దృష్టి
దృష్టి
*దృష్టి*(కథ )
ఇరవైఐదేళ్ల శోభన కాలేజీలో లెక్చరర్. ఆ రోజు పొద్దున్నే కాలేజీకి బయలుదేరుతూ తల్లి మొహంలో దిగులును గమనించింది. విషయం అర్థం అయ్యింది.
"నువ్వేమీ దిగులు పడకమ్మా!నేను బాగానే ఉన్నాను. అయినా నా పెళ్ళికి అంత తొందరేమొచ్చింది చెప్పు!"అంది.
"ఒక్కో సంబంధం ఇలా వెళ్లిపోతుంటే నీ గురించి నాకు బెంగ ఎక్కువవుతోంది "అంది శ్రావణి దిగులుగా.
ఈ లోపల శోభన తండ్రి కృష్ణమూర్తి అక్కడికి వచ్చాడు.
"నీకు కాలేజీకి టైమవుతుంది గానీ నువ్వు బయలుదేరు తల్లీ!"అన్నాడు కూతురుతో.
శోభన గబగబా కాలేజీకి వెళ్ళింది.
కృష్ణమూర్తికి ఇద్దరు పిల్లలు శోభన, సుధేష్ణ.
శోభనకు టెన్త్ క్లాసు చదివేటప్పుడు తండ్రి బైకు మీద బజారుకెళ్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఇద్దరికీ ప్రాణాపాయం కలగలేదు కానీ శోభన ముఖం మీద పెద్ద గాయమయ్యింది. నుదురుమీద పెద్ద చీలిక నిలువుగా పడింది. కుట్లు వేశారు డాక్టర్లు. ఎడమ కన్నుమీద కూడా దెబ్బ తగలటంతో కన్ను చిన్నదిగా అయ్యింది. ఆమె దృష్టికేమీ లోపం రాలేదు కానీ ఆమె ముఖం కొద్దిగా అందవిహీనంగా కనిపిస్తుంది.తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించి కొంత వరకు సరిదిద్దినా కూడా ఈ రెండు మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
శోభనకు పెళ్ళిసంబంధాలు చూస్తున్నారు. ఫొటోలో కొంచెం బాగా కనిపించినా ఆమెను దగ్గరగా చూస్తే మాత్రం ఆమె ముఖంలో ఉన్న లోపం కనిపించటంతో నాలుగైదు సంబంధాలు తప్పిపోయాయి.
"పిల్లకు కొంచెం లోపం ఉంది కదా కృష్ణా!కాస్త తక్కువ స్థాయి సంబంధాలు చూడు!లేకపొతే పెళ్ళి కావటం కష్టం!"అంటూ దగ్గర బంధువులు కృష్ణమూర్తికి చెబుతూనే ఉన్నారు.
శోభన ముఖం చూసి పిల్ల నచ్చలేదని చెబుతున్నారు కానీ ఆ అమ్మాయిలో ఉన్న లోపం పరిగణించదగినదా? ఈ ప్రపంచంలో అందం మాత్రమే ఎన్నదగినదా? మనసు, వ్యక్తిత్వం, చదువు, సంస్కారం గురించి ఆలోచించే మనుషులు కరువైపోయారా?
కృష్ణమూర్తి కూతురుకు తమకంటే తక్కువ స్థాయి సంబంధాలు చూడసాగాడు.తమ డబ్బు చూసి, ఇచ్చే కట్నకానుకల కోసం మాత్రమే కూతుర్ని చేసుకుంటామనే వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఉండే డబ్బు యావ అతడిని భయపెడుతోంది. అంత లేకిగా ప్రవర్తించేవాళ్లకు పిల్లనివ్వటం అస్సలు ఇష్టం లేదతడికి.
భార్యాభర్తలిద్దరికీ శోభన గురించిన దిగులు పీడిస్తూనే ఉంది.
అమ్మాయిని చేసుకునే వాడు ప్రేమను పంచి ఇచ్చి బాధ్యతగా చూసుకునేవాడు కావాలని తండ్రిగా కృష్ణమూర్తి కోరిక.ఆ కోరిక ఎలా తీరుతుంది?
కాలేజీకి వచ్చింది శోభన. కాలేజీ అయ్యాక ప్రిన్సిపాల్ తో లెక్చరర్లకు మీటింగ్ ఉంది. మీటింగ్ హాల్లో అందరూ సమావేశమయ్యారు.
ప్రిన్సిపాల్ అందరినీ ఉద్దేశించి
"డియర్ ఫ్రెండ్స్!ఈ రోజు మన కాలేజీకి డాక్టర్ సుధామ వచ్చారు. వీరు ఆంగ్ల, తెలుగు సాహిత్యాల్లో డాక్టరేట్స్ చేశారు. అతి పిన్నవయసులోనే రెండు డాక్టరేట్స్ చేసిన మేధావిగా కీర్తి ప్రతిష్టలు సాధించిన సుధామగారు మన కాలేజీలో సేవలందిస్తారు.మన వాళ్ళల్లో ఎవరైనా ఉత్సాహం ఉన్నలెక్చరర్లు ఎమ్. ఫిల్, పి. హెచ్. డి. చెయ్యాలంటే డాక్టర్ సుధామగారి పర్యవేక్షణలో చెయ్యవచ్చు. వీరు మన కాలేజీకి రావటం మన అదృష్టం."అంటూ డాక్టర్ సుధామను ఆహ్వానించింది.
డాక్టర్ సుధామ అందరినీ విష్ చేసి ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
సుధామ స్ఫురద్రూపి. నిండైన విగ్రహం. చక్కని నవ్వు. కానీ అతడు నల్లకళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. చేతిలో అంధులు ఉపయోగించే కర్ర ఉంది. అతడు పుట్టుకతో అంధుడు. వయసు ముప్పై ఉండొచ్చు.చదువులో ఏకసంధాగ్రాహి అనే పేరు అతడికి ఉంది.
'అంత విద్యావంతుడికి అంధత్వమా!విధివిలాసం!'అని అనుకున్నారందరు.
శోభనకు ఎమ్. ఫిల్. చెయ్యాలని ఉంది. యూనివర్సిటీకి వెళ్లకుండా తమ కాలేజీలోనే మార్గదర్శకత్వం లభిస్తుంటే అంతకంటే కావాల్సింది ఏముంది?ఆమె తెలుగు లెక్చరర్.
ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి తనకు ఎమ్. ఫిల్. చెయ్యాలని ఉందని చెప్పి ఇంటికి వచ్చింది.
సుధామకు తెలుగు భాషలో అపారమైన పాండిత్యం ఉంది. అతడు తెలుగు కావ్యాల గురించి వివరంగా, అర్థమయ్యేట్లు చెప్పగలడు. శోభన అతడి దగ్గర చేరింతర్వాత తను చదివింది చాలా తక్కువ అని ఆమెకు అర్థం అయ్యింది. అందుకని ఖాళీ దొరికితే వెళ్లి సుధామ దగ్గర పాఠాలు చెప్పించుకుంటోంది.
రోజూ సుధామను అతడి అసిస్టెంట్ రమణ తన బైక్ మీద తెచ్చి కాలేజీలో దింపి వెళతాడు. అతడే కాలేజీ అయిపోయే టైముకు మళ్ళీ వచ్చి ఇంటికి తీసికొని వెళతాడు.
ఆ రోజు క్లాసు అయిపోయాక ఖాళీ టైములో శోభన సుధామ దగ్గరికి వెళ్ళింది.
"రండి శోభనా!నిన్న నేను ఇచ్చిన ప్రబంధకావ్య విశిష్టత గురించి చదివారా?"అడిగాడు సుధామ.
"చదివాను సర్!ఉదాహరణ కావ్యాల గురించి కూడా నోట్స్ వ్రాసి తెచ్చాను "అంది శోభన.
"చాలా సంతోషం!.......
ఆ..శోభనా!నేనొక విషయం గమనించాను. చెప్పనా!"
"చెప్పండి సర్!"
"మీ కంఠస్వరం చాలా బాగుంటుంది. కొద్దిగా సంగీతం నేర్చుకొంటే చాలు!మీరు పాటలు పాడొచ్చు!"
ఆ కాంప్లిమెంటుకు ఆనందం వేసింది శోభనకు.
"ఉద్యోగం, చదువూ మింగేస్తున్నాయి. ఇంకా సంగీతానికి తీరికేది సర్ "
"అలా అనకండి!మనకు భగవంతుడు ఇరవైనాలుగు గంటలు ఇచ్చాడు. రోజుకొక అరగంట కేటాయించలేమా?"
"ఆలోచిస్తాను సర్!"అంది శోభన.
సుధామ తన దగ్గరికొచ్చే విద్యార్థులకు సాహిత్యం గురించే కాకుండా సంగీతం గురించి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు. చాలా కల్చరల్ పోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటాడు. అతడు వైలెన్ వాయిద్యం కూడా అద్భుతంగా వాయిస్తాడు. అతడు అవివాహితుడు. అన్నయ్య ఇంజనీరు.అతడిది తల్లి తండ్రి, అన్నా, వదినలు కలిసి ఉండే మంచి కుటుంబం. చదువులో అతడికి చాలా రికార్డ్స్ ఉన్నాయి.ప్రస్తుతం సంస్కృతంలో ఎమ్. ఎ. చేస్తున్నాడు.
మూడు నెలల తర్వాత జరిగిన కల్చరల్ పోగ్రాములో శోభన అన్నమాచార్య కీర్తన ఒకటి పాడింది.
రెండోరోజు నోట్స్ చూపించడానికి సుధామ దగ్గరికి వెళ్ళింది.
"సంగీతం నేర్చుకుంటున్నట్లు నాకు చెప్పలేదేం శోభనా!"అన్నాడు సుధామ నవ్వుతూ.
"మీకు సర్ప్రైజ్ ఇద్దామని సర్!"
"నేను రేడియో స్టేషనులో రెగ్యులరుగా వైలెన్ వాయిస్తుంటాను. మీరు కీర్తనలు పాడతానంటే రేడియో స్టేషనులో చెప్తాను!"
"అలాగే సర్!"అంది శోభన ఉత్సాహంగా.
ఒక నెల తర్వాత
శోభనకు అరగంట సేపు కీర్తనలు పాడటానికి అవకాశం ఇస్తున్నట్లు, ఆమె ప్రక్కన సుధామ వైలెన్ వాయిస్తున్నట్లు రేడియో స్టేషన్ నుండి కబురొచ్చింది.
"సాధన చెయ్యటానికి మా ఇంటికి వస్తారా శోభనా!"అడిగాడు సుధామ.
"తప్పకుండా సర్!మా నాన్నగారిని తీసికొని వస్తాను!"అంది శోభన సంతోషంగా.
ఈ మధ్య శోభన చాలా ఉత్సాహంగా ఉంటోంది. సంగీతం నేర్చుకోవటం, అప్పుడప్పుడూ సరదాగా కొత్త విషయాల గురించి చెల్లితో, తల్లితో మాట్లాడుతూ ఉండటం, ఏదో తెలియని ఆనందం ఆ అమ్మాయిని కమ్ముకుంటూ ఉంటే ఆమె ముఖంలో వెలుగు కనిపిస్తోంది.
కృష్ణమూర్తి కూతురు కళ్ళల్లో మెరుపును గమనిస్తున్నాడు.
దీనికంతటికీ కారణం సుధామ పరిచయం అనికూడా అతడికి తెలుసు.
శోభన సుధామను ఇష్టపడుతోందా? చూస్తూ చూస్తూ ఒక గుడ్డివాడిని..... ఏమనాలో తోచడం లేదతడికి.
శోభన, కృష్ణమూర్తి కలిసి సుధామ ఇంటికి వెళ్లారు. వీళ్ళను సాదరంగా ఆహ్వానించారు సుధామ కుటుంబసభ్యులు.
కాసేపు అవీ ఇవీ మాట్లాడాక "మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాము. కుదిరితే పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నాము."అన్నాడు కృష్ణమూర్తి.
శోభనను చూశాక ఆ అమ్మాయికి పెళ్ళి ఎందుకు కుదరటంలేదో అర్థం అయ్యింది సుధామ అన్నయ్య శేఖరుకు.
సుధామ, శోభనల సంగీత సాధన అయ్యాక సుధామ కుటుంబ సభ్యులను తమ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ దగ్గర సెలవు తీసికొని తమ ఇంటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.
ఆరాత్రి భోజనాలయ్యాక సుధామ గదిలోకి వచ్చాడు శేఖర్.
"శోభన గురించి నీ అభిప్రాయం ఏమిటి?"అన్నాడు మంచం మీద కూర్చుంటూ.
"చాలా తెలివైనది. ఏ విద్య అయినా నేర్చుకునే తపన ఆమెలో ఉంది.చక్కని కంఠస్వరం."
"అంతేనా!"
"అంతకాక ఏముంది? ఆమెను చూశావు కదా!పోనీ నువ్వు చెప్పు!నేను వింటాను!"
"ఆ అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని."
"వాళ్ళు చాలా పేదవాళ్ళా?గుడ్డి వాడికి పిల్లనిచ్చేంత దీనత్వంతో బాధపడుతున్నారా?"
"వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్ళే!"
"ఆ అమ్మాయి గురించి ఆలోచించకు!నాకు లేని ఆలోచన, ఆరాటం నీ కెందుకన్నయ్యా?"
అసహనంగా అన్నాడు సుధామ.
"నువ్వు మనుషులను చూడలేవు. నీకు ఎవరైనా మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. నేను ఆ అమ్మాయిని చూశాను. నేను ఆ అమ్మాయి కళ్ళల్లో కదిలే భావాన్ని చదవగలను. శోభన నిన్ను ఇష్టపడుతోంది. ఆ విషయం వాళ్ళ నాన్నకు కూడా చూచాయగా తెలుసు."
తల విదిల్చాడు సుధామ.
"అది ప్రేమ కాకపోవచ్చు. కేవలం ఒక గురువు మీద ఉండే అభిమానం కావచ్చు. ఈ కాలం అమ్మాయిలకు గుడ్డివాళ్ళ మీద, కుంటి వాళ్ళ మీద అప్పనంగా ప్రేమ పుట్టుకొస్తుందనుకునే మూర్ఖుడిని కాను...."
"ఈ లోకంలో ప్రేమ అనేదే ఉండదు. కేవలం ఈ ప్రపంచాన్ని తెలివిగలవాళ్ళు మాత్రమే శాసిస్తారని నీ అభిప్రాయం అవునా!"అన్నాడు శేఖర్.
"పెళ్ళి ఒక వ్యాపారమయింది. నువ్వు నాకేమిస్తావు? నేను నీకేమివ్వాలి?.. ఇదే కదా విషయం. ప్రేమ బంధం కంటే సౌకర్యమే చూసుకొంటున్న తరం. తల్లి దండ్రులను వదిలేసే కాలం. అన్నదమ్ములతో గొడవలు పడే బంధుత్వాలు. ఎవరికి వాళ్ళు విడివిడిగా తమకు తాము ప్రపంచాన్ని సృష్టించుకొంటున్న కాలం . ఇక్కడ, ఇప్పుడు మనసును గుర్తించే స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందా? ప్లాస్టిక్ పూవుల్లో మకరందం ఉంటుందా?"
"ఒక వేళ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడితే నువ్వు కాదంటావా? చెప్పు!"అడిగాడు శేఖర్.
మౌనంగా ఉన్నాడు సుధామ.
"నువ్వు అతిగా ఆలోచించే మేధావివి. నాకు, మీ వదినకూ పెళ్లయినప్పుడు మా పరిచయం కేవలం పదిహేను రోజులు మాత్రమే. మా మధ్య ప్రేమ లేదా? వ్యాపారబంధమే మిగిలి ఉందా? ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా మామధ్య ప్రేమ పెరుగుతోందే కానీ తగ్గిపోవటం లేదే!అమ్మా నాన్నల ప్రేమ వయసెంత? మరీ మూర్ఖంగా ఆలోచించకు!ఒకరితో ఒకరికి సాహచర్యంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అదే రోజు రోజుకూ పటిష్ఠమై విడిపోలేని ప్రేమ బంధం అవుతుంది.నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. ఒక వేళ నా ఊహ నిజమయితే మనం ముందుకు వెళదాము!"
"కానీ అన్నయ్యా!... "
"నువ్వేమీ సందేహాలు పెట్టుకోకు!ఆమెకు బలవంతం ఏమీ లేదుగా!ఇష్టం లేకపొతే నిక్కచ్చిగా చెప్తుంది. ఈ కాలం పిల్ల.చదువుకుంది ఉద్యోగం చేస్తుంది.తనకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు."అన్నాడు శేఖర్.
సుధామ ఆలోంచిస్తున్నాడు.
శేఖర్ తమ్ముడి భుజాలచుట్టూ చేతులు వేసి
"నువ్వు కూడా నాలాగా పెళ్ళి, సంసారం అనే భవ బంధాల్లో చిక్కుకొని గిజగిజలాడుతూ ఉంటే చూడాలని ఉందిరా!నేను ఒక్కడినే ఇద్దరు పిల్లలతో సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటే నువ్వు మాత్రం పుస్తకాలతో , సంగీతంతో ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కుళ్లుగా ఉండదూ!" అన్నాడు నవ్వుతూ.
ఫక్కున నవ్వాడు సుధామ.
"ఎక్కువ ఆలోచించకు!చూద్దాం!బి పాజిటివ్!గుడ్ నైట్!"అంటూ తన రూములోకి వెళ్ళాడు శేఖర్.
బాల్కనీలోకి వచ్చాడు సుధామ.మాధవీ లత పరిమళం మనసును పరవశింపచేస్తోంది.
అతడు ఆలోచిస్తున్నాడు. చందమామ, నక్షత్రాలు చూడటానికి బాగుంటాయట. చాలా పుస్తకాల్లో చదివాడు. శోభనతో పరిచయం అయ్యాక ఆమెలో ఉన్న చైతన్యం మనసుని ఆకర్షిస్తోంది. కానీ పుట్టు గుడ్డివాడయిన తనకు చందమామ దొరకదు. అది తనకు బాగా తెలుసు. అన్నయ్యకు ఆరాటం ఎక్కువ. అన్నయ్య ఊహలు నిజం కావు. కలల్లో కల్పనల్లో మునగటం తన స్వభావానికే వ్యతిరేకం.సాహిత్య, సంగీతాలు మాత్రమే తనకు తోడు నీడ.
మాధవీలతను చేత్తో స్పృశించాడు. చల్లగా, మృదువుగా తగిలింది.
** ** ** ** ** ** ** ** ** **
ఆ పై ఆదివారం శోభన ఇంటికి వచ్చాడు సుధామ. అప్పటికి సంగీతం టీచరు సుజాత కూడా అక్కడికి వచ్చి ఉంది.
సుధామ వైలెన్ వాయిస్తూ ఉంటే శోభన పాడుతూ ఉంది.
"టీచర్!మీరు శోభనగారిని సంగీతం పరీక్షలకు ప్రిపేర్ చెయ్యండి!గాత్రంలో డిప్లొమా అవుతుంది. సర్టిఫికెట్ ఉంటే రేడియో స్టేషనులో అవకాశాలు ఎక్కువగా వస్తాయి."టీచరుతో చెప్పాడు సుధామ.
"అవును!నేను కూడా అదే అనుకొంటున్నాను "అంది టీచరు.
"సిలబసులో రెండు వర్ణాలు మాత్రమే ఉన్నాయి. మీరు కనీసం ఏడెనిమిది వర్ణాలు నేర్పించాక కృతులకు వెళ్ళండి!వర్ణాలు కనుక బాగా సాధన అయితే పునాది గట్టిగా ఉంటుంది!"
సుజాత టీచరుకు సంతోషం వేసింది. ఎదురుగ్గా ఉన్నవాడు సంగీతంలో నిష్ణాతుడు.
అక్కడే ఉన్న కృష్ణమూర్తి సుధామ నుద్దేశించి
"మీరు ఇంత విద్యను ఎలా నేర్చుకొన్నారు?"కుతూహలంగా ప్రశ్నించాడు.
"నిజానికి మా లాంటి అంధులకు స్కూళ్లు సరిగ్గా ఉండవు. బోధనా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఇప్పటికి ఒకటిన్నర కోటి మంది గుడ్డివాళ్ళు ఉన్నారు. బ్లైండ్ స్కూళ్లు మాత్రం దేశం మొత్తం మీద పాతికలోపే ఉన్నాయి. సగం స్టేట్స్. లో స్కూళ్లే లేవు. బ్రెయిలీలో ఉండే పుస్తకాలు తక్కువ. నాది శృతపాండిత్యమే. మా అన్నయ్య, నాన్న, ప్రతి పుస్తకం చదివి రికార్డ్స్ చేసి పెట్టేవాళ్ళు. నేను విని గుర్తుపెట్టుకొనేవాణ్ని. తెలుగు పద్య భారతం బ్రెయిలీలో దొరుకుతుందా? నేను రికార్డ్స్ ద్వారా విన్నాను. ప్రతి పద్యమూ, శ్లోకమూ కూడా అన్నయ్య, నాన్న, అమ్మ రికార్డ్ చేసేవాళ్ళు. నా చిన్నప్పటినుండి నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈనాడు ఇలా ఉన్నాను.
నాకు లభించిన సహకారం ఎంతమందికి లభిస్తుంది? అందుకే మేము ఒక గ్రూప్ పెట్టుకొని చాలా వరకు పుస్తకాలను రికార్డ్ చేయిస్తూ ఉంటాము. ఆ గ్రూప్ మా నాన్నగారి పర్యవేక్షణలో పనిచేస్తుంది."వివరంగా చెప్పాడు సుధామ.
"అయితే నేను కూడా మీ గ్రూపులో చేరతాను. నాకు కూడా బుక్స్ ఇవ్వండి!రికార్డ్ చేసి పెడతాను!"మనస్ఫూర్తిగా చెప్పాడు కృష్ణమూర్తి.
"చాలా సంతోషం అంకుల్!మీరు కేటాయించే ఈ కొద్ది సమయం మా లాంటి వాళ్లకు వెలుగునిస్తుంది."
నిజానికి అతనితో మాట్లాడుతుంటే కృష్ణమూర్తికి తెలియని అవ్యక్తమైన ఆత్మీయత మనసులోనుంచి పొంగుకొస్తోంది. తనకే ఇలా ఉంటే చిన్నపిల్ల శోభన సుధామను ఇష్టపడటంలో వింతేముంది?
రేడియో స్టేషనులో శోభన ఒక వర్ణం, రెండు కీర్తనలు మధురంగా గానం చేసింది. ప్రక్కన సుధామ వైలెన్ వాయిస్తుంటే ఆమెలో ఒక నూతనోత్సాహం జలపాతంలాగా ఉరకలు వేస్తున్నట్లుగా ఉంది.
ఆ తరువాత వచ్చిన సోమవారం కృష్ణమూర్తికి ఫోన్ చేసి తను వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు శేఖర్.
"రండి!రండి!అందరిని తీసికొని రండి!"ఆహ్వానించాడు కృష్ణమూర్తి.
"లేదంకుల్!నేను ఒక్కడినే మీతో మాట్లాడాలి!"
విషయం కొంచెం అర్థం అయింది కృష్ణమూర్తికి. ఆ సమయానికి శోభన కాలేజీలో ఉంటుంది.
శేఖర్ వచ్చాడు.
ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సరాసరి విషయానికి వచ్చాడు.
"మీ అమ్మాయి శోభనను మా తమ్ముడికి చేసుకుందామని మా ఇంట్లో ఆలోచిస్తున్నాము.
సుధామది జెనటిక్ ప్రాబ్లెమ్. వాడికున్న లోపం వల్ల చదువులో కానీ, ఉద్యోగంలో కానీ వాడు పెద్దగా ఇబ్బంది ఎదుర్కొలేదు.
దృష్టి ఉన్న మనుషులకన్నా వాడు చాలా నయం. వాడి ప్రపంచం పుస్తకాలు, సంగీతం. ఆ రెండింటిని ఇష్టపడే అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యాలని చూస్తున్నాము. గుడ్డివాడికి మీ అమ్మాయిని అడిగామని మీరు తప్పుగా భావిస్తున్నారా? నాకు శోభన కళ్ళల్లో వాడి పట్ల ప్రేమ కనిపించింది. అది నా ఊహ మాత్రమే అయితే మీరు అమ్మాయితో ఏమీ చెప్పవద్దు!వాడి పట్ల ఉన్నది కేవలం గురుభావమే అయితే విషయాన్ని ఇంతటితో వదిలి వేద్దాము!..... "
"అదేమీ లేదు శేఖర్ గారూ!ఈ మధ్య మా అమ్మాయి చాలా ఉత్సాహంగా ఉంటోంది.
దానికి కారణం సుధామతో పెరుగుతున్న స్నేహం. సుధామకు కళ్ళు లేవని తప్ప కుటుంబం, సాంప్రదాయం అంతా నాకు నచ్చింది. కానీ కళ్లు లేని వాడికి భార్యగా తరువాత తరువాత మా అమ్మాయి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో అని భయంగా ఉంది. నేను ఎటూ ఆలోచించలేకపోతున్నాను.అన్నదమ్ముల పట్ల, తల్లితండ్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఎంతో మందిని నేను చూశాను. మిమ్మల్ని చూస్తుంటే శ్రీరామచంద్రుడు ఇలాగే ఉంటాడు అనిపిస్తోంది. మీ వంటి వారి మధ్య మా అమ్మాయి జీవితం భద్రంగా ఉంటుందని నమ్మకం కూడా కలుగుతోంది. మా అమ్మాయికి కన్ను చిన్నగా ఉంటుంది.దృష్టిలోపం లేదు. పిల్లను చూడంగానే అందవిహీనంగా కనిపిస్తోంది... బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనసును చూసే వాళ్ళు తక్కువయ్యారు. "
"మీరు అమ్మాయిని కదిపి చూడండి!ఒక వేళ తనకు ఇష్టం లేకపొతే సుధామ వల్ల అమ్మాయికి కాలేజీలో అమ్మాయి చదువుకు ఎటువంటి సమస్య రాదని నేను హామీ ఇస్తున్నాను. అమ్మాయికి మంచి సంబంధం చూసే విషయంలో నేను కూడా మీకు తోడుగా ఉంటాను. నన్ను మీరు కొడుకుగా భావించండి!"
ఇంటికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు శేఖర్.
శేఖర్ చేతులు పట్టుకున్నాడు కృష్ణమూర్తి. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
"మీ వంటి పుత్రులు ఉన్న మీ తల్లితండ్రులు అదృష్టవంతులు. "అంటూ వరండా దాకా వచ్చి శేఖర్ కు వీడ్కోలు చెప్పొడు.
ఆ పూట అంతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు భార్యాభర్తలిద్దరు.
శ్రావణి మాత్రం సమాధానపడలేక పోతోంది.
"ఎంతయినా మన పిల్లను గతిలేని వాళ్ళలాగా గుడ్డివాడికిచ్చి చేద్దామా!నేను భరించలేను" అంటూ ఏడ్చింది.
"మనం ఒక సారి శోభనను అడిగి చూద్దాము!కష్టనష్టాలు అన్నీ చర్చిద్దాము! "అన్నాడే కానీ అతడి మనసులో కూడా ముల్లు గుచ్చుకున్నట్లుగా ఉంది.
ఆ రాత్రి శ్రావణి, కృష్ణమూర్తి సుధామ శోభన అభిప్రాయం అడిగారు.
"నాకు ఇష్టమే నాన్నా!సంకుచితత్వం లేని మనిషి. మీరు మన ఇల్లు, లక్షల్లో కట్నం ఇస్తే నన్ను ఉద్ధరించినట్లు పెళ్ళి చేసుకుంటామనే వాళ్ళ కంటే సుధామ చాలా బెటరు. అతడిలో ఒక లోపం ఉంది. నాలో ఒక లోపం ఉంది. నేను అందంగా ఉండను. నా మనసు, నాలో ఉన్న టాలెంట్, నా వ్యక్తిత్వాన్ని గుర్తించే మనిషి కబోది ఎలా అవుతాడు నాన్నా!కళ్ళు లేవనే లోపం తప్ప సుధామలో ఇంకో లోపాన్ని వెదకండి!..."
"జీవితమంతా అతడు ప్రక్క మనిషి తోడు లేకుండా గడపలేడు. పిల్లలు పుట్టాక చాలా వరకు భారం నీ మీద పడుతుంది. అప్పుడు నీకు అసంతృప్తి మొదలయితే తట్టుకోగలవా? మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్థలు వస్తే పరిష్కారం ఎలా అనే దిశగా కూడా ఆలోచించాలి. పెళ్ళి అంటే జీవితాంతం కలిసి బాధ్యతలు నిర్వహించటం."
తండ్రి మాటలకు బదులివ్వలేదు.
వేలితో పక్క మీద గీతలు గీస్తూ ఉంది శోభన.
"ఇంత బతుకు బ్రతికి పిల్లను గుడ్డివాడికిచ్చి చేశామంటే అందరిలో ఎంత పరువు తక్కువ!బంధువుల్లో తల ఎత్తుకొని తిరగగలమా? ఆలోచించు!నా కయితే అస్సలు ఇష్టం లేదు. మొన్న ఒక సంబంధం వచ్చింది!చూడు!ఏభై లక్షలు కట్నం అడిగారు. ఇచ్చి చేస్తాం. పిల్ల వాడు బాగానే ఉన్నాడు.ఇంజనీరు.ఈ రెండిళ్ళుఆస్తి మేము కట్టుకుపోతామా!నీకు, చిన్నదానికే కదా!
అది ఇప్పుడే ఇస్తాము!మరీ ముష్టివాళ్ళలాగా గుడ్డివాడిని చేసుకొనే ఖర్మ నీకేంటి?కట్నం భారీగా ఇస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మేము కూడా నీ పక్కనే ఉంటాము!"అంటూ అసంతృప్తిని వెళ్ళగక్కింది శ్రావణి.
తల్లి మాటలకు దిగులుగా చూసింది శోభన.
"ఎంతకని డబ్బు పెడతారు? నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూడని మనిషిని చేసుకొని ఏం సుఖపడతాను? నాక్కూడా నన్ను ప్రేమించే భర్త కావాలని ఉంటుందమ్మా!"
కూతురి తల నిమిరాడు కృష్ణమూర్తి.
"ఖర్మ ఎదురయితే కాట్లోకి పొయ్యే కాలం వచ్చిందట!అలా వుంది మన జాతకం!"తల కొట్టుకుంది శ్రావణి.
నిస్సహాయంగా తండ్రివైపు చూసింది శోభన.
"నువ్వు చిన్నపిల్లవు కాదు!మళ్ళీ ఆలోచించు!మేము నీ క్షేమం గురించి ఆందోళనపడుతున్నాము తల్లీ!"అంటూ కూతురును దగ్గర తీసికొని ఆమె నుదురు చుంబించాడు కృష్ణమూర్తి.
ఆ రాత్రి భర్తను పట్టుకొని ఏడుస్తూనే వుంది శ్రావణి.
రెండుమూడు రోజులు వాదించి తల్లిని ఒప్పించింది శోభన.
కృష్ణమూర్తి సుధామతో కూతురు జీవితం గురించి దిగులుపడినా అతడి వ్యక్తిత్వం తల్చుకొని తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు.
శోభన, సుధామ బిర్లా మందిర్ దగ్గర కూర్చున్నారు.
వాళ్లిద్దరినీ మాట్లాడుకోమని బయటకు పంపించారు పెద్దవాళ్ళు.
"నన్ను ఎందుకు పెళ్ళి చేసుకోవలనుకుంటున్నారు శోభనా!"అడిగాడు సుధామ.
అతడు అలా అడిగేసరికి కొంచెం సహజసిద్ధంగా ఆడపిల్లకు కలిగే సిగ్గు కలిగింది శోభనకు. ఆమె ఏమీ మాట్లాడలేదు.
"మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. లేక పోతే ఎలా తెలుసుకోగలను?"మృదువుగా నవ్వుతూ పలికాడు సుధామ.
అప్పుడు గుర్తొచ్చింది శోభనకు. తను సిగ్గు పడితే అతడికి తెలియదు.
"మీకు నా శరీరం కనిపించదు. నాకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంటులో ముఖం మీద పెద్ద గాయం అయ్యింది. ఎడమ కన్ను కాస్త చిన్నగా కనిపిస్తుంది. నాకున్న చదువుకూ, ఉద్యోగానికి అదేమీ పెద్ద లోపం కాదు. కానీ దాన్నే పెద్ద లోపంగా చూస్తూ, నన్ను కించపరుస్తూ, కట్న కానుకలతో నన్ను తూకం వేస్తూ జరిగే ఈ పెళ్ళి సంబంధాల వరస నాకు పరమ అసహ్యన్ని కలగచేస్తోంది. మా నాన్న నాకు కట్నంగా లక్షలు లక్షలు దోచి పెడితే, అంతంత మాత్రం చదువుకొన్న వాడు నాకు దొరుకుతాడు. అటువంటి వాడిని చేసుకొని నేను ఎంత మాత్రం సుఖపడతానో దేవుడికే తెలియాలి. మీకు నాకున్న లోపం కంటే ఎక్కువ లోపం వుంది.నాకు నచ్చిన చదువు మీకు వుంది.నన్ను గుర్తించి , నాలో ఉన్న కళను ప్రోత్సాహించే మనసు ఉంది. ఎంత మంది భర్తలు తమ భార్యలను కళాకారులుగా తీర్చి దిద్దుతారు? కేవలం బాహ్యసౌందర్యాన్ని చూసే దృష్టి ఉన్నవాళ్ళ కంటే మీరు నాకు ప్రత్యేకంగా కనిపించారు...... ఇంత కంటే నేను చెప్పలేను..."
ఆమె కంఠం వణికింది.
ఇంక ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చెయ్యి చాచాడు. ఆమె మెల్లగా అతడి చేతిలో చెయ్యి వేసింది.
అతడు ఆమె చేతిని భద్రంగా పట్టుకొని తన పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు.
ఒక విద్యుత్తరంగం తన తనువులోకి ప్రవహించినట్లనిపించింది శోభనకు.
ఆమె జీవితానికి శుభారంభం పలుకుతున్నట్లు గుడిలో గంటల నెవరో మోగించారు.
సమాప్తం.

