అతనితో సంబంధం ఉన్న ప్రతి వస్తువూ - చిన్న, పెద్ద - నా జ్ఞాపకాల వలయంలో భాగం అయ్యేవి.

’నీకు ఇదేం పిచ్చే!?’ అని నవ్వేవాడు తాను.

’ఎవరి వెర్రి వారికి ఆనందమట! ఇది నా ప్రేమ సామ్రాజ్యం. ఇవి నా మధురస్మృతుల చిహ్నాలు. అవహేళన చేస్తే ఊరుకునేది లేదు,’ ఉడుక్కునేదాన్ని నేను. ’ఇవి లేని రోజున నేనూ ఉండను’.

’అందుకే నిన్ను ’పిచ్చి పిల్లా!’ అనేది,’ అనేవాడు తాను. అలాగే పిలిచేవాడు నన్ను. 

మాది ప్రేమ వివాహం. విష్ణు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. నేను ఓ ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ ని. మా ఇద్దరికీ సిటీ బస్ లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా పుష్పించి మూడేళ్ళ తరువాత, ఇరువైపుల పెద్దల్నీ ఎదిరించి వివాహం చేసుకునేంత వరకు దారి తీసింది. 

ఎందుచేతనో భగవంతుడు మాకు సంతానం ఇవ్వలేదు. 

‘మనకు ఇద్దరు పిల్లలు - నాకు నువ్వు, నీకు నేనూను!’ అనేవాడు విష్ణు.

ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవాడలోని ఓ పేదకుటుంబానికి చెందిన మూడేళ్ళ సయీదాని స్పాన్సర్ చేసాము మేము. ఆ పిల్ల తిండి, చదువుల నిమిత్తం ఆ సంస్థ నిర్ణయించిన మొత్తం నెలకు ఇంత అని ఇవ్వవలసియుంటుంది. ఆరు నెలలకోసారి సొమ్ము పంపిస్తూంటాము మేము. ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆ పాప చదువుకు సంబంధించిన అభివృద్ధిని గూర్చి మాకు నివేదికలు పంపిస్తూంటుంది. ఆ పాప ఫోటో, కుటుంబపు వివరాలు కూడా పంపించింది. మా కోరిక మేరకు ఏడాదికోసారి మేము విజయవాడకు వెళ్ళి సయీదాని కలుసుకునే వీలు కూడా కల్పిస్తుంది. విష్ణు, నేను గిఫ్ట్స్ తో వెళ్ళి ఓ రోజంతా పాపతో, ఆమె కుటుంబంతో గడిపి వస్తుంటాము. సయీదా చదువులో చూపే శ్రద్ధాసక్తులు మమ్మల్ని ఆకట్టుకునేవి. 

విష్ణు పోయిన సంవత్సరం సయీదాని చూడడానికి వెళ్ళలేదు నేను. 

మరుసటి ఏడాది ఒంటరిగా వెళ్ళిన నన్ను చూసి, విషయం తెలిసి కంట నీరు పెట్టుకుంది ఆ కుటుంబం. 

సయీదా కూడా, ’తాతయ్య రాలేదేం, అమ్మమ్మా?’ అని పదే పదే అడుగుతూంటే, దుఃఖం ఆపుకోవడం కష్టమైంది నాకు. 

ఇప్పుడు మళ్ళీ విజయవాడకు బైలుదేరాను. సయీదాకి ఇప్పుడు పదేళ్ళు నిండాయి. ఐదవ తరగతి చదువుతోంది. ఐతే, ఈ ప్రయాణం సంతోషానికి బదులు నాకు దుఃఖాన్నే మిగుల్చుతుందని ఊహించలేకపోయాను...

ఆ కుటుంబం చెప్పిన సంగతులు నన్ను నిశ్చేష్టురాలిని చేసాయి… ఆ మధ్య సయీదా తరచు అనారోగ్యం పాలవుతోందట. డాక్టర్స్ పరీక్షలు జరిపి ఆ పిల్ల గుండెలో కన్నం ఉన్నదని తేల్చారట! ఆపరేషన్ చేయకపోతే పిల్ల ఎన్నాళ్ళో బతకదట. సర్జరీకి కనీసం ఐదు లక్షలైనా కావాలట!

నా మనసంతా చేదు తిన్నట్టైపోయింది. విష్ణు పోయినప్పుడు అనుభవించినప్పటి బాధ ఇప్పుడు మళ్ళీ నన్ను ఆవహించింది...ఆ పసిపాప ఏం పాపం చేసిందని భగవంతుడు అంతటి శిక్షను విధించాడు!? ఆ పేద కుటుంబం అంత సొమ్ము ఎక్కణ్ణుంచి తెస్తుంది? అప్పటికప్పుడు ఐదు లక్షలు దానం చేసే దాతలు ఎక్కడ దొరుకుతారు?

ఎంత సంతోషంగా విజయవాడకు బైలుదేరానో, అంత విచారంగాను ఇంటికి తిరిగి వచ్చాను నేను.

విష్ణు వైద్యం కోసం చేసిన అప్పులు ఇంకా తీరనేలేదు. సయీదా కోసం సొమ్ము ఎక్కణ్ణుంచి తేగలను?

భోషాణం పెట్టె తెరచి నా ’జ్ఞాపకాల ప్రోవులను’ తీసి ముందు వేసుక్కూర్చున్నాను. ఒక్కో వస్తువుకూ ఒక్కో జ్ఞాపకం, ఒక్కో అనుభూతి! ఒక్కొక్క వస్తువునే ఆప్యాయంగా తడుముతూ దాని వెనుకనున్న జ్ఞాపకాలను నెమరువేసుకోనారంభించాను...

అదిగో, అప్పుడే వచ్చింది నాకు - ఆ ఆలోచన!

ఇది ఇంటర్నెట్ యుగం. నెట్ లో ప్రతీదీ అమ్ముడుపోయే కాలం. ’బిజారే ఐటెమ్స్’ కూడా హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయట! నా ’జ్ఞాపకాలను’ నేను ఎందుకు అమ్మకానికి పెట్టకూడదు? సయీదా కోసం! ఆ పిల్ల ప్రాణాలకంటె, ప్రాణప్రదంగా పదిలపరచుకున్న నా అనుభూతుల చిహ్నాలు నాకు ఎక్కువ కాదనిపించింది!

అంతే! షాపుకు వెళ్ళి పెద్ద స్క్రాప్ బుక్స్ కొని తెచ్చాను. వాటిలో ఒక్కో వస్తువునే అతికిస్తూ, దాని క్రింద దానికి చెందిన నా జ్ఞాపకాలను, అనుభూతులను సవివరంగా పొందుపరచాను. వాటన్నిటినీ తయారుచేయడానికి పుస్తకాలు చాలానే పట్టాయి. రేయింబవళ్ళు కూర్చుని పని పూర్తిచేసాను. 

తరువాత ’ప్రోడక్ట్’ గురించి క్లుప్తంగా వివరిస్తూ ’నెట్’ లో పెట్టాను. నాకు అవి అమూల్యాలు. వాటికి మూల్యం నిర్ణయించే సాహసం చేయలేదు. కొనుగోలుదారుల విజ్ఞతకే వదిలేసాను. 

ఏళ్ళ తరబడి నేను సేకరించి భద్రపరచుకున్న నా ’జ్ఞాపకాలను’ చూసి విష్ణు నాకు ’పిచ్చిపిల్ల’ అని బిరుదు ఇచ్చాడు. ఇప్పుడు ’నెటిజెన్స్’ నా ’పిచ్చి’ కి నవ్విపోతారేమోనన్న సంశయమూ పట్టుకుంది. కాని, నాది ’అవసరం’. ’నవ్విపోదురుగాక నాకేమి?’ అనుకున్నాను.  

వారం...రెండు వారాలు...అయింది. నా ప్రకటనకు స్పందన కరవయింది. నాది క్రేజీ ఐడియా అని నేనెరుగుదును. ఐనా నేటి నెట్-క్రేజీ వరల్డ్ లో అది క్లిక్ కావచ్చునన్న చిరు ఆశ ఉండేది నాలో. రోజులు గడుస్తూంటే అది సన్నగిలసాగింది.

అంతలో సయీదాని ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అందడంతో నా మనసు ఆందోళనకు గురయింది. స్క్రాప్ బుక్స్ ని ముందు వేసుకుని కూర్చున్నాను.

అదే సమయంలో ఎవరో ఫోన్ చేసారు. నా ప్రకటన సందర్భంగా నన్ను కలవాలనుకుంటున్నారట. నా ఇంటి చిరునామా చెప్పాను.

కాసేపటి తరువాత ఓ యువజంట కారులో వచ్చింది. అతనికి ముప్పై ఐదేళ్ళు, ఆమెకు ముప్పై ఏళ్ళు ఉంటాయి. ముచ్చటైన జంట.

తన పేరు ప్రభు అనీ, భార్య పేరు సరోజ అనీ చెప్పాడు అతను. విశాఖపట్టణంలో అతనికి నగల దుకాణం ఉన్నదట. అపూర్వ వస్తు సామాగ్రి సేకరణ అతని హాబీ అట. నెట్ లోని నా ప్రకటన ఆకట్టుకోవడంతో వివరాలు స్వయంగా తెలుసుకోవాలని విశాఖపట్టణం నుండి వచ్చారట దంపతులు.

నేను ఏదీ దాచకుండా నా ప్రకటన వెనుక ఉదంతాన్ని విపులంగా చెప్పాను. స్క్రాప్ బుక్స్ అన్నిటినీ ఎంతో శ్రద్ధాసక్తులతో పరిశీలించారు వాళ్ళు . 

తరువాత, "ప్రాణప్రదంగా పదిలపరచుకున్న మీ మధురస్మృతుల చిహ్నాలను ఏమీ కాని ఓ పరాయి పాప కోసం త్యాగం చేయడానికి పూనుకున్న మీ సహృదయతకు మా జోహార్లు. మా కనులు తడిసి, మనసులు ఆర్ద్రమయ్యాయి. మీ యీ బృహత్కార్యంలో మేమూ పాలు పంచుకోవాలని నిశ్చయించుకున్నాము," అన్నాడు అతను. 

అంతవరకు వారి కవి నచ్చుతాయో లేదోనన్న మీమాంసలో ఉన్న నాకు ఆ పలుకులు గొప్ప ఊరట కలిగించాయి. 

"మీవి అపురూపమైన అనుభూతుల స్మృతిచిహ్నాలు. అవి నా సేకరణకు ప్రత్యేక ఆకర్షణ కాగలవని విశ్వసిస్తున్నాం," మందహాసంతో మళ్ళీ అన్నాడు అతను. 

అప్పటికప్పుడే చెక్ రాసి, "అమూల్యమైన వీటికి వెలకట్టేంతటి సాహసం చేయలేను నేను. అందుకే నాకు తోచిన ఈ గౌరవ పారితోషికాన్ని స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను," అంటూ చెక్ ని నా చేతిలో పెట్టాడు.

అతని సంస్కారానికి ముగ్ధురాలినవుతూ, చెక్ లోని మొత్తాన్ని చూసిన నేను విభ్రాంతి చెందాను. అయిదు లక్షలు...!

ఆనందంతో నా నోటమ్మట మాట రాలేదు. 

నేను ఆనందాశ్చర్యాల నుండి పూర్తిగా తేరుకోకుండానే స్క్రాప్ బుక్స్ తీసుకుని, నమస్కరించి వెళ్ళిపోయారు ఆ దంపతులు...

మర్నాడే బైలుదేరి విజయవాడకు వెళ్ళాను నేను. 

సయీదాని పరామర్శించి, సొమ్మును ఆసుపత్రిలో కట్టేసాను. ఆపరేషన్ జరిగితే పిల్ల ప్రాణాలకు ఢోకాలేదని డాక్టర్స్ చెబుతూంటే గొప్ప ఆనందం కలిగింది నాకు. ప్రభు దంపతుల ఔదార్యానికి మనసులోనే జోహార్లు అర్పించాను. సర్జరీ డేట్ మరుసటి వారంలోనే నిర్ణయించారు డాక్టర్స్.

ఆ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాను. 

రైల్లో కూర్చుంటే హఠాత్తుగా విష్ణును గూర్చిన తలపులు ఝుమ్మంటూ రేగాయి. 

తేలికపడవలసిన మనసు బరువెక్కింది, ఎందుకో! 

సయీదాకి ప్రాణగండం తప్పినందుకు ఓ పక్క ఆనందంగా ఉన్నా...మరో పక్క మదిలో ఏదో ఆవేదన, వెలితి. ఇదమిద్ధమని తెలియని బాధ. 

సీట్లో వెనక్కి జారగిలబడి అలసటగా కన్నులు మూసుకున్నాను. 

ఏదో మగత. ఆ మగతలోనే - విష్ణు రూపం!

ప్రేమగా చేతులు చాచి నవ్వుతూ, ’రావే, నా పిచ్చిపిల్లా!’ అని పిలుస్తూన్న అనుభూతి!

’వస్తున్నాను, విష్ణూ! నిన్ను విడచి ఉండడం ఇక నా వల్ల కాదు...’ అంటూ అతని బాహువుల్లో ఒదిగిపోవడానికి అడుగులు వేసాను...



Rate this content
Log in

Similar telugu story from Drama