అనుభవం
అనుభవం


అవి మేము కొత్తగా హైదరాబాద్ కి వచ్చిన రోజులు. ఒకరోజు మా అమ్మాయి ఆఫీస్ కి వెళ్తూ
"అమ్మా, నాతో రా, నీకు టాంక్ బాండ్, ప్రసాద్స్
చూపిస్తాను." అంది.
"సరే పద" అంటూ నేను సరదాగా తయారయ్యాను
మేమిద్దరం. టాంక్ బండ్ అంతా నడుచు కుంటూ
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎండని కూడా
లెక్క చేయకుండా నడుస్తూ మెల్లగా ఐమాక్స్ కి
చేరుకున్నాం
మా అమ్మాయి నేను ప్రతీ ఫ్లోర్ తిరిగాం. ఏ ఫ్లోర్
లో ఏముందో వివరిస్తూ అన్ని చూపిస్తూ మధ్య
మధ్యలో తినేవి కొంటూ అంతా చూపించింది. ఒక గంటసేపుఐమాక్స్ అంతా తిరుగుతూనే ఉన్నాం.
నా మనసులో మాత్రం, మాకు తెలిసిన వారు ఎవరైనా కనపడాలి అన్న కోరిక బలంగా ఉంది.
ఇద్దరం ఐమాక్స్ మెట్ల మీద కూర్చుని చిప్స్ తింటున్నాం. నా మనసులో ఉన్న కోరిక దానికి
చెప్పాలనిపించి "" స్వాతీ, ఇక్కడ మనకు తెలిసిన
వాళ్ళు కనబడితే బాగుంటుంది కదే" అన్నాను.
"అవును మరి. నువ్వొస్తున్నావని నీకోసం రెడీగా
తెలిసిన వాళ్లు వస్తారు." అంది నవ్వుతూ.
నాకు అది ఎగతాళి చేయడం తో కోపం వచ్చింది.
ఇంతలో "మేడం" అన్న పిలుపు విని పక్కకు
చూసాను. ఎవరో అబ్బాయి తెలిసిన ముఖమే.
ఎవరన్నట్టు చూసాను.
" నేను మేడం విశాల్ ని. మీ స్టూడెంట్ ని. వైజాగ్ లో నేను మీరు పనిచేసే స్కూల్ లోనే చదువుకున్నాను. గుర్తు పట్టలేదా మేడం." అన్నాడు.
కాస్త పరిశీలనగా చూసి గుర్తు పట్టాను." ఓ, నువ్వా విశాల్ గుర్తుకు వచ్చావ్. నీకొక తమ్ముడు
విమల్ ఉండే వాడు కదూ. చిన్నప్పుడు కంటికి దెబ్బ తగిలించుకున్నాడు." నాకు బాగానే గుర్తు
ఉన్నావన్నట్లు నవ్వుతూ బదులిచ్చాను. మా అమ్మాయి స్వాతి మా ఇద్దరినీ చూస్తోంది. దానిని
'మా అమ్మాయి' అని చెప్పి విశాల్ కి పరిచయం చేశాను
"అమ్మయ్య, మేడం గుర్తు పట్టారు." అంటూ పక్కనే కూర్చుని మాటలు కలిపాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాత విద్యార్థిని కలిసినందుకు. మాటల్లో మా అమ్మాయి చేసే ఉద్యోగ వివరాలు తెలుసుకొని " స్వాతీ, నీకు మీ కంపెనీలో తక్కువ పేకేజీ ఇస్తున్నారు. మా అంకుల్ కంపెనీ లో సాలరీస్ చాలా బాగుంటాయి. నీకు కావాలంటే మా అంకుల్ తో
మాట్లాడి అక్కడ వేకెన్సీ ఉందేమో కనుక్కోమంటావా." అని అడిగాడు.
స్వాతి నావైపు చూసింది. నీ ఇష్టం అన్నట్లు సైగ చేసాను. స్వాతి కొంత సేపు ఆలోచించి
"అన్నా, ఈ ఆఫీస్ లో ఈమధ్యనే చేరాను. వాళ్ళు
త్వరగా వదుల్తారని నమ్మకం లేదు." అంది.
"దానికి నువ్వు టెన్షన్ పడకు. మా అంకుల్ అన్నీ చూసుకుంటారు. ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. వేకెన్సీ ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తారు. ఆయన్ని ఒకసారి కలిస్తే నీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. నేను అందులోనే చేస్తున్నాను."
అన్నాడు విశాల్.
ఇంతలో టైం చూసుకుని " అన్నా టైమైంది. ఆఫీస్ కి వెళ్ళాలి. వస్తాం."అని "అమ్మా, వెళదామా"
అంటూ లేచింది స్వాతి.
"ఓకే. ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. నేను అంకుల్
తోమాట్లాడి ఏవిషయం చెప్తాను." అన్నాడు విశాల్
అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి బైల్దేరాము.
" అమ్మా, ఈ అబ్బాయి నీకు తెలుసుకదా." అడిగింది స్వాతి.
"తెలుసమ్మా, నా స్టూడెంట్. ఈ రోజు ఎవరైనా తెలిసిన వాళ్లు కనబడితే బాగుండునని అనుకున్నా. నా స్టూడెంట్ కనిపించాడు." నా గొంతులోఆనందం ధ్వనించింది.
స్వాతి నవ్వుతూ "హేపీనా." అంది
బదులుగా నేనూ నవ్వాను. స్వాతి ఆఫీస్ టైం కావడంతో వెళ్ళిపోయింది. నేను ఇంటికి చేరుకున్నాను.
రెండు రోజుల తర్వాత విశాల్ ఫోన్ చేసి
"మేడం, అంకుల్ మిమ్మల్ని కలుస్తానన్నారు. ఈ
శనివారం." చెప్పాడు.
"సరే విశాల్, నేను స్వాతి కి చెప్తాను." అని చెప్పాను.
ఆ శనివారం ఒకసారి కలిస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళని కలవడానికి మళ్ళీ ఐమాక్స్ కి
వెళ్ళాం ఇద్దరం. అన్నట్లు గానేవాళ్ళిద్దరూ వచ్చారు. ఆయన్ని ఆ కంపెనీ మానేజర్ గా పరిచయం చేసాడు విశాల్. ఆయన మా స్వాతి తో మాట్లాడి తప్పకుండా ఉద్యోగం మంచి పేకేజీ తో
ఇప్పిస్తానని, ఉన్న ఆఫీస్ నుండి ఎలా తప్పుకోవచ్చో చెప్తానని మాట ఇచ్చారు. విశాల్ తో అప్లికేషన్ పంపిస్తానని అది సబ్మిట్ చేయగానే
ఇంటర్వ్యూ ఉంటుందని, ఇలా చాలా చెప్పారు.
నా వైపు చూసి "మీరు సంస్కృతం చెప్తారు కదా మేడం, మా కంపెనీ లో మీకు కూడా ఆఫర్ ఇప్పిస్తాను. మీరు కూడా మా కంపెనీ లో మంచి పేకేజీ తో పని చేయవచ్చు." అన్నారు.
"నాకెందుకు లెండి. అమ్మాయి సంగతి చూడండి"
అన్నాను.
"అది మీరు చెప్పాలా మేడం. ముందు అమ్మాయికి జాబ్ ఇప్పించాక మీకు కూడా ఆఫర్ఇప్పిస్తాను" అన్నారు మళ్లీ.
నేను నవ్వేసి ఊరుకున్నాను. తర్వాత వాళ్ళ నుండి శెలవు తీసుకుని వెళ్ళి పోయాము.
మరో రెండు రోజులకు మళ్ళీ విశాల్ ఫోన్ చేసి అప్లికేషన్ కోసం ఫొటోలు పట్టుకొని 600రూ.లు తీసుకుని వస్తే వాళ్ళ ఆఫీస్ బైటనే అందచేస్తానని
మా అమ్మాయి కి చెప్పాడట. మావారు కూడా నా స్టూడెంట్ కదా అని ఏమీ అనలేదు. మరుసటి రోజు అతను అడిగిన మనీ ఇచ్చి అప్లికేషన్ పూర్తి చేసి విశాల్ కి ఇచ్చింది.
మరొక నాలుగు రోజులు పోయాక విశాల్ నాకు ఫోన్ చేసాడు. "మేడం. మీ అమ్మాయి కి జాబ్ తప్పకుండా ఇస్తారట. అయితే కొన్ని ఫార్మాలిటీస్ కోసం మూడు వేలు అవసరమౌతాయట. అంకుల్ చెప్పమన్నారు. ఆ మనీ ఇచ్చేస్తే నామకః ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు." అన్నాడు. మా అమ్మాయి కి చెప్తానని ఫోన్ పెట్టేసాను. కానీ నాలో ఏదో అనుమానం మొదలైంది. మా అమ్మాయి వచ్చాక విషయం చెప్పి నా అనుమానం కూడా వ్యక్తం చేశాను.
తను కొంత సేపు మౌనంగా ఉండి "అమ్మా, మొదటి సారి డబ్బు అడిగినప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ నీ స్టూడెంట్ అని ఏమనలేక పోయాను. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కంపెనీ లో వీళ్ళగురించి ఆరా తీయాలి." అంది.
"ఐతే ఆ కంపెనీ లేదంటావా!" అడిగాను ఆతృతగా.
"కంపెనీ చాలా పెద్దది. అది మా ఆఫీసుకి దగ్గర లోనే ఉంది. అందులో వీళ్ళ పొజిషన్ తెలుసుకోవాలి."అంది సాలోచనగా.
"రేపే తెలుసుకుంటాను. ఈ లోపు ఫోన్ చేస్తే కొంచెం టైం కావాలి అంది మా అమ్మాయి అని చెప్పు" అంది మళ్ళీ.
మరునాడు విశాల్ ఫోన్ చేస్తే ఆ విషయమే చెప్పాను.
రెండు రోజుల తర్వాత మా అమ్మాయి "అమ్మా, నీ స్టూడెంట్ చెప్పిందంతా అబద్ధం. వాళ్ళని గురించి ఆ ఆఫీస్ లో అడిగితే ఆ పేర్లు కలవాళ్ళెవరూ ఆ కంపెనీ లో లేరని చెప్పారు. ఈమధ్య ఇలాంటి కథలు చెప్పి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారటమ్మా. ఎంత మోసం చూడమ్మా" అంది
మోసపోయినందుకు కన్నా నా స్టూడెంట్ నన్ను మోసం చేశాడన్న బాధే నాకు ఎక్కువగా అనిపించింది.
మా ఇంట్లో వాళ్ళు "నమ్మిన వారినే కదా ఎవరైనా మోసగిస్తారు. నువ్వు ఎక్కువ ఆలోచించకు." అని సర్ది చెప్పారు. ఆ తర్వాత ఆ విషయం పేపర్ లో వచ్చింది. మళ్లీ విశాల్ ఫోన్ చేస్తాడేమో అనుకున్నా. కానీ చేయలేదు. బహుశా వాళ్ళకీ విషయం తెలిసిపోయి ఉంటుంది.
ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మనసు కి బాధ కలుగుతుంది. అయినా స్టూడెంట్స్ అందరూ అలా ఉండరు కదా. వాడేదో అవసరం కొద్దీ తప్పు చేసుంటాడని మనసుకి సర్ది చెప్పుకున్నా
ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు.