పల్లెతల్లి
పల్లెతల్లి
పల్లె తల్లి
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
ఇంటిముందు పేడ కల్లాపు జల్లించి ముగ్గు పెట్టింది అనసూయమ్మ. ఆరోజు ముంబాయి నుంచి ఆపల్లెటూరుకి కొడుకూ కోడలు, మనుమరాలు వస్తున్నారని ఎంతో సంబరంతో ఊపిరాడనీయడం లేదామెకు.
పెరట్లోని రకరకాల మందార మొక్కలు ఒకదానికొకటి పోటీపడి పూచినట్లు తోచాయి ఆరోజెందుకో. అరటిచెట్టుకు కూడా సమయానికి గెల తయారవ్వడం ఎంతో తృప్తినిచ్చింది. జామ కాయలు కోయించి , కొబ్బరి చెట్టు నుంచి బొండాలు కూడా తీయించాలి. కొంకుడు కాయలు కొన్ని రాలకొట్టించాలి. అన్నట్టు కరివేపాకూ, మునగాకు కూడా ఎక్కువే కోయించాలి" మనసులో అనుకుంటూ... "ఒరేయ్ రాముడూ" అంటూ పిలిచింది పాలేరుని.
"వస్తున్నా అమ్మాగారూ" అంటూ ఆవులను గడ్డివేసొచ్చి "ఏంటమ్మ గారు" అన్నాడు. "నువ్వు త్వరగా ఆ చద్దన్నం తినేసి...ఈ పనులన్నీ చేసిపెట్టు" అంది అనసూయమ్మ.
ఆవిడ చెప్పినట్టుగానే...చెక్కెరకేళి అరటి గెలని కోసి అరిటాకులతో చుట్టేసి ధాన్యం పోసే గదిలో పెట్టాడు. కొబ్బరి చెట్టు నుంచి బొండాలు తీసాడు. పరువుకొచ్చిన జామకాయలు ఒక సంచినిండా కోసాడు. వాటితో పాటూ మునగాకు, కరివేపాకూ కూడా ఎక్కువే కోసాడు.
ఆరోజు ఇల్లంతా కూరలు తెగ ఘుమఘుమ లాడిపోతున్నాయి. ఆరోగ్యానికి మంచిదని కరివేపాకు, మునగాకు పొడులు వెల్లుల్లి వేసి దంచిందేమో వాటి వాసన కూడా అదిరిపోతోంది. వెన్నపూసను కాచి కమ్మటి నెయ్యిని చేసి సీసాలో నింపింది. అవన్నీ ముంబాయికి తీసుకుపోతారని ముందుగానే రెడీ చేసేస్తోంది అనసూయమ్మ.
భార్య హడావిడి చూసి ముసిముసిగా నవ్వుకున్నారు గోవిందయ్య.
నీ పిచ్చి గానీ...వాళ్ళు వచ్చి రెండురోజులుండి వెళ్ళిపోతారు. ఈమాత్రం దానికే ఇంత హడావుడి చేస్తున్నావు అన్నారు.
పోనీ లెండి. ఏదో పెద్దవాళ్ళం ఇక్కడున్నామనే కదా చూడ్డానికి వస్తున్నారు. అంతకంటే ఎక్కువ రోజులుండటానికి వారికి మాత్రం సమయం ఎక్కడుంటుంది చెప్పండి...? ఇప్పుడు కొడుకూ కోడలతో పాటూ మనుమరాలు కూడా జాబ్ చేస్తుంది. ఇక్కడకొచ్చి ఉండిపోవాలనుకుంటే వారికి మాత్రం సెలవులు వుండద్దూ...? అంటూ భార్య వెనకేసుకురావడంతో...ఆవిడ చెప్పిన దాంట్లో నిజముందనుకుని మౌనంగా ఉండిపోయారు.
కొడకు, కోడలు, మనుమరాలు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. వచ్చీరావడంతోనే కొబ్బరి బొండాలు కొట్టిచ్చి...జామకాయ ముక్కల్ని అందిచ్చింది అనసూయమ్మ. ఎంతో ఇష్టంగా తాగారు...తిన్నారు.
పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ...ఎలాగూ ఒక వారం రోజులు వుందామనుకుంటున్నాం ఈసారైనా నాన్నగారి కోరిక ప్రకారం పొలానికి వెళ్లి వ్యవసాయపనులు ఎలా చేస్తారో చూద్దామనుకుంటున్నాను అన్నాడు కొడుకు శేఖరం.
అవునత్తయ్య గారూ...నేను కూడా మీ దగ్గర కొన్ని రకాల కూరలు నేర్చుకుందామనుకుంటున్నాను. అస్తమానూ మీ అబ్బాయి మీరు వండే ఆ గుత్తివంకాయ కూర, గోంగూర పచ్చడి, చేపల పులుసు, అల్లం పులుసు ఒకటేమిటి ఎన్నో తలుస్తూ వుంటారు. అన్నీ కాకపోయినా కొన్నైనా నేర్చుకునే తీరతాను అంది కోడలు రమ్య.
"అవును నానమ్మా...వచ్చినప్పటినుంచీ నిన్నే తదేకంగా చూస్తున్నాను. నీకింత వయసు వచ్చినా...నీ జుట్టు నల్లగా ఒత్తుగా అంత పొడవుగా ఎలా ఉంది...? ఇన్నాళ్ళబట్టి నీజుట్టుని ను నేనసలు ఎప్పుడూ గమనించలేదు" అంది అప్పుడే కొత్తగా చూసినట్టు.
నేనూ నిన్ను చూస్తూనే వున్నాను స్వాతీ. చక్కటి జుట్టుని అలా కత్తిరించేసుకుని...విరబోసుకుని ఉన్నావు. జుట్టు కూడా ఎంతో పల్చబడిపోయింది. ఏం ఫ్యాషన్ లో ఏమో...? స్కూలు కెళ్లేటప్పుడు చక్కగా నూనె రాసుకుని రెండు జడలూ రిబ్బన్లతో పైకి కట్టుకున్నప్పుడు వెంట్రుకులెంతో నిగానిగలాడుతూ ఉండేవి. ఇప్పుడు చూడు ఎంత పేలవంగా తయారయ్యాయో. ఇంత చిన్న వయసులోనే వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నాయంటే నువ్వు జుట్టు సంరక్షణ చేయడం లేదు"...చిరు కోపంగా మందలించింది మనుమరాల్ని.
"మరేం చేయను నానమ్మా... మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలే అలాంటివి. అమెరికన్ కంపెనీకి ఆన్లైన్లో పనిచేస్తూ ఉండటం వల్ల మా డ్రెస్డింగ్, జుట్టు వదిలేసిన హెయిర్ స్టైల్ లో కొంచెం మోడరన్ గా కనిపిస్తూ పనిచేయాలి. నూనె పెట్టి జడలు వేసుకుంటూ... పూవులు పెట్టుకుని చీరలు కట్టుకుంటే నవ్వుతారు కూడా "... బుంగమూతి పెట్టి అంది స్వాతి.
మనుమరాలి బాధను అర్థం చేసుకుని... మురిపెంగా నవ్వేసింది అనసూయ.
"వద్దులేవే...నీకు నచ్చినట్టే నువ్వుండు గానీ.. నీకు నేను తయారు చేసిన నూనె ఇస్తాను. రోజూ కాకపోయినా వారానికి రెండు సార్లైనా తలకు బాగా మద్దనాచేసి నేనిచ్చే కంకుడుకాయలతో తల స్నానం చేసావనుకో...మళ్లీ నీజుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పొడవుగా అవ్వడం ఖాయం అంది.
నానమ్మ అంత భరోసాగా చెప్పడంతో..."అవునా నానమ్మా...నువ్వు అలాగే చేస్తూ వుంటావా ఇప్పటికి కూడా. ఇంతకీ ఆ నూనె ఎలా తయారు చేస్తావు"...? అంది ఎంతో శ్రద్దగా.. ఆశ్చర్యపోతూ.
"అవునే తల్లీ...నేను నిత్యం నూనె రాసుకుంటూ... మందార ఆకులు, కొంకుడు కాయలతో తల రుద్దుకోవడం వల్లే నావెంట్రుకలు ఇప్పటికీ ఊడకుండా తెల్లబడకుండా ఉంది .
ఇంతకీ కొబ్బరి నూనెలో నేనేం వేస్తానంటే.... ఓ అరకేజీ ఆడించిన కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు, గుప్పెడు, గోరింటాకు, గుప్పెడు గుంతకలవరాకు, ఐదంగుళాల కలబంద ఆకులోని గుజ్జు, ఉసిరి కాయలు, మందారపూలు ఇవన్నీ వేసి వాటి పచ్చిపోయేవరకూ బాగా మరిగించి వడపోసి సీసాలో పోసుకుంటాను".... అంటూ ఎంతో గొప్పగా చెప్పింది మనుమరాలికి అనసూయమ్మ.
"అలాగే నానమ్మా తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు నువ్వు పిండివంటలు ఏమీ చేసి ఇవ్వక్కర్లేదు గానీ....ఓ సీసా నిండా నూనెతో పాటూ కొంకుడుకాయలు కూడా కొట్టించి ఇవ్వు" ఎంతో కోరిగ్గా అడిగింది స్వాతి.
మనుమరాలు అలా అడిగిందో లేదో ఆ మర్నాడే సిద్ధం చేసేసింది. అక్కడున్న వారం రోజులూ మనుమరాలికి జుట్టు సంరక్షణ చేస్తూ...కోడలకు కూరలు నేర్పుతూ అనసూయ ఉంటే...గోవిందయ్య కొడుక్కి పొలంలోని తమ హద్దులు చూపిస్తూ వ్యవసాయంలోని లాభనష్టాల్ని కూడా వివరించి చెప్పారు.
కొడుకు, కోడలు,మనుమరాలు తిరిగి వెళ్లిపోతుంటే..ఆ దంపతులకు కొద్దిగా బాధనిపించినా....ఈసారి మాత్రం వారం రోజులు గడిపి వారన్నీ తెలుసుకున్నందుకు చాలా తృప్తిగా అనిపించింది.
ప్రశాంతకు ప్రతిరూపమైన పల్లెనొదిలి వారినుంచి సెలవుతీసుకుని ముంబాయి తిరిగివెళ్తుంటే కొడుకు కుటుంబానికి కూడా గుండెలు బరువెక్కాయన్న విషయం ఆ దంపతులకు తెలీదు...!!!*
