ఏకాంతం
ఏకాంతం
ఏకాంతం ఒక అతిథి !!
మనిషికి ఏకాంతం ఓ స్వాంతన
తనకు తాను కోరుకునే ఒక చింతన
అందరి మధ్యలో మౌనంగా మునిలా
అంతరంగంలో ఆద్యంతం ఋషిలా
ఎవరూ తలుపు తట్టలేదు, ముట్ట లేదు
నాకు నేనుగా మిగిలిన ఏకాంతాన్ని
ఆ ఏకాంతం అనే అతిథి నాతోనే
ఏ సందడి లేని, చడీచప్పుడు లేని క్షణాలు
ఏకాంతంలో హడావుడి మాటలు లేవు
పలుకులు, పరిచయాల సందడి లేదు
ఓ నిశ్శబ్దం మాత్రమే ఆవరించిన శూన్యం
నా ఉఛ్వాస, నిశ్వాసాలతో నా భాషణం
ఏకాంతంమంటే మొదట కాస్త భయం
పగలైతే తోడుగా ఓ వెలుతురి అభయం
రాత్రి అయితే ఇంట్లో చీకటి సమయం
కళ్ళళ్ళో అలవాటులేని కన్నీటి ప్రాయం
మది లోపల దాగిన ప్రశ్నల పరంపర
మంచి చెడుల ఆలోచనలన్నీ చిందరవందర
ఒక్కొక్క ప్రశ్నను మెల్లగా బయటకు వదిలి
నాకు నేనే సమాధానంగా బదులు పలికి
సమాధానాలకంటే ఆలోచనల హడావిడి
మాటల కంటే మనసు నిశ్శబ్దాల సవ్వడి
ఏకాంతం ఎందుకో తెలియని అయోమయం
ఓ మనిషిగా కొంత నప్పని ఏకాంత సమయం
జనంతో కలిస్తే ఏకాంతం కాస్తా బద్దలు
బయటికి వెళుతే నలుగురితో సుద్దులు
కానీ నాలో ఏకాంతం మిగిల్చిన జ్ఞాపకాలు
నన్ను నేను కలుసుకున్న విలువైన క్షణాలు
అపుడే అర్థమైంది ఏకాంతం శత్రువు కాదని
సత్యాన్ని చూపించే నిశ్శబ్ద అతిథి అని
స్వాంతనతో ప్రశాంతతనిచ్చే మిత్రుడని
జీవితంలో ఏకాంతం కూడా అవసరమని!
