ఇంటింట రామాయణం
ఇంటింట రామాయణం


కొడుకుని కని పెంచి పెద్ద చేసి, ఆలనాపాలనా చూసుకుంటూ, చదివించి, ఉద్యోగస్తుడుని చేసి ప్రయోజకుడిగా మార్చి కోడలు పిల్లకు అప్పగించే సరికి ఆ తిప్పులాడి నా కొడుకుని చవటని చేసి దాని కొంగుకి ముడేసుకుంది వదినా’’ అంది అప్పలనరసమ్మ అనసూయమ్మతో.
‘‘మరేం నా కొడుకూ ఉన్నాడు కదా. ఆ వెధవా అంతే ఇంజనీరింగ్ చదివించాము. అమెరికా పంపాము. మా కోడలూ తెలుసు కదా జిత్తులమారి నక్క. అభం శుభం తెలియని నా కొడుకుని వెర్రిబాగులాడిని చేసి దాని వెనకే కుక్కలా తిప్పుకుంటుంది అమెరికాలో’’ మరి కొంచెం డోసు పెంచి అంది అనసూయమ్మ.
‘‘ముదనష్టపు సంబంధాలు చేశాము. లక్షలకు లక్షలు కట్నాలు, బంగారం తెచ్చామని పొగరు ఆ పిల్ల ముండలకి’’ కోపంతో ఊగిపోతూ అంది అప్పలనరసమ్మ.
‘‘మా బాగా చెప్పావు తల్లీ. నా కోడలయితే భూమి చూడ్డంలేదు. మిడిసిపడిపోతుంది. పాతిక లక్షలు తెచ్చిందన్న గర్వం దానికి’’ అంటూ మూతి తిప్పింది అనసూయమ్మ.
‘‘మంచిగా అన్నావే అమ్మా. నా కోడలేం తక్కువ తిన్నాదా. ముప్పై లక్షల కట్నం, ముప్పై తులాల బంగారం అంటూ మొగుడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. పైగా నా కొడుకేమైనా అనామకుడా ఏంటి. నీ కొడుకు ఎక్కడో పరాయి దేశంలో ఇంజనీరు. నా కొడుకు ఇక్కడే ఈ దేశంలోనే ఇంజనీరు’’ అంటూ తన కొడుకే గొప్ప అన్నట్లు అంది అప్పలనరసమ్మ.
‘‘అదేటొదినా అలాగంటావు అమెరికాలో ఇంజనీరంటే అలగా జనంలా కాదు. ఎన్ ఆర్ ఐ అంటారు. బాగా రిచ్చు. మీ వాడిదేముంది ఇక్కడే కదా మామూలు జీతమే’’ నీ కొడుక్కంటే నా కొడుకు పదిరెట్లు గొప్ప అన్నట్లు అంది అనసూయమ్మ.
టాపిక్ డైవర్ట్ అయిపోతుందని ఇద్దరూ గ్రహించారు.
‘‘ ఆ విషయం వదిలెయ్ వదినా. నీ కొడుకూ, నా కొడుకూ ఇంజనీర్లే. కోడల్లే ఇల్లు కదలకుండా ఒళ్లు కందకుండా తింటూ తమన నెత్తి మీద గుదిబండల్లా తయారయ్యారు’’ అంది అప్పలనరసమ్మ.
‘‘నిజం చెప్పావే తల్లీ. నా కోడలైతే మరీను పెళ్లికి ముందు యాభై కిలోలు ఉండే మనిషి ఇప్పుడు అరవై కిలోల కొచ్చిందట. తెగ బలిసిపోయింది’’ ఆడిపోసుకుంది అనసూయమ్మ.
అనసూయమ్మ, అప్పలనరసమ్మ ఇద్దరూ రెచ్చిపోతున్నారు. రోజు రోజంతా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి కోడళ్లను తిట్టడమే పనిగా గడిపేస్తున్నారు. అనసూయమ్మ, అప్పలనరసమ్మ బంధువులు కారు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే పరిచయస్తులు.
వాళ్ల రెండిళ్ల మధ్యలో మరో ఇల్లు ఉంది. అందులో నాయుడుబావ ఉంటాడు. నాయుడుబావకు నా అన్న వాళ్లు లేరు. భార్య రేవతి పెళ్లయిన మూడేళ్లకే చనిపోయింది. వాళ్లకి ఒక కొడుకు ఉండేవాడు. అతడిని డాక్టర్ చేశాడు నాయుడుబావ. కోడలూ డాక్టరయితే బాగుంటుందని కొడుక్కి పైసా కట్నం తీసుకోకుండా డాక్టర్ కోర్స్ చదివిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశాడు. దురదృష్టం వెంటాడగా కొడుకు కోడలూ హనీమూన్‌కి కాశ్మీర్ విమానంలో వెళుతూ ప్రమాదంలో చనిపోయార. నాయుడుబావకి దూరపు బంధువులే ఉన్నారు. అతను ఒంటరివాడైపోయాడు. ఉన్న బంధువులు కూడా చూడడానికి కూడా రారు. నాయుడుబావ జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా చేసి రిటైర్ అయ్యాడు. వచ్చిన డబ్బంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. నెలనెలా వస్తున్న పెన్షన్‌తో కాలం గడుపుతున్నాడు.
రెండు మూడు రోజులకొకసారి అనసూయమ్మా, అప్పలనరసమ్మ కలసి కోడళ్లన ఆడిపోసుకోవడం, అతడు విని వైరాగ్య ధోరణిలో నవ్వుకోవడం పరిపాటే. కానీ ఏదో ఒక రోజు మీ ఇద్దరికి అర్ధమయ్యేటట్లు క్లాస్ పీకాలి. కుటుంబ విలువలు, సర్దుకుపోవడాలు, సానుకూల దృక్పథంతో ఆలోచించడం, నెగెటివ్ ధోరణి విడనాడటం వంటి అంశాలను కూలంకషంగా మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ఇద్దరు ఆడవాళ్ల మాటల్లో దూరితే ఇద్దరూ ఒకటైపోయి తన మీదే తిరగబడతారని ఊరుకుంటున్నాడు.
* * *
ఒకరోజు అనసూయమ్మ మొగుడు, అప్పలనరసమ్మ మొగుడు కలసి మిత్రులతో కలసి తిరుపతి వెళ్లారు. నాయుడుబావనూ రమ్మన్నారు.
‘‘నాకు గుళ్లుగోపురాలకు పోయే అలవాటు లేదండి. ప్రేమసమాజాలు, అనాథ శరణాలయాలను పరిశీలిద్దాం పదండి’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అమ్మో అదో టైప్‌లా ఉన్నాడు. వీడితో మనకెందుకు’’ అనుకుంటూ తిరుపతి వెళ్లిపోయారు ఆ పెద్ద మనుషులు. వంటలు అయిపోయాక తీరుబడిగా అనసూయమ్మ, అప్పలనరసమ్మ నాయుడుబావ ఇంటి ముందే కూర్చుని కోడళ్లను తిట్టసాగారు.
‘‘అన్నయ్యగారూ మీరు అదృష్టవంతులు. మాలా కోడలు బాధలు లేవు’’ అన్నారు ఇద్దరూ.
నాయుడుబావ మనసు చివుక్కుమంది.
ఈ ఆడాళ్లకి తమ సోదే తప్ప ఎదుటి వాళ్ల బాధ అర్ధం కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అందరినీ కోల్పోయి నేను కుమిలిపోతుంటే నాతో ఇలాగేనా మాట్లాడేది’ అనుకున్నాడు.
‘‘నిజమేనమ్మా నేనే అదృష్టవంతుడిని. మీలా కోడళ్లను ఆడిపోసుకునే భార్య లేదు. అత్త చేత తిట్టుంచుకోవడానికి కోడలు లేదు. అమ్మ చేత చవట, వెధవా అనిపించుకోవడానికి కొడుకు లేడు. అయినా నాకు తెలియక అడుగుతాను నేను చాలా సంవత్సరాల నుండి గమనిస్తున్నాను మీకు మరేం పనులు ఉండవా? నిత్యం కోడళ్లని ఆడిపోసుకోవడమే మీ దినచర్యా? నిజానికి పెళ్లయిన పదిరోజుల్లోనే మీ కొడుకులు కోడళ్లను వాళ్ల వెంట తీసుకుపోయారు. అప్పటి నుండి వాళ్ల సంసారాలు వాళ్లు చక్కగా నడుపుకుంటున్నారు. వాళ్ల మధ్య సమస్యలు లేవు. పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. మీకా ఆ కొడుకులు తప్ప మరెవరూ లేరు. లంకంత కొంపలు, రెండు మూడు తరాలకు సరిపడా ఆస్తులు. అయినా నెలనెలా కొడుకులు డబ్బులు పంపుతారు. అయినా మీకు కోడళ్లు అన్యాయం చేసేస్తున్నారు, కొడుకుల్ని కొంగుకి ముడేసుకుంటున్నారు అని తిట్ల పురాణం వల్లిస్తుంటారు. అసలు ఏమిటి మీ బాధ? మిమ్మల్ని మీ కోడళ్లు నిర్లక్ష్యం చేసిన సందర్భాలు లేవు. అయినా మీ సహజధోరణితో వాళ్లను తిడుతుంటారు’’ అంటూ కాస్త ఘాటుగా అంటించాడు.
‘‘అయ్యో అన్నయ్యగారూ మీరు అపార్ధం చేసుకుంటున్నారు. మేము చాలా నయం. అదే మా అత్తలయితే మమ్మల్ని రాచి రంపాన పెట్టేవారు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు అనేవారు. మాకు నిత్యం నరకం చూపేవారు. మేము అలా కాదు కదా’’ అంది అప్పలనరసమ్మ.
‘‘అదేనండీ బాబూ నాయుడుగారు మా అత్త అయితే నా మొగుడితో మాట్లాడితే గుర్రుగా నా వైపు చూసేది. ఆమె కొడుకు భయంతో వణికిపోయేవాడు. నేను కొడుకుని, కోడలిని అలా చూడ్డంలేదు కదా’’ అంది అనసూయమ్మ.
‘‘మిమ్మల్ని ఎప్పుడో మీ అత్తలు బాధలు పెట్టారని మీరు మీ కోడళ్లపై పెత్తనం చెలాయించాలని తెగ ఆశ పడిపోతున్నారు. అలా చెయ్యడానికి వాళ్లు అందుబాటులో లేరన్నదే మీ బాధ. మీ కొడుకు అమెరికాలో, మీ కొడుకు బెంగళూరులో ఉన్నారు. అదే మీ బాధంతా. అలాగని ఇళ్లల్లోనే ఉంటే వాళ్లకి గడుస్తుందా? అయినా మీకు కూతుళ్లు లేరు. కోడళ్లలోనే కూతుళ్లను చూసుకుని వాళ్లతో మంచిగా ఉండకుండా ఎందుకండీ మీకీ అసూయలు, ఈర్ష్య, కోపాలు. అయినా అత్తా ఒకప్పటి కోడలే అన్న విషయం మరిచిపోతుంటారు మీలాంటి వాళ్లు. మీలాంటి వాళ్ల వల్లే అత్తలు, కోడళ్లు సమాజ విరోధులు అన్న భావన సమాజంలో ఉంది’’ అంటూ ఈసడించుకున్నాడు నాయుడుబావ.
‘‘అయినా అన్నయ్యగారూ మా బాధలు మీకు తెలియవు లెండి. మీరు ఒంటరి కదా’’ అన్నారు ఇద్దరు అమ్మలక్కలు.
‘‘అవునులెండి నేను ఒంటరినే. అయినా భార్య జ్ఞాపకం నా వెంటే ఉంటుంది. నా పిల్లల ప్రేమ, వాత్సల్యం, ఆనవాళ్లు నాతోనే ఉంటాయి. మీరూ ఉన్నారు మీ వేధింపులు భరించలేక భర్తల తీర్థయాత్రలకు పోతుంటారు మూడు నెలలకు ఒకసారి. ఇకనైనా ఆలోచించండి’’ అన్నాడు అతను ఘాటుగా.
ఆ మాటలకి ఎవరింటికి వాళ్లు పోయారు అనసూయమ్మ, అప్పలనరసమ్మ.
వీళ్లలో మార్పు వచ్చినట్లే ఉంది’ అనుకున్నాడు నాయుడుబావ.
ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న నాయుడుబావకి తమ అరుగు మీద కూర్చుని కోడళ్లని తిడుతున్న అనసూయమ్మ, అప్పలనరసమ్మల మాటలు వినిపించి ‘వీళ్లిక మారరు’ అనుకున్నాడు నాయుడుబావ.