శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

వీలునామా

వీలునామా

3 mins
399



               వీలునామా

            శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

    

    రాధమ్మ మరణం...ఆ ఊరు వారందరినీ విషాదంలో ముంచేసింది. మృతదేహాన్ని ఆఖరి చూపుకోసం అందరూ కదిలొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి వెళ్తున్నారు. ఆమెను అంతగా అభిమానించేవారు కాబట్టే...ఆ ప్రాంగణం అంతా మౌనంగా రోధిస్తుంది.


    రాధమ్మ గురించి చెప్పాలంటే...ఆ పల్లెటూర్లో అరవై ఏళ్లుగా జీవిస్తుంది. భర్తతో జీవనం పాతికేళ్లు మాత్రమే. ఇరవై సంవవత్సరాలప్పుడు పెళ్ళై...నలభై ఐదేళ్ల వయసులో వైధవ్యం చుట్టుకుంది. భర్త ముకుందం బ్రతికుండగా ఆఊరి వాళ్లకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఆపదలో ఎవరున్నా... ఎవరికి ఏ సహాయం కావాలన్నా... నాయకుడై ముందుండేవాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడి ....కుటుంబంతో పాటూ నలుగురికీ ఏదో విధంగా వెచ్చించడమే...గానీ రూపాయి అయినా వెనకేసుకునేవాడు కాదు. ఆఊరి ప్రెసిడెంటుగా పోటీచేయమని ఊరివారంతా అడిగినా...అధికారం కాదు...సహకారం ముఖ్యమని సున్నితంగా చెప్పి తప్పించుకున్నాడు

    

   అతని భార్యగా రాధమ్మ కూడా ఏనాడూ అడ్డుచెప్పలేదు. భర్తకు అనుగుణంగా ఊరివారికి తన సహకారం కూడా ఉండటంతో...రాధమ్మని కూడా దేవతలా కొలిచేవారు. అలాంటి మంచివాళ్లకు కష్టం వచ్చిపడింది. అందరి హృదయాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకుని... గుండెపోటుతో ఈలోకం విడిచి వెళ్ళిపోయాడు రాధమ్మ భర్త.


   వైధవ్యం వచ్చినా...కృంగిపోలేదు రాధమ్మ. తన కొడుకులు ముగ్గురూ...అప్పటికే యుక్తవయసుకు రావడంతో... వారి శ్రద్ధను బట్టి చదువులయ్యి ఏదో సంపాదనలో పడ్డారనిపించాకా ...ఒకరి తర్వాత ఒకరికి ఊరి వాళ్ళ అండదండలతో...ముగ్గురు కొడులకూ పెళ్లిళ్లు చేసి...ఎవరి జీవితాలు వాళ్ళను చూసుకోమంది. పిల్లలు ఉద్యోగరీత్యా వారి కుటుంబాలతో...వేరే ఊర్లలో ఉంటున్నా...పండగలకూ పబ్బాలకూ కొడుకులు, కోడళ్లు, మనుమలు వచ్చి సందడి చేసెళ్లిపోయేవారు . తాను మాత్రం ఆ ఊరులోనే ఉండిపోయింది.  కష్టం అంటే...కొడుకుల దగ్గరకెళ్లి చూసి వచ్చేయడం తప్పించి...ఎప్పుడూ ఎవరిదగ్గరా ఉండిపోవాలనుకోలేదు. ఉన్న ఊరులోనే వ్యవసాయం చూసుకుంటూ...ఊరివారి బాగోగులను పట్టించుకుంటూ నలుగురిలోనూ మంచిగానే కన్ను మూయాలని రాధమ్మ ఉద్దేశ్యం.

    

   కొడుకులు ముగ్గురూ తన కడుపునే పుట్టినా...వారి స్థితిగతుల్లో ఎంతో వ్యత్యాసముంది. పెద్దవాడు కోటీశ్వరుడైనా...రెండో వాడు మధ్యతరగతి వాడు గానూ...మూడో వాడు చిన్న ఉద్యోగంతోనూ వారివారి పిల్లలతో పట్టణాల్లో నెట్టుకొస్తున్నారు..! తల్లి కదా...అందరూ బాగుండాలని ఆశించే హృదయం కాబట్టే...పిల్లల కుటుంబ పరిస్థితుల్ని గమనిస్తూనే ఉండేది. 


   వృద్దాప్యం వచ్చాకా...తనలాగే భర్తను కోల్పోయిన బంధువులావిడను దగ్గర పెట్టుకుని...రోజులు వెళ్లదీసేది. 

   

   "ఈ ఎనిమిది పదుల వయసులో...అదీ ఏకాదశి రోజున నిద్దట్లోనే ప్రాణం వదిలేయడం ...ఆమహాతల్లి చేసుకున్న పుణ్యం వల్లే " అనుకుంటున్నారంతా.


   తల్లి మరణంతో...కొడుకులు ముగ్గురూ కుటుంబాలతో వచ్చారు. తల్లి సడన్ గా పోవడంతో...దగ్గర లేకపోయినందుకు బాధ పడ్డా...ఏ జబ్బూ లేకుండా సుఖంగా ప్రాణం పోయినందుకు అదే చాలనుకున్నారు.


   తల్లి దహన సంస్కారాలు, పదకొండవ రోజు కారక్రమాలు అన్నీ సజావుగా సాగిపోయాయి....!


         ***         ***         ***


   రాధమ్మ కొడుకులు ముగ్గురూ కలిసి...ఉమ్మడి ఆస్తిని పంచుకోవాలనే పనిపెట్టుకున్నారు....ఇక ఆ ఊరితో రాకపోకలు ఉండవని... సంబంధం తెంపేసుకోవాలన్నట్టు. 


   తల్లి బీరువాను తెరిచి చూసారు...వారికి ముట్టాల్సిన ఆస్తి తాలూకా కాగితాలు ఏమైనా కనిపిస్తాయని. వారు ఆశించినట్టుగానే... భద్రంగా దాచుంచిన వీలునామా కాగితాలు, బంగారు వస్తువులు, కొంత డబ్బు, వాటితో పాటూ ఒక ఉత్తరం.


    తనకే రాసుండటంతో...మొదటిగా ఆ ఉత్తరం తీసి చదువుతున్నాడు పెద్దకొడుకు రాఘవ.


   ప్రియమైన రాఘవకు,


   మీ అమ్మ దీవించి రాయునది..నువ్వు బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగంతో ఎంతో సంపాదించావు. నీ భార్య తాలూకూ ఆస్తి కూడా నీకు బాగా కలిసొచ్చింది. నీకూ ఒక్కడే కొడుకు. ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ హాయిగా ఆనందంగా వున్నారు. చాలా సంతోషం. నేను ఆస్తిలో నీకేమి ఇవ్వలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నీకూ ఈ ఆస్తిలో అధికారం వున్నా...నీ సహకారం ఎవరికీ వుండదని గ్రహించాను. అవునురా... ఇంటికి పెద్దవాడవై కూడా ఎప్పుడైనా బాధ్యతగా తొడబుట్టిన తమ్ముళ్ల కష్ట సుఖాల్ని పట్టించుకున్నావా...? 


   ఒకడు ...ఉండటానికి చిన్న సొంత గూడున్నా...చాలీ చాలని జీతంతో గడుపుతున్నాడు. ఇంకోడు అద్దె ఇళ్లల్లో గడుపుతూ భార్య అనారోగ్యానికి డబ్బు పెట్టుబడి పెట్టలేక ...అప్పుల పాలవుతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా నువ్వెప్పుడూ రూపాయి కూడా వాళ్లకు ఏ విధంగానూ సహాయం చేయలేదన్న విషయం నన్నెంతో బాధ పెట్టింది. పైగా వాళ్ళిద్దరికీ పెళ్లీడు కొస్తున్న ఆడపిల్లలు కూడా వున్నారు. వారి పెళ్లిళ్లప్పుడైనా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా నువ్వు దయతలచవని అర్థమయ్యింది. ఈరోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి చేయడం ఎంత గగనమో నాకు తెలుసు కాబట్టే... చిన్నోళ్ళిద్దరూ ఆవిషయంలో డబ్బు కోసం తడుముకోకూడదనే...బాగా ఆలోచించి...ఈ నిర్ణయానికి వచ్చాను. 


   మనకున్న పదెకరాల పొలం తమ్ముళ్ళిద్దరికీ రాసేసాను.

కనీసం ఇల్లు కూడా లేకుండా అద్దె ఇళ్లల్లో బతుకుతున్న చిన్నోడి పేరున ఈ ఇల్లు రాసాను. నా బంగారమంతా పెళ్లి కావాల్సిన నా మనవరాళ్లిద్దరికీ పంచండి. నేను దాచి ఉంచిన డబ్బుతో నాదహన సంస్కారాలకు ఉపయోగించండి. లేదంటే...ఈ ఖర్చులో కూడా తమ్ముళ్లను వాటాలు అడుగుతావేమోనని జాగ్రత్త చేసాను. ఇలా చేసానని... నామీద నీకు కోపం రావచ్చు. కానీ నీమీద నాకెలాంటి కోపం అసూయ లేవు. తల్లిని కదా...అందరి స్థితిగతులు బావుండాలని ఆశ పడ్డం నాది అత్యాశే అయినా... నేను చేసింది తప్పు కాదనిపించింది. ఇంటికి పెద్దవాడివై ఆస్తిని పంచాల్సిన అధికారం కాదు...నీవంతు సహకారం ఉండాలని మీనాన్న నాపేరు మీద రాసిన ఆస్తిని ముందుగా ....ఇలా వీలునామా రాసి పెట్టినందుకు అమ్మను తిట్టుకోకు. రక్త బంధాల్ని దూరం చేసుకోకుండా.... మీ అన్నదమ్ములు ముగ్గురూ బాగున్నప్పుడే కదా...పై లోకానికెళ్ళినా నాఆత్మ శాంతిస్తుంది. 


                      ఇట్లు

                     అమ్మ.


   తల్లి ఉత్తరం చదివాక...భార్య ఏమంటుందో అనే భయం  మనసులో చిన్న అలజడి సృష్టించింది రాఘవకు. అది తన తల్లి తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పుపట్టలేకపోయాడు. 

పూల దండతో కనిపిస్తున్న తల్లి దండ్రుల ఫోటో వైపు చెమర్చిన కళ్ళతో చూసాడు. మీ కడుపున పుట్టినా ఊరివాళ్లకెందరికో సహాయం చేసిన మీలాంటి ఉత్తమ గుణం నాకెందుకబ్బలేదో అనుకున్నాడు. 


  ఈ విషయంతో తమ్ముళ్ళిద్దరికీ ...సహకారం జరిగినా.... భార్య మాత్రం తమకేమీ ఇవ్వనందుకు చచ్చిపోయిన తన అత్తగారిని సాధిస్తూనే ఉంటుందన్న నిజం రాఘవకు తెలుస్తూనే ఉంది...!!*


    


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational