కవి
కవి
కవిపరిచయం :
శృంగారనైషధము అను ప్రబంధ కావ్యము శ్రీనాథ మహాకవి రచించెను. ఈ కావ్యమును సంస్కృతమున శ్రీహర్షుడను కవి రచించెను. ఇది అనువాద కావ్యము.నలదమయంతుల ప్రణయకావ్యము. శ్రీనాథ కవి క్రీ. శ. 14 వ శాతాబ్ది చివర నుండి 15 వ శతాబ్ది పూర్వార్ధములో నుండెనని చరిత్రకారుల అభిప్రాయం. ఇతని కవిత్వం ప్రౌఢముగాను, తెలుగు నుడికారములతో మృదుమధురంగా ఉంటుంది.
ఇతడు తన భీమేశ్వరపురాణంలో తన కవిత్వశైలి గురించి ఇట్లు చెప్పుకున్నాడు.
"ప్రౌఢి పరికింప సంస్కృత భాషయండ్రు
పలుకు నుడికారమున నాంధ్రభాషయండ్రు
ఎవ్వరేమన్న నండ్రు, నా కేమి కొఱత?
నా కవిత్వంబు నిజము కర్ణాటభాష."
దీనిని బట్టి ఇతడు సంస్కృతాంధ్ర కన్నడ భాషాకావ్యమర్యాదలననుసరించాడని తెలుస్తోంది.
ఇతర గ్రంథములు :మరుత్తరాట్చరిత్ర, శాలివాహనసప్తశతి, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, పండితారాధ్యచరిత్రము మొదలైనవి.//
కందం
ఆ రాజు విజయలక్ష్మికి
నీరాజన మాచరించు నిర్దగ్ధ దిగం
తారాతి రాజ నగరీ
దారుణ వైశ్వానర ప్రదక్షిణ శిఖలన్.//
ప్రతిపదార్థం :
ఆ రాజు = ఆ నలమహారాజు :
విజయలక్ష్మికిన్ = విజయలక్ష్మికి :
నిర్దగ్ధ = మిక్కిలి కాల్చబడిన వైన :
దిక్ అంత ఆరాతి రాజ నగరీ = దిక్కుల తుదల యందలి శత్రు రాజుల పట్టణముల యొక్క:
దారుణ :భయంకరములైన:
వైశ్వానర ప్రదక్షిణ శిఖలన్ = అగ్నియొక్క ప్రదక్షిణ జ్వాలలచేత :
నీరాజనము ఆచరించున్ = హారతి నిచ్చును.//
తాత్పర్యం :
దిగ్విజయయాత్రయందు ఆ నలమహారాజు శత్రువుల పురములను కాల్పించుచు,తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము అనుక్రమంలో దిగ్విజయయాత్ర చేయగా ఆ మంటలు అతడు విజయలక్ష్మికి ఇచ్చు హారతి వలె నున్నవి. ప్రదక్షిణత మంగళార్థకము.//
