ఋణానుబంధం
ఋణానుబంధం


గత కొద్ది రోజులుగా సత్యమూర్తి నిర్లిప్తంగా వుంటున్నాడు. ఎవరితో చెప్పుకోవాలి తన బాధ. ఆర్చేవాళ్ళా తీర్చేవాళ్ళా? భార్యతో చెప్తే బెంబేలు పడుతుంది. కూతురు ఎక్కడో దూరాభారంలో వుంది. దాని పరిస్థితీ అంతంత మాత్రమే.వయసు మళ్ళింది.డాక్టర్ హార్ట్ ప్రాబ్లెమ్ అన్నాడు. త్వరగా ఆపరేషన్ చేయించు కోవాలన్నాడు. 2లక్షలు కావాలట.ఏంచేయాలి అనుకుంటూ ఇంటికిచేరాడు. భార్య ఎదురొచ్చి మంచినీళ్ళు అందిస్తూ "ఏమన్నాడండి డాక్టరు ?"అని అడిగింది."ఏమీలేదే! కాస్తంత వాకింగ్ చేస్తే చాలన్నాడు.అయినా నీపిచ్చిగానీ నా దగ్గరకి రావడానికి యముడికి కూడా భయమేనే! "అన్నాడు. "మీరు ఎప్పడు సరిగా మాట్లాడారు కనక సరేలెండిఏమీలేదుకదా"అంటూఓనిట్టూర్పుతీసి లోపలికి వెళ్ళిందికామేశ్వరి. కళ్ళుమూసుకుని "హేభగవాన్ ఈబాధ ఎవరికీ రాకూడదు ".అనుకున్నాడు.
ఇంతలో ఎవరో గుమ్మం దగ్గర పిలుస్తున్నఅలికిడికి లేచి వెళ్ళి తలుపు తీసాడు.ఎదురుగా ఓ30ఏళ్ళ కుర్రాడు."నమస్తే మాస్టారు,గుర్తు పట్టారా? నేను వివేక్ ని "అంటూ పరిచయం చేసుకున్నాడు. "ఓ నువ్వా చాలా మారిపోయవు. "అంటూ అతని క్షేమ సమాచారాలు అడిగాడు."అదే మాస్టారు ఇందాకా హాస్పిటల్ లో మిమ్మల్ని చూసాను. ఔనాకాదా అని అనుకున్నాను.మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాను.మీరు సాయంత్రం ఒక్కసారి మళ్ళీ హాస్పిటల్ కి వస్తే అన్నీ మాట్లాడుదాం. మేడంని కూడా తీసుకురండి.నాకు కొంచెం అర్జంట్ పనివుంది "అంటూ సమాధానంకోసం చూడకుండా వెళ్ళిపోయాడు.
సాయంత్రం 5గంటలకి హాస్పటల్లో వివేక్ ఎదురొచ్చి ఒకరూమ్ లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ సుమారు 20మంది యువకులు ఉన్నారు."నమస్తే మాస్టారు "అంటూ నమస్కరించారు. వివేక్"మాస్టారు మీరు చెప్పిన చదువు మీరు నేర్పిన సంస్కారం మమ్మల్ని ఇంతవాళ్ళని చేసింది.ఎన్నోసార్లు మీగురించి అనుకున్నాము.మాలో డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్ కూడా మా ఫ్రెండ్. మీకు వైద్యం చేసే భాద్యత మాది. కొడుకులు లేని మీరు మమ్మల్ని కొడుకుల్లా పెంచారు.ఇంక మీరు నిశ్చింతగా వుండండి. ఫ్రెండ్స్ ఏమంటారు? "అంటూవుంటే మిగిలినవాళ్ళుకరతాళధ్వనుల తో తమ సమ్మతి తెలిపారు.
రుణానుబంధం అంటే ఇదేనేమో చెమ్మగిల్లిన ఆదంపతులకళ్ళు వినూత్న అనుభూతికి సాక్ష్యాలుగా మిగిలాయి.