Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


3  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


త్యాగ(త్రి)మూర్తులు

త్యాగ(త్రి)మూర్తులు

4 mins 52 4 mins 52

            త్యాగ(త్రి)మూర్తులు

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

            


  జూన్ రెండవ తేదీ...!

  తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం...

  టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఎంతో ఆతృతగా వింటున్న మణెమ్మ అతని నోటి వెంట త్యాగం అనే మాట విని...ఆమె నవనాడులూ దహించుకుపోయాయి. ఒక ఉదుటున లేచెళ్లి టీవీని కట్టేసి కూర్చుంది. 


   తెలంగానా కోసం ఉద్దెమం జేపెట్టడం తనకెరుకే. ఆ ఉద్దెమం కోసం ప్రజలెంత ఘోష పడిన్రో. ఎంత మంది జనం సావుకి తెగించిన్రో..? ఎన్ని దినాలు కండ్లుల్ల పానాలు వెట్టుకొని యెదురు జూసిన్రో...? చివరాకరికి తెలంగానా వొచ్చింది. ఊర్లల్ల బోనాలెత్తిండ్రు...యేటలు ఏసిన్రు..పండ్గలు జేశిండ్రు. తనకు ఎట్లాంటి సంతోషం లేదు. రేపటి దినం మీద ఆశ లేదు. ఈ ఏకాకి జీవితంలో అనుక్షణం గతమొక భయంకరంగా అగుపిస్తూనే ఉంది.


   యానాడో తాను కాపురానికి వొచ్చిన కొత్తలో డెబ్బైఏండ్ల క్రిందట జరిగిన అప్పటి తెలంగానా సాయుధ పోరాటంలో నిజామోళ్ల కాలంలో తన మామ పోలీసోళ్ల కాల్పుల్లో సచ్చిపోయిండని అత్తమ్మ జెప్తే తెల్సింది. యాభై ఏండ్ల కిందప్పుడు మళ్లీ తెలంగానా పెజా ఉద్దెమం ఊపందుకుంది. మామలాగే పెనిమిటి కూడా పోరాటం అంటూ కానరాకుండా పోయిండ్రు. అసలుంటిరో పోయిండ్రో తెలీని అయోమయంలో తాను పున్నిస్త్రీయో... విధవరాలో అర్థంకాని పరిస్థితి. 

    

   యాదగిరి తనకు ఒక్కగానొక్క కొడుకు. ఊర్ల ఉన్న అరెకరం చెరక(ముక్క), రెండు గదుల ఇల్లు మిగిలాయి. పొలాన్ని తమ్ముడు నరసింహాకి సాగుచేసుకోడానికి కౌలుకిచ్చి, ముందు గదిని కిరానా దుక్నంకి అద్దెకిచ్చి...కొడుకుతో పక్కనే ఉన్న చిన్న పట్నానికి చేరింది. కొడుకునైనా మంచిగా సదువు సదివించి...సర్కారీ కొలువులో జేర్పించి..లగ్గం జేశి మనుమల్ని ఎత్తుకోవాలని ఎన్నో కలలుగంటూ గడిపింది.నాలుగిళ్ళలో వంటమనిషిగా జేరి ...పొదుపుగా కొడుకుతో నెట్టుకొస్తుంది.


   తన కలల్నఆశల్నీ కూల్చేస్తూ...యాదగిరి పధైదవ తరగతి సదువుతుండగా విప్లవ భావాలంటూ... ఉద్దెమాలంటూ ఎక్కడెక్కడికో వెళ్లడం మొదలు వెట్టిండు. సర్కారీ వాళ్ళమీద పగబూనినట్టు తిరుగుతుండంట. కొడుకు ప్రవర్తన మణెమ్మలో గుబులుపుట్టింది. నెత్తీ నోరూ బాదుకుంటూ కొడుక్కి బుద్దులు చెప్పింది. "వద్దురా బిడ్డా...మన ఇంట ఈ ఇప్లవం బాట పోయినోళ్ళకి అచ్చిరాలేదు. నామాటినుకో... మంచిగ సదువుకొని సర్కారీ కొలువుల జేరు కొడ్కా"... అంటూ గడ్డం పట్టుకుని బతిమాలింది. కొడుక్కి ఎప్పుడు యే ఆపద వస్తుందోనని బోనం ఎత్తుకుని పండగ జేయిస్తానని...యేటేసి నైవేద్యం పెట్టుకుంటానని తనకు తెలిసిన అన్ని దేవుళ్ళకీ మొక్కేసుకుంది.


    కొడుకు యాదగిరి పేరు సర్కారోళ్లకి జేరిపోయిందని జెప్పిన తమ్ముడు నర్సింహ మాటలకు గజగజా వణికిపోయింది. మనసంతా అల్లకల్లోలమైపోయింది.

    

   తన కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఉద్దెమం కోసం పానాలు పణంగా పెట్టి పోరాడిండ్రు. ఈ గెడ్డ కోసమే పాకులాడిండ్రు. తెలంగానా వస్తే అందరం సుఖపడతాం..మన కష్టాలు గట్టెక్కుతాయి...మనకి నీళ్లు అస్తయి...కొలువులొస్తయి అంటూ కళ్ళనిండ ఆశల్తో ఉరికిండ్రు. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి పోయిండ్రు. మామ, పెనిమిటి పోయిన దారిలోనే కొడుకు కూడా పోయిండు.మనసు ఏనాడో సచ్చిపోయింది. పానం ఉంది గనకనే కొడుకు తిరిగొస్తాడని నీరింకిపోయిన కళ్ళతో యెదురుజూస్తుంది.


   మణెమ్మ ఎప్పటిలాగే పనులు ముగించుకుని ఇంటికొచ్చి నడుం వాల్చింది. చిన్న కునుకు పడుతుండగా దబదబా తలుపులు బాదుతుంటే తుళ్ళిపడి లేచింది. తలుపు తీసిన వెంటనే లోనికొచ్చి తలుపు మూసేస్తున్న ఆ వ్యక్తిని చూసి ఒక్క క్షణం భయపడినా..."అమ్మా" అని పిలిచిన ఆపిలుపు విని మణెమ్మ ముఖం బంతిపూవులా విప్పారింది. 

    

  " యాడికి వొయినవ్ రా కొడ్కా ఇన్ని దినాలు.? మీయమ్మ సచ్చిందనుకున్నావా...? వద్దునాయనా మనకీ ఇప్లవాలూ, ఈ తెలంగానాలూ అని మొత్తుకుంటనే వున్నా ఇన్నావు కావు. నాయనా నీ కాల్మొక్త ...నన్ను వదిలి పోకురా. నేను బతకలేను. మీ అయ్యలేకున్నా నీమీద పేనాలు ఒగ్గెట్టి బతుకుతున్నాను." అయ్యా...బాబూ అంటూ కొడుకుని హత్తుకుపోయింది. చింపిరి జుట్టు, పెరిగిన గెడ్డం, గుంటలు పడిన కళ్ళు, ఎండుకుపోయిన పొట్టని తడిమి తడిమి చూసి భోరున ఏడ్చేసింది. మరెక్కడున్నాయో ఆకన్నీళ్ళు ఎండిపోయిన కళ్లనుంచి ఊరిపోతున్నాయి. 


   తల్లిని ఏడవనిచ్చి ...అప్పుడు నోరిప్పాడు యాదగిరి! 

   "ఊకొవే... యాడికి వోలేదు. నక్స్లైట్లలో జేరిన మాట నిజమే. కానీ ఆ జంగిల్ల ఉంటే పనికాదని వచ్చిన. సర్కారోళ్ళు పనిపట్టాలంటే ఈడనే ఉంట. తెలంగానా ఉద్దెమంలో నేను కూడా పోతా. నా తాతా, అయ్యా దీనికోసమే కదమ్మా పోరాడిండ్రు. నేనే కాదు నాతో సదువుకున్న నా సోపతులు(స్నేహితులు) కూడా నాతో వున్నారు. ఈసారి ఉద్దెమం మంచి జోరుగా ఉంది.తెలంగానా ఖాయంగా వస్తదంటున్నరు. తెలంగానా వస్తే మనమందరం ఖుషీగా ఉంటమే అమ్మ" అంటూ చెప్తున్న కొడుకుని అలా చూస్తూ ఉండిపోయింది మణెమ్మ. 


   యాదగిరి తాననుకున్నట్లుగానే ఉద్యమకారుల్లో చేరిపోయాడు. పోనీలే...కొడుకు కళ్లెదుటే ఉంటాడని ఊరుకుంది.


   ఇది జరిగిన వారం రోజులకి....

   తెలంగాణా ఉద్యమం మంచి ఊపుమీదుంది. ఎప్పట్లాగే వంట చేస్తూనే...ఇంట్లో టీవీలో వస్తున్న వార్తలపై ఒక చెవి వేసి వింటుంది. బ్రేకింగ్ న్యూస్ అని రావడంతో...సౌండ్ పెద్దదయ్యింది. చేతిలోని పనిని వదిలేసి ముందు గదిలోకి తొంగిచూసింది. ఉద్యమంలో పోరాడుతున్న వారిమీద జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వారిని ఒక్కొక్కరిగా చూపిస్తున్నారు. దడదడలాడుతున్న గుండెను చేతితో నొక్కుకుంటుండగా కొడుకు ఫోటో కనిపించేసరికి... కుప్పకూలిపోయింది. అనుకున్నదంతా అయ్యింది. మూడు తరాలుగా కుటుంబమంతా నాశనమైపోయింది. దేవుడా ఏందిది...? నేను మట్టుకు ఎందుకు బతకాలంట...? కొడుకు మరణంతో మణెమ్మలో తీరని ఆవేదన నిండుకుంది.


   అనుకున్న తెలంగాణా రానేవచ్చింది. కాల్పుల్లో చనిపోయిన వారందరి జ్ఞాపకార్థంగా స్థూపాకారాలు , గౌరవ వందనాలు, వారి స్ఫూర్తిదాయకమైన సేవలు, నిరంతరాయంగా సాగిన వాళ్ళ త్యాగాల గురించి టీవీలో ఎవరెవరో పొగుడుతూ... ఏవేవో వాగ్దానాలు చేస్తున్నారు. అదంతా చూసిన మణెమ్మలో చిన్న చిగురాశ తొంగిచూసింది. 

   

  " పోయినోళ్లు పోయిండ్రు. సర్కారు నాకేమైనా సాయం జేస్తదేమో...? ఊరికి పోయి దుక్నం నడుపుకుంటూ బతుకు ఎళ్లదీస్తను " అంటూ ఆలోచనలో పడింది.


   ప్రభుత్వం వచ్చి రెండేండ్లు దాటిపోతుంది!  

   మణెమ్మలో ఓవిధమైన నిరాశ చోటుచేసుకుంది. తనలో తానే ఇలా రోధించుకుంటుంది...

   

  " సర్కారు షురూ(మొదలు) అయ్యి ఈ బోనాలకి రెండేండ్లు గావస్తుంది. వాల్లు నుంచి ఎలాటి సాయం అచ్చేట్టు లేదు. పత్రికోల్లు, టీవీవోల్లు అస్తూ పోతున్నరు. మూడు తరాల మీవాల్ల గురించి చెప్పుండ్రి అని అడ్గతనే వున్నరు. ఏం ఫాయిదా (ఉపయోగం) లేదు. 

   

   ఎప్పటిలాగానే టీవీలో వార్తలు చూస్తూ కూర్చుంది మణెమ్మ. తాతతో పాటూ దండి సత్యాగ్రహంలో పాల్గొన్న మహాత్మాగాంధీ మనుమడు గుజరాత్ లోని ఓ ఆశ్రమంలో అనాధగా మృతిచెందాడన్న వార్త చెవిలో పడేసరికి మనసంతా వికలమైపోయిందామెకు. చిన్నప్పటినుంచీ తాను సదువుకోకపోయినా ఆళ్ళూ ఈళ్ళూ మాటలు, మెట్టినింట్లో సుద్దులు వింటూ పెరిగింది. ఏదో ఆలోచన మొదలయ్యింది మణెమ్మలో. దేశానికి సొతంత్రం తెచ్చినాయన మనుమడే అనాథలా శవమైతే....మాలాంటోళ్ళ గతేంది..? రాజకీయనాయకుల బేకార్ (ఉపయోగం లేని) మాటలు నమ్మబుద్ది కాలేదు. ఏదో నిర్ణయానికి వచ్చినట్లు కదిలింది మణెమ్మ. ఊళ్ళో ఉన్న అరెకరం పొలం తమ్ముడుకి చెప్పి అమ్మించింది. "ఏం తిని బతుకుతావే అక్కా" అని అడిగిన నరసింహం మాటల్ని పక్కకు పెట్టింది. వచ్చిన డబ్బుతో దుక్నంలోకి కావాల్సిన సరంజామా సద్దుకుంది. వెనుకనున్న గదిని శుభ్రం చేసుకుంది.మిగిలిన పైసల్ని బాంకులో జమ చేసుకుంది. దానిమీద వచ్చిన మిత్తి (వడ్డీ) తో తెలంగానా పోరాటంలో తన కొడుకులాగే పోయిన వారి బిడ్డల్ని నలుగుర్ని సదివించాలని అనుకుంది. మణెమ్మ తీసుకున్న ఆనిర్ణయానికి ఊరంతా సలాము చేసింది.


    దుక్నం మీద వచ్చే ఆదాయం తన తిండికి చాలు. తన తదనంతరం మిగిలిందేదో తమ్ముడి బిడ్డలకే రాసేసింది. మూడు తరాల మామ, మొగుడు, కొడుకుల ఫోటోలు    దుక్నం గోడకి తగిలించింది. "మీరంతా ఈ గెడ్డ కోసం పేనాలే ధార పోసిండ్రు. మీలాగ నేను పేనం ఇవ్వలేకపోయిన. నలుగురు బిడ్డల్ని సదివించి వాల్లు బాగుపడి ఈ దేశానికి సేవ జేస్తుంటే వాళ్ళల్లో మిమ్మల్ని జూస్కుంటా అని దండం పెట్టింది.* 


   (తెలంగాణా ఉద్యమపోరాటంలో అశువులు బారిన     వారందరికీ...వారి కుటుంబాలకు నా జోహార్లు...!) Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Inspirational