ముసిరేసిన మనసులు
ముసిరేసిన మనసులు
" ముసురేసిన మనసులు"
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
ఆరోజు ఎంతకీ కోడికూయలేదు...! అసహనంగా మంచంపై దొర్లుతుంది మహాలక్ష్మి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని రాత్రి నుంచి ఎదురుచూస్తూ సరిగా నిద్రపోలేదు సరికదా..పట్టిన ఆకొంచెం నిద్రా కలత నిద్రే. ఎదురుచూస్తున్న కోడె కూతతో..గబుక్కున లేచిపోయింది . వాకిలి ఊడ్చి...కల్లాపు జల్లి అందంగా ముగ్గుపెట్టింది. భర్త రామారావు కూడా రోజూ కంటే ముందుగానే లేచి స్నానాది కార్యక్రమాలు కానిచ్చేశారు.
ఆరోజు ఉదయమే ...అమెరికా నుంచి కొడుకు,కోడలు మనుమలు వస్తున్నారన్న ఆనందం అంతా ఇంతా కాదు. గుమ్మం ముందు ఆగిన కారులోంచి దిగిన కొడుకూ,కోడలు,మనుమల్ని చూసి ...వారికళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. లోలోన ఉబ్బితబ్బిబ్బై వారిని సాదరంగా లోనికి తీసుకెళ్లారు దంపతులైన మహాలక్ష్మి, రామారావు.
అవును మరి...మూడేళ్ళ తర్వాత కొడుకు కుటుంబం వస్తే యే తల్లిదండ్రులు ఆనందించరూ...?
"చాన్నాళ్లు అయిపోయిందిరా మిమ్మల్ని చూసి. నీకు కొంచెం ఒళ్ళు వచ్చింది గానీ... కోడలు ఇంకాస్త నాజూగ్గా అయిపోయింది. పెద్ద మనుమడు ప్రశాంత్ భలే పొడుగయ్యాడు .ఈ బుజ్జిగాడికి మేము గుర్తున్నామో లేదో..ఐదేళ్లు నిండిన చిన్న మనుమడి బుగ్గలు నిమిరి ముద్దులాడుతూ...మురిపెంగా చూసుకుంది మహాలక్ష్మి.
నానమ్మ,తాతయ్యలను కొత్తగా చూస్తుంటే...గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాథర్ అంటూ కొడుకులిద్దరితో నమస్కారం పెట్టించాడు తన తల్లిదండ్రులకు శ్రీనివాస్.మనుమల సంస్కారానికి తెగ ముచ్చటపడిపోయారిద్దరూ.
"బాగున్నారా అత్తయ్య" అంటూ కోడలు ఆప్యాయంగా పలకరించింది. ఆ పలకరింపు చాలు ఈకాలంలో పెద్దలు ఆశించేది...తమకు ఏం చేసినా చేయకపోయినా...! కోడలు కుశలప్రశ్నకి ...ఎంతో పొంగిపోయింది మహాలక్ష్మి.
"అదిగో చూస్తే తెలియడం లేదూ...మీరు వస్తున్నారని తెలిసినప్పటినుంచీ ఎక్కడలేని ఓపికా వచ్చేసింది మీ అత్తగారికి. జంతికలు, చేగోడీలు, అరిసెలు, ,సున్నుండలు ఇలా ఒకటేమిటి ఏదో ఒకటి అలా చేస్తూనే క్షణం తీరిక లేకుండా ఉంది."భార్యని ఆటపట్టించే ధోరణిలో కోడలికి జవాబిచ్చారు మావగారైన రామారావు.
"మీరు మాత్రం తక్కువా...? మనోళ్లు వస్తున్నారంటూ...ఇంటికెన్ని మరమ్మత్తులు చేయించారని? తాపీ మేస్త్రి అంటూ నాలుగు రోజులు, ఎలక్ట్రీషియన్ అంటూ నాలుగు రోజులూ, అదేపనిగా తిరుగుతూ వాళ్ళతో ఏదో ఒకపని చేయిస్తూనే వున్నారు కదా. అదంతా మీకొడుకు కుటుంబం ఎక్కడా ఇబ్బంది పడకూడదనేగా" కిందా మీదా పడిపోతూ పనులు కానిచ్చిన భర్త పడ్డ శ్రమనంతా ఏకరువు పెట్టేసింది భార్య మహాలక్ష్మి.
తమకోసం తల్లిదండ్రులు పడిన ఆరాటం తెలిసేసరికి...కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనివాస్ కి. అమెరికా వెళ్లి వీరినెంతగా మిస్సయ్యాడో బాగా అర్థమైంది.
ఒరేయ్...మీరెళ్లి ఆ ఏసీ గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి. అసలే ఎండలు మండిపోతున్నాయి.మీరొచ్చింది అసలే చల్లటి ప్రదేశం నుంచి.పిల్లలతో ఇక్కడెలా తట్టుకుంటారో ఏంటోననే మనూరి ప్రెసిడెంట్ గారబ్బాయిని టౌన్ తీసుకెళ్లి ఏసీ ని కొనుక్కొచ్చాను. అమ్మ భోజనాలవీ ఆగదిలోకే తెచ్చి పెడుతుంది గానీ... మీరు మాత్రం బయటకు రాకండి.గాలుపు కొట్టేస్తాది.ఎన్నో జాగ్రత్తలు చెప్తూ...వారు తెచ్చుకున్న పెద్దపెద్ద పెట్టెలు ఆగది లోపలే పెట్టించారు రామారావు.
'సరే...నాన్నా..! మీరు కూడా రెస్ట్ తీసుకోండి.జెట్లాగ్ వల్ల మాకూ నిద్రవస్తుంది.కొంచెంసేపు పోయాకా మాట్లాడుకుందాం."అంటూ కొడుకు శ్రీనివాస్ అనేసరికి...తల్లి మహాలక్ష్మి అదేమిటిరా భోజనం చేసి పడుకోవచ్చు కదరా అంది.
"అబ్బే లేదమ్మా...ఫ్లైట్ లోతిన్నదే ఇంకా అరగలేదు.ఈపూటకి వొద్దు.రాత్రికి తింటాం. పిల్లలకి ఎలాగూ అక్కడనుంచి వాళ్ళు తినే ఫుడ్ ప్యాక్స్ తెచ్చాము.ఈరోజుకి అవి తినేస్తారు." అని చెప్పేసరికి ...సరే రా మీఇష్టం మరి. ఫ్రిడ్జ్ లో మినరల్ వాటర్ ,కూల్డ్రింక్స్ ,జ్యూస్ లవీ కొనితెచ్చి పెట్టారు నాన్న. దాహం వేస్తే అవి మాత్రమే తాగండి" అంటూ అక్కడ నుంచి కదిలింది మహాలక్ష్మి.
సాయంత్రం అయ్యేసరికి...ఊర్లోనే ఉన్న రామారావు చెల్లెలు కుటుంబమంతా వచ్చారు.అమెరికా నుంచి వచ్చిన మేనల్లుడు ఫ్యామిలీని చూసి పలకరించి పోదామన్నట్టు. దూరపు ఆత్మీయులు దగ్గరకు వస్తే...బంధువర్గమంతా ఒకేచోట గుమిగూడడంలో ఉన్న మజాయే వేరు. ఆఇల్లంతా కబుర్లతో సందడిగా మారింది. అమెరికా నుంచి తెచ్చిన చాక్లెట్ పాకెట్స్ని తీసి మేనత్త మనుమల చేతిలో పెట్టాడు శ్రీనివాస్. అవి అందుకున్న ఆపిల్లల ముఖాల్లోని ఆనందం అంతాఇంతా కాదు. తెలుగు రాని పిల్లలు,ఇంగ్లీష్ రాని పిల్లలు కలిసి ఒకచోట చేరారు. మాటలు అర్థం కాకపోయినా...అర్థమైన రీతిలో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటుంటే...పెద్దవాళ్ళంతా నవ్వుకున్నారు.
ఎంత అమెరికాలో ఉంటే మాత్రం మన మాతృభాషంటూ వాళ్ళకీ రావాలి కదరా...? ఇలా వచ్చినప్పుడైనా మాలాంటివాళ్లతో మాట్లాడటానికి నాలుగు తెలుగు మాటలైనా నేర్పించొచ్చు కదా...మేనత్త మేనల్లుడిని చిలిపిగా చివాట్లేసింది.
ఆవిడ మాటలకు...శ్రీనివాస్ నవ్వేసినా...అతని భార్య సుశీల సంజాయిషీ ఇచ్చుకుంది...! పిల్లలు మాట్లాడలేకపోయినా...తెలుగులో ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు పిన్నీ. మేము ఉద్యోగాలకు వెళ్లిపోతూ ఉండటం వల్ల చిన్నప్పుడే చిల్డ్రన్ కేర్స్ లో జాయిన్ చేయడం వల్ల, ,ఆతర్వాత స్కూల్స్ లో బిజీ అయిపోడం వల్ల తెలుగు మాట్లాడ్డం పూర్తిగా మానేశారు...అంటూ పిల్లల్ని దగ్గరకు పిలిచి...అందర్నీ పరిచయం చేసింది. వాళ్ళందరూ తెలుగులో మాట్లాడ్డంతో...వచ్చీరాని భాషతో చెప్తున్న ....ఆపిల్లల ముద్దుమాటలకు మురిసిపోయారంతా.ఆరోజు రాత్రి అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ కమ్మటి భోజనం రుచి చూపించింది మహాలక్ష్మి.
కొడుకు కుటుంబం వచ్చి వారం రోజులైనా క్షణాలే గడిచినట్టుగా ఉంది. వంటగదిలో వంట చేస్తున్న అత్తగారిదగ్గరకు సుశీల వచ్చి...మా అమ్మ గారి ఊరెళ్లి అటునుంచి అటే అమెరికా వెళ్లిపోతామని చెప్పడంతో కొంచెం తడబడింది మహాలక్ష్మి. అప్పుడేనా...అని అనబోతూ మనసుని తమాయించుకుంది . అంతదూరం నుంచి వచ్చిన కోడలు తన పుట్టింటికి వెళ్తానంటే ఎలా కాదనగలదు..? అక్కడైనా ఒక వారం రోజులే కదా గడిపేది. అందుకే...మనసునుగ్గపెట్టుకుని "సరే అమ్మా "అంటూ ఊ కొట్టింది. కోడలు అత్తగారి మొఖంలోని నిరుత్సాహాన్ని గమనించిందేమో..."మీ అబ్బాయి మమ్మల్ని అక్కడ దింపేసి రెండు రోజులుండి మళ్లీ మీదగ్గరకొచ్చి గడుపుతారు లెండి.ఈసారి మీరు అమెరికా రావడానికి ప్లాన్ చేసుకోండి.ఇలా ఇక్కడెంత కాలం చెప్పండి" ?అంటూ సున్నితంగా ఆహ్వానించింది. కోడలు మాటలకు అత్తగారేమీ సమాధానం చెప్పలేకపోయింది.చిన్న చిరునవ్వు నవ్వేసి..కోడలికి కాఫీ కప్పుని అందించింది.
కొడుకు భార్యా పిల్లలతో అత్తగారి ఊరు ప్రయాణమై వెళ్ళిపోయాక... ఇల్లంతా చిన్నబోయినట్టు అయింది.
బై నానమ్మా,తాతయ్య అని చెప్పి వెళ్లిపోతున్న మనుమల్ని మనసారా గుండెలకు హత్తుకున్నప్పుడు...ఏదో తెలియని తన్మయత్వం మనసంతా. ఆ అనుభూతి దూరమై పోతుంటే...మనసెంతగా కదిలిపోయిందో...? తాము కొన్న కొత్తకారుకి డ్రైవర్ ని కుదిర్చిపెట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్లీ అబ్బాయి గారు వచ్చేవరకూ సిటీలో వారితోనే ఉండు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాడు రామారావు.
ఆ వారం రోజులూ మనుమల్ని ఊర్లోకి తీసుకెళ్లి తానిష్టపడే ఆపచ్చదనాన్ని, గుళ్ళూ,కొనేరులు చూపించినా...పెద్దగా ఆసక్తి, సంతోషం చూపించని మనుమలని గమనించి...వాళ్ళకి సిటీలోని అమ్మమ్మ గారింటిదగ్గరైనా కొంచెం బాగా కాలక్షేపమైతే బాగుండును అనుకున్నారు రామారావు.
* * *** **** ****
రెండురోజుల తర్వాత అత్తగారింటి దగ్గరనుంచి వచ్జిన కొడుకుని చూడగానే...మళ్ళీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది...!
ఇంట్లో ఉండగా తల్లితోనూ..బయటకు వెళ్తే తండ్రితోనూ గడిపిన కొడుకును చూస్తే...మళ్లీ వాడి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి వారికి.వీడు ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆ అలవాటుతో సర్దుకుపోతున్నాడు. మనుమలు పుట్టింది విదేశంలో కాబట్టి ఇక్కడ వాతావరణం వాళ్ళకి నచ్చలేదు. ఎక్కడ అలవాటు పడితే అక్కడీకే మనసు పోతుందన్న మాట నిజమే...!
ఆ విషయాన్నే కొడుక్కి చెప్పి సంబరపడుతున్న..తల్లినీ తండ్రిచూస్తూ ..తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు. జరిగినదేదో జరిగిపోయింది. నేను ఇక్కడ మీతో ఉండిపోదామని వున్నా..ఇంకా చక్కబెట్టాల్సిన బాధ్యతలు మిగిలిపోయాయి. మీరే నాకొరిక మన్నించి అమెరికాకి వచ్చేయకూడదూ...? మనమధ్య ఎందుకీ దూరం..? వాళ్ళను విడిచి ఉండలేక తాను నిర్ణయించుకున్న మాటను మళ్లీ రెండోసారి తీసుకొస్తూ అడిగాడు. కొడుకు ఈమాట మళ్లీ అడుగుతాడని ముందే తెలుసు.ఈసారి మాత్రం తమ మనసులోని మాట చెప్పేయడానికే సిద్ధమయ్యారు.
అది కాదురా...మమ్మల్నీ అర్థం చేసుకో...! మీ పెద్దోడు పుట్టినప్పుడు అక్కడకి వచ్చున్న ఆ ఆరునెలలూ మీరు మమ్మల్ని ఎంతబాగా చూసుకున్నా...అక్కడ వాతావరణం మాఆరోగ్యానికి సరిపడలేదు. ఇక్కడ ఈపచ్చదనంలో అలవాటు పడిపోయి... అక్కడ ఆమంచుముక్కల్లో ఒళ్ళు ముద్దయిపోయేది. కరెంటుతో వాడే ఆహీటర్లూ, ఏసీల గదుల్లో కృత్రిమమైన ఆవాతావరణంలో ఎంత సేపని ఉండగలం చెప్పు..? ఇక్కడైతే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తే చాలనిపిస్తుంది. ఇప్పుడు మేము దేనికీ ఇబ్బంది పడకుండా ఇలా ఉండగలుగుతున్నామంటే... అదంతా మీరిద్దరూ అమెరికాలో బాగా సంపాదించబట్టే కదా. ఉన్న ఇంటికి మరో రెండుగదులు పొడిగించి ఎటాచ్డ్ బాత్రూంలు కట్టించి ఆధునాతనంగా తీర్చిదిద్దినా... ఇంటినిండా మంచి ఫర్నిచర్ కొనుక్కున్నా, సిటీ పోవాలంటే ఏ ఎర్ర బస్సూ ఎక్కనీయకుండా కార్ కొనుక్కోమని నువ్వు డబ్బు పంపబట్టే.. దాన్ని కూడా ఇంటిముందు హోదాగా పెట్టుకున్నాం. అమ్మ కేన్సర్ నుంచి బయటపడి మళ్లీ మునుపటిలా ఇలా తిరగగలుగుతుందంటే సమయానికి నువ్వు అక్కడ నుంచి లక్షల్లో డబ్బు పంపించబట్టే అంత ఖరీదైన వైద్యం చేయించగలిగాను. నువ్వు అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించబట్టే..అప్పులు పోయి ఇలా మంచి స్థాయిలో నిలదొక్కుకున్నాము. నీవిక్కడే మాతోపాటే ఉండిపోయి ఉంటే మనమింత పైకి వచ్చేవాళ్ళమే కాదు..ప్రతినెలా నువ్వు పంపే డబ్బుతో మాకు ఏలోటూ రాకుండా హాయిగా రోజులు గడిచిపోతున్నాయి.. అవసరం అనుకున్నప్పుడల్లా సిటీకి పోయి డాక్టర్ చెకప్ చేయించుకుంటూనే ఉన్నాం. మిమ్మల్ని పలకరించాలన్నా..చూడాలన్నా.. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చూపించావు. బుల్లి ప్రపంచమేదో మాచేతిలోకి వచ్చినట్టైంది. మీరే మీకు వీలైనప్పుడు మేమిద్దరం కలిసున్నంత కాలం చూడ్డానికి వస్తూ ఉండండి. ఆతర్బాత ఎవరో ఒకరు మిగిలిపోక తప్పదు.అప్పుడు ఎక్కడుండాలన్నది ఆరోజు వచ్చాకా ఆలోచించొచ్చు.మీరు దూరంగా ఉన్నారన్న మాటే గానీ...మా మనసుల్లో ఎప్పుడూ దగ్గరగానే వుంటారు కొడుకుని నొప్పించకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తూ అనునయంగా చెప్పారు రామారావు.
నిజమే...తండ్రి చెప్పినదాంట్లో తప్పులేదు. కానీ నాకే ఏదో గిల్టీ ఫీలింగ్. ఉన్న ఊరుని వదిలేసి చదువు పేరుతో విదేశానికి ఎగిరిపోయాను. నాతోపాటు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి సిటిజన్స్ ని చేసాను. నా భార్యకి కూడా అక్కడ నుంచి రావాలని లేదు. ఇప్పుడు వాళ్ళక్కడ బాగా అలవాటు పడిపోయారు. ఇండియా కి వెళదాం అంటే...మేము రామంటూ పిల్లలు మొండికేస్తే బుజ్జగించి తీసుకొచ్చాను. మళ్లీ ఈసారి రమ్మంటే వస్తారో లేదో కూడా అనుమానమే. చిన్నవాళ్ళై ఉండి ఇండియా లో ఇరవైరోజులు కూడా ఉండలేని వాళ్ళు ఈపెద్ద వయసులో వీరిని ఆచలి ప్రదేశానికి వచ్చేయమని నాలుగు గోడల మధ్య ఉంచేస్తూ అప్పుడప్పుడు బయట ప్రపంచం చూపిస్తూ ఇబ్బంది పెట్టడం తప్పే. కానీ...ఇప్పుడున్న ఈపరిస్థితిలో వీరు అక్కడకు రారు...మేమిక్కడకు రాలేము. అందరూ కలిసి ఉండాలని మా మనసుల్లో వున్నా...పరిస్థితులు అలా ఎదురయ్యాయి.
"నాన్నా...నన్ను క్షమించరూ...? ఆనాడు నన్ను డాక్టర్ చదువుకోమని మీరెంతగా అడిగినా...నాకు బొత్తిగా ఇంట్రెస్ట్ లేని ఆ కోర్స్ కి దూరంగా ఉండేవాడిని. నాలో ఆలోచనలన్నీ వేరుగా ఉండేవి. ఎదుగూ బొదుగూ లేని మనజీవితాల్లో వెలుగుని నింపాలనుకుని...నేననుకున్న మార్గంలో చదువు సాగించాను. అనుకున్నట్టుగానే విదేశంలో ఉద్యోగం సంపాదించాను. 'కష్టం వెనుకే అవకాశం ఉంటుంది'అన్నట్టు నేనక్కడ వరల్డ్ వేవ్స్ టెక్నిలజీ కంపెనీకి సీఈఓ గా ఉన్నానంటే నాకిష్టమైన సబ్జెక్ట్ పై దృష్టిని పెట్టి చదవగలిగాను కాబట్టే. ఒక విధంగా నాకల నెరవేరినా...మీ ఆశ నెరవేర్చలేకపోయానన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది" అంటూ మనసు లోని వేధన తండ్రికి చెప్పాడు.
"అవునురా...తల్లిదండ్రులు పిల్లలకు రెక్కలొచ్చేవరకూ బాధ్యత వహించాలి గానీ...వారిదే చదవాలి అని పట్టుబట్టకూడదని నువ్వింత పెద్ద పొజిషన్ లోకి వచ్చాకా గానీ మాకర్ధంకాలేదు" ఎంతో గర్వంగా కొడుకు భుజం తట్టి చెప్పారు రామారావు.
నన్ను అమ్మా నాన్నా అర్థం చేసుకున్నా.. బంధువులు అర్థం చేసుకోవడం లేదు. ఈ వయసులో మీ అమ్మానాన్నని అలా వదిలేస్తే ఎలా..? వారినైనా తీసుకెళ్లిపోండి..లేదా మీరైనా ఇక్కడకు వచ్చేయండి అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు నేను వీరికేదో అన్యాయం చేస్తున్నట్టు . కందకు లేని దురద కత్తిపీటకెందుకో...? మనసు చాలా గందరగోళంగా తయారైంది శ్రీనివాస్ కి.
మర్నాడు ...వెళ్ళొస్తాను అంటూ...తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకుని అత్తగారింటికి ప్రయణమయ్యాడు శ్రీనివాస్. అక్కడ నుంచి భార్యాపిల్లలతో అమెరికా వెళ్లిపోడానికి...!
కొడుకుని ఊరి పొలిమేరవరకూ సాగనంపుతూ... బంధువుల మాటలు నువ్వేమీ పట్టించుకోకురా...మనకు మనం అర్థమైనప్పుడు...అవన్నీ మరచిపోవాలి.కొడుకు అంతర్మధనం గ్రహించిన తండ్రి.. కొడుకు భుజంపై తట్టి చెప్పి మరీ వెనుతిరిగారు. దూరమౌతున్న ఆత్మీయత కు గుండె బరువెక్కింది.మనసుని మభ్యపెట్టడం చెప్పినంత తేలికైన విషయమేమీ కాదు.అందుకే...రామారావు,మహాలక్ష్మి ల మనసులు మళ్లీ ముసురుపట్టాయి. కార్లో అటుగా వెళ్తున్న కొడుకు పరిస్థితీ అంతే.తల్లితండ్రులను విడిచి వెళ్లలేక వెళ్తూ...తన మనసు కూడా ముసురేయడం మొదలు పెట్టింది శ్రీనివాస్ కి....!!
***** ********** *******
