విద్య
విద్య


విద్య కానిది విద్యగా చెలామణీ అయిపోతున్న ఈ రోజుల్లో, అందరూ ఆగి విద్య నిర్వచనము, స్వరూప స్వభావాలు, ప్రభావంలపై దృష్టి పెట్టి తీరాలి.
ఉద్యోగం కోసం చదువు అనే దృష్టి, భ్రమ, భ్రాంతి పోవాలి. చదువులో మానసిక వికాసం, జ్ఞాన సముపార్జన భాగాలు అని విద్యారంగంలోని అందరూ మర్చిపోయి తల్లిదండ్రుల కోరికననుసరించి ఉద్యోగం తెచ్చే సర్టిఫికెట్ సముపార్జనయే విద్యాభ్యాసం అని తేలడం దురదృష్టకరం. దౌర్భాగ్య స్థితి.
గుంపు స్వభావం పక్కన పెట్టి నిజమైన విద్యావేత్తలు కరికులం నిర్ణయించి తీరాలి. ఈ విద్యాభ్యాసం వల్ల ఉద్యోగం కాని, జీవనోపాధి కాని దొరకడం క్లిష్టం అని అందరికీ అస్తమానూ తెలియజేయాలి. లేకపోతే చదువులో సాహిత్యానికి, లలిత కళలకు, తత్త్వానికి, ఆధ్యాత్మికత కు చోటు పోతుంది. విద్య సమగ్రము.
చదువు ఒక్క జీవనోపాధి దాయకం మాత్రమే కాదు. నిజానికి ఇప్పటి చదువులు జీవనోపాధిని కల్పించలేక పోతున్నాయి. ఇది చాలా పెద్ద సమస్య. ఆషామాషీగా తేలదు. అంతటి ప్రతిభావ్యుత్పన్నతలు కలవారు ఉన్నారా? ఉంటే వారిని మాట్లాడనిస్తారా? విద్యారంగ ప్రక్షాళనలో భాగస్వాములను కానిస్తారా? అలా జరగక పోతే, అంతవరకూ మానవ హృదయం, మేధ నుంచి జనించిన అపార, అద్భుత జ్ఞాన, కళా, నైపుణ్యాలు వృథాగా పుస్తకాలలో మాత్రమే ఉండి పోతాయి.
విద్య అవిద్య అయిన ఈ వేళ మంచి పరిశీలన చేసి తగిన ఆలోచనా సరళి, వ్యాస రచనము, చక్కని చర్చలు చెయ్యడం మాత్రమే విద్య భవిష్యత్తు, ఆరోగ్యం పై మనలను ఆశావహులను చేస్తాయి.