gowthami ch

Drama

4.7  

gowthami ch

Drama

భయం తెచ్చిన ముప్పు

భయం తెచ్చిన ముప్పు

5 mins
641


అది ప్రేమ డిగ్రీ చదువుతున్న రోజులు డిగ్రీ చదువుకుంటూ ఖాళీ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతూ ఉండేది. ఒకరోజు తన స్నేహితురాలు ఒకరు రైల్వేలో ఉద్యోగాల కోసం దరఖాస్తు పంపమని ఇచ్చిన సలహా మేరకు దరఖాస్తు పంపింది . పరీక్షకు ఒక నెల మాత్రమే సమయం ఉండడంతో రాత్రింబవళ్లు బాగా కష్టపడి చదివింది , పరీక్ష రాయాల్సిన స్థలం తమిళనాడులోని చెన్నై మహానగరం .


మొత్తానికి పరీక్షరోజు రానే వచ్చింది . రాత్రి బస్ కి చెన్నై వెళ్ళాలి. ప్రేమ కేమో తమిళ్ ఒక్క ముక్క కూడా రాదు. ఏదో తన చెల్లి ఉంది అన్న ధైర్యంతో బస్సు ఎక్కింది , బస్సు ఎక్కింది అనే కానీ ఒకటే భయం ఇదే మొదటిసారి ఒక్కటే ఒంటరిగా కొత్త ప్రాంతానికి వెళ్లడం , ఇంతలో బస్సు మెల్లగా కదిలింది.


బస్సు ఒక్కొక్కచోట ఆగుతూ కొంతమందిని ఎక్కించుకుంటూ ముందుకు సాగుతోంది .ఇంతలో ఎవరోవచ్చి తన పక్కన కూర్చున్నారు. తన గుండె వేగం పెరిగింది , ఎవరో చూద్దాము అని కొంచెం అటుగా తన కళ్ళు తిప్పింది ఎవరో మగ మనిషి అని అర్ధం అవుతుంది ,ఇంక పూర్తిగా చూడలేక వెంటనే కిటికీ వైపుకి తీరిగేసింది . అంతే ...ఇంక ఆ పక్కకి తిరిగితే ఒట్టు.


ఒకే వైపున తిరిగి ఉన్నందున కొంత సమయానికి తన మెడ కూడా పట్టేసింది. "అయినా ఇంత మంది మగవాళ్ళు ఉండగా ఇతను నా పక్కనే కూర్చోవాలా! , అమ్మాయి కనపడితే చాలు ఎప్పుడెప్పుడు పక్కలో కూర్చుందామా అనుకునే వాళ్ళే ఎక్కువ , అనుకుంటుండగా" ఉన్నట్లుండి ఒక చెయ్యి తన భుజం ని తాకుతున్నట్లు అనిపించింది వెంటనే కోపంతో, "అనుకుంటున్నానో లేదో ఇంతలోనే స్టార్ట్ చేసాడు"! అనుకుంటూ పక్కకి తిరిగి చూసింది.


ఒకచిన్నపాప ఆడుకుంటూ ఉంది వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చొని , ఆ పాప వాళ్ళ అమ్మని చూసి "అదేంటి నా పక్కన అబ్బాయి కదా కూర్చున్నాడు. ఈమె ఎలా వచ్చింది" అని అనుకుంటుండగా ఇంతలో ఆమె నవ్వుతూ ఇలా అంది "నీ పక్కన కూర్చున్న అబ్బాయి నువ్వు ఇబ్బంది పడుతున్నావని గమనించి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి తను వెనక్కి వెళ్ళాడు. ఈకాలంలో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారంటే గొప్పే" అంది .


"నేనే అనవసరంగా అతనిని అపార్ధం చేసుకున్నట్లున్నాను. అయ్యో.. కనీసం అతని మొహం కూడా చూడలేదు కోపంతో , సర్లే ఏదైతే నేం మంచే జరిగింది ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు" అనుకొంది.


ఉదయం 6 కల్లా చెన్నై కి చేరుకుని తన చెల్లికి కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఎత్తడంలేదు. దార్లో ఉందేమో అందుకే ఎత్తడం లేదేమో అనుకుని కొంచెంసేపు తర్వాత మరలా కాల్ చేసింది. ఇలా చాలా సార్లు చేసిన తరువాత ఎప్పటికో ఫోన్ లిఫ్ట్ చేసి "హ.... చెప్పు" అంటూ నిద్రమత్తులో ఉన్నట్లు మాట్లాడడం గమనించిన ప్రేమ కోపంగా "చెప్పేది ఏంటి ఇంకా నిద్ర పోతున్నావా? నేను ఎంత సేపటి నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా?"


"అప్పుడే వచ్చేసావా ?"


" అప్పుడే ఏంటి వచ్చి గంట అవుతుంది. ఇంకా రాకుండా ఏం చేస్తున్నావ్ ?"


" అయ్యో క్షమించు అక్క ,ఇప్పుడే నిద్ర లేస్తున్నాను రాత్రి అలారమ్ పెట్టుకోవడం మరచిపోయాను ఏమి అనుకోకు, ఒక పని చెయ్యి నేను ఇప్పుడు లేచి అక్కడికి వచ్చేసరికి నీకు పరీక్షా సమయం కూడా అయిపోతుంది. అందుకని పక్కనే లోకల్ బస్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్లి నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ బస్సు ఎక్కు, ఆ బస్సు ఆగే 5 వ స్టాప్ లోనే నువ్వు దిగాల్సింది కాబట్టి 4 వ స్టాప్ వరకు ఏమి భయపడవలసిన పనిలేదు. ఏమైనా ఇబ్బంది ఉంటే మరలా నాకు కాల్ చెయ్యి ఈలోపు నేను కూడా అక్కడికి వచ్చేస్తాను" అని పెట్టేసి బస్సు నెంబర్ మెసేజ్ చేసింది.


"అయ్యో ఇలా ఇరికించేసింది ఏంటి ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? నాకేమో తమిళ్ ఒక్క ముక్క కూడా రాదు. సరే పక్కనే బస్టాప్ అంది కదా ముందు అక్కడికి వెళ్లి చూద్దాము" అని బ్యాగ్ తీసుకొని బయల్దేరింది .


ఎంత దూరం నడిచినా తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది. అంత పెద్దగా ఉంది ఆ బస్టాప్. ఎటు చూసినా బస్సులే. ఎవరిని అడిగినా అటు , ఇటు అని చేతులు చూపిస్తున్నారు. సరే అని అక్కడికి వెళ్లి అడిగితే ఇంకో దగ్గర అంటున్నారు తనకేమీ అర్థం కావడం లేదు. ఒకపక్క ఏడుపు వస్తుంది ,ఇంకో పక్క ఆకలి ,ఎటు పోవాలో తెలియట్లేదు.


ఇంతలో తన చెల్లి నుండి కాల్ , "ఏం అక్క ఎక్కావా బస్సు?" అని. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని వచ్చింది ప్రేమకి. అంతే చెడా మడా తిట్టేసింది తర్వాత కొంచెం సేపటికి నెమ్మదించి తన పరిస్థితి వివరించింది . "అయ్యో నువ్వేమి బయపడకు ఒక పని చెయ్యి నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్లకి ఫోన్ ఇవ్వు అంది" వాళ్ళ చెల్లి.


"సరే "అని అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషికి చూసి చూడటానికి పెద్దవాడిలా , మంచివాడిలా ఉన్నాడు , ఈ కాలం లో కుర్రవాళ్ళని నమ్మడం కంటే వీళ్ళని నమ్మడం మంచిది అనుకొని ఫోన్ ఆయనకి ఇచ్చింది. తన చెల్లి ఆయనకి అంతా వివరించి తనను ఆయనతో వెళ్ళమని చెప్పి పెట్టేసింది. సరే అని అయన వెనకాలే వెళ్ళింది. ప్రేమను బస్సు ఎక్కించారు అయన , ప్రేమ "థాంక్స్" అంది , వెంటనే అయన కూడా బస్సు ఎక్కి "స్టాప్ వరకు వచ్చి దిగబెట్టి వెళ్తాను" అన్నాడు. తెలుగు ,ఇంగ్లీష్ ,తమిళ్ మిక్స్ చేసిన భాషలో. సరే మంచి వారు లాగా ఉన్నారు అనుకొని "అలాగే" అంది ప్రేమ. ఇద్దరికీ ఆయనే టిక్కెట్ తీసుకున్నారు. తను ఇస్తుంటే వద్దు అన్నారు. తనతో పాటే తన పక్కనే కూర్చున్నారు, ఊరికి కొత్త కదా బయపడతాను అని కుర్చున్నారేమో అనుకుంది ప్రేమ. కొంచెం సేపటికి మాట్లాడటం మొదలు పెట్టాడు తన పేరు , ఊరు అన్ని అడిగాడు. చెప్పింది. ఇంకా ఏదో మాట్లాడబోతుంటే "నాకు తమిళ్ తెలియదు" అంది ప్రేమ. నవ్వి ఊరుకున్నాడు .


కొంతసేపటికి అర్ధం అయ్యింది అయన బుద్ధి. ఎంత మంది ఆడవాళ్లు , ముసలివాళ్ళు వచ్చి లేవమన్నా కూడా లేవలేదు , అదీ కాక ప్రేమను విచిత్రంగా చూడటం మొదలు పెట్టాడు . బస్సు రద్దీ గా ఉండటంతో చాలామంది నిల్చొని ఉన్నారు. డ్రైవర్ బ్రేక్ వేసిన ప్రతిసారీ కావాలని ప్రేమ మీద పడడం , అడిగితే రద్దీ అనడం ఇవన్నీ చూస్తుంటే ప్రేమకి ఏమీ అర్ధం కావడంలేదు. భయం మొదలయ్యింది.


ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. బయపెడదామా అంటే భాష రాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టుకొని కూర్చొని ఉంది. దానికి తోడు తన చెల్లి చెప్పిన 4 స్టాప్ లు అయిపోవడంతో " ఈయన ఏంటి ఇంకా దిగడం లేదు ,నన్ను దిగమని చెప్పడం లేదు" అనుకుంది.


తనకేమి అర్ధంకాక తన చెల్లికి కాల్ చేసి ఇలా జరిగినదంతా వివరించింది. "సరే... ఆయనకి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను" అని వాళ్ళ చెల్లి అనడంతో సరే అని ఆయనకి ఇచ్చింది , కొంచెం సేపటికి ఫోన్ తిరిగి ప్రేమకి ఇచ్చాడు . "ఏం లేదు అక్క నేను చెప్పిన బస్సు ఎక్కలేదంట మీరు, ఇది వేరే నెంబర్ అంట ఇది అయితే ఇంకో 2 స్టాప్ లు ఆగాలి అందుకే దిగలేదు అంట, అయినా నేను నువ్వు వచ్చేసరికి వచ్చేస్తాను లే ఏమి భయపడకు" అని కాల్ కట్ చేసింది. సరే అని ఊపిరి పీల్చుకుంది ప్రేమ.


"అవును!!..మరచిపోయాను బస్సు నెంబర్ నేను చూడలేదు కదా. కొంపతీసి మా చెల్లి చెప్పిన నెంబర్ ఎక్కించి కావాలని మా చెల్లికి అబద్ధం చెప్పలేదు కదా! ఒకవేళ అదే జరిగితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో ? ఏం చేస్తాడో ? ఏదో పెద్ద మనిషి లాగా ఉన్నాడని సహాయం అడిగినందుకు నాకే శిక్ష పడింది. "అని పలు రకాలుగా ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంది.


కొంత సేపటికి ఒక వెకిలి నవ్వు నవ్వి ప్రేమ మీద చెయ్యి వెయ్యబోయాడు , అంతే. టక్కున లేచి నిలబడింది. "ఏమి లేచావు? అన్నాడు" నవ్వుతూ. " ఒకవేళ అక్కడే కూర్చుంటే ఈ స్టాప్ లో కూడా దిగనివ్వకపోవచ్చు అనుకొని , "ఇంకొక్క స్టాపే కదా , అందుకే లేచాను" అంది ప్రేమ. వెంటనే అయన కూడా లేచాడు , ఎలాగో తప్పించుకొని ఆ జనాలని దోసుకుంటూ బస్సు తలుపు దగ్గరకి వచ్చి నించుంది ప్రేమ. వెనకాలే అయన కూడా వస్తున్నాడు.


"ఏది అయితే అది అవుతుంది ఈ స్టాప్ లో దిగేస్తాను. ఒకవేళ నేను దిగవలసింది ఇక్కడ కాకున్నా పర్లేదు మరలా వేరే బస్సు ఎక్కుతాను అనుకొంది. ఇంతలో బస్ అడగడం , తన చెల్లి కనపడడం అన్ని ఒకేసారి జరిగేసరికి ఆనందంతో బస్సు దిగి పరిగెత్తింది." ఆయన కూడా తన వెనకాలే దిగాడు కానీ తన చెల్లి వాళ్ళ తో పాటు పోలీసులు ఉండటం చూసి పారిపోబోయాడు ఇంతలో పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారు. "ఇప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చింది" అంది ప్రేమ. "నాకు మెసేజ్ ద్వారా విషయమంతా చెప్పి మంచిపని చేసావ్ అక్క అందుకే పోలీసులని తీసుకొచ్చాను" అంది తన చెల్లి ... అందుకే ఒక్కొక్కసారి భయం మనిషిలోని ఆలోచనా శక్తిని హరించివేస్తుంది అంటారు.

ఇలా ప్రేమ మొదటి ప్రయాణం తన జీవితంలో మరచిపోలేనిదిగా మారింది.


Rate this content
Log in

Similar telugu story from Drama