నూతన సంవత్సరం
నూతన సంవత్సరం
పూర్వ జడ శిశిర తిమిర సంహర్తినీ
నవ్య చైతన్య ఝరీ ప్రవాహినీ
సమతా రస కలితా ప్రపూర్ణ ప్రజ్వల యుగాదీ!
మాకు నుజ్వల భవిత నీయగా రావమ్మా!
హాలిక దుఃఖనివారిణీ!శ్రామిక శ్రమ జీవన ఫలదాయినీ!
దీనజనోద్ధారిణీ!కాంచన మణిమయ శోభాకృతీ!
శుభదాయక వరదాయీ !శోభకృతు యుగాదీ!
మాకు ధనధాన్య రాశులు కురిపించగ రావమ్మా!
సర్వరోగ భయ నాశనీ!సర్వానందమయీ!
సంతోష క్షీరపూర్ణ భరితా!సురభీ!
ఆరోగ్య ప్రదాయక పీయూష ధర జీవదా!యుగాదీ!
మాకు నూత్న జవసత్వములీయగ రావమ్మా!
కులమత భేద వినాశనీ!సర్వ జన శాంతి ప్రదాయనీ!
స్వార్థ దుష్ట చిత్త దానవ సంహారిణీ!క్రాంతి పథగామినీ!
విమల చారు సుజన రక్షిత!ధైర్య శక్తి భరిత యుగాదీ!
మాకు సద్గుణ సంపద లీయగా రావమ్మా!
జయజయహో!నూతన వత్సరమా!ప్రణతులు గొనుమా!
మధుమాస విహారీ!మనోల్లాస కూజిత స్వర రాగ నాదమయీ!
స్వాగతం!స్వాగతం సుమనోహర ప్రకృతి విలాసినీ!
శోభకృతూ!నీకిదే మా వందనం ! వందనం!
