రేపల్లె ముచ్చట్లు
రేపల్లె ముచ్చట్లు
*రేపల్లె ముచ్చట్లు*
(బాల పంచపదులు )
పొద్దు పొద్దున పడుతులు లేచిరి.
నిద్దుర వీడి పనులకు మళ్ళిరి.
ముద్దులొలికెడు పూవుల గాంచిరి.
చద్దియన్నములు త్వరగా తినిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
ముంగిట భామలు కల్లాపి చల్లిరి.
వంగుచు వర్ణాల ముగ్గులు పెట్టిరి.
ఛంగున దూకెడి కోడెల గాంచిరి.
పొంగుచు ప్రేమగా మేతను బెట్టిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
పిల్లలు నవ్వుతూ నాటల నాడిరి.
త్రుళ్ళుతునా తరుణులు మురిసిరి.
చల్లని యమునా నదికి వెళ్ళిరి.
సల్లాపములతో స్నానాలు జేసిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
వన్నెల చిన్నెల వస్త్రాలు కట్టిరి.
చెన్నుగ కొప్పులో పూవులు బెట్టిరి.
కన్నెలు కలిసి యుయ్యాలలూగిరి.
జున్నును వండుచు శౌరిని దల్చిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
చిట్టి కన్నయ్య నల్లరి నెరింగిరి
చట్టిలో వెన్నముద్దలను దాచిరి
ఉట్టిపై బెట్టుచు తా 'ముష్ యుష్ష 'నిరి.
చుట్టూ చూచుచు తలుపులు మూసిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
దొంగకృష్ణుడు దొరవలె వచ్చెను.
సంగతేమిటో తాను పసిగట్టెను.
సంగడికాళ్ళతోడ సంప్రదించెను.
ముంగివోలె చని మ్రింగె నా వెన్నను.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
గొల్లుమని యా భామలు వగచిరి.
పిల్లవానిపైన నిందలు మోపిరి
తల్లితో తెల్పుచు తగవు పెంచిరి.
చెల్లని వాడని చిరాకు పడిరి.
రేపల్లెలోని ముచ్చటలు వినగా రండమ్మా!
మాయదారి వాడమ్మా!మోహనాంగుడు.
చేయుచుండె నల్లరి చిలిపివాడు.
తీయతీయగ పలుకు చుండు వాడు.
సాయమెంతో చేయునీ చెలిమికాడు.
చెంతనుండువాడె !మన గోపాలబాలుడమ్మ!//
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
