మనసు మాట
మనసు మాట
మల్లెపూవుల పరిమళం
వలపు తలపై దరిచేరింది,
మనసులోని కొంటెకోరిక ప్రణయగీతమే పాడింది,
ప్రశ్నై మిగలని అనురాగం
జీవన తోడైంది,
సిగ్గుమల్లెపూవే
ఊరించే మధువే అయ్యింది,
పరిమళ ప్రేమే
నుదిటిబొట్టుగా మారింది,
మదిలోని మధురభావాలే తాళిబొట్టుగా మారి
జీవితాలు ముడివేసింది.
గుఱ్ఱమల్లె పరుగులు తీసే కోరిక
అలరించే ప్రణయగీతంగా మారింది,
కనుపాపల కోవెలలో నిలిచిన
ఇష్ట సఖుడి మనసుకే
మనసు బందీ అయ్యింది,
ఊహల జాబిలే మదినేలే
కరుణామయి రూపమై కనిపించింది,
పరిమళించు ప్రేమే
తనువు ఆణువణువూ నిండి
నన్నే మరిపించింది.
చిరునవ్వుల ముద్దుమురిపమే కాలాన్ని ఖైదీ చేసింది,
ముడుపుకట్టిన ముద్దుముచ్చట్లే ఆనందసంపదగా దరిచేరింది,
వలపువీణా రాగాలకు
సాకారమైన స్వప్నమే పల్లవయింది,
మల్లెల సోయగపు గడసరితనం
మాటలకే అందని
సంతోషాన్ని చేరువచేసి హృదివేదన తీర్చింది.

