STORYMIRROR

gowthami ch

Drama

3.9  

gowthami ch

Drama

అపరిచిత వ్యక్తి

అపరిచిత వ్యక్తి

2 mins
478


 దీపావళి పండుగ సెలవులు కావడంతో రైల్వే స్టేషన్ అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ జనాల్లో ఎలాగోలా తోసుకుంటూ ట్రైన్ ఎక్కాము నేను , మా స్నేహితులు మానస మరియు లలిత. ఎక్కడం అయితే ఎక్కాము కానీ ఎక్కడా ఒక్క సీట్ కూడా కాళీగా లేదు సీట్ కాళీగా ఉండడం కాదు కదా కనీసం నించోవడానికి కూడా స్థలం లేదు.


ఇలా అయితే కష్టం అనుకోని తరువాతి స్టేషన్ లో దిగి చిన్నగా లేడీస్ కంపార్ట్మెంట్ కి చేరి హమ్మాయ్య అని ఊపిరిపీల్చుకుని లోపలికి అడుగుపెట్టేసరికి భోగీ మొత్తం ఆడవాళ్ళతో నిండిపోయి ఉంది. ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు.


"నేను ముందే చెప్పాను కదే ఈరోజు జనాలు ఎక్కువగా ఉంటారు అని మీరే నా మాట వినకుండా తీసుకొచ్చారు. ప్రశాంతంగా రేపు వచ్చి ఉండాల్సింది" అంటూ అరవడం మొదలుపెట్టింది మానస. తన మీద పడుతున్న ముసలావిడని వెనక్కి నెడుతూ.


"రేపైనా ఇదే పరిస్థితి ఉండదని నమ్మకంగా ఎలా చెప్పగలవు? పండగ అయ్యే వరకు

ఇలానే ఉంటుంది. కాబట్టి కష్టమో ,నష్టమో ఈరోజు వెళ్లడమే మంచిది ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో ఇంకో రోజు గడిపే అవకాశం అయినా ఉంటుంది." అంది లలిత.


ఇంతలో మేము నిలబడుకొని ఉన్న బెర్త్ పక్కనే పడుకొని ఉన్న ఒక అపరిచిత వ్యక్తి మా మాటలు విని పైకి లేచి మమ్మల్ని చూసి నవ్వి ఎంతసేపు అలా బాగ్స్ మోస్తూ నిలబడతారు. ఇలా ఇవ్వండి నా దగ్గర పెట్టుకుంటాను అని అనడంతో ఆనందంగా బాగ్స్ తీసి ఆమె చేతికి అందించి కృతజ్ఞతలు తెలిపాము.


"ఎక్కడి నుండి వస్తున్నారు?" అని అడిగింది ఆవిడ. "మేము చెన్నైలో ఎంబీఏ చేస్తున్నాం , దీపావళి సెలవులకు ఇంటికి వెళ్తున్నాం" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాము.


"నా పేరు జ్యోతి మాది విజయవాడ నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మాయి దేవి" అని పక్కనే ఉన్న

వాళ్ళ అమ్మాయిని పరిచయం చేసింది.


వాళ్ళ కూతురు మా కన్నా వయస్సులో పెద్దది అవడంతో "హయ్ అక్క" అని పలకరించాము. "హయ్" అంటూ నవ్వుతూ చెయ్యి ఊపింది ఆ అక్క.


అలా అలా కొంత సమయం ఆ అక్కతో మాటలతో గడిపేసాము. మాటల్లో తెలిసింది ఆమె అమెరికాలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తుంది అని ,కానీ ఆవిడ చూడడానికి అలా లేరు ఎంతో సాదా సీదాగా ఉంది.


అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంది. ఆ అక్కతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందం అనిపించింది మాకు. మంచి సంస్కారం , మంచి నడవడిక అన్నింటికన్నా ముందు అంత సంపాధిస్తున్నాను అన్న గర్వం కొంచెం కూడా లేదు.


ఒక పెద్దావిడ నిలబడలేక కష్టపడుతుంటే గమనించిన దేవి అక్క తను కిందకి దిగి కింద ఉన్న వాళ్ళని పైకి వెళ్ళమని చెప్పి ఆవిడని కింద కూర్చోబెట్టారు. అప్పుడు ఆ అక్కని చూసి ఎంతో ఆనందం కలిగింది మాకు.


"చెప్పండి చెల్లెల్లు" అంటూ వచ్చి మా పక్కనే నిలబడి "ఇప్పటివరకు పైన కూర్చొని కిందకి ఒంగి మీతో మాట్లాడడం కష్టంగా ఉంది ఎలా అనుకున్నాను ఇంతలో ఇలా అయింది." అంటూ మాటలు కొనసాగించారు. అప్పుడే ఆ అక్క మనసు ఎంత మంచిదో అర్ధమైంది మాకు.


కొంత సేపటికి మేము దిగవలసింది ఊరు రావడంతో

ఇంక మేము వెళ్ళొస్తాము అని చెప్పి బయలుదేరు తుండగా, అక్క మమ్మల్ని ఆపి "మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అక్కని గుర్తు ఉంచుకుంటారు కదూ" అంటూ నవ్వి ..తన నెంబర్ , మెయిల్ ఐడీ ఒక కాగితం మీద రాసి మాకు ఇచ్చింది.


అక్కకి , వాళ్ళ అమ్మ గారికి వీడ్కోలు పలికి అక్కడి నుండి వచ్చేసాము. మన జీవితంలో ఎంతో మంది అపరిచితులని కలుస్తూ ఉంటాము, విడిపోతు ఉంటాము కానీ కొందరు మాత్రం అలానే గుర్తు ఉండిపోతారు అలాంటివారిలో ఒకరే ఈ దేవి అక్క కూడా.





Rate this content
Log in

Similar telugu story from Drama