రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి
రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి
రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి
**************************************
ప్రహ్లాద పురం అనే గ్రామం లో శ్రీకాంత్, అతని భార్య పల్లవి నాయనమ్మ రాజేశ్వరమ్మ తో కలసి ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. వారి ముద్దుల కొడుకు అయాన్ష్.
అయాన్ష్ కి తొమ్మిదో నెల వచ్చింది లేచి నిలబడుతున్నాడు. గోడనో, మంచాన్నో పట్టుకుని బుడి బుడి అడుగులు వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి అడుగు వెయ్యబోయి తూగిపోయి ముందుకు పడిపోతున్నాడు.
మునిమనవని విద్యలు చూసి రాజేశ్వరమ్మగారు మురిసిపోయే వారు. దూరంగా నిలబడి "విద్ది చెయ్య్, విద్ధి చెయ్య్ హాయ్ విద్ధి హాయ్ విద్ధి" అని మునిమామ్మ పాడ గానే బుడి బుడి అడుగులేసేవాడు ఆయాన్ష్. కొద్దిరోజులకు నెమ్మది నెమ్మదిగా అడుగులు వెయ్యడం మొదలు పెట్టాడు.
మునిమనవడు నడచి వస్తూ ఉంటే "రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి,రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి" అని గట్టిగా అన్నారు మునిమామ్మ గారు. ఎవరికీ ఏమీ అర్ధం కాక నిలబడి చూసారు.
అయాన్ష్ ఊగుతూ, తూగుతూ, బుడి బుడి అడుగులేస్తూ, నడుస్తూ దారిలో ఉన్న సామాన్లు తన్నుకుని బోర్లా పడిపోయాడు. ఇంకేముంది ఆరున్నొక్క రాగం తీశాడు. ముని మామ్మకి కోపం వచ్చింది. “నేను చెప్పినా మీరు అర్ధం చేసుకోలేదు” అని చివాట్లు పెట్టారు.
“రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి అంటే మాకేం అర్ధం అవుతుంది? దారిలో ఉన్న సామాన్లు తియ్యమని చెప్పవచ్చుగా... అయినా రోజూ ఏదో ఒకటి ఆయాన్ష్ కి చెప్తారు కదా అలాగే అనుకున్నాం. అందుకే మేము చూస్తూ నిలబడ్డాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాకు అర్ధమయ్యేటట్లు చెప్పండి.” అన్నారు శ్రీకాంత్, పల్లవి.
చెప్పడం ప్రారంభించారు రాజేశ్వరమ్మ గారు.
"స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు నిచ్చారు. ఖాదీ వస్త్రాలు ధరించాలని చెప్పడం తో ప్రతీ ఒక్కరూ రాట్నం మీద నూలు వడికి బట్టలు నేసేవారు ఇది ఒక ఉద్యమంలా సాగింది. ఆ సమయంలో గాంధీ గారు వస్తున్నారని తెలిసి అందరూ రాట్నాలతో స్వాగతమిచ్చారు.
రాట్నాలు పట్టుకుని వచ్చేవారి గౌరవార్థం దారిలో ఉన్న వస్తువులు, వాహనాలను (బళ్లను) పక్కకు తీసేవారు. రాట్నం చిన్నదే అయినా దానికి ఇచ్చే గౌరవం అటువంటిది. నాటి నుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.
చిన్న పిల్లలు బుడి బుడి అడుగులేసేటప్పుడు దారిలో ఉన్న వస్తువులను పక్కకు తియ్యమని చెప్పే సందర్భంలో వాడే జాతీయం “రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి." అని కథ ముగించింది రాజేశ్వరమ్మ.
"అబ్బా దీని వెనుక ఇంత కథ ఉందా!" అని నోరెళ్ళబెట్టారు పల్లవి శ్రీకాంత్ లు.
సందట్లో సడేమియా అన్నట్లు ఆయాన్ష్ పెరట్లోకి వెళ్ళిపోయాడు.
(సిరిమల్లె అంతర్జాల పత్రిక సెప్టెంబర్ సంచికలో ప్రచురించ బడింది)
