శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.2  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

తల్లి హృదయం

తల్లి హృదయం

2 mins
337



           'తల్లి' హృదయం" 

            - శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

  

    


   "పోస్ట్...


   ఆపిలుపు కోసమే ఎదురుచూస్తున్న వర్ధనమ్మ ఆనందంగా ఉత్తరాన్ని అందుకుంది. 


   ఎక్కడో ఢిల్లీలో ఉన్న పెద్దకూతురు నుంచి వచ్చే ఉత్తరం కోసం ఆమె కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడడం ఎప్పుడూ మామూలే.


   ఆతృతగా ఉత్తరం మడతవిప్పింది....


   గౌరవనీయులైన అత్తయ్య గారికి,

   నమస్కరించి వ్రాయునది...


   మీరందరూ క్షేమమని తలుస్తాను. నేనూ పిల్లలూ బాగానే ఉన్నాం. మీ అమ్మాయికే బాగుండటం లేదు. ఈమధ్య మళ్లీ సుస్తీ చేసింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాము. కొద్దిగా నీరసంగా వున్నా ఇప్పుడు బాగానే ఉంది. రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. పిల్లలిద్దరికీ స్కూలుకెళ్లడం రావడం తోనే రోజు గడిచిపోతుంది. మీ అమ్మాయిని దగ్గరుండి చూసుకోడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసాను. త్వరలోనే కోలుకుంటుంది. కాబట్టి మీరేమీ కంగారు పడకండి. ఈ విషయం మీకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతోనే చెప్పాను. 


                   ఇట్లు

                   మీ అల్లుడు

                   రవీంద్ర.


   ఆ ఉత్తరం చదువుతున్నంతసేపూ వర్ధనమ్మకు ముచ్చెమటలు పోస్తూనే ఉన్నాయి. పైగా వయసు తెచ్చిన వృద్దాప్యం.


  కూతురు సుఖపడుతుంది కదాని...ఇంజనీరుకిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళుండే ఢిల్లీ వాతావరణం కూతురికి అసలు పడటం లేదు. అప్పుడే ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఇది మూడోసారి. ఇక్కడ నేనేం కంగారు పడతానోనని అల్లుడు పెద్దగా చెప్పివుండరు. అదిప్పుడు ఏ స్థితిలో ఉందో ఏంటో...? కూతురు విషయం తెలిసాక ఆతల్లి మనసు కుదురుగా లేదు. ఆ ఉత్తరాన్ని పట్టుకుని...బయటకు వెళ్లిన కొడుకుల కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇద్దరిలో ఎవరైనా వెళ్లి చూసి వస్తే బాగుంటుందనిపించి. 


   ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన పెద్దకొడుక్కి ఆ ఉత్తరాన్ని అందించి...మళ్లీ మీఅక్కకు ఒంట్లో బాగుండటం లేదంట" అంది ఎంతో దిగులుగా. 


   అలాగా...అంటూ ఆఉత్తరాన్ని ఓసారి చూసి పక్కన పెట్టేసాడు.

    

   " అది ఎలా ఉందొ ఏంటో...? ఓసారెళ్లి అక్కని చూసిరారా" అంటూ ప్రాధేయతగా అడిగింది.


   "ఎందుకమ్మా...అంత బెంబేలు పడిపోతావు. అక్క ఇప్పుడు బానే ఉందని బావగారు చెప్పారు కదా. పైగా అక్కడిప్పుడు విపరీతమైన చలొకటీ".... నేను వెళ్లలేనన్నట్టు కచ్చితంగా చెప్పేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం పెట్టుకుంటే...తనకు బోలెడు ఖర్చు. పైగా...ఒంట్లో బాగోక పోయిన అక్కకు ఎంతోకొంత చేతిలో పెట్టి రాకపోతే బాగోదు. అసలే...రూపాయి రూపాయి కూడబెడుతూ కష్టబడి సంపాదిస్తున్నాను అనుకున్నాడు మనసులో.


  చిన్న కొడుకుని అడిగితే..."అమ్మా...మాకు ఈమధ్య ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. పైగా నాకసలు లీవ్ దొరకదు" తనకున్న ప్రాబ్లెమ్ తో వెళ్లడం కుదరదని తప్పించుకున్నాడు.

కానీ...తాను ఊళ్ళో ఒకరోజు లేకపోతే తనకొచ్చే లంచాలు ఎంతగా నష్టపోతాడో తనకు మాత్రమే తెలుసు. ముందుముందు మేడలు, మిద్దెలు కట్టుకోవాలంటే...వస్తున్న డబ్బుల్ని జారవిడుచుకోకూడదన్నదే పట్టుగా వున్నాడు.


   కొడుకుల సమాధానం వర్ధనమ్మకు ఏమాత్రం నచ్చలేదు. తోడబుట్టిన అక్కపై ఏమాత్రం ప్రేమాభిమానాలు కనబర్చకపోయేసరికి...వర్ధనమ్మలో మరింత దిగులు పేరుకుపోయింది.

  

   కనీసం హైద్రాబాద్ లో ఉన్న చిన్న కూతురినైనా పంపితే...కొన్నాళ్ల పాటు అక్కకు తోడుగా వుంటుందేమోననే ఆలోచన వచ్చి....ఉత్తరం రాసి పడేసింది.


     చిన్న కూతురు నుంచి వచ్చే సమాధానం కోసం... ఎప్పుడెప్పుడా అని మళ్లీ పోస్ట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది వర్ధనమ్మ.


  వారం రోజుల తర్వాత వచ్చింది...పోస్ట్...!


  ఎంతో ఆశ పెట్టుకుని చదివితే....ఆ కూతురిచ్చిన సమాధానం కూడా ఆమె మనసుని విరిచేసింది.


   తాను బయలుదేరి వెళ్తే...మా ఆయనకు రోజు గడవడం కష్టమనీ...పైగా హోటల్ తిండి అసలే పడదని రెండు ముక్కల్లో తేల్చి చెప్పేసింది...ఆ ఉత్తరంలోని సారాంశం

   

   వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది...!


  ఈరోజుల్లో ఎవరి జీవితాలు వారికే గానీ.... తొడబుట్టిన వారి బాగోగుల్ని కూడా పట్టించుకోకుండా ప్రేమాభిమానాల్ని చంపుకుని రాతిగుండెలతో బ్రతుకుతున్నారనిపించి బాధపడింది.


   కూతురికి పెళ్లి చేసి అంత దూరం పంపించినందుకు అక్కడకు వెళ్ళడానికి ఎవరు తప్పించుకున్నా...కన్నతల్లి మనసు ఊరుకోదు కదా...ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే అల్లుడికి తానే బయలుదేరి వస్తున్నట్టుగా ఉత్తరం రాసింది.


   ఓపిక లేకపోయినా...మనుమల కోసం రెండు రకాల పిండివంటలు, ఊరగాయ సిద్ధం చేసి... పెట్టెలో బట్టలు సర్దుకుని...కాకినాడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి రైలెక్కింది అరవై ఏళ్లు పైబడ్డ వర్ధనమ్మ....!!*



Rate this content
Log in

Similar telugu story from Inspirational