kottapalli udayababu

Inspirational

4  

kottapalli udayababu

Inspirational

మనిషిని నమ్మితే ఏముందిరా? (కధ)

మనిషిని నమ్మితే ఏముందిరా? (కధ)

7 mins
978


మనిషిని నమ్మితే ఏముందిరా? (కధ) – కొత్తపల్లి ఉదయబాబు


పాఠశాల గేట్ దగ్గర బైక్ ఆపాను.

సరిగ్గా అప్పుడే ఒక ముసలాయన సంచీ నిండా బాదంఆకులు తీసుకుని బయటకు వస్తూ నన్ను చూసి “నమస్కారం మాస్టారూ” అని చెప్పేసి ముందుకు నడవబోతుంటే “ఆగు తాతా.పడిపోతావ్. నిన్ను ఒక్కడిని వదిలేస్తే అమ్మ నన్ను తంతుంది “అంటూ ఒక పదేళ్ళ కుర్రాడు వెనకనుంచి వచ్చి ఆయన మరో చేతిని తన భుజాలమీద వేసుకుని నడిపించుకు వెళ్ళిపోయాడు.. నేను ఆయన్ని, ఆ కుర్రవాడిని దాదాపు రోజూ చూసున్నాను. నేను ఆ పాఠశాలకు బదిలీ మీద వచ్చి పదిహేను రోజులు మాత్రమే అయింది.

నేను పాఠశాల ప్రహారీగోడ దాటి లోపలికి ఆడుగుపెట్టేసరికే నా ప్రధానోపాధ్యాయుని గది ముందు కారిడార్ నిండిపోయి ఉంది – పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులతో.

అటెండర్ వీర్రాజు నన్ను చూసి ఎదురొచ్చి నా బైక్ తీసుకుని వెళ్ళాడు సైకిల్ షెడ్ లో పెట్టడానికి.

నేను లోపలికి వచ్చి సీట్లో కూర్చుని హాజరు పట్టీలో సంతకం పెట్టాను.

వీర్రాజు మొదటి గంట కొట్టాడు. నేను బయటకు వచ్చి ప్రార్ధనా ప్రదేశం లో నిలబడ్డాను. ఉపాధ్యాయులు, విద్యార్ధులు వచ్చినవారందరూ హాజరయ్యారు.

ప్రతే రోజు ప్రధానోపాధ్యాయునిగా నాలుగు మంచి మాటలు, ఆరోజు ఉదయం నేను వార్తాపత్రికలలో చదివిన ముఖ్య వార్తలు, ఆరోజు ప్రాముఖ్యత వీటన్నిటిని సమన్వయం చేసి చెప్పడం నాకు అలవాటు.

ప్రార్థన పూర్తయ్యాకా వచ్చి సీట్లో కూర్చున్నాను.

పింఛన్లు పంచే వరలక్ష్మి వచ్చి నాకు నమస్కారం చేసి వృద్ధులందరినీ ‘బాదంచెట్టు’ కిందకు తీసుకుపోయింది. వీర్రాజును పిలిచి రెండు కుర్చీలు, రెండు బల్లలు, రెండు బెంచీలు వేయించుకుంది. వీర్రాజు ముఠ ముఠలాడుతూ వేసి వచ్చి హాజరు పట్టీలు తీసుకుని తరగతి గదుల్లో ఇవ్వడానికి వెళ్ళాడు.

తన నీడలో వందమందికి పైగా కూర్చునేంత విస్తృతంగా పెరిగిన బాదంచెట్టు అది. వరలక్ష్మి ప్రతీనెల మొదటి మూడు రోజులు ఆ బాదంచెట్టు కిందనే వృద్ధులకు, వికాలాంగులకు ప్రభుత్వ పింఛనులిస్తుంది . ప్రస్తుతం ఆమె పోస్ట్ నా పాఠశాలలోనే ఉన్నా, చక్కగా పని చేస్తుందని దేప్యుటేషన్ మీద మున్సిపల్ ఆఫీసువారు తమ ఆఫీసుకు వేసేసుకున్నారు. ఆమె ఈ పాఠశాల పూర్వవిద్యార్ధిని కావడంతో అందరితో కలివిడిగా, చనువుగా ఉంటుంది. అందరికీ ఆమె అంటే చాలా అభిమానం.

నేను ఒకసారి బయటకు వచ్చి అన్ని తరగతుల్లోనూ ఉపాధ్యాయులు ఉన్నారో లేదో పర్యవేక్షిస్తూ వరండాలో నెమ్మదిగా నడుస్తూ చివరకు వచ్చాను. ఇపుడు అక్కడి దృశ్యం, వారి మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఇందాకా నేను చూసిన మాస్టారు సన్నగా ఎండుకొమ్మకు చీర కట్టినట్టుగా ఉన్న ఒక ఆమెను – ఆయన తల్లి కాబోలు, భుజాన ఎత్తుకుని తీసుకువచ్చి బెంచీ మీద కూర్చోబెట్టి తాను ఆమె పక్కనే కూర్చున్నాడు.

నన్ను వరండాలో చూసి వరలక్ష్మి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా…మా అమ్మకు పెన్షన్ ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది.?’’ అని అడిగాడు.

‘’పావుగంట పడుతుంది మాస్టారు.’’ అంది వరలక్ష్మి.

‘’ఈలోగా నేను మాస్టారితో మాట్లాడి వస్తాను. కొంచెం మా అమ్మను కనిపెట్టుకుని వుండమ్మా ‘’ అని తన తల్లి పక్కన కూర్చున్నా మరో ఆమెతో చెప్పి నా దగ్గరకు వచ్చారాయన. ఆయన్ని పరిశీలించాను.

ఆయనకు అరవై ఏడేళ్లు ఉంటాయి.సన్నగా చెరుకుగడలా ఉన్నా బలిష్టంగా ఉన్నాడు. ముతక నేత పంచే మీద ఖద్దరు బనీను ధరించాడు. దవడలు లోపలకు పోయి, మాసిపోయిన గెడ్డం, మీసాలతో సూటిగా మొనదెలిన ముక్కుతో, పరీక్షించి చూస్తే గుచ్చుకుంటాయేమో అనిపించే చూపులతో, నిక్కచ్చితనాన్ని పాటించే దర్పపు ముఖంతో ఉన్నాడు.

‘’మీతో కొద్దిసేపు మాట్లాడాలి సర్. తమరు అనుమతి ఇస్తే…’’ అన్నాడు.

‘’ చెప్పండి.’’

‘’నేను మీలాగే ప్రధానోపాధ్యాయుడుగా చేసి ఉద్యోగవిరమణ చేశాను.’’

‘’అలాగా …అయితే?’’

’’తమకు అభ్యంతరం లేకపోతే మీగదిలో కూర్చుని మాట్లాడుకుందాం. ‘’

ఒకసారి ఆయన్ని ఎగా దిగా చూసి ‘’రండి’’ అన్నాను. నాగదిలో ఒకరికొకరం అభిముఖంగా కూర్చున్నాము.

‘’చెప్పండి’’

‘’నాపేరు లక్ష్మీనారాయణ. మానాన్నగారు పోస్ట్ మాస్టర్ గా చేసేవారు. నేను ఆరోతరగతిలోకి వచ్చినప్పుడు మా నాన్నగారికి ఈ వూరు బదిలీ అయింది. వచ్చిన ఏడాదిలోనే ఈ పేటలోనే సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాము. అప్పట్లో మున్సిపల్ ఉన్నత పాఠశాలలంటే చాలా చిన్నచూపు ఉండేది. నాన్నగారు మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నన్ను చేర్పించారు.

నాకు గణితం అంటే చాలా భయంగా ఉండేది. నాలోని భయాన్ని గుర్తించిన లెక్కల మేడమ్ ‘’ పుష్పవల్లి’’గారు నాలోని భయాన్ని పోగొట్టి, ‘జీవితంలో గణిత ఉపాధ్యాయుడిని మాత్రమే అవ్వాలి’ అన్న లక్ష్యం నిర్దేశించుకునేంతగా నాలో అభిరుచిని కలిగించి, దగ్గర కూర్చొబెట్టుకుని మరీ నేర్పారు.

దానికి కారణం ఆమె ఏ పని చేసిపెట్టమన్నా తూనీగలా పరుగెత్తి చేసెసేవాడిని. నాలో ఆ చురుకుదనం గమనించిన ఆమె ‘’ఇంత చురుకైన కుర్రాడివి ..లెక్కలు అంటే భయం యేమిటి? ఇంతకు ముందు నీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులెవరో ‘లెక్కలంటే నీకు భయం కలిగేలా బోధించారన్నమాట. వాళ్ళు నాలాంటి ఉపాధ్యాయులే కాబట్టి వారు నీలో కలిగించిన ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది ‘లక్ష్మణ్’ ‘అని నాకు ఎంతో శ్రద్ధగా బోధించారు.

మొట్టమొదటిసారి గణితంలో ఫస్ట్ మార్క్ వచ్చినరోజు పుష్పవల్లి మేడమ్ కి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని అనిపించింది.ఏమివ్వాలో తెలియక ఇంట్లో పూసిన ‘సీతమ్మవారి జడగంటలు’ చెట్టు పూవు తీసుకువెళ్లి ఇచ్చాను.

ఆమె నవ్వి..’’ఇది తలలో పెట్టుకోరు నాన్నా..అయినా నీ సంతోషం కొద్దీ ఇచ్చావు కాబట్టి… ”అని జడలో పెట్టుకున్నారు. ఆ తరువాత చదువుకున్నంతకాలం ప్రతీ గణిత పరీక్షలోను నాదే ఫస్ట్ మార్క్.

ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే సర్ …విద్యార్ధులు వెన్నముద్దల్లాంటి మనసులతో మనమేదో తమను గొప్పగా తీర్చిదిద్దుతామని మన పాఠశాలకు వస్తారు. ఆనమ్మకంతోనే తల్లితండ్రులు మనదగ్గర వాళ్ళని నిస్సంకోచంగా వదిలి వెళ్తారు.

మీరు గతం లో పనిచేసిన పాఠశాలల్లో చక్కని విద్యాప్రమాణాలు నెలకొల్పే కార్యక్రమాలు అక్కడ పనిచేసినంతకాలం నిర్వహించారని నేను సేకరించిన సమాచారం వల్ల తెలిసింది. కాబట్టి తమరు అనుమతీస్తే నాకు తెలిసిన రెండు, మూడు సూచనలు చేద్దామన్న చొరవతో మీ ముందుకు వచ్చాను. ‘’అన్నారాయన.

ఎప్పుడో ఎక్కడో నా జాతి ఉపాధ్యాయుడిగా పనిచేసినవాడు కదా అనుకున్నాను గాని ఆయన చెప్పిన విషయం విన్నాకా ఆయనమీద గౌరవం పెరిగి నిటారుగా అయ్యాను.

‘’చెప్పండి సర్ ‘’

‘’ఈ పట్టణంలో ఆరు మునిసిపల్ ఉన్నత పాఠశాలలలో ఇది మొట్టమొదట స్థాపించబడింది. నా చిన్నప్పటినుంచి ఈపేటలో ఉన్న ఈ ‘సరస్వతీ నిలయం’ అంటే నాకు ఎంతో ఇష్టం. నా దురదృష్టం కొద్దీ ఈ పాఠశాలలో చదవలేకపోయాను. ఈ పేటలో విద్యార్ధుల తల్లి తండ్రులు ఎక్కువగా రోజు వారీ వ్యాపారం చేసుకుంటేగానీ బతుకు గడవనివారు. తల్లితండ్రులు ఉదయాన పోయి ఎప్పటికో సాయంత్రానికి ఇల్లు చేరతారు. ఇక ఈ పిల్లలు క్లాసులు ఎక్కొట్టి యేదో వంకతో బయటకి వచ్చేసి ఇష్టారాజ్యంగా గూటీ బిళ్ళలు, పేటలో వినాయకుని గుడి దగ్గర చేరి పెద్ద క్లాసుల పిల్లలు వాలీబాలు, లేదా క్రికెట్ బెట్టింగ్లు ఆడటం చేస్తున్నారు. మీరు ఈ క్షణంలో గమనిస్తే హాజరుపట్టీలో హాజరు వేసి ఉంటుంది.క్లాసుల్లో మాత్రం కొంతమంది పిల్లలు ఉండరు. వారిలో చదువుపట్ల ఆ అయిష్టత పోగొట్టి వారందరూ ‘’ఈ పాఠశాలలో చదవడమే మా అదృష్టం’’ అనుకునేలా చర్యలు చేపట్టమని నా విన్నపం. అది చెప్పడానికే వచ్చాను. మరో మాట. ఇంతకాలం మీ అనుమతి లేకుండా బాదం ఆకులు కోసుకుని వెళ్లిపోతున్నాను. ఇపుడు రోజూ కోసుకునేందుకు మీ అనుమతి కావాలి.’’ అన్నారాయన లేచి నిలబడి.

పరోక్షంగా నా పర్యవేక్షణలో లోపాలను ఎత్తి చూపుతూనే ఆయన ‘ఈ పాఠశాల బాగుకోసం ఏమైనా చేయండి.’ అన్న విన్నపం గురించి తీవ్రమైన ఆలోచనలో పడిపోయిన నేను తెరుకుని ‘’ ఎంతమాట తప్పనిసరిగా తీసుకువెళ్ళండి సర్.’’అన్నాను ఆయనకు చేతులు జోడించి.

ఆయన కూడా నాకు నమస్కరించి వెళ్ళిపోయారు.

ఆ సాయంత్రం ఇంటిగంట కొట్టగానే సుమారు ఎనిమిది మంది ఆడపిల్లలు నా గదిముందు తచ్చాడుతూ కనిపించారు. ‘’లోపలికి రండమ్మా’’ అని పిలిచాను. వారు భయం భయంగా లోపలికి వచ్చారు.

‘’చెప్పండే?’’ అని గొణుక్కుంటున్నారు. ‘’భయం దేనికమ్మా? చెప్పండి’’ అన్నాను.

‘’సార్…మా అమ్మాయిల హాజరు తగ్గడానికి కారణం ….బాత్రూంస్ అస్సలు పనికిరాకపోవడం.ఇంతకు ముందు ప్రధానోపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోలేదు సర్’’ విషయం చెప్పడానికే సిగ్గుతో చచ్చిపోతున్నట్టు తలలు గబగబా చెప్పేసి తలదించుకున్నారు. నా కుమార్తే నాతో అన్నట్టుగా అనిపించి ఎవరో చర్నాకోలాతో నా వీపుమీద చరిచినట్టు ఫీలయ్యాను.

గత పదిహేను రోజులుగా ఎంత హీనంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చానో గుర్తుతెచ్చుకుంటే నామీద నాకే అసహ్యం వేసింది.

ఆ రాత్రికే ఎంతో ఆలోచించి ‘కర్రవిరగకుండా…పాము చావకుండా’ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను.

ముందుగా పాఠశాల పూర్వ విద్యార్ధులందరినీ కలిసి సమావేశం ఏర్పాటుచేశాను. పాఠశాలను పట్టణంలో ప్రధమ స్థానానికి తీసుకువెళ్లాలన్న నా ఆశయంలో భాగంగా వారి సహకారం కోరాను. వారు కేవలం రెండు రోజులలో ‘’పూర్వ విద్యార్ధుల సంఘం’’ గా ఏర్పడి పాఠశాల మానివేసిన ప్రతీ పిల్లవాడివిషయం అతడి తల్లి తండ్రులకు తెలియచేసి, స్వయంగా తీసుకువచ్చి పాఠశాలలో కూర్చుండచేశారు. వారిపై పైతరగతుల విద్యార్ధులను పర్యవేక్షణకు నియమించి ఎప్పటికప్పుడు సమాచారం తమకు తెలియచేసేలా హెచ్చరించారు. ఈచర్యతో విద్యార్ధుల తల్లితండ్రులు తమ పిల్లవాడు సవ్యంగా బడికి వస్తున్నాడో లేదో, తెలుసుకోవడమే కాదు, ఉపాధ్యాయులనడిగి వారి విద్యాభివృద్ధిని కూడా స్వయంగా తెలుసుకునే అవకాశం కల్పించినందుకు నాకు కృతజ్నతలు తెలిపారు.

పాఠశాల కౌన్సిలర్ గారిని కలిసినపుడు వారు ఆనందం వ్యక్తం చేస్తూ ‘’మా పాఠశాలకు మంచిరోజులు ప్రారంభం అయ్యాయన్నమాట….నా సంపూర్ణ సహకారం ఉంటుంది మాస్టారు ‘’అని ప్రోత్సహించడమే కాదు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం నన్ను నిత్య చైతున్యుడిని చేసింది. మన శ్రమను అధికారులు గుర్తించి అభినందించినపుడు అది మరో కార్యక్రమానికి ఇంధమయ్యేది నాకు.

ప్రభుత్వం వారిచ్చిన నిధులతో కేవలం వారం రోజులలో బాలికలకు బాత్రూంస్ వాడుకలోకి తెప్పించాను. వారి కళ్ళల్లో తమ సమస్య పరిష్కారమైందన్న సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడు నా మనసు మానస సరోవరమే అయింది.

ఈలోగానే పాఠశాలలో ఉపాధ్యాయ సమావేశం యేర్పాటు చేసి నా ప్రణాళిక వివరించి వారి సహకారాన్ని కోరాను.

దాని ప్రకారం ప్రతీ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ప్రతీ శనివారం మధ్యాహ్న విభాగం లో చివరి రెండు పీరియడ్స్ నందు వారి వారి సబ్జెక్ట్ లో క్విజ్, ఏకపాత్రాభినయం, స్కిట్, వ్యాసరచన,వకృత్వం, రూపకం …వారికి నచ్చిన ఏవైనా ప్రక్రియలలో విద్యార్ధులచే ప్రదర్శింపచేయడం, ఉత్తమంగా ప్రదర్శించిన విద్యార్ధులను బహుమతులకు ఎన్నిక చేయడం…ముఖ్య అతిధి చేత వారికి బహుమతి ప్రదానం చేయించడం, ఆ కార్యక్రమ వివరాలను పత్రికలకు అందించడం, తద్వారా విద్యార్ధులలో చైతన్యం తీసుకురావడం.

ఈ ప్రణాళికలో ప్రతీ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు పోటీ పడి, ఆరువారాలు ఆరు సబ్జెట్లలో కార్యక్రమాలు నిరాఘాటంగా జరగడం వల్ల విద్యార్ధులలో పోటీతత్వం ఏర్పడి, మంచి ఫలితాలకు దారి తీయడంతో ఒక్కసారిగా పాఠశాల కీర్తి పట్టణంలో మార్మోగిపోయింది. వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా పోటీ పడటంతో విద్యార్ధుల్లో మరింత ఉత్సాహం వూపందుకుంది. మండల, అర్బన్, జిల్లా స్థాయి లలో యే పోటీలు జరిగినా ఉపాధ్యాయులు తమ పిల్లలతో ఉత్సాహంగా పాల్గొన్న కృషికి ఫలితంగా రెండు మూడు బహుమతులు పాఠశాలకు లభించడం ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న సూక్తికి న్యాయం జరిగినట్టుగా అనిపించేది.

పాఠశాల విద్యాసంవత్సరంలో ఆరునెలలు గిర్రున తిరిగిపోయాయి. ఇంతటి స్ఫూర్తిని అందించిన ‘లక్ష్మీనారాయణగారు’ నాకు మనసులో తళుక్కున మెరిశారు. నాకు కనిపించిన మొదటినెల చివరిలో వారి తల్లిగారు కాలం చేయడం వల్ల, పింఛను తీసుకునే అవకాశం లేక రావడంలేదని వీర్రాజు అప్పుడు చెప్పాడు. ఫిబ్రవరి నెలలో పాఠశాల వార్షికోత్సవం నిర్వహించి దాని తాలూకు నివేదిక, ఫోటోలతో, పత్రికల క్లిప్పింగులతో అందించమని ఉన్నత అధికారులనుంచి ఆదేశాలు అందాయి. ఉపాధ్యాయుల సమావేశంలో మాలోని చైతన్యాన్ని తట్టిలేపిన శ్రీ లక్ష్మీనారాయణగారిని ఘనంగా సన్మానించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు అందరూ.

**

పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉన్నత స్థాయి అధికారుల అందరి సమక్షంలో ‘’శ్రీ లక్ష్మీనారాయణ’’ గారిని ఘనంగా సత్కరించుకున్నాం. సత్కార గ్రహీతగా ఆయన ప్రతిస్పందన ఇలా సాగింది.

‘’ప్రియమైన విద్యార్ధులారా… ఉద్యోగ విరమణ అయ్యాకా కూడా నేను ఇంతటి ఘన సన్మానం అందుకుంటున్నానంటే దానికి కారణం ఈ ప్రాంగణంలో చల్లని నీడను ఇస్తోందే…ఆ బాదంచెట్టు. ఆ చెట్టుకు ఓ పేరు కూడా ఉంది తెలుసా..దాని పేరు ‘’పుష్పవల్లి మేడమ్’’ అవును నాన్నా…మీరు విన్నది నిజమే. బాల్యంలో తనకంటే ముందు నాకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు నాలో ‘గణితం’ అంటే భయం యేర్పడేలా బోధించాడని, ఆ బాధ్యత తాను తీసుకుని నాకు అక్షరబిక్ష పెట్టిన ఉత్తమురాలు మా ‘’పుష్పవల్లి’’మేడమ్ . ఆరవ తరగతిలో మొదటిసారి మొదటి స్థానం సంపాదించెట్లుగా నన్ను తీర్చిదిద్ది, నేను గణిత ఉపాధ్యాయుడిగా 33 సంవత్సరాలు బతికేలా చేసి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆమె.

ఆమె జ్నాపకంగా యేదైనా చేయాలి అనుకున్నప్పుడు నాతల్లిని సలహా అడిగితే ఆమె ‘గోడలో మొలిచిన బాదం మొక్కను పీకెసి వీధిలో పడేసిరా ..ఆలోచించి చెబుతాను ‘ అన్నది. ఆరోజు ఆదివారం. దానిని పీకెసి ఈ పాఠశాల గోడదూకి ఆ ఈశాన్యపు మూల నుంచి దక్షిణానికి పారుతున్న చోట ఈ మొక్కను ఈ చేతులతో నేనే పాతాను. ప్రతీ రోజు వచ్చి దానిని మనసారా చూసుకునేవాడిని. ఎన్ని గాలివానలు, తుఫానులు, మండుటెండలు ఎదుర్కుందో నాతల్లి…ఇంతగా ఎదిగి ఇంకా ఎందరికో నీడనిస్తోంది.

నేను ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగవిరమణ చేశాను.రక్తమాంసాలు ధారపోసి ఇద్దరు మగపిల్లల్ని చదివించాను. అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిమీద బెంగతో నా భార్య మరణించింది. దహనసంస్కారాలకు కూడా వాళ్ళు రాలేదు. అన్నీ పూర్తి అయ్యాకా అమెరికా వచ్చెయ్యమన్నాడు పెద్దవాడు. ‘’నాకు జన్మనిచ్చిన కన్నతల్లి నా దగ్గరే ఉంది. నేను రాలేను’’ అన్నాను. ‘’అయితే అమ్మతోనే నువ్వు పోయామనుకుంటాము’’ అన్నారు. విరక్తిగా నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను.

ఇంతకీ మీకు చెప్పేదేమిటంటే ‘’మనిషిని నమ్ముకోకండి. మీ స్వశక్తిని నమ్ముకోండి. కష్టపడి చదువుకుని మీకు జీవితాన్ని ఇచ్చిన అమ్మ నాన్నలను వృద్ధాప్యంలో ఆదరించండి. మొక్క ఎండిపోతుంటే చారెడు నీళ్ళు పోస్తామే…అంతా ప్రేమ అందించండీ చాలు. నా పిల్లల్ని నమ్మాను. ఫలితం ఏముంది? మట్టిని నమ్మినా, ఆ మట్టిలో నీడనిస్తూ బతుకుతున్న చెట్టును నమ్ముకున్నా మనిషి బతుకు సుఖంగా సాగిపోతుంది. అందుకే రోజూ నా మనవడు కానీ మనవడు పక్కింటి ‘’పవన్’’ చేత రోజూ నా తల్లి చెట్టు ఆకులు కోసుకుని వెళ్ళి విసరి కుట్టుకుని ఆ బాదం ఆకుల విస్తరిలోనే రెండు మెతుకులు తింటేనే నాకు సంతృప్తి.. మనశాంతి.

అందుకే ఒక సినీ కవి రాశాడు మంచి పాట…

‘’మనిషిని నమ్మితే ఏముందిరా…? మట్టిని నమ్మినా ఫలితముందిరా…నాన్నా…చెట్టును నమ్మినా ఫలితముందిరా….’’ ఆయన చమర్చిన కళ్ళతో పాడసాగాడు.

మరునిమిషంలో గౌరవసూచకంగా వేదికమీద అధికారులందరూ నిలబడి చేస్తున్న హర్షడ్వానాలకు విద్యార్ధులందరూ సహకరించడంతో… ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనించసాగింది. అవన్నీ తనకే చెందుతాయన్నంత ఆనందంతో బాదాంచెట్టు లయబధ్దంగా వూగుతూనే ఉంది.

సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Inspirational