అనురాగ తరంగాలు
అనురాగ తరంగాలు
హృదయానికి ఎందుకో ఈ అంతులేని తపన
మనసు మడతల్లో మలిగి పోని నీ స్మృతుల్లో
ఎదమాటునదాగిన ఆశలు ఆవిరై
ఎడారి దారుల ఆవిరైన నీటి చుక్కలతీరుగా
శిశిరపు ఆకుల్లా రాలిన నాపచ్చని కోర్కెలు
గుక్కపట్టి వెక్కి పడ్డా
గునపమేసి గుంట తీసి
గుండె లోతుల్లో దాచేస్తున్నా
చెల్లా చెదురైన మనసు శకలాల్లో సైతం
నిన్ను తడిమి చూసుకుంటున్నా
నా జ్ఞాపకాల దొంతర ల్లో
అప్రయత్నంగానే అయినా
అంతులేని అనురాగం తో
వసంతాల దారుల్లో
వెన్నెల వానల్లో
నక్షత్రాల పూదోట లో
జాబిలి చిరునవ్వుల కిరణాల్లో
పిల్లతెమ్మెర మురిపెంగా
మోసుకొచ్చే పూల సుగంధాల్లో
నువ్వు నేనై నేను నువ్వై
దేహబేధమే తప్ప
ఆత్మల సంగమమై
అలసిపోని అవధిలేని
అనురాగ తరంగాలమై
అనంత అవిభాజ్యాలమై
మాసిపోని మమతలకు
చిరునామాలమైన మనం
కన్నుల బాసలు మనసుబాసలుగా
ఎన్ని మంతనాల మధురస్మృతులకు
వారధులమై మైమరచి
మమేకమయ్యామోకదా
తలంచని కాలపు క్రౌర్యానికి
కాకావికలులమై
కాంచిన కలలన్నితెగిన గాలిపటాలై
కనపడని తీరాలకు నువ్వువెళ్తే
మనం కలిసి నడిచిదాటిన
మైలు రాళ్లను పదిలంగా
మది నేలలో శాశ్వతంగా పాతేసుకున్నా
మరుభూమి గా మారిన నేను
నీజ్ఞాపకాల చెట్టుగా మిగులుతూ

