తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

4  

తెలుగు హాస్య నీతి కథలు

Children Stories Comedy Fantasy

నవ్వితే నవరత్నాలు

నవ్వితే నవరత్నాలు

6 mins
320


నవ్వితే నవరత్నాలు (అద్భుతమైన జానపద కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*****************************

ఒకూరిలో ఒక రాజున్నాడు. ఆయనకు అన్ని కోరికలు తీరినాయి గానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం తీరలేదు. ఎన్నో పూజలు చేసినాడు, వ్రతాలు చేసినాడు, అడిగిన వారికల్లా కాదనకుండా దానం చేసినాడు. ఐనా పిల్లలు మాత్రం పుట్టలేదు. దాంతో ఒకరోజు పోలేరమ్మ గుడికి పోయి "తల్లీ! పిల్లలు లేని బతుకూ ఒక బతుకేనా... నేనేం పాపం చేసినాను. ఈ బతుకు బతికితేనేమి సస్తేనేమి'' అంటూ కత్తి తీసుకోని కసుక్కున పొడుచుకోబోయినాడు. అంతలో దేవత ప్రత్యక్షమయి "ఆగాగు?! నీకు కావల్సింది పిల్లలే గదా. ఇస్తా. కానీ ఒక షరతు. నీ పెండ్లాం కడుపు పండిన వెంటనే నీ రాజ్యం పోతాది. రాజ్యమా... పిల్లలా... ఏది కావాల్నో చెప్పు" అనడిగింది. దానికా రాజు వెంటనే “తల్లీ! రాజ్యం పోయినా పరవాలేదు. నాకు పిల్లలు పుడితే చాలు" అన్నాడు. సరే అని దేవత రెండు పండ్లిచ్చింది. “ఇవి తీస్కోనిపోయి నీ పెండ్లానికియ్యి" అని చెప్పి మాయమైపోయింది.

రాజు సంబరంగా ఆ పండ్లు తీసుకోని పోయి పెండ్లానికిచ్చినాడు. కొన్నాళ్ళకు ఆమె కడుపు పండింది. పోలేరమ్మ ముందే చెప్పినట్టు కొద్ది రోజులకే పక్కూరి రాజు వీళ్ళ మీదకి దండయాత్ర కొచ్చినాడు. యుద్ధంలో రాజు ఓడిపోవడంతో శత్రువులకు చిక్కకుండా పెండ్లాన్ని తీసుకోని పారిపోయినాడు. తన గురించి ఎవరికీ తెలీని ఒక చిన్న గ్రామానికి చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకోని కూలీ నాలీ చేసుకుంటా బతక సాగినాడు.

తొమ్మిది నెల్లు దాటినాక ఆమెకు ఒకరోజు చందమామలాంటి చక్కని కొడుకు పుట్టినాడు. పుట్టిన గంటకే మరలా ఇంకొకడు పుట్టినాడు. అట్లా ఒక్క కాన్పుకే ఇద్దరు పుట్టినారు. వాళ్ళను చూసి రాజుకీ రాణికీ సంబరం సంబరం గాదు.

వాళ్ళు ఆడతా పాడతా నెమ్మదిగా పెరిగి పెద్దగయినారు. ఒకరోజు వాళ్ళ నాయన దగ్గరికి పోయి “నాయనా! నాయనా! మేం పెరిగి పెద్దగయినాం గదా. ఈన్నే ఎన్ని రోజులున్నా ఏం లాభం. కొంచం గూడా జ్ఞానం పెరగదు. అందుకే దేశదేశాలు పోయి అక్కడి వింతలూ వినోదాలూ చూసి వస్తాం. మమ్మల్ని ఆశీర్వదించు" అన్నారు. సరేనని వాళ్ళమ్మా నాయనా వాళ్ళని ఆశీర్వదించి పంపించినారు. వాళ్ళిద్దరూ అట్లా ఒక్కొక్క ఊరు దాటుకుంటా అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఒక రోజు ఒక పెద్ద అడవిలోనికి పోయినారు.

ఆ అడవి మధ్యన వాళ్ళకు ఒకచోట ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది. దానికి ఒకే ఒక కాయ వుంది. అది బంగారు రంగులో ధగ ధగ ధగ మెరుస్తా కనబడింది. ఇదేందబ్బా ఇట్లా మెరుస్తా వుంది అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తా వున్నంతలోనే అది పై నుండి కిందికి రాలింది. వాళ్ళు వురుక్కుంటా పోయి దాన్ని కింద పడక ముందే గాల్లోనే పట్టుకోని మళ్ళా తిందాంలే అనుకోని సంచిలో పెట్టుకున్నారు. అది చానా మహిమ గల మామిడి పండు. వంద సమ్మచ్చరాలకు ఒకే ఒకసారి కాస్తాది. దాని సంగతి వాళ్ళిద్దరికీ తెలీదు. వాళ్ళు అది మామూలు మామిడి పండే అనుకున్నారు.

వాళ్ళిద్దరూ అట్లా పోతా పోతా కాసేపటికి అలసిపోయి ఒక చెట్టు కింద పన్నుకున్నారు. చిన్నోనికి వెంటనే నిద్రపట్టింది. కానీ పెద్దోనికి మాత్రం నిద్ర రాలేదు. వూరికే కండ్లు మూసుకోని పన్నుకున్నాడు. కాసేపటికి ఆ చెట్టు మీదికి రెండు చిలకలొచ్చి వాలినాయి. దాండ్లకు మాటలొచ్చు. అందులో ఒక చిలక వాళ్ళ దగ్గరున్న పండును చూసి ఇంకో చిలకతో “ఏయ్! వాళ్ళ దగ్గరున్న పండు చూసినావా... అది మామూలు పండుగాదు. వంద సమ్మచ్చరాలకు ఒకే ఒకసారి కాసే మహిమ గల మామిడి పండు. ఎవడైతే దాని కండ తింటాడో వాడు రాజైపోతాడు. ఎవడు దాని టెంక మింగుతాడో వాడు నవ్వితే నవరత్నాలు పడతాయి" అని చెప్పింది. పెద్దోడు నిద్రపోలేదు గదా ఆ మాటలన్నీ విన్నాడు.

వెంటనే తమ్ముని లేపి విషయం చెప్పి తాను కండ తిని తమ్మునికి టెంక మింగిచ్చినాడు. మరలా ఇద్దరూ నడవడం మొదలు పెట్టినారు. అట్లా నడిచీ నడిచీ బాగా అలసిపోయినారు. ఇద్దరికీ బాగా ఆకలేయసాగింది. తిందామంటే చుట్టు పక్కల యాడా ఏమీ దొరకలేదు. దాంతో చిన్నోడు ఒక చెట్టు కింద కూలబడి “అన్నా! అన్నా! ఇంక నడవడం నా చేత గాదు. యాడైనా ఏదైనా దొరికితే తీసుకోనిరా" అన్నాడు. అన్న 'సరే' అని ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెదుకుతా బైలుదేరినాడు. కాసేపటికి ఒక వూరొచ్చింది.

ఆ వూరికి ఒక రాజున్నాడు. ఆయనకు పిల్లల్లేరు. పిల్లల కోసం చూస్తా చూస్తానే ముసిలోడయిపోయి మంచం పట్టినాడు. ఈ రోజో రేపో అనేటట్టున్నాడు. వారసులెవరూ లేరు గదా. నేను రాజునంటే నేను రాజునంటూ బంధువులంతా కొట్టుకోవడం మొదలు పెట్టినారు. రాజు పెద్దలందరినీ పిలిపిచ్చి “మన పట్టపుటేనుగుకి ఒక పూలదండ ఇచ్చి పంపించండి. అది ఎవరి మెడలో దండ వేస్తే వాడే నా తరువాత రాజు. వాడు ధనవంతుడు గానీ, బిచ్చగాడు గానీ, యువకుడు గానీ, ముసిలోడు గానీ ఎవ్వరూ మాట్లాడగూడదు. ఇది నా ఆజ్ఞ" అన్నాడు. అందరూ "సరే" అన్నారు.

ఏనుగును బాగా అలంకరించి దానికి దండిచ్చి వూరిలో వదిలినారు. వూరు వూరంతా ఎవరి మెడలో దండేస్తాదా అని చూడ్డానికి వచ్చినారు. రాజసైనికులు వెనకాల నడుస్తా వుంటే ఏనుగు ఒక్కొక్కన్నే దాటుకుంటా అప్పుడే వూర్లోకొచ్చిన పెద్దోన్ని చూసింది. వాని దగ్గరకు పోయి మెళ్ళో దండేసింది. వెంటనే అందరూ వాన్ని ఎత్తి ఏనుగు మీద కూచోబెట్టి తప్పెట్లు కొట్టుకుంటా సంబరంగా ఈలలు వేసుకుంటా రాజు దగ్గరకు తీసుకొని పోయినారు. రాజు సంతోషించి తన కిరీటాన్ని వాని నెత్తిన పెట్టి రాజును చేసినాడు.

తమ్ముడు అడవిలో వున్నాడు గదా, వానికిదంతా తెలీదు. అన్న కోసం చూసీ చూసీ "ఏమబ్బా ఇంకా రాలేదు! ఏమయిపోయినాడో ఏమో" అనుకుంటా అన్నను వెదుకుతా పోయినాడు. అక్కడ అన్నేమో రాజు కాగానే

సైనికులను పిల్చి" అడవిలో మా తమ్ముడుంటాడు. పోయి పిల్చుకోని రాపోండి" అంటూ గుర్తులు చెప్పి పంపిచ్చినాడు. కానీ వాళ్ళు వచ్చేటప్పటికే చిన్నోడు ఆన్నించి వెళ్ళిపోయినాడు. అట్లా అన్నాదమ్ములిద్దరూ విడిపోయినారు.

చిన్నోడు అన్న కోసం వెదుకుతా ఒక వూరికి చేరుకున్నాడు. ఆ వూర్లో ఒక పెద్ద మేడ వుంది. దాంట్లో ఒక ముసిల్ది దాని కూతురు వున్నారు. వాళ్ళిద్దరూ చానా చెడోల్లు. ఎవరైనా వేరే వూరి నుండి అక్కడికి వస్తే చాలు ఎలాగో ఒకలాగా వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గరున్నదంతా కాజేసేటోళ్ళు. చిన్నోన్ని చూసి “వీడెవడో బాగా డబ్బున్నోడున్నట్టున్నాడు. ఏమైనా వుంటే దోచుకోని పంపుదాం" అనుకోని దాసిని పిల్చి వాన్ని పిల్చుకోని రమ్మని పంపినారు. ఆ దాసీ పోయి చిన్నోన్ని పిలుచుకోనొచ్చింది.

ఆ తల్లీ కూతుళ్ళు వినయంగా "అయ్యా! మీరెవరో మాకు తెలీదు గానీ చానా దూర ప్రాంతం నుండి అలసిపోయి వస్తున్నట్టున్నారు. అతిథులకు సేవ చేయడం మా ఆచారం. దయచేసి ఈ రోజు ఈన్నే వుండి మా ఆతిథ్యం స్వీకరించండి"అంటూ తియ్య తియ్యగా మాట్లాన్నారు. వాళ్ళ గురించి వానికి తెలీదు గదా. దాంతో 'సరే' అన్నాడు. వాళ్ళు వానికి బాగా మర్యాదలు చేసి ఆ మాటా ఈ మాటా మాట్లాడతా వుంటే వానికి నవ్వొచ్చి పకపకా నవ్వినాడు. వాడట్లా నవ్వుతా వుంటే నోట్లోంచి గలగలగలమని నవరత్నాలు జారిపన్నాయి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. విషయమేందో కనుక్కోవాలని బాగా తాపిచ్చినారు. వాడు బాగా తాగినాక "నువ్వు నవ్వితే నవరత్నాలు పడతా వున్నాయి గదా, ఏంది సంగతి" అనడిగినారు. వాడు ఆ మత్తులో జరిగిందంతా చెప్పేసినాడు.

అప్పుడు వాళ్ళు “ఓహో అదా సంగతి" అనుకోని ఒక వైద్యుని దగ్గరకు పోయి వాంతులయ్యే మందు తీస్కోకొచ్చి పాలలో కలిపి వానికి బాగా తాపిచ్చినారు. అంతే వానికి వాంతులు వాంతులు కాదు. అట్లా ఆఖరికి కడుపులో వున్న మామిడి టెంక గూడా బైటకొచ్చేసింది. వాళ్ళు దాన్ని తీస్కోని సేవకులను పిలిచి "వీన్ని ఎత్తుకోని పోయి అడవి మధ్యలో వదిలేసి రాపోండి" అన్నారు. వాళ్ళు సరేనని వాన్ని ఎత్తుకొని పోయి అడవి మధ్యలో పాడేసినారు. తరువాత రోజు పొద్దున్నే లేసి చూస్తే అడవి మధ్యలో పడున్నాడు.

జరిగిందంతా గుర్తుకొచ్చింది. రాత్రంతా వాంతులు వాంతులు గదా. కడుపు ఖాళీయై నకనకలాడసాగింది. ఆకలికి తట్టుకోలేక యాడన్నా ఏమన్నా

దొరుకుతాయేమోనని వెదుక్కుంటా బైలుదేరినాడు. అట్లా పోతా వుంటే ఒకచోట ఒక పెద్ద చెట్టు కనబడింది.

అది చానా వింతగా వుంది. దానికి మూడే మూడు కొమ్మలున్నాయి. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క రంగు కాయలున్నాయి.

“ఇదేందబ్బా విచిత్రంగా వున్నాయి" అనుకుంటా ఆకలికి తట్టుకోలేక ఒక ఎర్రకాయ తిన్నాడు. అంతే అట్లా తినడం ఆలస్యం ఇట్లా కోతి అయిపోయినాడు. ఇదేందబ్బా కోతి అయిపోతినని అనుకుంటా పక్కనున్న తెల్లకాయ తిన్నాడు. అంతే వెంటనే గాడిదయి పోయినాడు. ఇదేం మాయరా దేముడా అనుకుంటా పక్కనున్న పచ్చపండు తిన్నాడు. అంతే మళ్ళా మామూలు మనిషయి పోయినాడు. ఓహో... ఇదా సంగతనుకోని వాటిని తెంపుకోని మూటగట్టుకోని బైలుదేరి మళ్ళా ఇంతకు ముందు పోయిన వూరికే పోయినాడు.

వాళ్ళు చూస్తే గుర్తు పడతారనుకొని గడ్డం మీసాలు తగిలిచ్చుకోని మారు వేషమేసుకోని వాళ్ళింటికి పోయి తలుపు కొట్టినాడు. వాళ్ళు తలుపులు తీసి “ఎవరు నీవు. ఏం కావాల" అనడిగినారు. దానికి వాడు “నేను పెద్ద నగల వర్తకున్ని, మాది పక్క దేశం. రాత్రయింది కదా ఎవరయినా దొంగలొస్తే ప్రమాదం. ఈ రోజుకి ఈన్నే పండుకోనిస్తే రేప్పొద్దున్నే లేచి వెళ్ళిపోతా” అన్నాడు. వెంటనే తల్లీ కూతుళ్ళు వాని నుంచి రాత్రి నగలమూట కొట్టేయొచ్చనుకోని లోపలికి రమ్మన్నారు. వానికి బాగా సేవలు చేసి పిండివంటలు పెట్టినారు.

వాడవన్నీ బాగా తిన్నాక సంచీలోంచి పండ్లు తీసి “మీరెక్కడయినా ఇట్లా ఎర్రకాయలు, తెల్లకాయలు చూసినా రా... ఇవి మా దేశంలో తప్ప యాడా పండవు. దీని రుచి ప్రపంచంలో ఇంక ఏ పండుకూ వుండదు" అని నోరూరేటట్లు చెప్పి తల్లికి ఎర్రది, కూతురికి తెల్లది ఇచ్చినాడు. వాని మాటలతో వాళ్ళ నోట్లో నీళ్ళూరుతా వున్నాయి. ఇవ్వడం ఆలస్యం ఆ రుచి ఎట్లా వుంటాదో ఏమో! అనుకోని లొట్టలేసుకుంటా బిరబిరా తిన్నారు. అంతే! అట్లా తినడమాలస్యం క్షణంలో ఎర్రపండు తిన్న తల్లి కోతయితే, తెల్లపండు తిన్న కూతురు గాడిదయిపోయింది. వాడు ఇండ్లంతా వెదికి మామిడి టెంక తీసుకోని మళ్ళా మింగి బైలుదేరినాడు.

అట్లా పోతా పోతా ఒకరోజు వాళ్ళ అన్న వున్న రాజ్యానికి చేరుకున్నాడు. వాడు వీధిలో పోతా వుంటే ఒక చోట ఒకడు కోతులు ఆడిపిస్తా వుండడం కనబడింది. కోతులెగురుతా, పల్టీలు కొడతా, దండాలు పెడతా వుంటే వీనికి నవ్వొచ్చి గలగలగల నవ్వినాడు. అంతే నవరత్నాలు కుప్పలు కుప్పలు కిందపడినాయి.

అది చూసి రాజ సైనికులు ఆశ్చర్యపోయి వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి విషయం చెప్పినారు. వెంటనే రాజుకి వాడు తన తమ్ముడే అని అర్థమయిపోయి వురుకులు పరుగుల మీద ఆడికి వచ్చినాడు.

అట్లా అన్నాదమ్ములిద్దరూ మళ్ళా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పోయి వాళ్ళమ్మా నాన్నలను పిల్చుకోనొచ్చి అందరూ కలసి హాయిగా వున్నారు.

*****************************

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

*****************************

కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.


Rate this content
Log in