లౌకికత
లౌకికత
బాల పంచపదులు :
మనసులో మర్మంబు నిండియుండ
కనులలో కపటం కలిసియుండ
మాటలో తీయదనం కులుకు చుండ
పూటకో వేషం మార్చి వేయుచుండ
లౌకికత యని యందురు విజయ.
ధరలో బ్రతక నేర్చిన వానిని
పరులకు సాయం చేయని వానిని
విలువ లేవియు తల్చని వానిని
కలిమిని గూర్చి శోచించు వానిని
లౌకికుడని పిల్తురు విజయ.
ఆడంబరముతో మెలిగే వానిని
కూడని పనులను చేసే వానిని
భోగాల వెంట పరిగిడు వానిని
త్యాగమంటే తెలియని వానిని
లౌకికుడని పిల్తురు విజయ.
నాస్తికత్వం నమ్మెడి వారిది
పునర్జన్మ మిధ్యను వారిది
వేదముల నిరసించెడి వారిది
దైవమనే మాట నమ్మని వారిది
లౌకికవాదమనగా విజయ.
పాషండ మతముకు పెద్దలగుచు
శూన్యవాదము కాద్యుల
గుచు
మ్లేచ్ఛ సంస్కృతిని పెంచు కొనుచు
వేద విద్యకు బాహ్యులగుచు
మెల్గెడి వారే లౌకికులు విజయ.
లౌకిక మనగా లోక బంధము
సాకార మగు సామ్యవాదము
మనది, మనమను భావనము
సంఘం కోసం కలిసి యుండటము
మంచిని పెంచుకొనుట విజయ.
లౌకికవాదుల సిద్ధాంతములు
జాతిని నడిపెడి సాధనములు
రాజ్యాల నేలగా కొంతకాలము
శాంతి నిల్పగ జీవన యానము
మంచిని పెంచుకొనుట విజయ.
సిద్ధాంతాలమధ్యలో రాద్ధాంతము
కాలగతిలో మారిపోవు మతము
జనుల హృదిలో నూతనత్వము
లౌకిక మతముకు చెల్లెను కాలము
మంచిని బోధించు మతము విజయ.
వ్యవహారికమగు యర్థముండగ
పలుమార్లు లోకము మార్చుచుండగ
అయోమయముతో జనులుండగ
లౌకికమంటే తెలియలేదుగ
గ్రంథములు చదవాలి విజయ.