Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

gowthami ch

Drama

4.7  

gowthami ch

Drama

ఆమె కోసం

ఆమె కోసం

3 mins
271


"అమ్మా..... సీతా ! కాస్త కాఫీ పెట్టివ్వమ్మా" అంటూ తన గదిలో నుండి వచ్చి హాల్ లోని సోఫాలో కూర్చుంటూ అడిగింది కనకం.


"అలాగే అతయ్యగారు" అంటూ వంటింటిలో నుంచి కాఫీ కప్ తో బయటకి వస్తూ అంది సీత.


కాఫీ కప్ అందుకుంటూ "ఇప్పుడే కదా అడిగాను అంతలోనే ఎలా చేశావ్ ?"అడిగింది అత్తగారు.


"నేను కూడా ఇప్పుడే కలుపుకుంటున్నాను ఆలోగా మీరూ అడిగారు అందుకే ఇద్దరికి కలిపేసాను." అంటూ కప్ తీసుకొని అత్తయ్య పక్కనే కూర్చుంది.


"మధ్యాహ్నం భోజనంలోకి ఏం వండమంటారు అత్తయ్యా?" అడిగింది సీత.


"ఈరోజు వంట నేను చూస్తానులే సీత నువ్వు ఇంకేదైన పని ఉంటే చూసుకో. "అంటూ కాఫీ కప్ లోపల పెట్టడానికి పైకి లేచింది కనకం. "అది ఇలా ఇవ్వండి అత్తయ్యా నేను కడిగేస్తాను" అంటూ అత్తయ్య చేతిలో నుండి గ్లాస్ తీసుకుని లోపలకి వెళ్ళిపోయింది సీత.

*****

"చేతిలో కాఫీ కప్ తో పడకగదిలోకి వెళ్లి భర్త ని నిద్ర లేపి కాఫీ అందించి పక్క బట్టలు సర్ది "వెళ్లి స్నానం చేసి రండి" అంటూ అల్మారాలో నుండి టవల్ తీసి భర్త చేతికి ఇచ్చి పిల్లల్ని లేపడానికి పక్క గదిలోకి వెళ్లింది సీత.


"గుడ్ మార్నింగ్ అన్షు పాప , గుడ్ మార్నింగ్ యోషిత్ కన్నా లేవండి త్వరగా స్కూల్ కి టైం అవుతుంది" అంటూ పిల్లల్లిద్దర్నీ లేపి బ్రష్ చేయించి ,స్నానం చేయించి, బట్టలు వేసి, రెడీ చేసి బయటకి వచ్చే సరికి ఆఫీస్ కి రెడీ అయ్యి తన గదిలో నుండి బయటకి వచ్చాడు సూర్య.


ముగ్గురికీ టిఫిన్ పెట్టింది సీత. వాళ్ళు తినడం పూర్తి అయ్యేలోపు తన కొడుక్కి లంచ్ బాక్స్ సిద్ధం చేసి టిఫిన్ తినడానికి వచ్చి కూర్చుంది కనకం. అత్త గారికి కూడా టిఫిన్ పెట్టి తను కూడా తినింది. ఇలా అందరూ కలిసి టిఫిన్ చేసిన తరువాత సూర్య ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.


సాయంత్రం వరకు అత్త కోడళ్లు ఇద్దరూ కలసి అన్నీ పనులు చేసుకుంటూ పిల్లల్ని ఆడిపించుకుంటూ , ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.


సాయంత్రం పిల్లలకి స్నానం చేయించి తినడానికి ఏమైనా పెట్టి కొంచెం సేపు ఆటలు ఆడుకున్న తరువాత కనకం పిల్లళ్ళిద్దరికి తన చేత్తో గోరుముద్దలు తినిపించి తను కూడా తినేసి పిల్లలకి కధలు చెప్పి నిద్రపుచ్చి తను నిద్రపోయింది.


సూర్య ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చేలోగా టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి భర్త రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేసారు. భోజనం అయిన తరువాత సీత అన్ని సర్దుకొని గదిలోకి వెళ్లిన సీత భర్త ఏదో ఆలోచిస్తుండడం గమనించి "ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? "


మంచం మీద కూర్చున్న సూర్య సీత వైపు చూసి "సీత నిన్ను ఒక విషయం అడగాలి?" అన్నాడు.


"ఏంటండి అది?" అంటూ భర్త పక్కనే కూర్చుంది సీత.


"నీకు మా అమ్మ నచ్చిందా..?"


"సీత చిన్నగా నవ్వి... నచ్చకుంటే ఏం చేస్తారేంటి?"


"నిజం చెప్పు సీత...నచ్చిందా? లేదా?"


"మీ అమ్మ నాకే కాదు ఎవరికైనా నచ్చుతారు. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? "


"ఏం లేదు సీత , సహజంగా అందరూ అంటూ ఉంటారు కదా పెళ్ళయిన కొత్తల్లో అందరూ బాగానే ఉంటారు ఆ తరువాతే మొదలవుతుంది అసలు కథ. పిల్లల విషయం లో అత్తా కొడళ్ళకి ఏవేవో మాట పట్టింపులు వస్తాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారి వాళ్ళ మధ్య దూరం పెంచేస్తాయి అని, అందుకే అడుగుతున్నాను. ఇది వరకు అంటే నువ్వు కూడా ఉద్యోగం చేసేదానివి కాబట్టి ఇంట్లో ఎక్కువ సమయం ఉండేదానివి కాదు, కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నావు కదా, అంటే అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు ,అందుకే మీ ఇద్దరి మధ్య ఏమైనా మాట పట్టింపులు వస్తాయేమో అని నా భయం.


మా అమ్మ ఇప్పుడు బాగానే ఉంది కాని భవిష్యత్తులో కూడా ఇలానే ఉండదుగా. వయసు మీద పడడం వల్ల పోను పోను ఆమెలో చాలా మార్పులు వస్తాయి. అప్పుడు కూడా నువ్వు మా అమ్మని ఇలానే చూసుకోవాలి అనేది నా కోరిక."


"తప్పకుండా అండి ఎవరో ఏదో అన్నారని అందరూ అలానే ఉంటారనుకోవడం మీ భ్రమ. ఎప్పటికీ మా మధ్య అటువంటివేమి రావు, సరేనా.... "అంటూ భర్త చేతిలో చెయ్యివేసి చెప్పింది సీత.


"ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సీత. ఎందుకంటే మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది నేను పుట్టిన 5 సంవత్సరాలకే మా నాన్నగారు చనిపోవడంతో అప్పటినుండి నాకు అన్నీ అమ్మే అయ్యి ఇంత వాడిని చేసింది. ఎప్పుడూ నాగురించే తప్ప ఆమె గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించేది కాదు.


"చిన్న తనంలో నేను ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చే అమ్మ నాకు ఉద్యోగం వచ్చి ఇంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఇప్పటికీ ఆమె కోసం అంటూ నన్ను ఏదీ అడగదు. అటువంటి ఆమెకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఒక మంచి కొడుకుగా ఉంటూ ఆమెకి ఈ వయస్సులో ఏ లోటు రాకుండా చూసుకోవడం తో పాటు ఆమెను కన్న కూతురిలా చూసుకొనే మంచి కోడలిని ఇవ్వడం తప్ప. ఇంతకన్నా మించి ఆమె కోసం నేను చేయగలిగేది ఏది లేదు." అంటూ కన్న తల్లి కష్టాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డాడు.


"మీరు అటువంటి భయాలు ఏమి పెట్టుకోకండి మీరు అనుకున్న విధంగానే నేను మీ అమ్మ గారికి ఒక మంచి కూతురిలానే ఉంటాను. మీ కోసం అంత కష్టపడ్డ ఆమె కోసం మనం ఈ మాత్రం చేయలేమా?

ఖచ్చితంగా ఆమె కోసం నేను ఏమి చేయగలనో అవి అన్నీ చేస్తాను. "అంటూ భర్తకి ధైర్యం చెప్పింది.


Rate this content
Log in

More telugu story from gowthami ch

Similar telugu story from Drama