STORYMIRROR

Tvs Ramakrishna Acharyulu

Drama

4  

Tvs Ramakrishna Acharyulu

Drama

టెరిఫిక్

టెరిఫిక్

2 mins
414

మామూలుగా 8గంటలకు డ్యూటీకి వచ్చేసాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనకారావు.సూర్యుడు కూడా రెండు గంటలు ముందే డ్యూటీ ఎక్కేసాడు.ఇంకా ట్రాఫిక్ రద్దీ మొదలవ్వలేదు.ఇంకో పావుగంట తర్వాత ఊపిరి సలపని రద్దీ. ప్రతీవాడికీ తొందరే. ఒక కంట ట్రాఫిక్ ని నియంత్రించాలి.మరోపక్క పై అధికారులు ఎవరైనా దారిలో వెళ్తుంటే సెల్యూట్ చెయ్యాలి.ఇలా ఆలోచిస్తూ కనకారావు తన డ్యూటీ మొదలు పెట్టాడు.

ఇంటిదగ్గర బయలుదేరేప్పుడు భార్య హితబోధలు గుర్తొచ్చాయి.

"డిపార్ట్ మెంట్ లో ఉంటూ కూడా రూపాయి పై సంపాదన తెలియదు. ఎలాగండీ మిగతావాళ్ళని చూసైనా నేర్చుకోరు.మడికట్టుకు కూర్చుంటే మనం ఏమీ కూడబెట్టలేం.ఆలోచించండి".

"మనం ఎవరిదగ్గర డబ్బులు వసూలు చేస్తాం చెప్పు.పేదవాడో మధ్యతరగతి వాడిదగ్గరో.డబ్బున్నవాడి దర్పం ముందు మన అధికారాలు చెల్లవు.ఏదో ఉద్యోగం ధర్మమా అనినాలుగువేళ్ళూ నోట్లోకి పోతున్నాయి. ఇంకెందుకే మనకి "సర్ది చెప్పి వచ్చేసాడు.

నెమ్మదిగా ట్రాఫిక్ పుంజుకుంది. సూర్యుడు కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడు.తన తోటి ఉద్యోగస్తుల గురించి ఆలోచిస్తూ డ్యూటీ చేస్తున్నాడు.ఎంతెంత సంపాదిస్తున్నారు!అంత అవసరమా!

అనుకుంటూ ఉండగానే స్టాప్ సిగ్నల్ ఇచ్చినా ఒక కుర్రాడు ముందుకి వచ్చేసాడు. గబగబా వెళ్ళి వాడిని పక్కకి లాగి వాహనం తాళాలు తీసేసుకున్నాడు. వాడు బ్రతిమాలుతున్నాడు.

"ఒక్కనిముషం ఆగు"అని గదమాయించి ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో ఏంటిచెప్పు అన్నాడు.

సర్ ఈ యభైతీసుకుని వదిలేయండి సర్.మళ్ళీ ఎప్పుడూ ఈ తప్పు చేయను సర్ అన్నాడు ఆ కుర్రాడు.

నాకు ఒద్దు.కేసు రాస్తాను 100ఫైన్ కట్టు.అన్నాడు కనకారావు.

నాదగ్గర లేవు సర్.ఈ యాభయ్యే ఉన్నాయ్ సర్.ఇవి తీసుకోండిసర్ ప్లీజ్. అన్నాడు.

చదువుకుంటున్నవాడిలా ఉన్నావు.లంచం తీసుకోమంటున్నావు సిగ్గులేదూ.కనీసం మీరైనా మారండయ్యా!లంచాలు లేని సమాజాన్ని మీ యువతే తేగలరు.ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు.రూల్స్ పాటించు.తప్పు చేస్తే ఫైన్ కట్టి రశీదు తీసుకో.ఈ ఒక్కసారికీ వదిలేస్తున్నాను వెళ్ళు అని పంపించేసాడు.ఆ పక్కనే జీప్ లో ఎప్పుడు వచ్చాడో సి.ఐ.అతని దగ్గరకి వచ్చాడు.సర్ మిమ్మల్ని చూడలేదు సర్ అంటూ సెల్యూట్ చేసాడు.

ఫరవాలేదయ్యా!సల్యూట్ చేయించుకునే అంత ఉత్తముడివి నువ్వు.మన డిపార్ట్ మెంట్లో అందరూ నీలా ఉంటే దేశం మొత్తం మనకి సెల్యూట్ చేస్తుంది అని అభినందించి వెళ్ళి పోయాడు సి.ఐ.

ఎన్ని లక్షలు సంపాదిస్తే ఈ తృప్తి లభిస్తుంది. ఎండ చుర్రుమంటున్నా కనకారావు కి వెన్నట్లో ఉన్నట్టు ఉంది.పరిస్థితి అర్ధం చేసుకున్న సూర్యారావు(సూర్యుడు)కాసేపు మబ్బుచాటుకి వెళ్ళాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama