శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.7  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

నిరుద్యోగి

నిరుద్యోగి

2 mins
470


            నిరుద్యోగి

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   కమల్ నిరుద్యోగి...!

   పదమూడేళ్ళుగా ఉద్యోగం కోసం పడిగాపులు పడుతూ ఎదురుచూస్తూనే వున్నాడు. కనీసం ఒకాఫీసు నుంచి కూడా ఇంటర్వ్యూ రాకపోవడం అతని దురదృష్టమో...ప్రభుత్వ అసమర్థతో తెలీదు.


   ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో తన పేరు నమోదు చేయించుకున్నది ఇరవైఏళ్ల వయసప్పుడు. అంటే అతను బిఏ పాసైనప్పుడు. 


   ఉద్యోగర్హతకు మరో ఆరునెలలు మాత్రం గడువుంది. పదమూడేళ్ళుగా ఎదురుచూస్తూ వస్తుందేమో అనుకుంటున్న ఉద్యోగం ఇక వస్తుందని అతనిలో ఏ కోసాన్నా నమ్మకం లేదు. ఉన్న కాలం కాస్తా గతంలాగే గడిచిపోతే తన చదువుకు సార్థకత లేదని తెలిసి కమల్ మనసు విరిగిపోయింది. తన సమస్యకు పరిష్కారాన్ని బాగా ఆలోచించి టేబుల్ పైనున్న కాగితం కలాన్ని అందుకున్నాడు.


         **       **       **


  రాఘవాచార్యులు ఇల్లు అర్చకుల మంత్రాలతో హోరెత్తిపోతుంది. 


   ఆ తంతు అలా జరుగుతుండగా పోస్ట్ అంటూ ఓ లెటర్ రావడంతో భారంగా నిట్టూర్చారు రాఘవాచార్యులు.


   కమల్ పేరున ఓ గవర్నమెంటు ఆఫీసు నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ చూడగానే...కొడుకు తొందరపాటుకు మరింతగా కుమిలిపోయారు.  

   

   కొడుకు రాసిన ఆ ఉత్తరంలో...


   జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,

   ఇన్నాళ్లూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే వున్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం పోయింది. పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నాభారాన్ని మీపై వేస్తాను..? అలాగని ఏ కూలో నాలో చేసుకుని బ్రతకలేని డిగ్రీ హోల్డర్ని. వృద్దాప్యానికి చేరుకున్న మిమ్మల్ని నేను పోషించాల్సింది పోయి మీరు నన్ను పోషించడం నన్నెంతగానో బాధిస్తుంది. బ్రతికుండగా మీకు నేను ఓ ముద్ద పెట్టలేకపోయాను. నేను చచ్చి కూడా మీతోనే పిండం పెట్టించుకోవాల్సిన రోజు మీకు కల్పిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది. మీకు దూరమవుతున్నందుకు నన్ను క్షమించండి.

                         మీ

                         కమల్.


   పదకొండు రోజుల క్రితం కొడుకు రాసిన ఆ అక్షరాలు నీలిమేఘాల్లా కళ్ళల్లో అలుముకునేసరికి ...ఉబికిపెట్టుకున్న దుఃఖం పైకి పొంగుకొచ్చింది రాఘవాచార్యులకు.


   వాడు బ్రతుకుతెరువుకి భయపడి పిరికివాడై ప్రాణాలు తీసుకున్నాడు గానీ... నేను ఏం చదుకున్నానని అందర్నీ పోషిస్తూ సంసారభారాన్ని మోస్తున్నాను..? నేర్చుకున్న నాలుగుముక్కల వేదంతో నమ్ముకున్న నాలుగిళ్ళల్లో శుభకార్యాలకు పురోహితుడిలా కొనసాగుతున్నాను. పాడుబడ్డ దేవాలయాల్లో అర్చకుడిగా వెళ్తూ భక్తులు వేసే దక్షిణలను ఏరుకుంటున్నాను. పండక్కోపబ్బానికో అందరూ ఇచ్చే స్వయంపాకాలతో కూడా మీ అందరికీ పొట్ట నింపుతున్న బ్రతకనేర్చిన మనిషిని. 

   

   నాకు తెలిసిన విద్యలు నీకు తెలియవనే కష్టపడి వెనకేసిన కొంత డబ్బుని ఉద్యోగం కోసం తల్లడిల్లుతున్న నీకు ఉద్యోగం ఇప్పించమని ఓ అధికారి కాళ్ళా వెళ్ళా బ్రతిమాలి అతని చేతిలో దక్షిణ అర్పించుకున్నాను. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. దాని ఫలితమే ఈరోజు నీకోసం వచ్చిన కాల్ లెటర్ ఇది. మనసులోనే చనిపోయిన కొడుక్కి చెప్పుకుంటూ... ఆ ఇంటర్వ్యూ లెటర్ని కూడా కొడుక్కి పెడుతున్న పిండాలతో పాటూ గోదాట్లోకి వదిలేసి.... కొడుకు ఆత్మశాంతికై దేవుడ్ని ప్రార్థిస్తున్నారు రాఘవాచార్యులు...!!*


             ***   ***   ***


   



Rate this content
Log in

Similar telugu story from Inspirational