అమ్మ
అమ్మ
అమ్మ హృదినిండుగా నమృతంపు రసధార
కమ్మగా బిడ్డలకు కలిమినే పంచునట
ప్రేమబంధంబొకటి పృథ్విలో ప్రాణులకు
క్షేమంబు కలిగించి జీవంబు నిల్పునట
ఆ రూపమేసృష్టికాలంబనై నిలుచు
కారుణ్య మూర్తిగా గారాలనే పంచు
జీవనము నిడుచుండి శ్రేయమ్ము కోరుతూ
సేవలను సల్పి తను చివికి పోతుంటుంది
తల్లిగా బాధ్యతలు తలకెత్తి మోస్తుంది
చల్లనౌ దీవెనలు సతము కురిపిస్తుంది
అమ్మ లేకున్నచో నవనిలో వెలుగేది?
అమ్మయే వేలుపులకారాధ్యమౌతుంది.
అమ్మకై విష్ణువే నవనిలో పుట్టాడు
అమ్మ పాలను త్రావి యందలంబెక్కాడు
కరిగిపోతుంటుంది కర్పూరమై తల్లి
పరమాత్మ రూపిణికి భక్తితో వందనం!//
