కవిత్వమంటే
కవిత్వమంటే
కవిత్వమంటే కలవడం, కలపడం
అక్షరాలను కూర్చడం. పదాలను చేర్చడం
భావాలను నూర్పడం, భావనలను పేర్చడం
వచనంగా, పద్యంగా ఒద్దికగా వడ్డించడం
కవిత్వమంటే కలవడం. కలపడం
మనలోని ఉద్వేగాలకు ఊపిరి పోయడం
మన భావోద్వేగాలను భాషతో వ్యక్తపరచడం
నవరసాలతో హృద్యంగా కవనాన్ని కనడం
కవిత్వమంటే కలవడం, కలపడం
ఒంటరి హృదయానికి ఓదార్పు నివ్వడం
ఒక హృదయంతో మరోదాన్ని కలపడం
చెల్లాచెదురైన అనుభవాలను చేరదీయడం
కవిత్వమంటే కలవడం, కలపడం
అనేక జ్ఞాపకాలను దారంతో అల్లడం
అక్షరాల కూర్పుతో ఆత్మలను కలపడం
పలకని నిశ్శబ్దాలను అనువదించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
కన్నీటి చుక్కను చిరునవ్వుతో కలపడం
ఓటమి నీడను ఆశాకిరణంతో చేర్చడం
విరిగిన మనసులో విశ్వాసాన్ని నాటడం
కవిత్వమంటే కలవడం, కలపడం
ఈ మట్టివాసనతో మనిషిని కలపడం
మర మనిషిలో మానవత్వాన్ని నింపడం
ప్రకృతితో ప్రాణాన్ని మమేకం చేయడం
కవిత్వమంటే కలవడం, కలపడం
కాలంతో ప్రతి క్షణాన్ని కౌగిలించుకోవడం
అమ్మ ఒడిలోని ఆప్యాయతను పంచడం
నాన్న చెమటలోని బాధ్యతను బోధించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
స్నేహితుడి కష్టాలకు భరోసాను ఇవ్వడం
వృద్ధుడి మౌనపు బాధను అర్థం చేసుకోవడం
అభాగ్యుడి గుండె చప్పుడును వినిపించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
కులాల మధ్య కట్టిన గోడలను కరిగించడం
మతాల మధ్యనున్న మంటలను చల్లార్చడం
మనసుల్లో మమతల వంతెనలు నిర్మించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించడం
ప్రశ్నించే గొంతులతో హక్కులకై పోరాడడం
సమకాలీన సమస్యలపై రాజీలేక రాయడం
కవిత్వమంటే కలవడం, కలపడం
కవి కలాన్ని సహానుభూతితో నింపడం
మనిషి రక్తనాళాల్లోని స్పందనలను రాయడం
మానవత్వపు మల్లెలను పూయించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
ప్రతి మంచి కవిత గాయానికి లేపనమవడం
ఒక నిరాశ, నిస్పృహలకు దీపమై వెలుగడం
మనిషి చీకటిలో వెలుగుగా ఉదయించడం
కవిత్వమంటే కలవడం, కలపడం
గతాన్ని వర్తమానంతో జోడించడం
వర్తమానాన్ని భవిష్యత్తుతో ఊహించడం
మనిషిని మానవ విలువలతో కలపడం
కవిత్వమంటే కలవడం, కలపడం
అక్షరాలతో అంతరాలను తగ్గించడం
భావాలతో భవితలను కూడా కలపడం
మనిషి గుండెలో మానవత్వాన్ని మేల్కొలపడం
కవిత్వమంటే కలవడం, కలపడం
ప్రపంచమంతా ఒక కుటుంబమని చెప్పడం
వసుధైక భావనలతో బాధ్యతలను పంచడం
భౌగోళిక హద్దుల మధ్య సయోధ్య చేయడం
కవిత్వమంటే కలవడం, కలపడం
మహా నిశ్శబ్దాన్ని శబ్దంగా పలికించడం
నిద్రపోయే సమాజాన్ని మేలుకొలపడం
అక్షర యజ్ఞాన్ని మహాయజ్ఞంగా మలచడం
