శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం
*శ్రీరామపట్టాభిషేకము*
"రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః"
"శ్రీరామ చంద్రప్రభో!జయహో జయహో!"
అంటూ అయోధ్య ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తున్నారు.
శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం తన తమ్ముడుగు లక్ష్మణునితో, ధర్మపత్ని సీతాదేవితో కూడి పుష్పక విమానంలో సాకేత పురానికి చేరుకున్నాడు.
వానర రాజైన సుగ్రీవుడు తన సైన్యముతో, తన బంధు, మిత్ర పరివారంతో వెంట వచ్చాడు. విభీషణుడు కూడా తన పరివారంతో శ్రీరామ చంద్రుని వెంట వచ్చాడు.
రామ చంద్రప్రభువును చూడగానే ప్రజలు ఉప్పొంగి పోయారు.పూలు, పేలాలు జల్లుతూ పరవశించారు. సుందరమైన కన్యామణులు ముందు నాట్యం చేయసాగారు. ముత్తైదువలు ముందు నడుస్తూ ఉంటే గోవులు, వృషభాలు, ఏనుగులూ గంభీరంగా ఊరేగింపు వెంట నడిచాయి. ముని శ్రేష్ఠులు, పురోహితులూ, మంత్రి, సామంతులు వెంట రాగా, శ్రీరాముడు సీతతో కూడి పుష్పకవిమానం దిగి మొదటగా భరత శత్రుఘ్నులను ఆలింగనం చేసుకొని, తదుపరి మువ్వురు తల్లులకూ వందన మాచరించాడు. తల్లులు ఆనంద భాష్పాలతో రాముని శిరసును ముద్దాడి ఆశీర్వదించారు.
శ్రీరామచంద్రుడు వశిష్ఠ, వామదేవ, జాబాలి, గౌతమాది మునిశ్రేష్ఠుల ఆశీర్వాదములను పొంది అంతఃపురమును చేరుకున్నాడు.
ఆ సమయమున పెద్దలగు పురోహితులు శ్రీరామ పట్టాభిషేకమును గూర్చి మంత్రులగు సుమంతుడు, విజయుడు, అశోకులు మొదలగు వారితో చర్చించిరి. "శ్రీరామ పట్టాభిషేకము కొఱకు మంగళ పూర్వకముగా చేయవలసిన సమస్త కార్యక్రమములను నిర్వహింపు"డని ఆదేశించిరి.
మరునాడు తెల్లవారు జామున బ్రహ్మముహూర్తంలో మంగళ వాయిద్య భేరీ ధ్వనులు వినిపించినవి.
అయోధ్య ప్రజలు నిదురపొతే కదా!అందరూ శ్రీరామ పట్టాభిషేకం గురించి కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా గడిపారు కదా!ఉత్సాహంగా జయజయ నాదాలు చేస్తూ ఊరంతా అలంకరించారు. వాడవాడలా మామిడి తోరణాలు, పుష్ప మాలికలు వేలాడదీశారు. వీధుల్లో కల్లాపి జల్లి రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దారు.
ఆహా!ఆ శోభ వర్ణించ తరమా! దేదీప్యమానంగా వెలిగిపోతున్నది అయోధ్య. ఎక్కడ చూచినా శ్రీరామ సంకీర్తన!రామ కథాగానమే!అంతా రామమయం!
అదిగో!శ్రీరామ చంద్రుడు సీతాదేవితో కూడి ఉత్తమమైన అశ్వములను పూన్చిన రథమునధిరోహించిఅంతఃపురం నుండి బయలు దేరాడు. చూడండి!
తన్మయంతో పులకించిన ప్రజలు అనందంతో స్తోత్రం చేయసాగారు.
"శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్,
ఆజానుబాహు మరవిన్దదళాయతాక్షం
రామం నిశాచరవినాశనకరం నమామి."
ప్రియమైన సోదరుడు భరతుడు రథ సారథ్యం వహించాడు. చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు సీతారాముల శిరసులపై బంగారు ఛత్రమును పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.
శ్రీరాముని క్షణమైనా వదిలి ఉండలేని లక్ష్మణుడు భక్తితో తెల్లని వింజామర వీస్తున్నాడు.
రాక్షస రాజైన విభీషణుడు మరియొక తెల్లని వింజామరను చేబూని రథమునకు ముందు భాగంలో నడుస్తున్నాడు.
ఆ కమనీయమైన దృశ్యమును గాంచి ఆకాశంలో దేవతలు, మరుద్గణములు, మహర్షులు శ్రీరామచంద్ర ప్రభువును స్తుతిస్తూ పుష్ప వర్షం కురిపిస్తున్నారు.
వానర రాజైన సుగ్రీవుడు 'శతృంజయము 'అను పేరు గల గజము నధిరోహించి వెనుక వచ్చుచుండగా, హనుమంత, అంగద, నల, నీల, మైంద, ద్వివిద, జాంబవతాది ప్రముఖులు జయ జయ నాదములు చేయుచు రథము ప్రక్కగా మెల్లిగా నడుచుచున్నారు.
శంఖారావములు మార్మోగుచుండగా, దుందుభ ఢక్కా నాదములు మిన్ను ముట్టుచుండగా, జనుల హర్ష ధ్వానముల మధ్య ఆ ఊరేగింపు మెల్లిగా సభాభవన ప్రాంగణమును చేరుకొంది.
తరువాత భరతుడు సుగ్రీవునితో "శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పట్టాభిషేకము కొఱకు జలములను తెచ్చుటకై మీ దూతలను ఆజ్ఞాపించండి "అని పలికాడు.
వెంటనే సుగ్రీవుడు భల్లూక రాజైన జాంబవంతుని, హనుమంతుని, ఋషభుని, గవయుని, సుషేణుని, నలుని పిలిచి బంగారు కలశముల నిచ్చి ఆజ్ఞాపించగా, వారు వెళ్లి సమస్త నదీ, సముద్ర జలములను కలశములలో నింపి తెచ్చారు. ఆ కలశములను సుగ్రీవుడు పురోహితులకు అందచేసాడు.
"వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్డపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితమ్
అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరమ్
వ్యాఖ్యాంతం భరతాదిభిః రామం భజే శ్యామలమ్."
అనంతరం రాజపురోహితుడైన వశిష్ఠుడు వేదవిదులైన బ్రాహ్మణులతో గూడి సీతా సమేతుడైన శ్రీరామ చంద్రుని రత్న సింహాసనముపై కూర్చుండ బెట్టెను.
అంతట వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాత్యాయనుడు, గౌతముడు మున్నగు మునులందరు పవిత్రమైన సుగంధ జలములతో సీతారాముల నభిషేకించిరి.
ఆ తరువాత దేవతలూ, గంధర్వులు వచ్చి మంగళ, ఓషధీ ద్రవ్యాలతో సీతారాములకు నభిషేకము గావించారు.
పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచితమైన కిరీటమును తయారు చేసి 'మనువు 'కు బహూకరించాడు. మనువు తర్వాత ఇక్ష్వాక మహారాజు దానిని ధరించాడు. ఆ తరువాత వచ్చిన సూర్యవంశ చక్రవర్తులందరు ఆ దివ్య కిరీటంతోనే అభిషిక్తులై తమ రాజ్యాన్ని ధర్మ బద్ధంగా పరిపాలించారు.
అదిగో!ఇప్పుడా దివ్యమైన బ్రహ్మ కిరీటాన్ని వశిష్ఠుడు, గౌతముడు పట్టుకొని శ్రీరామచంద్రుని శిరసుపైనలంకరించగా దేవదుందుభులు మ్రోగాయి. దివి నుండి పూల వాన కురిసింది.
శతృఘ్నుడు స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొన్నాడు. వానర రాజైన సుగ్రీవుడు, రాక్షస రాజైన విభీషణుడు ఇద్దరూ వింజామరలను వీస్తూ ఉండగా హనుమంతుడు పాదముల కడ కూర్చుని సేవించు కుంటున్నాడు.
దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు నూరు బంగారు పద్మాల మాలను, వివిధ రత్నములతో కలిపి మణులతో ప్రకాశించుచున్న ముత్యాల హారమును ఆ ప్రభువుకు సభక్తికముగా సమర్పించాడు.
ఆ హారములు ధగద్ధాయమానముగా వెలుగుతుంటే సీతారాముల దివ్యమంగళ రూపములను గాంచి అయోధ్యాపుర వాసులు ఆనందబాష్పాలతో స్వామిని స్తోత్రం చేశారు.
"మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.
వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే,
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్."
స్వస్తి 🙏🙏
******************************************
