నవజీవన రేఖలు
నవజీవన రేఖలు
గతం కరిగిపోయిన కొవ్వొత్తి
వర్తమానం వెలుగుతున్న కొవ్వొత్తి
భవిష్యత్తు ఎల్ఈడి బల్బులా వెలుగకున్నా
కొండెక్కిన దీపం కావద్దన్నది కోరిక
అరచేతిలో హారతి కర్పూరం వెలిగించడం కాదు
బర్త్ డే కొవ్వొత్తిలా వెలిగించి ఆర్పడం కారాదు
దీపాలు వెలిగించే దీపంలా మారాలి
నవజీవన రేఖలు చుట్టూ ఉన్న లోకంపై గీయాలి
గతం భవిష్యత్తుకు పునాదొక్కటే కాదు
ఆరిపోని అక్షరాల గోడలతో కట్టుకున్న ఇల్లు
ఆ తొవ్వలో పోయే వారంతా
ఆగి చదువుకునే పాఠం
ఆ పాఠం తరగతిలో బోధించే పాఠ్యాంశంగా మారాలి
గత బాల్యం నేడు వృద్ధాప్యంగా మారినా
అనుభవాల పిల్లర్లు నిలబెడతాయి పైకప్పును
గోడలెలా కట్టుకుంటావో
ఆధునీకరణ ఎలా చేసుకుంటావో నీ ఇష్టం
అందరూ మెచ్చుకునే అద్భుత కళాఖండంగా
మారాలని కోరుకోను ఎప్పుడూ
చూపులకే పరిమితం కావొద్దు నీడనివ్వాలి ఏదైనా
నవజీవన రాగాలు నిత్యం పూచే పూల మొక్క
ప్రాణవాయువు పంచే చైతన్యపు గాలి
సతత హరితాన్ని పెంచే సూర్యకిరణాలు
ఏడాదికల్లా భూమిలో నిల్వగా మారే వర్షాలు
నిన్నటి నేటి వెలుతురు కొనసాగాలి భవిష్యత్తంతా
