శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

మేలిమి బంగారం

మేలిమి బంగారం

2 mins
715


            మేలిమి బంగారం

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

             

    "మా కోడలు బంగారం" దానికి నగలూ గట్రా అవసరం లేదు. దాని రంగు దగ్గర బంగారం వేసుకున్నా దిగదుడుపే." కోడలు రంగు గురించి చెప్తూ...తెగ మురిసిపోతూ ఉంటుంది సీతమ్మ.


   " మీరు అదృష్టవంతురాలు కాబట్టే...చక్కటి కోడలు వచ్చింది . నాకూ వచ్చింది ఎందుకు...? నల్లటి తుమ్మ మొద్దుని తాళికట్టేసి తీసుకొచ్చాడు నాకొడుకు. ఊళ్ళో ఇంక అమ్మాయిలే దొరకనట్టు. రావాల్సిన కట్నకానుకలు కూడా రాకుండా పోయాయి. బంగారం లాంటి సంబంధాలెన్ని వచ్చాయో. వాళ్లలో ఎవరినైనా చేసుకుంటే బాగుంటుందని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కితేనా? ఏమీ మాట్లాడకపోతే... ఇంకా చేసుకునే ఉద్దేశ్యం లేదనుకున్నాను గానీ...ఇలా ఏకంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుని వస్తాడని అసలు ఊహించలేదు సుమీ...! మంటెక్కిపోతూ అక్కసుతో చెప్పింది రాధమ్మ.


      ***      ***     ***

   కోడళ్ల రూపులు సరే. గుణాలు తెలుసుకుందామా?

   సీతమ్మ కోడలు పేరు స్వర్ణ.

   పని ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతానో అన్నట్టు ఉంటుంది. కట్టిన చీర నలగదు. వేసిన జోడు విప్పదు. ఏసీ గది దాటి బయటకు రాదు. షోకేసులో బొమ్మల్లే ఉంటుంది. 

సీతమ్మ చేతిలోంచి ఏ పనీ అందుకోదు సరికదా తిరిగి కోడలికి సీతమ్మే చేస్తూ ఉండేది.


    సీతమ్మ కాలు జారిపడితే... కాలు విరిగిందని చూడటానికి వెళ్ళింది రాధమ్మ. వాకర్ సహాయంతో నడవలేక నడుస్తూ వంటగదిలో వంట చేసుకుంటుంది. "అదేంటి సీతమ్మా! ఈ టైం లో విశ్రాంతిగా ఉంటేనే కాలు సర్దుకుంటుంది గానీ...పనులు చేస్తున్నారా? ఇవన్నీ మీ మీకోడలు చేయదా..? మీ కోడలు బంగారం కదా! విడ్డూరంగా అడిగింది రాధమ్మ.


    ఏం చెప్పమంటావు రాధమ్మా! గుణం గురించి చెప్పుకుంటే సిగ్గుచేటని ...దాని పేరు గురించీ,రఅందం గురించి చెప్పుకుంటూ ఉంటాను. మా కోడలు బంగారం అంటే నీకలా అర్థమయ్యిందా...? బ్రతికినన్నాళ్ళూ నాకీ పాట్లు తప్పవు అంటూ అసలు గుణం చెప్పింది సీతమ్మ.


  ఆవిడను చూస్తే జాలేసింది. కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుని ఇంటికి బయలుదేరింది రాధమ్మ.


      ***        ***      ***


   రాధమ్మ కోడలు పేరు రాగిణి!

   రాగిణి పేరులో ఉన్న రాగిలాగే గుణాలన్నీ మంచివే. అయినా ఆవిషయం చెప్పాల్సింది, మెచ్చాల్సింది రాధమ్మే.


   ఉదయాన్నే లేచి గొడ్ల పాక నుంచి వీధి వాకిలి వరకూ తుడిచి, అంట్లగిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, వంటచేయడం, ఒకటేమిటి అన్ని పనులూ గిరగిరా తిరుగుతూ ఆ ఇంటికి గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటుంది. 


   అప్పటికే ఇంటిపనులన్నీ చేసేసి...వంట కూడా వేడివేడిగా వండిందేమో...ఇల్లంతా మంచి ఘుమఘుమ లాడించేసింది.

    

   సరిగ్గా అప్పుడొచ్చింది ఇంటికి రాధమ్మ!

   గుమ్మంలో ఎదురొచ్చిన కోడల్ని చూసింది.

   పనులన్నీ చేసిచేసి ఉన్నందుకు కట్టిన చీర నలిగుంది. పాదాల మడాలు పగిలున్నాయి. ముఖమంతా చెమటలు పట్టున్నాయి.


   ఎండలో వచ్చిన అత్తగారి కోసం గబుక్కున లోనికెళ్లి మంచినీళ్ళ గ్లాసును తెచ్చి అందిచ్చింది.


    "వంటయి పోయింది అత్తయ్యా! భోజనం వడ్డించేస్తాను ?" ఎంతో మర్యాదగా అడిగింది అత్తగారిని.


  కోడలు సపర్యలు చేస్తుంటే....తల దించుకుంది రాధమ్మ.


  గుణవంతురాలైన కోడల్ని ఇంట్లో ఉంచుకుని...సీతమ్మ అదృష్టవంతురాలు అనుకున్నాను. నా కోడలు రాగిణి కాదు. అసలైన బంగారం. అదృష్టవంతురాలినంటే నేనే. ఈ బంగారం పనులు చేస్తూ మరింత కగ్గిపోకూడదు. వెంటనే పనిమనిషిని పెట్టుకోవాలి' అనుకుంటూ...


   'నా కోడలు మేలిమి బంగారం' అనుకుంది రాధమ్మ..!!


   


  

    

    

     



Rate this content
Log in

Similar telugu story from Inspirational