మలి మలుపు
మలి మలుపు
మలిమలుపు (కథ )
"పదిహేనురోజులు సెలవు కావాలి సార్!"మేనేజర్ ని అడిగింది భారతి.
భారతి మామగారు హఠాత్తుగా పోయారు. మేనేజర్ సెలవు మంజూరు చేశాడు. పదిహేనురోజులు మామగారి కర్మ, బంధువుల హడావుడి భారతికి ఊపిరి సలపలేదు. భర్త కేశవ్, మరిది మాధవ్ అన్నీ చేస్తున్నారు. తల్లిని ఒక్కదాన్నీ ఉంచటం ఇష్టంలేదు పిల్లలకు.
"మా దగ్గరికి తీసికెళ్తాము. ఒక్కరే ఉంటే ఇంకా దిగులు ఎక్కువ అవుతుంది."అంటూ భారతి, కేశవులు తల్లి సుమిత్రను ఇంటికి తీసికొని వచ్చారు.
తనకూ, భర్తకూ ఉద్యోగం. పిల్లలు స్కూలులో చదువుకొంటున్నారు. వాళ్ళు స్కూలునుండి, తను ఆఫీసు నుండి దాదాపు ఒకే సమయానికి ఇంటికి వస్తారు.అప్పటి దాకా ఆవిడ ఒంటరిదై పోతుంది. అందుకని తను వచ్చేదాకా అత్తగారికి తోడుగా పనిమనిషిని పెట్టింది భారతి. కానీ సుమిత్ర మాత్రం ఇంకా భర్త పోయిన దుఃఖంలోనుండి బయటకు రాలేక పోతోంది.
నెలరోజులు గడిచాయి. అంతకు ముందు భర్తతో కబుర్లు చెప్పటం, ఇంట్లో పని, కాస్త ఖాళీ దొరికితే భర్తతో కలిసి టి.వి.చూడటం ఇలా సాగిపోతూ ఉండేది సుమిత్ర జీవితం. ఇప్పుడు ఒంటరిగా, నిస్సారంగా అనిపిస్తోంది ప్రతిక్షణం. కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు పొద్దున్నే ఎవరిపాటికి వాళ్ళు హడావుడిగా వెళ్లిపోతారు. పొద్దున్న కొడుకు, కోడలు వంట, టిఫిన్ చేసుకుంటారు. పనిమనిషి వచ్చి మిగిలిన పనులు చేసిపెడుతుంది.వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళాక ఇంట్లో పనిమనిషి, సుమిత్ర మిగులుతారు. పనిమనిషి టి. వి. పెట్టుకొని చూస్తూ ఉంటుంది.సుమిత్రకు ఏమీ తోచకుండా ఉంది. రోజు రోజుకూ ఇంకా దిగులు ఎక్కువ అవుతున్నట్లుంది.
ఆ రోజు ఆదివారం.సుమిత్ర దగ్గరికి వచ్చింది భారతి. అత్తగారికి దగ్గరగా కూర్చుని
"మీ చిన్నప్పటి విషయాలు చెప్పండి అత్తయ్యా!నాకు పల్లెటూళ్లు ఎలా వుంటాయో తెలియదు.."అంటూ మాటల్లో పెట్టింది.
సుమిత్రకు సంతోషం వేసింది.ఆవిడ చిన్నప్పటి విషయాలు, అప్పటి ముచ్చట్లు చెప్పటం మొదలు పెట్టింది. చిన్నప్పుడు పండగ వస్తే వేసే ముగ్గుల గురించి, చేసే పిండివంటల గురించి, అమ్మవారి జాతర గురించి ఇలా అన్నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కోడలితో చెప్తూ ఉంది.
"అత్తయ్యా!నా కసలు ముగ్గులు రావు. రోజూ వెయ్యలేక వాకిట్లో ముగ్గు పేపర్ అంటించేశాను.మొదటి నుండి ఉద్యోగం కదా!పిండి వంటలు కూడా చెయ్యటం అసలు రాదు.ఓపిక కూడా ఉండదు. మీకు మీరు చిన్నప్పుడు వేసిన ముగ్గులు గుర్తుంటే డ్రాయింగ్ పేపర్ మీద వెయ్యండి!యు ట్యూబ్ లో పెడతాను. చాలా మంది చూస్తారు.నా లాగా ముగ్గులు రానివాళ్ళు నేర్చుకుంటారు."అంది భారతి.
సుమిత్రకు చాలా సంతోషం వేసింది. డ్రాయింగ్ పేపర్ తీసికొని కొన్ని ముగ్గులు వేసి కోడలికి ఇచ్చింది. వాటిని యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది భారతి.
సుమిత్ర చిన్నప్పుడు పాటలు పాడేది.సంగీతం కొంతకాలం నేర్చుకొంది. అంతలో పెళ్ళవటంతో సంగీతం, చదువు కాస్త అటకెక్కాయి.పిల్లలు, బాధ్యతలతో తీరికేది? తన గురించి తను అంతగా శ్రద్ధ పెట్టలేదు.
సుమిత్రకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది భారతి. దాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో, ఎలా పాటలు పాడి అప్ లోడ్ చెయ్యాలో నేర్పించింది.
మెల్లగా సుమిత్రకు ఒక కాలక్షేపం ఏర్పడింది.ముగ్గులు వేసి ఫోన్ లో పెట్టడం,తనకు వచ్చిన వంటలు చేసి యు ట్యూబ్ లో పెట్టడం చేస్తోంది.బంధు మిత్రులకు షేర్ చెయ్యటం ఇలా కొత్త హాబీలతో గడుపుతోంది.ఇప్పుడు భారతికి అత్తగారి గురించి దిగులు తగ్గింది. ఖాళీ దొరికినప్పుడల్లా ఆఫీసు నుండి అత్తగారితో మాట్లాడుతూ ఉండేది.
ఆ రోజు భారతికి సెలవు. అత్తగారిని తీసికొని దగ్గర ఉన్న గుడికి వెళ్ళింది.అక్కడ భజనలు కీర్తనలు పాడే వసంతను కలిసి అత్తగారిని పరిచయం చేసింది. అత్తగారు చక్కగా పాటలు పాడతారని,వీలయితే ఆవిడకు కూడా అవకాశం ఇవ్వమని అభ్యర్ధించింది. దానికి వసంత తాను సంగీతం నేర్పిస్తానని, ఒక ఆరునెలలు ప్రాక్టీసు చేస్తే బాగుంటుందని చెప్పింది. భారతి సంతోషించింది. వసంత వచ్చి అత్తగారికి సంగీతం ట్యూషన్ చెప్పే ఏర్పాటు చేసింది.
ఆరు నెలలు గడిచాయి. ఇప్పుడు సుమిత్ర జీవితం మారిపోయింది.కొత్తకొత్తగా ఉంది. ఒక వైపు శ్రద్ధగా వసంత దగ్గర సంగీతం నేర్చుకోవటం, ఖాళీ దొరికితే డ్రాయింగులు వేసుకోవటం, చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకోవటం ఇలా సాగుతోంది.
భారతి అత్తగారికి ఒక కంప్యూటర్ కొని పెట్టింది.
ఇప్పుడు భారతికి అత్తగారి గురించి దిగులు లేదు. ఆమె అప్పుడప్పుడూ స్టేజ్ మీద పోగ్రాములు ఇచ్చే స్థాయికి వచ్చింది.
అప్పుడే ఏడాది తిరిగింది.భారతి మామగారి సాంవత్సరీకాలు జరిగాయి. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. వసంత దగ్గర్నుంచి.
వసంత, సుమిత్ర కలిసి తిరుమలలో నాదనీరాజనం కార్యక్రమంలో భజనలు గానం చెయ్యటానికి సెలెక్ట్ అయ్యారని, టిటిడి వాళ్ళు తెలిపారని సారాంశం.
పిల్లలు అందరూ చాలా సంతోషించారు. భారతి కయితే ఎంతో సంబరంగా ఉంది.
అత్తగారు ఇంత మంచి స్థాయికి వచ్చినందుకు.
సుమిత్రకు కలలో ఉన్నట్లుగా ఉంది. దీని కంతటికీ కారణం కోడలు భారతి.
కన్నీళ్ళతో భారతిని దగ్గరకు తీసికొంది.
"బంగారు తల్లీ!నువ్వు నాకు కోడలివి మాత్రమే కాదు. గురువువి కూడా. నాకు మంచి దారి చూపించావు. ఇన్నేళ్లు నాలోఒక కళ ఉందని నాకే తెలియదు.. పెళ్లి అవటంతో నన్ను నేనుమర్చి పోయాను. నాలో చైతన్యాన్ని తెచ్చి పెట్టావు. నేను ఎంతో జీవితాన్ని వృధాగా గడిపాను. ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనది. ఇంక నా శేష జీవితం విద్య నేర్చుకోవటానికి వినియోగిస్తాను "అంటూ భారతి బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది.
నిజం!
ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం ఉంటుంది.అయితే బాధ్యతల్లో, బరువుల్లో పడి అణగారి పోయి ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి అంతే. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి.
సమాప్తం.
