తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

4  

తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

చందమామ కథ (అమ్మమ్మ చెప్పిన కథ)

చందమామ కథ (అమ్మమ్మ చెప్పిన కథ)

2 mins
291


చందమామ కథ (అమ్మమ్మ చెప్పిన కథ) డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

*****************************

     చందమామ మీకు తెలుసు గదా... రాత్రివేళ చల్లని వెన్నెల కురిపిస్తా వుంటాడు. ఔను... ఇంతకీ చంద్రుడు మనకి మామ ఎట్లవుతాడో మీకెవరికైనా తెలుసా... తెలీదా... సరే ఈ రోజు మనం ఆ సరదా కథని చెప్పుకుందాం.

పాలసముద్రం లోపల అమృతం వుందంట. సముద్రమంటే మాటలా... చానా చానా పెద్దగుంటాది. ఒకరోజు దేవతలు, రాక్షసులు అమృతం కోసం దాన్ని చిలకాలనుకున్నారు. చిలకాలంటే కవ్వం కావాలి కదా... మనింట్లో మాదిరి మామూలు కవ్వమయితే లాభం లేదు. అందుకని వాళ్ళు ఎత్తయిన మంధర పర్వతాన్ని తెచ్చినారు. సరే పర్వతమయితే తెచ్చినారు కానీ చిలకడానికి అంత పెద్ద తాడెక్కడ దొరుకుతాది. అందుకని పాముల రాజయిన వాసుకి అనే పాముని ఒప్పించి దానిని తాడు మాదిరి కట్టినారు. ఇక చిలకడానికి రాక్షసులు ఒకపక్క దేవతలు ఒకపక్క చేరినారు. అంతలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ

మంధర పర్వతం చానా బరువుంటుంది గదా... ఆధారం లేకపోతే అది పాలసముద్రంలో లటుక్కున మునిగిపోతుంది. మరి ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే విష్ణువు పెద్ద రాక్షస తాబేలు అవతారం ఎత్తినాడు. అందరూ కలిసి దాని డిప్ప మీద పర్వతాన్ని వుంచినారు.

ఇక దేవతలు, రాక్షసులు కష్టపడి చిలకడం మొదలుపెట్టినారు. సముద్రం లోపల ఎన్నెన్నో విలువయిన వస్తువులు వున్నాయంట. అవన్నీ ఒకొక్కటే పైకి రాసాగినాయి. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం... ఇట్లా ఎన్నెన్నో వచ్చినాయి. అలా మనం పూజించే లక్ష్మీదేవి పుట్టింతర్వాత చంద్రుడు పుట్టినాడంట.

అంతలో హాలాహలం పుట్టింది. హాలాహలమంటే భయంకరమయిన కాలకూట విషం. దాని దెబ్బకి అందరూ మిడతల్లా మాడిపోతా వున్నారంట. అంతలో శివుడొచ్చి దాన్ని తన కంఠంలో అంటే గొంతులో బంధించినాడు. శివుని కడుపులో పధ్నాలుగు లోకాలు వుంటాయంట. మింగితే అవన్నీ భస్మం అయిపోతాయని గొంతులో బంధించినాడంట. ఆ విషం వేడికి శివుని కంఠం నల్లగా కమిలిపోవడంతో... శివున్ని నీలకంఠుడనీ, విషాన్ని గొంతులో వుంచుకొన్నందుకు గరళకంఠుడనీ పిలుస్తా వుంటారు. హాలాహలం పుట్టిన కాసేపటికి అమృతం పుట్టిందంట.

రాక్షసులు వెంటనే అమృతం తీసుకోని పారిపోవాలని చూసినారు. కానీ విష్ణువు మోహినీ అవతారమెత్తి రాక్షసులకు అడ్డం పడి దాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేసినాడు.

ఇదీ కథ.

ఇంతకీ మీకు చంద్రుడు మామెట్లా అవుతాడో చెప్పలేదు గదా... ఇప్పుడు చెప్తా వినండి.

పాలసముద్రాన్ని చిలుకుతా వున్నప్పుడు లక్ష్మీదేవి పుట్టింది గదా... లక్ష్మీదేవి జగన్మాత అంటే మనకందరికీ తల్లిలాంటిది అన్నమాట. లక్ష్మీదేవి తర్వాత పుట్టిందెవరు? చంద్రుడే గదా... అంటే లక్ష్మీదేవికి చంద్రుడేమవుతాడు. తమ్ముడౌతాడు... ఇక ఇప్పుడు చెప్పండి. మన అమ్మ తమ్ముడు మనకు ఏమవుతాడు? మామే గదా... అర్థమయ్యిందా... అందుకే చంద్రుడు మన అమ్మకు తమ్ముడై... మనకు మామై... చందమామ అయినాడు. ఎలా ఉంది ఈ సరదా కథ

*****************************

డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

*****************************

కథ నచ్చితే SHARE చేయండి.



Rate this content
Log in