తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

4  

తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

కాకమ్మ  పిట్టమ్మ

కాకమ్మ  పిట్టమ్మ

2 mins
325


కాకమ్మ పిట్టమ్మ ( మీరు మీ చిన్నప్పుడు విన్న సరదా జానపద కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*****************************

          ఒక చింతచెట్టు మీద కాకమ్మ, పిట్టమ్మ వుండేటివి. కాకమ్మదేమో కొట్టం. పిట్టమ్మదేమో ఇండ్లు. ఒకరోజు రాత్రి పెద్ద ఎత్తున గాలీవానా వచ్చాయి. ఆ దెబ్బకు కాకమ్మ కొట్టం కాస్తా ఎగిరిపోయింది. పిట్టమ్మది ఇండ్లు గదా... దానికేమీ కాలేదు. కాకమ్మ వానలో తడుస్తా... చలికి వణికిపోతా పిట్టమ్మ ఇంటి దగ్గరకొచ్చి "పిట్టమ్మా.... పిట్టమ్మా... కొంచెం తలుపు తియ్యవా... నాకొట్టం పడిపోయింది" అని దీనంగా అడిగింది. పెట్టమ్మ చానా మంచిది గదా... దాంతో వెంటనే తలుపు తెరిచి కాకమ్మను లోపలికి రమ్మనింది.

కాకమ్మ బాగా తడిచిపోయింది గదా... అందుకని పిట్టమ్మ దానికి తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది. వేడి వేడి అన్నం చేసి కడుపు నిండా పెట్టింది. పిట్టమ్మ ఇంటి నిండా గంపలే గంపలు, బియ్యం, పప్పులు, బెల్లం, జొన్నలు, గోధుమలు, శెనగలు అట్లా ఒక్కొక్క గంపలో ఒక్కొక్కటి వుండేటివి. ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో వాటికోసం చాలా కష్టపడి సేకరించింది.

కాకమ్మ అన్నం తిన్నాక “నాకు నిద్ర వస్తా వుంది. యాడ పండుకోమంటావ్" అనడిగింది. “బెల్లంగంప దగ్గర పడుకోపో" అనింది పిట్టమ్మ. కాకమ్మ బెల్లంగంప దగ్గర పండుకోని అర్ధరాత్రి మట్టసంగా లేచి బెల్లం తినసాగింది. తింటా వుంటే టకటకమని చప్పుడొస్తాది గదా... ఆ చప్పుడు విని పిట్టమ్మ "కాకమ్మా... కాకమ్మా... ఏందా చప్పుడు" అనడిగింది. దానికి కాకమ్మ “అబ్బే ఏం లేదు. వానకి బాగా తడిసిపోయినాను గదా... అందుకే చలికి పళ్ళు కొట్టుకుంటా వున్నాయి. అంతే" అనింది. “అట్లాగా" అని పిట్టమ్మ అమాయకంగా కాకమ్మ మాటలు నమ్మి నిద్రపోయింది.

కాకమ్మ బెల్లమంతా తిని దాన్నిండా పుర్రు పోసింది. పిట్టమ్మ నిద్రపోతా వుంది గదా... దాంతో నెమ్మదిగా సెనగల గంపలోకి దూరింది. అవన్నీ తినేసి దాన్నిండా పుర్రు పోసింది. అట్లా రాత్రంతా బియ్యం, గోధుమలు, పప్పులు, జొన్నలు అన్నీ తినేసి అన్నిట్లోనూ పుర్రు పోసేసి పొద్దున్నే "నేను పోయెస్తా పిట్టమ్మా" అని ఏమీ ఎరుగని నంగనాచి లెక్క మట్టసంగా యెగిరిపోయింది.

కాకమ్మ పోయిన కాసేపటికి పిట్టమ్మ పిల్లలు నిద్రలేచినాయి. లేచి “అమ్మ... అమ్మా... ఆకలేస్తా వుంది... కాస్త బెల్లం పెట్టు" అన్నాయి. సరేనని పిట్టమ్మ బెల్లం గంపలో చేయి పెట్టింది. అంతే... దాని చేయంతా పుర్రంటుకోనింది. పిట్టమ్మ అదిరిపడింది. ఏ గంప చూసినా పుర్రే. దాంతో పిట్టమ్మకి చానా చానా కోపమొచ్చేసింది. "పాపమని లోపలికి రానిస్తే ఇంత మోసం చేస్తాదా... ఎట్టాగైనా సరే దానికి బుద్ధి చెప్పాల" అనుకోనింది.

వేడివేడి నిప్పుల కుంపటి తెచ్చింది. మంచానికున్న నవారంతా ఇప్పేసి కింద నిప్పుల కుంపటి పెట్టింది. అది కనబడకుండా మంచంపైన దుప్పటి కప్పింది. కాకమ్మ దగ్గరికి పోయి "కాకమ్మా... కాకమ్మా... ఈ రోజు నా పుట్టినరోజు. వేడి వేడి బచ్చాలు చేసి పూరందరికీ పెడతా వున్నా. నువ్వూ వచ్చి ఒక తియ్యని బచ్చం తినిపోదురా" అని పిల్చింది.

బచ్చమనే సరికి కాకమ్మ నోట్లో నీళ్ళూరినాయి. దాంతో సంబరంగా లొట్టలేసుకుంటా పిట్టమ్మ ఇంటికొచ్చింది. పిట్టమ్మ దాన్ని లోపలికి పిల్చి “వంటింట్లో బచ్చం కాల్తా వుంది. కాసేపు మంచం మీద కూచో... వేడివేడిగా తిందువుగానీ” అనింది.

మంచం కింద నిప్పుల కుంపటి వున్నది దానికి తెలీదు గదా... దాంతో ఆనందంగా ఎగిరి మంచం మీద కూచోనింది.

మంచానికి నవారు లేదు గదా. దాంతో సర్రున దుప్పటి జారి కిందున్న వేడి వేడి నిప్పుల మీద దభీమని పడింది. అంతే... ఆ నిప్పుల వేడికి కాకమ్మ ఒళ్ళంతా సర్రున కాలింది. ఆ దెబ్బకి కాకమ్మ లబలబలాడిపోతా అన్నించి పారిపోయింది. పిట్టమ్మ పిల్లలు సంబరంగా చప్పట్లు కొట్టినాయి.

*****************************

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*****************************

కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.


Rate this content
Log in