తెలుగు హాస్య నీతి కథలు

Tragedy Classics Thriller

2.8  

తెలుగు హాస్య నీతి కథలు

Tragedy Classics Thriller

చెన్నమ్మ సర్కిల్

చెన్నమ్మ సర్కిల్

8 mins
146


చెన్నమ్మ సర్కిల్ - (Heart ❤️ Touching Story) ఆంధ్రజ్యోతి సండే బుక్ లో ప్రచురింపబడిన కథ *(డా.ఎం.హరికిషన్ -9441032212-కర్నూలు)* 

**************************

"ఈ ఎర్ర రంగు చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా?" దగ్గరకు తీసుకుంటూ అన్నాడు గోపాల్.

ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇద్దరే!

సుందరి వాళ్ళ అమ్మ పొద్దున్నే పనికి పోగానే రహస్యంగా ఇంట్లోకి చేరాడు.

అతని ఒడిలో పడుకొని, కళ్ళలోకి తదేకంగా చూస్తూ “గోపాల్... ఇదంతా జరుగుతుందంటావా” దిగులుగా అడిగింది. ఆమె నుదుటిమీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ “నన్ను నమ్ము. మన స్నేహం ఇప్పటిది కాదు. చిన్నప్పటినుంచి ఒకరి చేయి మరొకరం పట్టుకుని నడిచాం. కలసి బడిలో పక్కపక్కనే కూర్చున్నాం. తిన్నాం. తిరిగాం. ఇప్పుడు ఇలా నిన్ను ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకోవడానికి మనసొప్పడం లేదు. బతికినా చచ్చినా కలిసే” ఆ మాటలు అంటుంటే గొంతు ఉద్రేకంతో వణికింది. సుందరి చప్పున గోపాల్ నోటిని చేతితో మూసి గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళలోంచి ఒక్కొక్క చుక్క కారుతోంది.

“నువ్వేం దిగులుపడకు. నేను వివరాలన్నీ తెలుసుకున్నాను. బాంబేలో ఆపరేషన్ చేసే వైద్యులు చాలామంది వున్నారు. ఆ తరువాత మనం పెళ్లి చేసుకొని మనమెవరో ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళిపోయి బతుకుదాం.”

“మరి అంత డబ్బు!"

“దాని కోసమే రేపు బయలుదేరుతున్నా. పత్తికొండ దగ్గర జొన్నగిరి అనే వూరు వుందిలే. అక్కడ తొలకరి వానలప్పుడు వజ్రాలు దొరుకుతాయంట. సుంకన్న తెలుసు కదా... మన చిన్ననాటి స్నేహితుడు. వానితో కలిసి వెళుతున్నా. మన అదృష్టం బాగుంటే సమస్యలన్నీ తీరిపోతాయి.”

మధ్యాహ్నం పన్నెండవుతూ వుంది.

“సరే ఇంక నువ్వెళ్ళు. అమ్మ వచ్చే సమయం దగ్గర పడింది. జాగ్రత్త. అవసరమైతే మెసేజ్ చెయ్. ఫోన్ చేయకు.”

గోపాల్ ఆమె వంకే తిరిగి చూస్తూ వెళ్లిపోయాడు.

సుందరి గబగబా చీర విప్పేసి, బొట్టు తుడిచేసి, చొక్కా ప్యాంటు వేసుకొని, పాపిడి మధ్య నుంచి కుడికి తీసింది. చీరను జాగ్రత్తగా మడతలు పెట్టి బీరువాలో భద్రంగా దాచింది. వంట ఇంకా పూర్తి కాలేదు. అన్నం గిన్నె స్టవ్ మీదకి ఎక్కించి, బెండకాయలు తరిగి వేపుడు చేసింది. అమ్మ పనిచేసి అలసి ఆకలితో వస్తుంది. వంట సిద్ధంగా లేకపోతే విసుక్కుంటుంది.

“నేనూ నీతో పాటు వస్తాను మా... నీవొక్కదానివే ఎంత కాలం కష్టపడతావు" చాలాసార్లు అంది తల్లితో.

"వద్దు... బైట ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా తట్టుకోలేను.”

“ఎంత కాలం ఇలా ఒంటరిగా ఇంట్లో.”

"నేను బతికున్నంత కాలం" ఆమె కంట్లో నీటి పొర.

“ఆ తర్వాత?”

కాసేపు నిశ్శబ్దం. శూన్యంలోకి చూస్తూ “దేవుడున్నాడు” అంటూ పైకి రెండు చేతులు ఎత్తి మొక్కుకునేది.

చాలాసార్లు చచ్చిపోవాలి అనిపించేది. కానీ గోపాల్ బతుకుపై ఆశ కల్పించాడు. చిన్నప్పటినుంచీ ఎంతో స్నేహంగా వుండేవాడు.

అమ్మ బడి మానిపించాక కూడా ఒక్క గోపాల్ని మాత్రమే రానిచ్చేది.

ఎనిమిదో తరగతి వరకు అంతా బాగానే ఉండేది. కానీ తొమ్మిది నుంచి నెమ్మది నెమ్మదిగా మార్పు మొదలైంది. మామూలుగానే నాజూకుగా వుండే తెల్లని శరీరం మరింత నునుపుదేలసాగింది. గొంతు పూర్తిగా మగవాళ్లకు దూరంగా జరిగిపోయింది. మీసాలు గడ్డాలు రావలసిన మొహం నున్నగా తయారై ఛాతి పొంగడం మొదలైంది.

చుట్టూ గుసగుసలు మొదలయ్యాయి. నవ్వులు... అవహేళనలు... ఎత్తిపొడుపులు... రోజురోజుకి లోపలికి ముడుచుకొని పోసాగాడు. వెనుక మాటలు కాస్త మొహం మీదే అనటం మొదలయ్యింది.

మగపిల్లలు గిల్లటం, నవ్వటం, లాగటం మొదలుపెట్టారు. గోపాల్ వాళ్ళతో చాలాసార్లు గొడవ పడేవాడు. తన్నేవాడు.తన్నించుకునేవాడు.

ఆడపిల్లలు దూరంగా జరగటం మొదలుపెట్టారు.

తల్లికి అంతా అర్థమవుతూ వుంది. ఒకరోజు ఇంట్లో పెద్ద గొడవ. నాన్న గట్టిగా అరుస్తున్నాడు.

"వీన్ని ఎక్కడన్నా వదిలేసి వస్తా. ఊరిలో తలెత్తుకోలేకపోతున్నా. బిడ్డ పుట్టలేదనుకుంటే సరి.”

"లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ. ఎంతమంది వాళ్ళ పిల్లలకు కాలొంకరైనా, చేయొంకరైనా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవటం లేదు.”

"అది వేరు... ఇది వేరు... వాళ్లను చూసి అందరూ జాలిపడతారు. కానీ వీన్ని చూస్తే మొగం మీదే నవ్వుతున్నారు. భరించలేను.”

“నువ్వు ఎన్నైనా చెప్పు. చచ్చినా వీన్ని వదిలేయలేను.”

“సరే అయితే. నేనే మిమ్మల్ని వదిలేస్తా.” గదిలోంచి వస్తున్న మాటలు వింటూ వణికిపోయాడు. కళ్ళ నీళ్లతో ఒక మూల గోడకు అతుక్కుపోయాడు. మాటా మాటా పెరిగిపోయింది.

"వీడు వున్నంత వరకు ఇటువైపు అడుగు పెట్టను" అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

మూడు సంవత్సరాలయింది తండ్రి ముఖం చూడక.

తల్లి పనిచేసుకొని బతకడానికి ఏ ఊరయితేనేమి అనుకుంటూ ఆ ఊరు ఖాళీ చేసి, కర్నూల్లో తమ గురించి ఎవరికీ తెలియని చెన్నమ్మ సర్కిల్ దగ్గరికి చేరింది.

అక్కడ ఉదయం లేచినప్పటినుండీ ఎవరి బతుకు వేట వారిది.

ముందెవరున్నారు, వెనుకెవరున్నారు, బతికారా, చచ్చారా... తెలుసుకునే ఓపిక ఎవరికీ లేదు.

రేపటి వరకూ బతికి వుండడమే వారి ప్రధాన సమస్య.

అక్కడ వుండే ఇండస్ట్రియల్ ఏరియాలో పని వెతుక్కుంది. సుందరికి పంజాబీ డ్రెస్సులు తొడిగింది. చుట్టుపక్కల వాళ్లకి ఆడపిల్ల అనే చెప్పింది. ఇంట్లో మగపిల్లవానిలా బట్టలు వేసుకున్నా ఎప్పుడైనా బయటికి అడుగుపెడితే మాత్రం ఆడపిల్లలాగే బట్టలు వేసుకోమనేది. చుట్టుపక్కల ఎవరికీ ఎటువంటి అనుమానం రానీయకుండా గుట్టుచప్పుడు కాకుండా బతకసాగారు. ఎవరినీ ఇంటికి రానిచ్చేది కాదు. సుందరి ని కూడా బైటికి పంపేది కాదు. పిల్లలకోడిలా కాపాడుకోసాగింది.

కొంతకాలానికి గోపాల్ కూడా ఊర్లో పనులు దొరకక, పంటలు పండక, తాపీ పని నేర్చుకొని కర్నూల్లోకి అడుగు పెట్టాడు. మరలా ఇద్దరి మధ్య అనుబంధం మొదలై అది ప్రేమగా మారింది.


************


గోపాల్ బట్టలున్న తన పాత సంచితో సుంకన్న ఇంటికి చేరాడు. సుంకన్న పెళ్ళాం ఇచ్చిన కాఫీ తాగుతా వుంటే ఆమె వంటింట్లోంచి “అన్నా... అక్కడ వజ్రమూ లేదు, మట్టిగడ్డా లేదు. ఈయన మాటలు విని పనీపాటా వదిలేసి నువ్వు కూడా పోతున్నావే అనవసరంగా. పెండ్లయిన కాన్నించి చూస్తా వున్నా గదా... తొలకరి వానలు వస్తున్నాయంటే చాలు పంచ పైకెగ్గట్టి హుషారుగా ఎగురుకుంటూ పోవడం... చేతిలో దుడ్లు అయిపోగానే మొగమంతా నల్లగా చేసుకుని మట్టసంగా వూగులాడుకుంటా రావడం... ఇదే వరుస. నీకెందుకన్నా ఎండమావుల్లో ఎదుకులాట. హాయిగా పని చేసుకోక” అనింది.

సుంకన్న పెళ్ళాం వంక సురసురు చూస్తా “చూడు... అదృష్టదేవత ఎప్పుడు ఎవరి తలుపు తడతాదో ఎవరికి తెలుసు. చూస్తావుండు ఏదో ఒకరోజు నీ మొగుడు పెద్ద మిద్దె కట్టి, మోటర్ బండిపై నిన్నూ నీ బిడ్డను కూర్చోబెట్టుకుని చెన్నమ్మ సర్కిల్ వీధులన్నీ తిరగకపోతే.” "వాయబ్బో మాటలకేం తక్కువ లేదులే. వూ కొట్టేటోడు వుండాలగానీ చందమామ మీద ఇళ్ళుకూడా కట్టి చూపియ్యగలవు” అని నవ్వుకుంటా ఎంగిలి కాఫీగ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్లింది.

సుంకన్న గోపాల్ వంక తిరిగి “రేయ్ జొన్నగిరి అంటే ఏమనుకుంటా వున్నావ్... అశోకుని కాలంలో రెండవ రాజధాని. అప్పట్లో దాన్ని సువర్ణగిరి అని పిలిచేవారట. అదే కాలక్రమేనా సొన్నగిరిగా... జొన్నగిరిగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ అశోకుడు వేయించిన శాసనాలు తప్ప కోట గుర్తులు ఏమీ లేవు. అన్నీ శిథిలమైపోయి సర్వసంపదలతో సహా భూమిలో కప్పబడిపోయాయి. 

అంతేకాదు విజయనగర రాజ్యం పతనం అవుతున్న సమయంలో శత్రువుల చేతికి చిక్కకుండా రాజ్యంలోని విలువైన రత్నాలు, వజ్రాలు అన్నీ సరిహద్దు ప్రాంతాలలోని గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గుంతలు తీసి భద్రంగా దాచి పెట్టినారంట. అవే ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా భూమి కోతకు గురై ఒక్కొక్కటిగా వెలుపలికి వస్తా వున్నాయి. తినే ప్రతి గింజపైనా దేవుడు ఎవరో ఒకరి పేరు ముందే రాసిపెట్టినట్టు... ప్రతి వజ్రం పైన దాని యజమాని పేరు ముందే ఉంటుంది. అవి వాళ్ళు అడుగుపెట్టినప్పుడు మాత్రమే దొరుకుతాయి. నీ అదృష్టం ఎలా వుందో ఎవరికి తెలుసు?” ఊరించి ఊరించి చెప్పాడు.

ఇద్దరూ నెల రోజులకు అవసరమైన బియ్యాన్ని, వంట పాత్రలను, చిన్న కిరోసిన్ స్టవు, టార్చిలైటు, దుప్పట్లను, బట్టలను గోనె సంచుల్లో మూటగట్టుకొని బైలుదేరారు.

ఇంతలో పది సంవత్సరాల సుంకన్న చిన్న కూతురు ఎదురు వచ్చింది. పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. “బాయ్ నాన్నా... బాయ్ మామా” అంటూ టాటా చెప్పింది. “జాగ్రత్తగా పోయి రండి" కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ సుంకన్న పెళ్ళాం ఊరగాయ, రొట్టెలను దారిలో తినడానికి మూటగట్టి అందించింది.


******


వచ్చి అప్పటికే పదిహేను రోజులు అవుతావుంది. రోజూ పొద్దున్నే లేవడం, గుడి ముందున్న బోరింగు వద్ద స్నానం చేసి బట్టలుతుక్కోవడం, స్టవ్ మీద అన్నం పప్పు చేసుకోవడం, కొంచెం తిని మిగిలింది మూటగట్టుకుని పొలాల్లోకి బయలుదేరడం.

ఆ ఎర్ర నేలల్లో జనాలు గొర్రెలమందల్లా తలలు వంచుకొని గుంపులు గుంపులుగా వెదుకుతా వున్నారు. ఎవరెవరికో ఎప్పుడో వజ్రాలు దొరికి వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మారిపొయినాయనే కథలు వింటూ... చస్తున్న ఆశలకు జీవం పోస్తూ... పొలాలను జల్లెడ పడుతున్నారు.

ఆ ఊరి రైతులు చానా మంచోళ్ళు. విసుక్కోరు.

ఒకపక్క వాళ్ళు దున్నుకుంటా వుంటే మరొక పక్క జనాలు వాళ్ళ వెంబడే ఏరుకుంటా వున్నా ఏమీ పట్టించుకోరు. ఎక్కడెక్కడి నుంచో ఆశతో వచ్చే వాళ్లను చూస్తే ఆ ఊరి వాళ్లకు జాలి.

గోపాల్ నీరసంగా తవ్వుతూ వున్నాడు. పొద్దున్నుంచీ ఏమీ తినలేదు. ఇదే ఆఖరి రోజు. తెచ్చుకున్న సరుకులూ డబ్బులూ అయిపోయాయి. ఆకలి లోపల చంపేస్తా వుంది. నీళ్ల బాటిల్ వంక చూశాడు. ఖాళీగా వుంది. దూరంగా ఒక వంక వుంది. బాటిల్ తీసుకొని అటువైపు అడుగులు వేశాడు. వంక చుట్టూ గుబురు మొక్కలు. ఆ మొక్కల్లో తినడానికి పనికి వచ్చేవి ఏమైనా వున్నాయా అని పరిశీలనగా చూస్తూ అడుగులు వేస్తుంటే... పొదలో ఏదో తళుక్కున మెరిసింది. ఒక్క క్షణం ఆగిపోయాడు. తీక్షణంగా అటువైపు చూశాడు. రెండు కళ్ళు తనని బెదురు బెదురుగా చూస్తున్నాయి. కుందేలు పిల్ల...

కడుపులో ఆకలి కాల్చివేస్తా వుంది. నోట్లో సర్రున నీళ్ళూరాయి. చప్పుడు కాకుండా చుట్టూ చూశాడు. కొంచం దూరంలో ఒక లావు కర్ర కనబడింది.

గోపాల్ బలమంతా ఉపయోగించి సరిగ్గా దాని వీపు మీద కొట్టాడు. కట్టె తాకేంతలోగా పొదల్లోకి ఒక్క గెంతు గెంతింది.

వెంట్రుకవాసిలో కట్టె దభీమని ఆ పక్కనే ఉన్న మట్టి ముద్దపై పడి ముక్కలైంది. రెప్పపాటులో కుందేలు మాయమైంది.

అది వెళ్లిన దిక్కే చూస్తూ వుండిపోయాడు కొద్దిసేపు. తర్వాత నిరాశగా వెనక్కి తిరుగబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగాడు. ఏదో తళుక్కున మెరిసింది.

కొట్టుకుంటున్న గుండెతో అటువైపు చూశాడు. కట్టె దెబ్బకు పగిలి ముక్కలైన మట్టిముద్ద మధ్యలో పచ్చగా మెరుస్తున్న చిన్న రాయి. ఒక్కుదుటన ఎగిరి దాన్ని అందుకున్నాడు. గబగబా నీళ్ల వద్దకు పోయి మట్టిని కడిగి శుభ్రంగా తుడిచాడు. రాయి ఆకుపచ్చ రంగులో మినుకుమినుకుమంటా మెరుస్తావుంది.

చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. దాన్ని భద్రంగా ప్యాంటు జేబులో దోపుకున్నాడు. బాటిల్లో నీళ్లు నింపుకొని వడివడిగా సుంకన్న దగ్గరికి వచ్చాడు. వాన్ని పక్కకు తీసుకుపోయి రహస్యంగా జేబులోని రాయిని చూపించాడు. సుంకన్న కనుపాపలు పెద్దగా అయ్యాయి. ఆనందంతో గోపాల్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. శరీరం వణుకుతా వుంది. మొహం వెలిగిపోతా వుంది. "రేయ్... నాకు తెలిసినంత వరకు ఇది వజ్రమే. కానీ ఎంత విలువ వుంటాదో తెలియదు. వజ్రాల వ్యాపారుల ఏజెంట్లు ఇక్కడ గద్దల్లా తిరుగుతా వుంటారు. మాయచేసి చానా తక్కువ ధరకు అమ్మిస్తారు. ఎక్కడా నోరిప్పకు. గమ్మున నాతో రా. నాకు బాగా తెలిసిన మంచి ఏజెంట్ ఒకడున్నాడు.

వాని వద్దకు పోదాం” అన్నాడు గుసగుసగా. ఇద్దరూ పని ఆపేసి ఊర్లోకి బయలుదేరారు. ఛార్జీ కోసం తీసి పెట్టుకున్న డబ్బులతో కడుపునిండా అన్నం తిని ఏజెంట్ దగ్గరికి బైలుదేరారు.

“చూడు గోపాల్... పిల్చుకొచ్చింది, వసతి ఏర్పాటు చేసింది, అమ్మిస్తున్నది, దారి చూపిస్తున్నది అంతా నేనే కాబట్టి కనీసం పావు భాగమైనా నాకు ఇవ్వాల."

"రేయ్... లక్ష పైన ఎంతొచ్చినా అందులో సగం నీకిస్తా. కానీ లక్ష లోపల వస్తే మాత్రం ఈ ఒక్కసారికి వదిలేసెయ్. నీకు తెలుసు కదా సుందర్ గురించి. ఆపరేషన్ కి లక్ష ఖర్చు అవుతుంది. అర్థం చేసుకో. వాడూ నీ చిన్నప్పటి స్నేహితుడే కదా” చేతులు పట్టుకొని బతిమలాడుతూ అన్నాడు.

సుంకన్న కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత చిరునవ్వుతో “సరే... నీ దయ నా ప్రాప్తం. లక్ష కన్నా ఎక్కువ రావాలని కోరుకుందాం. నీ చెయ్యి మంచిగా వున్నట్టుంది. ఈసారి దొరికితే మాత్రం సగం సగం చూడు” అన్నాడు. గోపాల్ అలాగేనంటూ తలూపాడు.

సుంకన్న తనకు తెలిసిన ఏజెంట్ దగ్గరికి తీసుకుపోయాడు. వాడు దాన్ని పరీక్షించి వెంటనే వాళ్ళిద్దరిని తన మోటర్ సైకిల్ మీద గుత్తిలోని వజ్రాల వ్యాపారి దగ్గరికి పిలుచుకొని పోయాడు. అతను ఆ రాయిని పరీక్ష చేసి తొంభై వేలు వస్తుంది అన్నాడు. ఒక వ్యాపారిని కాదని ఇంకొక వ్యాపారి దగ్గరికి పోవడం కష్టం. ఇచ్చిన డబ్బులు తీసుకొని తిరిగి జొన్నగిరి చేరుకున్నారు. ఏజెంట్ కి కమీషన్ కింద పదివేలు ఇచ్చారు.

అప్పటికే బాగా చీకటి పడింది. కర్నూలుకు తిరిగి పోవడానికి బస్సులు లేవు. పొద్దున్నే వెళదామని అనుకున్నారు.

గుడిముందు పడుకున్నారు.

గోపాల్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నిద్ర రావడం లేదు. పదేపదే సుందరి గుర్తుకు

రాసాగింది. పెదాలపై నవ్వు తొంగి చూస్తోంది. విషయాన్నంతా సంబరంగా సుందరికి మెసేజ్ చేశాడు.

ఆలోచనల్లో కళ్ళు ఎప్పుడు మూతపడ్డాయో తెలియదు.

తనపై సుందరిపై పూల వర్షం...

“మీరిద్దరూ హాయిగా కలసి మెలసి బతకవచ్చు. ఇకపై ఏ సమస్యా వుండదు” అంటున్న బాంబే డాక్టర్లు...

ఎర్ర చీరలో ఆకుపచ్చ జాకెట్ వేసుకొని, జడలో మల్లెపూలతో, చేతిలో పూలదండతో తనకోసం వాకిలి దగ్గర ఎదురుచూస్తున్న సుందరి...

మెడలో పూలదండలతో కొత్త బట్టలతో చిటికెన వేలు పట్టుకొని తన వెనుకే ఏడడుగులు వేస్తూ...

కలలు ఒకదాని తరువాత ఒకటి...

ఒకదానితో మరొకటి కలిసిపోతూ....

అంతలో సుందరి వాళ్ళ అమ్మ కాళికాదేవిలా ఎర్రబారిన కళ్ళతో ప్రత్యక్షమైంది.

“వదులురా నా కొడుకుని" అంటూ విసురుగా చెయ్యి లాగి ఈడ్చి చెంపమీద కొట్టింది...

అదిరిపడి లేచి కూర్చున్నాడు.

చుట్టూ చీకటి.

గుండె వేగంగా కొట్టుకోసాగింది. నాలుక పిడచగట్టుకపోయింది.

బాటిల్ వైపు చూశాడు. ఖాళీగా వుంది.

పక్కకు చూశాడు. సుంకన్న లేడు!

బయటికి వచ్చి చూశాడు. అంతా చీకటి... నిశ్శబ్దం... కనుచూపుమేరలో ఎవరూ లేరు. చుట్టూ ఎటువంటి అలికిడీ లేదు.

మనసులో ఏదో అనుమానం కదిలింది. క్షణంలో అది పెరిగి పెద్దగై పెనుభూతమైంది. వణుకుతున్న చేతులతో వేగంగా లోపలికొచ్చాడు.

డబ్బు పెట్టిన సంచి లేదు.

క్షణాల్లో అంతా అర్థమయింది.

సమయం చూశాడు.

ఉదయం నాలుగవుతూ వుంది. ఇంత పొద్దున్నే ఊరు నుండి ఎవరూ బయటపడలేరు.

ఆరు గంటల వరకు ఆటోలు, బస్సులు కూడా కనీసం తిరగవు.

ఎవరైనా బండిమీద పోతూవుంటే వాళ్లతో లిఫ్టు ఎక్కి పోవాలన్నా వెలుతురు వచ్చేవరకు ఆగాల్సిందే.

కోపంతో బస్టాండ్ వైపు పరుగు తీశాడు. బస్టాండ్ దగ్గర పడగానే చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ... చుట్టూ గమనిస్తూ... చెట్ల చాటున పొదల చాటున దాక్కుంటూ... ఒక్కొక్క అడుగే వేయసాగాడు. బస్టాండ్ కు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద దాపుకు ఎవరికీ కనబడకుండా ముడుచుకొని కూర్చున్న సుంకన్న కనపడ్డాడు. వాని చేతిలో సంచి. జాగ్రత్తగా రెండు చేతులతో గుండెలకు అదుముకొని గట్టిగా పట్టుకొని వున్నాడు.

నెమ్మదిగా అడుగులు వేస్తూ వెనుక నుంచి వచ్చి “ఎక్కడికి తప్పించుకొని పోతావురా దొంగనాకొడకా... నన్నే మోసం చేయాలనుకుంటున్నావా" అంటూ ఎగిరి వాని

మీదికి దూకాడు.

సుంకన్న వణికిపోయాడు. “రేయ్ నా మాట వినరా. చాలా అవసరంరా. అక్కడ పాప...” అంటుండగానే గోపాల్ వాని మెడను చంకలో ఇరికించుకొని గట్టిగా నొక్కసాగాడు. పట్టు బిగుస్తున్నకొద్దీ సుంకన్నకు గాలి అందడం లేదు. నోట మాట రావడం లేదు. చేతులు టపటపా భూమిపై కొట్టుకుంటున్నాయి.

తప్పించుకోవడం చేతగాక నోటికి దగ్గరగా వున్న గోపాల్ భుజాన్ని పళ్ళతో కండ వూడి వచ్చేటట్లుగా కొరికాడు.

భుజం సుర్రుమనడంతో గోపాల్ చేయి వదిలాడు. రక్తం కారుతున్న చేతిని చూసి కోపంతో వూగిపోయాడు. చుట్టూ చూశాడు. దూరంగా రాయి కనపడింది. సర్రున దాన్ని అందుకుని ఈడ్చి సుంకన్న తలపై ఒక్కటి కొట్టాడు.

అంతే...

రక్తం సర్రున ఎగజిమ్మింది.

చేతులంతా రక్తంతో తడిసిపోయాయి. సుంకన్న పక్కనే పడి వున్న సంచిని తీసుకొని గోపాల్ దారితెన్నూ లేనట్టు పరిగెత్తాడు. ఇంతలో జేబులోని సెల్ ఒకటే మోగసాగింది. పరుగు తగ్గించి... తీసి చూశాడు.

ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆప్యాయంగా 'అన్నా' అని పిలిచే సుంకన్న పెళ్లాం!

గుండె పిసికినట్లు అనిపించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుందో తెలియక ఎత్తాడు. “అన్నా... చానా సేపటినుంచి ఫోన్ చేస్తున్నా. మా ఆయన ఎత్తట్లేదు. నిన్న రాత్రి నుంచి పాప ఆసుపత్రిలో తనకలాడతా వుంది. చేతిలో మందులకు ఒక్క పైసా లేదు. బతుకుతాదో చస్తాదో తెలియడం లేదు. అదేదో డెంగీ జ్వరం అంట. నిమిష నిమిషానికి కణాలు తగ్గిపోతున్నాయంట. నువ్వైనా విషయం చెప్పి వెంటనే పిలుచుకొని రా. నాకు కాలూ చేయీ ఆడడం లేదు" ఏడ్చి ఏడ్చి ఆమె గొంతు ఎండిపోయినట్లుంది. మాటలు ఎక్కడో నూతిలోనుంచి వస్తున్నట్లుగా వినబడుతున్నాయి.

గోపాల్ చేతిలోంచి సెల్ జారి కిందపడింది. “అన్నా... అన్నా..." ఆమె అరుపు

వినబడుతోంది.

సుంకన్నకు పాప పరిస్థితి ముందే తెలుసా? అందుకోసమేనా డబ్బులు దొంగతనం చేసి రాత్రికి రాత్రి పారిపోతున్నది! చిరునవ్వుతో వీడ్కోలు పలికిన పాప నవ్వు కళ్ళ ముందు కదలాడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వేగంగా వెనక్కు తిరిగి సెల్ తీసుకుని చెట్టువైపు పరిగెత్తాడు.

తన ఆనందంలోనూ, దఃఖంలోనూ, వూహల్లోనూ, ఆలోచనల్లోనూ, ఆవేశంలోనూ, ఓదార్పులోనూ... అమ్మగా, అన్నగా, తమ్మునిగా ఇన్నాళ్ళు మనసులో మనసై నిలిచిన తన చిన్ననాటి స్నేహితుడు...

సుంకన్న... చెట్టు దగ్గర పడి వున్నాడు. తల నుంచి రక్తం కారి గడ్డ కడుతూ వుంది. పక్కనున్న బాటిల్లోంచి నీళ్లు తీసి ముఖం మీద చిలకరించాడు.

"రేయ్.. లెయ్ రా... ఒక్క మాట చెప్పొచ్చు కదరా పాప కోసమని. ఈ స్నేహితుని మీద ఆ మాత్రం నమ్మకం లేకపోయిందా. లే... ఇదిగో ఈ డబ్బంతా నీకే. పద పద... పాపను కాపాడుకుందాం" కుదుపుతూ అన్నాడు. సుంకన్నలో చలనం లేదు.

కళ్ళు ఎక్కడో ఆకాశం కేసి నిరాశగా రెప్ప వేయకుండా చూస్తూ వున్నాయి.

అంతలో ఫోన్ మోగింది...

అదిరే గుండెతో... ఎవరా అని చూశాడు.

సుందరి...

చెన్నమ్మ సర్కిల్ నుంచి ఆశగా...

**************************

డా.ఎం.హరి కిషన్-కర్నూలు-9441032212

**************************

కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.


Rate this content
Log in

Similar telugu story from Tragedy