Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Varun Ravalakollu

Thriller

4.7  

Varun Ravalakollu

Thriller

తోడేలు

తోడేలు

7 mins
756


ఒక పెద్ద అరణ్యం చివరి భాగంలో రోడ్డు మీద వెళుతున్న ఆల్టో కార్, టైర్ స్లిప్ అయ్యి పక్కనే ఉన్న చెట్టుకి గుద్దుకుంటుంది. ఆ శబ్ధం అడవిలో అలజడి రేపుతుంది. ఆకలితో సతమతమవుతూ నిద్ర పట్టీ పట్టక సగం మైకంలో ఉన్న తోడేలు ఒకటి హడావిడిగా లేచి నిలబడుతుంది. భూమికి నాలుగు అడుగుల ఎత్తు, నిగనిగలాడే నల్లటి నేరుడు రంగులో ఉన్న చర్మం, మిర మిర మెరిసే ఎర్రటి కళ్ళు, చీకటిలో ధగధగలాడే కోరలతో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే ఆకారం. చుట్టూ ఉన్న అలజడిని గమనించి బెదిరి పరిగెడుతున్న మిగతా జంతువుల్ని చూసి, వాటి వెనక పరిగెడుతుంది. చాలా దూరం పరిగెత్తిన తర్వాత వాటిలో ఒంటరిగా విడిపోయిన ఒక కుందేలుని చూసి వెంబడిస్తూ పరిగెడుతుండగా ఆ కుందేలు పొదల్లో దూరి మాయమవుతుంది.

కోపం, కసితో రగులుతున్న తోడేలు కళ్ళు మరింత ఎర్రపడతాయి. చిమ్మ చీకట్లు చంద్రున్ని ముసిరిన రోజు కావటం వల్ల తోడేలు యొక్క ఎర్రటి కళ్ళు ఇంకా పెద్దగా అయ్యి కుందేలు కోసం వెతకసాగాయి. దాగి ఉన్న కుందేలుని తన కాలితో నొక్కిపట్టి లాగి గంభీరంగా అరిచి ఇంక ఆగలేక కుందేటిని తినే సమయానికి.. మళ్ళీ మరో శబ్ధం. దాని వైపు చూసేసరికి కుందేలు ఆ పట్టు వదిలించుకుని పారిపోతుంది. కానీ ఈసారి తోడేలు బాధ పడలేదు, కోప్పడలేదు, కసిగా అరవనూ లేదు. దాని చూపు దూరంగా కదులుతున్న వేరే జంతువు మీద పడింది. దూరంగా వెలుగు, వెలుతురులో చిన్న పాప. మెల్లిగా కాంతివైపుకి నడుస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి కాంతి ఆగిపోతుంది, కాని తోడేలు ఆలోచనలు ఆగిపోలేదు. దగ్గరికి వెళ్లి పొద చాటునుండి చూస్తుంది. ఆ చిన్న పాప నడుస్తూ వెళ్ళటం గమనించి, ఆ పాపతో పాటు వేరే ఎవరైనా ఉన్నారేమో అన్న అనుమానంతో, అదను కోసం పాపను మెల్లిగా పొంచి పొంచి వెంబడిస్తూ వెనక వెళ్తూ ఉంటుంది. అదను దొరికింది. పొంచి ఉన్న పొదలనించి ఒక్కసారిగా తన కళ్ళు పెద్దవి చేసి, పదునైన కోర పళ్ళు పైకి తెచ్చి ఒక్క ఉదుటున ఆ పాప పైకి దూకుతుంది.

                   ***

నా పేరు శివ. నేను ఒక ప్రింటింగ్ ప్రెస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నా. నా భార్య పేరు సంధ్య, పాప సరయు. SSS ఫ్యామిలీ అన్నమాట! చలాకీగా ఉండే సంధ్య, చిరునవ్వు చెరగని సరయుతో రోజులు చక చక సాగుతున్న సమయంలో కష్టం వచ్చి నా కంట్లో కన్నీరుని, ఇంట్లో ఇబ్బందుల్ని నింపింది. నా సంధ్యకి కాన్సర్ 1st స్టేజిలో ఉంది. తనకి ఖరీదైన వైద్యం కుదరలేదు గాని మూలికావైద్యం చేయించాను. ఇపుడు తనకి నయం అయిపోయిందని ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది. అప్పటినుండి నా మనసు నా దగ్గర లేదు. అందుకే వెంటనే ఆశ్రమానికి మా ఫ్రెండ్ ఆల్టోలో బయల్దేరాను. దూరం కావటం చేత దారిలోనే చీకటి పడింది.

శివ: “కన్నా, నిద్ర వస్తుందా?”

సరయు: “లేదు, అమ్మని చూస్తా కదా!”

శివ: “చీకటిగా ఉంది కదా భయం వేస్తుందా?”

సరయు: “నాన్న ఉంటె భయం వేయదు”

శివ: “మాటలు నేర్చావు రా నువ్వు!”. మా పాపకి చీకటి అంటే చాలా భయం. చాలా సార్లు చెప్పా. అయినా భయం పోలేదు. “అమ్మని చూస్తావు కదా. చూసాక ఎం చెప్తావు. ‘మిస్ యు’ అనా?”

సరయు: “లేదు. నీకు ఎలా ఉంది అని అడుగుతా. నువ్వు ఏమి అడుగుతావో కూడా నాకు తెలుసు.”

శివ: “ఎం అడుగుతాను?”

సరయు: “ ముద్దు ఇమ్మని, నువ్వు రోజు ఆఫీస్ కి వెళ్ళేటపుడు అడిగేది అదే కదా!”

అమ్మో..పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. సరయుతో మరీను! తను అన్నీ గమనిస్తూనే ఉంటుంది!

సరయు: “ నాన్న! ఫోన్ లో ఇది ఎందుకు కదులుతూ ఉంది”

శివ: “ అది GPS కన్నా. మనం ఎక్కడికి వెళ్ళాలో దారి అది చూపిస్తుంది. ఆ చివర్లో ప్లస్ మార్క్ ఉన్నది హాస్పిటల్”

సరయు: “ ఐస్ క్రీం కూడా చూపిస్తుందా?”

శివ కార్ సెల్ హంగర్ నుండి సెల్ తీసి, మ్యాప్ లో ఉన్న బ్లూ మార్క్, ఇంకా మిగతావాటి గురించి వివరిస్తూ దారిలో ఉన్న గ్రీజ్ ని చుస్కోడు.కార్ టైర్ స్లిప్ అయ్యి, శివ చేతిలో ఉన్న స్టీరింగ్ కంట్రోల్ తప్పి, కార్ ఒక పక్కకి వాలిపోయి, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వలన శివ తల సైడ్ విండోకి తగిలి విండో బద్దలు అయ్యి, స్కిడ్ అవుతూ వెళ్లి చెట్టుకి గుద్దుకుని మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చి ఆగుతుంది. ఆ రాపిడికి వచ్చిన పొగలు కారుని కమ్మేస్తాయి. సరయు నాన్న! నాన్న! అని శివ ని పిలుస్తుంది. శివ పలకడు. సీట్ బెల్ట్ లాగి అందులోనించి దూరి కార్ బయటకి వస్తుంది.

అక్కడ ఉన్న అద్దపు ముక్కల్ని దాటుకుని శివ ఉన్న వైపు వెళ్ళి శివ ని లేపటానికి ప్రయత్నిస్తుంది. సరయు పిలుపులు శివ మెదడు దాక చేరవు. శివ నుదుటి నుండి కారుతున్న రక్తం చూసి, తన పాకెట్ లో ఉన్న కర్చీఫ్ తీసి రక్తాన్ని తుడిచి మళ్ళీ నాన్న! నాన్న! అని పిలుస్తుంది. సరయు కళ్ళు మనసులోని దుఃఖాన్ని ఆపలేకపోతున్నాయి. సరయు ఏడుస్తూ ఏడుస్తూ శివ గుండెల మీద వాలి మెల్లిగా “నాన్న” అంటుంది. సరయు మాటలోని మమకారం గాని, అర్థరాత్రి అడవిలో ఆమె పరిస్థితిని గాని అర్థం చేసుకోవటానికి అక్కడ ఏ శివుడూ లేడు.

ఆగిపోతున్న శివ గుండెచప్పుడు సరయుకి వినిపిస్తుంది. సరయు లేచి కార్ లో నుండి వచ్చి చుట్టుపక్కల చూస్తుంది. కనుమరుగు దూరంలో రవ్వంత కాంతి కూడా కనపడక నిరుత్సాహంతో పైకి చూస్తుంది. చందమామ అయిన కనపడతాడేమో అని! చందమామ లేని ఆకాశాన్ని చూసి మళ్ళీ మెల్లిగా పడుకుని కార్ లోకి దూరి సెల్ ఫోన్ తీస్కుని, ఓపెన్ చేసి పాస్ వర్డ్ టైపు చేస్తుంది. ఇంతకు ముందు ఓపెన్ అయిన మ్యాప్ ఉండటం చేత మ్యాప్ చూస్తుంది. మ్యాప్ లో అడవి కొంచెం లోపలికి ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది. దాన్ని నొక్కుతుంది. ‘డైరక్షన్స్ ఫ్రం హియర్’ అనే అలెర్ట్ వస్తుంది. సరయుకి అర్థం కాదు. తను కార్ లో దూరి ఉండటం చేత బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం లో అక్కడ ఉన్న గాజుముక్క ఒక్కటి తన వీపు మీద గీస్కుంటుంది. సరయుకి స్పర్శ తెలియలేదు. బయటకి వచ్చి మళ్ళీ ఆ మ్యాప్ చూస్తూ ఉంటుంది.

“ D...I...R...E...” చదివే ప్రయత్నం చేస్తుంది కానీ అర్థం కాదు.

సరయు సెంటర్ బటన్ నొక్కి, కాల్ లిస్టులోకి వెళ్తుంది. అక్కడ నుండి సంధ్య అనే నెంబర్ కి కాల్ చేస్తుంది. సిగ్నల్ లేకపోవటం వలన కాల్ డ్రాప్ అవ్తుంది. మళ్ళీ మ్యాప్స్ లోకి వెళుతుంది. తెలియకుండా కాన్సెల్ అనే బటన్ నొక్కుతుంది. ‘డైరక్షన్స్ ఫ్రం హియర్’ అనే ఆప్షన్ పోతుంది. మ్యాప్ చూస్తూ, నడుస్తూ ఉంటుంది. తను అడవికి దూరంగా వెళ్తున్నా అని అర్థం చేసుకుని అడవి వైపు చూస్తుంది. నల్లటి రంగులో మనసులో అలజడి రేపే శబ్ధం చేసే అడవిలోకి వెళ్ళాలంటే భయం వేసి ఆగిపోతుంది.

***

శివ: “కన్నా! ఎందుకురా ఏడుస్తున్నావ్?”

సరయు: “చీకటి నాన్న! కరెంటు కూడా పోయింది”

శివ: “చీకటి అంటే ఎందుకు భయం?”

సరయు: “నాకు అమ్మ, నువ్వు కనపడరు కదా”

శివ: “నువ్వు చూడట్లేదు కన్నా! ఒక నిమిషం కళ్ళు ముస్కుని మెల్లిగా తెరువు”

సరయు: “ ఊహు! కరెంటు వచ్చిందా?”

శివ: “నువ్వు కళ్ళు మూసుకుంటే భయం వేయట్లేదు కదా”

సరయు: “లేదు”

శివ: “ఇపుడు కూడా నీకు మేము కనపడట్లేదు..అయినా నీకు భయం వేయట్లేదు కదా! అందుకే కళ్ళు తెరువు కన్నా”

సరయు కళ్ళు తెరుస్తుంది.

శివ: “ ఒక నిమిషం చూడు, మెల్లిగా నీకు అన్నీ కనిపిస్తాయి. చందమామ నీకు హెల్ప్ చేస్తాడు. ఇక్కడ ఉన్న కాస్త వెలుతురు నీకు హెల్ప్ చేస్తుంది. కాంతిగా కాకపోయినా నేను కూడా కనపడతాను”

సరయు: “ కాని దొంగోడు వస్తాడు చీకట్లో, అతను కూడా కనపడతాడు” అని కళ్ళు మూసుకుంటుంది.

***

అడవి ముందు నించి, సరయు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన చిన్న బాగ్ తీస్కుని, దాన్ని వెనక వేసుకుంటుంది. వీపుకి గీసుకున్న గాయం మంట రేపుతుంటుంది. ‘అమ్మా!’ అంటూనే మళ్ళీ అడవి దగ్గరికి వచ్చి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తుంది. నిటారుగా ఉన్న గీత చివర్లో హాస్పిటల్ చూస్తుంది. అది క్లోజ్ చేసి ఫోనులో టార్చ్ ఓపెన్ చేసి అడవిలోకి నడుస్తుంది.

***

శివ: “సెల్ లో టార్చ్ ఉంది కన్నా! భయపడకు..కళ్ళు తెరువు. టార్చ్ ఉంది కదా దొంగోడు దగ్గరికి రాడు”

సరయు: “ ఊహూ! నేను తెరవను”

శివ: “ సరయు వినవేంటిరా! నీకు టార్చ్ ఓపెన్ చేయటం నేర్పిస్తా కూడా, చీకటి అంటే భయపడకూడదు రా! నా మాట విను!”

***

మెల్లిగా దారి చూసుకుంటూ అడివిలో తిన్నగా నడక సాగిస్తుంటుంది..టార్చ్ వెలుగు తప్ప వేరే వైపుకి చూడకుండా! కొంచెం దూరం వెళ్ళాక మ్యాప్ చూస్తుంటుంది. ప్లస్ సింబల్ దగ్గరిగా వెళ్తుంది అని చూస్కుని మళ్ళీ టార్చ్ లో మార్గం చూస్కుంటూ ముందుకు సాగుతుంది. కాసేపటికి సెల్ ఫోనులో ‘బాటరీ లో’ అనే సింబల్ వస్తుంది. లైట్ మినుకు మినుకు మంటుంది. పొంచి ఉన్న ప్రమాదపు అరుపు సరయుకి వినపడింది. అరుపు అర్థం కాకపోయినా దాన్లో ఉండే క్రూరత్వం సరయుకి అర్థం అవుతుంది. సరయు పరుగు అందుకుంది. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఆ వైబ్రేషన్ కి మరియు సౌండ్ కి సరయు ఉలికిపడి ఆ ఖంగారులో ముందుకు పడుతుంది. ఫోను దూరంగా పడిపోతుంది. రింగ్ టోను వినపడి వెళ్లి ఫోను తీసి చుస్తే ‘సంధ్య కాలింగ్...’ అని వస్తుంది. ఫోన్ ఎత్తుతుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. సరయు మళ్ళీ మళ్ళీ డయల్ చేస్తుంది. ప్రయత్నిస్తున్న ప్రతిసారి ‘బాటరీ లో’ అలెర్ట్ వస్తుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. దేవుడు ఆశ చూపించాడా లేక ఉన్న అవకాశాన్ని లాగేసుకున్నాడా తెలియదుగానీ ఫోనులో ఉన్న బాటరీ పూర్తిగా అయిపోతుంది.

చీకటికన్నా సరయుకి తన దగ్గరికి ఏదో వస్తుందన్న అనుమానం ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. అక్కడ పడి ఉన్న బ్యాగ్ తీసుకుని తను ఇంతకు ముందు వెళ్ళే దారిలో ముందుకు నడుస్తుంది. తను నడిచే కొద్దీ, తన చుట్టూ ఏదో మెదులుతున్న అనుమానం ఎక్కువ అవుతుంది. బ్యాగ్ రాపిడికి సరయు వీపు నుండి సన్నటి రక్తపు ధరలు కింద పడతాయి. సరయుని తినటానికి వచ్చిన ఆ అడవి మృగం ఆ రక్తపు చుక్కల్ని నాకి, రుచి మరిగి సరయు వంక ఆశగా చూస్తుంది.

***

సరయు: “ అమ్మా! నాకు ఆ కుక్క బొమ్మ కావాలి”

సంధ్య: “కుక్క కాదు..అది తోడేలు”

సరయు: “నాకు అది కావాలి”

సంధ్య: “ తోడేలు, పులి అడవి జంతువులు. దే ఆర్ బ్యాడ్. పులి అంటే మిగత జంతువులకి కూడా అందుకే భయం. నువ్వు కుందేలు బొమ్మ కొనుక్కో రా! క్యూట్ గా ఉంటుంది. చూడు..కలర్ కూడా పింక్!”

సరయు: “ నాకు తోడేలు బొమ్మే కావాలి”

సంధ్య: “అవి క్రూర జంతువులు. అవి మాటు వేసి..”

సరయు: “మాటు ...అంటే?”

సంధ్య: “ మనకి తెలియకుండా మెల్లిగా మనల్ని వెంబడించి సరైన సమయం చూసి మనం బలహీనంగా ఉన్నపుడు మన మీద దాడి చేస్తాయి”

***

సరయు భయంతో పక్కకి చూస్తూ వేగంగా నడుస్తుంది. తనను వెంబడించేది కూడా వేగంగా కదలటం గమనిస్తుంది. సరయుకి భయంతో ఎం చేయాలో తెలియట్లేదు. దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది. సరయు బ్యాగ్ లోనించి చిన్న స్టిక్ లాంటిది తీసి పట్టుకుని బ్యాగ్ దూరంగా విసిరేసి మళ్ళీ పరుగు అందుకుంటుంది. అంతే...తోడేలు అమాంతం సరయు మీద దూకుతుంది. పరిగెడుతున్న సరయు ఒక్కసారిగా పక్కకు పడి దొర్లుతుంది. తోడేలు అమాంతం లేచి పడిపోయి ఉన్న సరయు కాళ్ళ మీద తన కాళ్ళు ఉంచి తన పదునైన గోర్లతో గుచ్చుతుంది. లేత చర్మం తట్టుకోలేక రక్తపు కన్నీరు కారుస్తుంది. ఎర్రటి కళ్ళను చూసి సరయు కళ్ళు ముసుకుంటుంది. ఆకలితో ఉన్న తోడేలు దగ్గరగా ఉన్న సరయు భుజాన్ని కొరుకుతుంది. అదే సమయానికి పొదల నుండి పెద్దగా పులి గాండ్రింపు వినపడుతుంది. పొదల వైపు చుసిన తోడేలుకి మెరుస్తున్న కళ్ళు కనపడతాయి. పులి మళ్ళీ గాండ్రిస్తుంది. తోడేలు భయపడి పారిపోతుంది. సరయు చేతిలో ఉన్న బ్లాక్ స్టిక్ యొక్క రిమోట్ స్విచ్ ని మళ్ళీ నొక్కుతుంది. పొదలలో ఓపెన్ చేసి ఉన్న సరయు బ్యాగ్లోని పులి బొమ్మ మళ్ళీ గాండ్రిస్తుంది.

***

శివ: “ ఎందుకు సంధ్యా...చిట్టి కన్నాను అలా భయపెడతావ్? నీకు తోడేలు కాదు పులిబొమ్మ కొనిపెడతాను. అరిచే పులి బొమ్మ, నువ్వూ ఒక్కటే! పులిలాగే నిన్ను చూసి కూడా అందరూ భయపడాలి”

సంధ్య: “ మీరు మారరు కదా. అమ్మాయిలకి సాఫ్ట్ టాయ్స్ కొనాలి.”

శివ: “ మన కన్నా అమ్మాయి కాదు. ఆడ పులి! నువ్వు షాపింగ్ త్వరగా తెమిలిస్తే ఇంటికి వెళ్దాం”


***

సరయు రిమోట్ స్విచ్ మార్చి నొక్కుతుంది. పొదలలో ఉన్న సరయు బ్యాగ్లోని పులి బొమ్మ ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై’ పాటకి మారుతుంది. తోడేలు సరయు భుజాన్ని పూర్తిగా కొరక్కపోయినా పళ్ళు సగం దిగటం వల్ల చాలా రక్తం కారుతుంది. కొంచెం దూరంలో ఉన్న లైట్ ని చూస్తూ సరయు కళ్ళు మూస్తుంది.

రెండు రోజులు తర్వాత, సరయు మెల్లిగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తూ, కట్టులతో ఉన్న వల్ల నాన్నని చూసి మళ్ళీ మెల్లగా కళ్ళు మూస్తుంది.

శివ: “థాంక్స్ డాక్టర్”

డాక్టర్: “నాకు కాదు మీ ఆడపులికి థాంక్స్ చెప్పండి. జంగిల్ బుక్ పాట విని అమ్మయిని ఇక్కడికి తీసుకొచ్చిన కాంపౌండర్ కి చెప్పండి”

సరయు ఇది వింటూ మళ్ళీ పక్కకి తిరిగి కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మని చూస్తుంది. అది చూసిన శివ, సంధ్య సరయు దగ్గరికి వస్తారు. సంధ్య సరయుని నుదిటి మీద ముద్దు పెడుతుంది.

సరయు: “ నీకు ఎలా ఉంది అమ్మ?”

అది వినగానే సరయుని సంధ్య తన గుండెలకి హత్తుకుంటుంది. శివ వాళ్ళ చుట్టూ చేతులు వేసి సంధ్యని , సరయుని ముద్దుపెట్టుకుంటాడు.

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Thriller