నిశబ్ద శ్మశానం – మనిషి గర్వం...???
నిశబ్ద శ్మశానం – మనిషి గర్వం...???
ఈ నింగి నీ సొత్తు కాదు,ఈ నేల నీ రాచరికం కాదు,
నువ్వు నాది అనుకుంటున్న నీ ఊపిరి కూడా నీ అద్దె ఇల్లే!
అయినా, "నేనే గొప్ప" అని విర్రవీగే ఓ మనిషి...
వినేపించుకో, ఇదీ నీ కథ!
ముడిచిన చేతులతో ఒంటరిగా వచ్చావు,
జాచిన చేతులతో ఒంటరిగానే వెళ్ళిపోతావు.
నాలుగు రోజుల ఈ నాటకరంగంలో బతికినంత మాత్రాన,
ఈ విశ్వానికే నువ్వు యజమానివి అనుకుంటున్నావా?
కుళ్ళిన పండు కొమ్మ నుండి రాలిపోతుంది,
తుప్పు పట్టిన ఇనుము కాల గర్భంలో కరిగిపోతుంది,
చెదలు పట్టిన కర్ర మట్టిలో మట్టి అయిపోతుంది.
కానీ... గర్వం పట్టిన నువ్వు మాత్రం,
బ్రతికుండగానే మనుషుల మనసుల్లో శవమైపోతున్నావు!
నీ గుండె కొట్టుకుంటున్నా, నువ్వు తిరుగుతున్న శవానివే!
కంటికి కనిపించే ప్రతిదాన్నీ "నాదే" అంటావు,
భూమిని చీల్చి నీ సరిహద్దులు గీసుకుంటాడు.
కానీ విచిత్రం ఏంటో తెలుసా?
చివరికి నువ్వు నిద్రపోయే ఆ రెండు గజాల మట్టి కోసమే,
జీవితమంతా రక్తాన్ని చిందించి పోరాడతావు!
నిన్ను నువ్వు మోసుకుంటూ పుట్టావా?
నీ ఊపిరిలోని ప్రాణవాయువుని నువ్వేమైనా సృష్టించావా?
పోనీ, ఆ గుండె చప్పుడునైనా నీ అదుపులో కొట్టించగలవా?
అన్నీ అడుక్కు తెచ్చుకున్నవే అయినప్పుడు...
ఈ గర్వం, ఈ అహంకారం నీకు ఎక్కడి నుంచి వచ్చాయయ్యా?
పండ్ల బరువు పెరిగితే చెట్టు కొమ్మ కిందికి వంగుతుంది,
వరద నీరు నిండితే నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది.
కానీ, నీకు కాస్త పేరు వస్తే చాలు... తల ఆకాశాన్ని తాకాలనుకుంటుంది,
నాలుగు రాళ్లు చేతికొస్తే, కన్నవాళ్లని, కట్టుకున్న నీడను కూడా మర్చిపోతావు!
జాగ్రత్త... రేపు కాలం నీ తలుపు తడుతుంది!
అప్పుడు నీ కుర్చీ రాదు, నీ బ్యాంకు బ్యాలెన్స్ రాదు,
నువ్వు తోపువని భజన చేసిన గుంపు అసలే రాదు.
నువ్వు కన్నుమూసినప్పుడు ఏడ్చే నాలుగు నిజమైన మనసులు ఉంటే...
అదే నువ్వు సంపాదించిన అసలైన ఆస్తి అని నీ ఆఖరి శ్వాస నీకు చెప్తుంది.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాజువైనా, పేదవాడైనా ఒకటే చీకటి!
చితి మంటల్లో కాలి బూడిదయ్యేటప్పుడు రాజువైనా,
పేదవాడైనా ఒకటే తెల్లటి బూడిద!
ఈ పుట్టుకకి, చావుకి మధ్యలో మాత్రమే కదా "నేనే తోపు" అనే నీ భ్రమ?
కాలం ఒక్కసారి తెర దించితే... నువ్వెంత, నీ బతుకెంత? అంతా శూన్యం!
కుళ్ళిన పండును చూసి నవ్వకు,తుప్పు పట్టిన ఇనుమును తక్కువ చేయకు,
అవి కాలానికి ఓడిపోయాయి...
కానీ, గర్వం పట్టిన నువ్వు మాత్రం... నీ అహంకారానికి నువ్వే ఓడిపోయావు!
గుర్తుపెట్టుకో...వినయమే మనిషికి నిజమైన అందం,
ప్రేమే ఈ సృష్టిలో శాశ్వతం.నువ్వు చనిపోయాక మిగిలేది నీ సిరిసంపదలు కాదు,
నువ్వు పదిమంది మనసుల్లో చల్లిన మంచితనం మాత్రమే!
నిన్ను నాశనం చేయడానికి బయట శత్రువులెవ్వరూ లేరు...
నీ గుండెల్లో దాగున్న అహంకారమే నిన్ను బూడిద చేసే అసలైన నిప్పు
