సంగీతము
సంగీతము
విశ్వం పుట్టక ముందు నిశ్శబ్దము
సన్నగా వినిపించిదొక స్వరము
అదే సృష్టికి మూలమౌ ఓం కారము
గంభీరంగా సాగినదా నాదము
పరమాత్మ రూపమిదియే విజయా
విరించి రాణిగా ఆవిర్భావము
సప్త స్వరాల సమ్మేళనము
జగతిలో నిండియున్నదీ రాగము
నాద బీజమంత్రో పాసనము
పరమాత్మ రూపమిదియే విజయా!
కిలకిలలాడు పక్షుల రావము
గలగల రాలే పర్ణపు ధ్వానము
జఱజఱ సాగె ఘరుల నాదము
వరమై కురిసే వర్షపు సారము
పరమాత్మ రూపమిదియే విజయా!
ఫెళఫెళ మెరుపుల గర్జనము
ఝణ ఝణ నదుల సోయగము
కణకణ మండు యగ్ని కణము
గాడ్పులతో ఝంఝామారుతము
పరమాత్మ రూపమిదియే విజయా!
రాగతాళ స్వర సమ్మేళనము
సుధలు జాలు వారెడి సంగీతము
సంగతులతో స్వర సాధనము
కృతులందు నిలిచి యుండు దైవము
పరమాత్మ రూపమిదియే విజయా
సరాగములు సల్లాపములు
నాట్య రీతులు కావ్య గీతులు
పలుకు బడులు బహు భాషలు
జగమంతా రాగ తాళ భావములు
పరమాత్మ రూపమిదియే విజయా!
వేద సారమీ దివ్య సంగీతము
నాదమయమై నిల్చె నింత కాలము
బాధలను మరిపించు సాధనము
ముక్తిమార్గమునకు సోపానము.
పరమాత్మ రూపమిదియే విజయా!//
