సంతలో చింతకాయ
సంతలో చింతకాయ
సంతలో చింతకాయ
*******************
సత్యం మాష్టారు తెలుగు ఉపాధ్యాయులు. ఒకసారి విద్యార్థులకు ఇరవై మార్కుల పరీక్ష నిర్వహించారు.
మరుసటిరోజు ఆ పేపర్లను దిద్ది మార్కులు సరిచూసుకోమని విద్యార్థులకు ఇచ్చారు.
విద్యార్థులకు ఇవ్వగా రెండు పేపర్లు మిగిలిపోయా యి. రెండింటి మీద దుర్గాప్రసాద్ అని రాసి ఉంది. “ఈ తరగతిలో దుర్గాప్రసాద్ పేరు గలవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇంటిపేరు రాయలేదు ఎవరు ఈ సంతలో చింతకాయలు” అన్నారు సత్యం మాష్టారు. పిల్లలందరూ ఫక్కున నవ్వారు.
“సర్ సర్ సంతలో చింతకాయ అంటే ఏంటి సార్” అన్నారు పిల్లలు.
పూర్వం సంతపేట గ్రామంలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సంతకు వెళ్లి కావాల్సిన కాయగూరలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకునేవారు. అలాగే అచ్చియ్యమ్మ కూడా సంతకు వెళ్ళి కూరగాయలతో పాటు చింత కాయలు కొన్నది.
ఇంటికి వెళ్లి ఆ చింతకాయలతో చారు పెట్టింది. చారు అస్సలు పులుపు లేకపోవడంతో భోజనం రుచించలేదు. .
ఎలాగైనా ఆ దుకాణదారుడుని కలిసి బుద్ధిచెప్పాలి అనుకుంది. ఆదివారం రానేవచ్చింది చింతకాయలు పట్టుకుని సంతకు వెళ్ళింది. చింతకాయలు ఎవరి దగ్గర కొన్నదో అచ్చియ్యమ్మకి గుర్తులేదు. ఒక దుకాణం దగ్గరికి వెళ్లి “బాబూ ఈ చింతకాయలు పులుపు లేవు నన్ను మోసం చేసావు” అంది.
“ఎల్లెల్లవమ్మా ఎవరైనా దూరి చూస్తారా ఏంటి. నువ్వు ఎవరి దగ్గరకొన్నావో వాళ్ళని అడుగు” అన్నాడు దుకాణదారు కోపంగా.
ఎవరిని అడిగినా ‘మేము కాదంటే మేము కాదు’ అన్నారు. చివరగా ఒక దుకాణ దారుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. “అమ్మా సంతలో చింతకాయలు ఎందరో అమ్ముతున్నారు. కిందటి వారం కొన్నానంటున్నావు. ఊరు పేరు లేకుండా ఎవరి దగ్గర కొన్నావో తెలియకుండా ఎవరిని నిందిస్తావు. నీలాగే ఒకావిడ గాజుల మలారం వాడి దగ్గరికి వెళ్లి లచ్చికి గాజులు కావాలని చీటి చూపించిందిట. చీటి చూసి గాజులు ఎలా ఇవ్వగలను కొలత చెప్పు అన్నాడట. ఆమె చెప్పలేక తెల్లమొహం వేసిందిట. అలాగే ఉంది నీ వరుస” అన్నాడు దుకాణదారు.
చేసేదేమీ లేక ‘సంతలో చింతకాయ’ అంటూ ఇంటికి పోయింది అచ్చియ్యమ్మ. అలా అప్పటినుంచి సరియైన చిరునామా లేకపోయినా, ఒక పనికి ఎవరు బాధ్యత వహించాలో తెలియనప్పుడు. ఒక పని గురించి ఎవరు పట్టించుకోనప్పుడు ‘సంతలో చింతకాయ’ అని ‘సంతకు చీటి లచ్చికి గాజులు’ అనే పలుకుబడి వాడుకలోకి వచ్చింది.” అని చెప్పారు సత్యం మాష్టారు. పిల్లలంతా “సంతలో చింతకాయ” అంటూ అరవడం మొదలుపెట్టారు. మాష్టారు వారిని వారించి, చేతి రాత ఆధారంగా తమ పేపరు గుర్తుపట్టిన దుర్గాప్రసాద్ ల చేత ఇంటిపేరు రాయించి, పేపర్లు వారికి ఇచ్చి మార్కులు సరిచూసుకోమన్నారు.
(మన తెలుగు కథలు.కాం లో 14-9-2024 న ప్రచురణ)
