Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

ఉదయబాబు కొత్తపల్లి

Drama

4  

ఉదయబాబు కొత్తపల్లి

Drama

మాట వినని ఫలితం !!!(కధ)

మాట వినని ఫలితం !!!(కధ)

7 mins
484


''మాట వినని ఫలితం'' 


ఆ రోజు పోస్ట్ లో వచ్చిన వుత్తరం దయానిధి మాస్టారి మనసుని పెద్దగాయమే చేసింది.

పడక కుర్చీ లో కూర్చున్న ఆయన చేతిలో రెపరెపలాడుతున్న ఉత్తరం లాగే ఆయన మనసు కూడా రెపరెపలాడసాగింది. 

ఏమిటో వెధవబుద్ధి. లోకం లో ఎవరు ఎలా పొతే మనకెందుకు అనుకోలేకపోతున్నాడు తను. తెలుసున్న వాడు, తన దగ్గర చదువుకున్న వాడు, తన మాట వింటాడు తన అభిమానాన్ని పొందిన వాడు, తనని అభిమానించేవాడు...ఇన్ని అనుకుని సలహా ఇచ్చాడే తప్ప మరే ఉద్దేశం తోనూ కాదు. కానీ శేఖరం ఇలా చేస్తాడని కలనైనా ఊహించలేదు.

ఎదుటి మనిషికి సలహా ఇవ్వాలని ప్రతీ మనిషికి ఎప్పుడు అనిపిస్తుంది అసలు? తనూ అదే విషయంలో దెబ్బ తిని, అనుభవాలు రుచి చూసి రాటు తేలాకనే కదా...నిలువెల్లా 'నా' అనే స్వార్ధం ఉన్నవాడెవడూ ఎదుటివాడికి సలహాలు సూచనలు ఇవ్వడు. వాడే తెలుసుకుంటాడు లే అని వదిలేస్తాడు. ఇంకా చెప్పాలంటే వాడు కూడా బొక్క బోర్లపడి దెబ్బతిన్నాకా చూసి నవ్వుకుంటాడు. 'ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు' అని పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడతాడు. తనకు ఏకోశానా అలాంటి బుద్ధి లేదు.నిజానికి తాను ఇచ్చిన సలహా చాలా చిన్న విషయం.

తాను అందరిచేతా మంచి వాడు, కష్టజీవి,ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించు కున్నాడు.ఇక విద్యార్ధిని లైతే తమ తండ్రికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు తనకు చెప్పుకుని బాధపడేవారు. తన పరిధిలో పరిష్కరించ లేనివాటికి ఓదార్చేవాడు. 'ఇలా చేస్తే నీ ఆ ఇబ్బంది తొలగుతుందేమో చూడు' అని పరిష్కరించగలిగే వాటికి సూచనలు ఇచ్చేవాడు. వాళ్ళు వాటిని పాటించి 'మీవల్లే మేమిమిపుడు ప్రశాంతంగా చదువుమీద దృష్టి కేంద్రీకరించగలుగుతున్నాం' అంటే ఎంతో ఆనందం అనిపించేది.

తన గురించి అన్నీ తెలిసినాయన అయి ఉండి కూడా శేఖరం వాళ్ళ నాన్న అలా తనకు వుత్తరం రాయడం లో ఆంతర్యం ఏమిటో అర్ధం కాలేదు. ఆయన మళ్ళీ ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళజోడు సర్దుకుని చదవసాగాడు. 


'' పూజ్యులైన దయానిధి మాస్టారికి,

శేఖరం వాళ్ళ నాన్న (పరబ్రహ్మం) నమస్కరించి రాయునది. ఉభయకుశలో పరి. మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆవిషయం తమకు తెలియ చేసాడు. నాకు వాడు ఒక్కడే కొడుకు. వాడి జీతం అంతా అమ్మ నాన్నలకు, అంటే మాకు ఇచ్చెయ్యకుండా కొంత తీసి దాచుకోమన్నారట. ఆవిధంగా వాడిలో స్వార్ధ బుద్ధి ప్రవేశపెట్టి, వాడిని మాకు కాకుండా చెయ్యడం లో మీ ఉద్దేశం ఏమిటో అర్ధం కాలేదు.


పెళ్లి కాని మగపిల్లల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలవుతారని మీకు తెలియంది కాదు. మీరు చాలా మంచివారనుకున్నాను. ఇలా ఒక కుటుంబం లో వ్యక్తుల మధ్య స్వార్ధపు ఆలోచనలు రావడం వలన ఆ కుటుంబ పర్యవసానం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీ చుట్టుపక్కల కుటుంబాలలో మీరు గమనించే వుంటారు. మీరు చేసిన ఈ పనివల్ల ఎందుకో మీ పట్ల ఉన్న నా గౌరవం కొంచం తగ్గిందని మాత్రం చెప్పగలను. ఇలా రాసినందులకు అన్యధా భావించకండి. సెలవు. 

నమస్కారాలతో - పరబ్రహ్మం.''


దయానిధి మాస్టారికి గతమంతా గుర్తుకొచ్చింది. 


తానూ లెక్కల మాస్టారిగా ఉన్న సమయం లో పరబ్రహ్మం గుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద ఈ ఊరొచ్చాడు.అతను అక్కడ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్నాడు. దాని బ్రాంచి ఈ ఊర్లో ఉండటంతో ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు. తెలిసిన బంధువుల సహాయంతో పిల్లల చదువు ఏ పాఠశాలలో బాగుంటుందో తెలుసుకుని తమ పాఠశాలలో జాయిన్ చేసాడు. అప్పటికి శేఖరం ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ అక్క తొమ్మిది చదువుతోంది. క్రమశిక్షణ, వినయ విధేయతలు, ఎవరు చెడగొట్టాలని చూసినా తన పని ఏమిటో తాను చూసుకోవడం, ఉపాధ్యాయుల పట్ల గౌరవం గా మసలుకోవడం ఇవన్నీ శేఖరాన్ని మంచి విద్యార్థిగా నిలబెట్టాయి. ఇల్లు దొరకకపోవడం తో అనుకోకుండా తమ ఇంటి పక్క వాటా ఖాళీ అవడంతో అందులోకి వచ్చారు. అయిదు సంవత్సరాలు హాయిగా జరిగిపోయాయి. చేరిన నెల్లాళ్లకే వాళ్ళు తమ కుటుంబ స్నేహితులుగా కలిసిపోయారు. 

ఇంటర్ పూర్తయ్యాకా శేఖరానికి గుంటూరు లో ఇంజనీరింగ్ సీట్ రావడం తో మళ్ళీ వాళ్ళ ఫామిలీ గుంటూరు వెళ్లిపోయింది. పరబ్రహ్మం కూడా ప్రయత్నం చేసుకుని అక్కడికే ట్రాన్సర్ చేయించుకున్నాడు. 

ఈ సెల్ ఫోన్ లు, వాట్స్- అప్ లు, ఫేస్బుక్ లు పుణ్యమా అని శేఖరం టచ్ లోనే ఉన్నాడు. వాళ్ళ అక్కకు డిగ్రీ పూర్తి అయ్యాకా మేనమావనిచ్చి పెళ్లి చేయడం తో వాళ్ళూ గుంటూరు లోనే స్థిర పడ్డట్టుగా శేఖరం వల్లనే తెలిసింది. 

సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన శేఖరం తనకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అని ఆగస్టు ఫస్ట్ తేదీన డ్యూటీ లో జాయిన్ అవుతానని చెప్పాడు. 

పక్కన టీపాయ్ మీద ఉన్న సెల్-ఫోన్ తీసుకుని శేఖరానికి తనకి జరిగిన వాట్సాప్ చాట్ చదవ సాగాడు దయానిధి. 

***

''జీతం ఎంత వస్తుందయ్యా...''

''అసలు ఇరవై అయిదువేలు సర్. కట్టింగ్స్ పోను ఇరవై రెండు చేతికి వస్తుంది సర్. ఇరవై రెండులో నేను పదివేలు నా ఖర్చులకు ఉంచుకుని మిగతాది నాన్నగారికి పంపిస్తాను సర్.''

''ఒక పని చెయ్యి. నాన్నగారికి పది పంపి, నువ్ పన్నెండు ఉంచుకో. నువ్వన్నట్టుగా పదివేలు నీ ఖర్చులకు ఉంచుకుని, మిగతా రెండువేలు నీ శాలరీ అకౌంట్ లోనే వన్ ఇయర్ ఆర్. డి. ఓపెన్ చెయ్యి. ఈ విషయం నీకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ పెళ్లి ఎప్పుడు? ''

''పెళ్లి నాలుగేళ్ల తర్వాత సర్. అప్పటి వరకు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి సర్, మీరు పూర్తిగా చెప్పండి సర్.''

'' గుడ్.అలా వన్ ఇయర్ అయ్యేసరికి నీ దగ్గర వడ్డీ తో సహా ఇరవై అయిదు వేలు పోగవుతుంది. దాన్ని మూడు సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యి. మళ్ళీ అదేవిధంగా కొనసాగించు. మళ్ళీ వన్ ఇయర్ అయ్యాకా ఈసారి దాన్ని రెండేళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యి.''

''ఓహో. మూడో ఇయర్ కూడా అలాగే చేసి ఒక ఇయర్ కి ఫిక్స్డ్ వెయ్యాలి. ఈ మూడేళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లనీ నాలుగో ఏడాది చివరకొచ్చే మొత్తం తో కలపాలి.''

''వెరీ గుడ్. నువ్ నా శిష్యుడవయ్యా. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర లక్ష పైనే ఉంటుంది.ప్రాణం మీదకు వస్తే తప్ప తీయకూడదు. నీ దగ్గర ఆ మొత్తం ఉందని నీకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు...ఆఖరికి మీ తల్లి దండ్రులకు కూడా.పనికి మాలిన స్నేహితులు అస్తమానూ అప్పులు అడుగుతూ ఉంటారు. ఎవరితోనూ ఆర్ధిక లావాదేవీలు వద్దు. పెట్టుకోకు.

ఎందుకు చెబుతున్నానంటే , ఈ లోకం లో బతకడానికి కావలసిన కనీస అవసరాలు తిండి, గూడు, గుడ్డ, . అవి కావాలంటే డబ్బువుండాలి. రేపు ఏదో అనుకోని ఖర్చు రావచ్చు. ఆరోజు నీకు అర్జంటుగా ఒక లక్ష కావాల్సి వస్తుంది. ఏ స్నేహితుడిని అడిగినా పదో ఐదో అంటే సర్దుతామ్ గానీ, లక్ష లేదని ఇవ్వరు. ఉన్నా ముఖం చాటేస్తారు. లేదా వడ్డీ అంటారు. అదే నేను చెప్పినట్టు చేసావనుకో నువ్ ఎవరినీ అడిగి లేదు అనిపించుకోనక్కర్లేదు. పైగా నావెనుక ఒక లక్ష ఉంది అనే ఆత్మస్థయిర్యం నిన్ను మరింత కష్టపడీ పనిచేసేలా చేస్తుంది. ఏమంటావ్. ''

''మీకు చాలా థాంక్స్ సర్. ఎప్పుడో ఏడూ సంవత్సరాల క్రితం మీదగ్గర చదువుకున్న ఒక విద్యార్థికి ఆత్మీయతతో ఇలా చెప్పగలగడం చాలా ఆనందంగా ఉంది సర్. అందుకే మీరంటే నాకు ఇష్టం సర్.''

''కబుర్లు చెప్పడం, నాలా సలహాలు ఇవ్వడం చాలా తేలిక.ఇది వాస్తవ రూపం దాల్చిన నాడు నాకు చెప్పు. అపుడు నిజం గా సంతోషిస్తాను.''

'' మీరే చూస్తారు గా సర్.''

***

ఆశ్చర్యంగా మరునాడు మా ఇద్దరి మొత్తం సంభాషణ మళ్ళీ టెస్ట్ మెసేజ్ గా వచ్చింది దయానిధికి.

'' అదేంటయ్యా ''ఇందులో మీ అక్క నెంబర్ ఉందేంటి?'' అడిగాడు దయానిధి.

'' ఇదంతా మా అక్కకు పంపాను సర్. సార్ సలహా బాగుంది. అని అమ్మకు చూపిస్తుంటే మా నాన్నగారు వచ్చి చూసారు సర్.''

''నేను ఎవరికీ తెలియకూడదు అన్నానుగా.''

''మా ఇంట్లో నలుగురి మధ్య ఏ రహస్యాలు ఉండవు సర్. ఐయామ్ సారీ సర్.ఈ విషయం మీకు ముందుగా చెప్పకపోవడం నా తప్పే సార్. ''

దాని పర్యవసానంగానే పరబ్రహ్మం గారి దగ్గరనుంచి వచ్చిన వుత్తరం. 


ప్రస్తుతానికి శేఖరం తాను రిప్లై ఇచ్చినా ఇవ్వక పోయినా ప్రతీ రోజూ శుభోదయం, శుభరాత్రి సందేశాలు పంపుతూనే వున్నాడు. అతను చాట్ చెయ్యడానికి ప్రయత్నించినా తానూ రిప్లై ఇవ్వకపోవడం తో అతనూ తగ్గించాడనే చెప్పాలి.


శేఖరం అక్క వివాహ శుభలేఖను భార్యాభర్తలిద్దరూ స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్లినా ఎందుకో తనకు వెళ్లాలనిపించక వెళ్ళలేదు. శుభాకాంక్షలు పంపాడు అంతే. 


సుమారు పధ్నాలుగు నెలల తరువాత పరబ్రహ్మానికి కారు ప్రమాదం లో కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయని శేఖరం మెసేజ్ పెట్టాడు. 

బాగుండదని దయానిధి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఆ కుంకుమ, ప్రసాదం తీసుకుని గుంటూరు శేఖరం ఇంటికి వెళ్ళాడు. 


'' రండి మాస్టారు. ఎంతో శ్రమపడి వచ్చారు. రండి.రండి.'' సాదరంగా ఆహ్వానించారు దయానిధిని చూస్తూనే ఆహ్వానించారు పరబ్రహ్మం దంపతులు.తానే స్వయంగా పరబ్రహ్మం నుదుట బొట్టు పెట్టి అమ్మవారి ప్రసాదం తినిపించాడు దయానిధి.


భార్యాభర్తలిద్దరూ వారం రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్లి వస్తుంటే ఎవరో కారువాడు వెనకనుంచి వేగంగా ఢీకొట్టడం తో జరిగిన ప్రమాదం లో పరబ్రహ్మం భార్య ఎగిరి దారిపక్కన ఒత్తైన గడ్డితో ఉన్న పొదలో పడటం వల్ల కముకు దెబ్బలు మాత్రమే తగిలాయి గానీ, డ్రైవ్ చేస్తున్న పరబ్రహ్మంగారిని బైక్ తో సహా ఇరవై మీటర్లు దూరం ఈడ్చేయడం తో ఆయనకు కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయట. మొత్తం లక్షకు పైగా అయిందట. మరో మూడునెలలు రెస్ట్ తీసుకుంటే మామూలుగా నడవవచ్చని, అయితే మరో ఏడాదివరకు బైక్ డ్రైవ్ చెయ్యకూడదని డాక్టర్లు చెప్పారట. అమ్మాయి అల్లుడు దగ్గరలోనే ఉండటం తో రోజూ అమ్మాయి భర్త ఆఫీస్ కు వెళ్ళగానే వచ్చి సాయంకాలం వరకూ ఉండి వెళ్తుందట. 


''శేఖరం ఎలా ఉన్నాడండీ?'' అడిగాడు దయానిధి.


'' వాడికసలు రెస్ట్ లేదు సర్. ఉదయం ఏడు గంటలకు వెళ్లిన వాడు రాత్రి పది దాటాకా వస్తాడు. వచ్చాకా మళ్ళీ లాప్- టాప్ లో ఏదో పని చేస్తూ ఏ రెండింటికో పడుకుంటాడు సర్. చెబితే వినడు. ఏమైనా అంటే అప్పులు తీరాలిగా నాన్నా..అంటాడు.ఆ నాడు మీరు సలహా ఇచ్చినట్టుగా చేసి ఉంటే బాగుండేది . మిమ్మల్ని చిన్నబుచ్చుతూ ఉత్తరం రాసిన నా అవివేకాన్ని మన్నించండి '' అంటూ వాపోయాడు పరబ్రహ్మం.''


'' శేఖరాన్ని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను, ''వారెంత బ్రతిమలాడినా ఉండకుండా ఇంటికి చేరుకున్నాడు దయానిధి. 

నాలుగు రోజుల్లో శేఖరం నుంచి ఉత్తరం వచ్చింది. చదవసాగాడు దయానిధి, 


'' పూజ్యులైన మాస్టారికి, మీ శిష్యుడు శేఖరం హృదయపూర్వక నమస్కారాలు.


'దు'రాలోచనకీ, 'దూ'రాలోచనకీ అర్ధం చేసుకుంటే చాలా తేడా ఉంటుందని మీరు ఒకసారి క్లాసులో చెప్పారు. మీరు 'దూ'రాలోచనతో చెప్పిన మంచి విషయాన్ని నేను 'దు'రాలోచన చేయబట్టే ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నాను సర్. నేను సంపాదన మొదలెట్టాకా మీ సూచన పాటించకుండా నేను నా ఖర్చులకు సరిపడా డబ్బు ఉంచుకుని మిగతా జీతం అమ్మకు పంపుతూ మీరు చెప్పినట్టుగా కనీసం రెండువేలు దాచమని కోరాను.


'నిన్ను ఇంజనీరింగ్ చదివించినందుకు, అక్కకు పెళ్లి చేసినందుకు, ఎంతో ఖర్చు అయింది. అవన్నీ మీ నాన్న ఉద్యోగం లో లోన్ లు పెట్టి ఖర్చుపెట్టారు. ఇపుడు ఆ డబ్బు కట్టకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అయినా డబ్బు ఎలా దాయలో మాకు తెలుసు.' అని అమ్మ చెప్పింది సర్. వాళ్ళు నిజంగానే రెండువేలు దాస్తున్నారనుకున్నాను. కానీ వాళ్ళ అప్పులు వాళ్లు తీర్చుకుంటున్నారని అర్ధం అయింది,. జీతం వచ్చిన మొదటినెలనుంచి మీరు చెప్పినట్టుగా దాచినా నాదగ్గర ఇరవై ఐదువేలు ఉండేవి. నావంతు సాయం చేసినట్టూ ఉండేది. నాన్న గారి ఆపరేషన్ కు లక్షా పదమూడు వేలు అయింది. ఈ డబ్బంతా మల్లె బయట వడ్డీకి తెచ్చారట. 


మనిషి ఎంత సంపాదించినా ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏపని జరగాలన్నా డబ్బే ముఖం కాబట్టి. అందుకే ఎన్ని ఖర్చులున్నా సంపాదించిన దాంట్లో పదోవంతు మీపేర దాచుకోండి అని మీరెంతో మందికి చెప్పగా విన్నాను. నిజంగా అది పాటించిన వారందరూ అదృష్టవంతులు సర్. 


పెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో ఇపుడు నాకు బాగా అర్ధం అయింది.అందుకే రోజు ఆఫీసు సాయంత్రం ఆరుగంటలకే అయిపోయినా మరో మూడుగంటలు హోమ్ ట్యూషన్స్ చెబుతూ మరో ఎనిమిదివేలు అదనంగా సంపాదిస్తూ కష్టపడుతున్నాను సర్. ఈవిషయం ఇంట్లో తెలియదు. ఆ డబ్బు నా పేరుమీదుగా రెండు నెలలనుంచి ఆర్. డి. కడుతున్నాను సర్. ఇపుడు నాదగ్గర నా కష్టార్జితం పదహారు వేలకు పైగాఉంది సర్. ఇలా నా వివాహం అయ్యేంతవరకు కష్టపడతాను సర్. మీ మాట వినని ఫలితం గా ఇది నాకుగా నేను విధించుకున్న శిక్ష సర్. 


ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్చే ముందు 'మావాడి జీవితానికి పునాది మీరే వెయ్యాలి' అనే తల్లితండ్రులు ఏరుదాటాకా తెప్ప తగలేసినట్లు వాడు ప్రయోజకుడు అయ్యాక వాడిని అలా తయారు చేసిన గురువు ఇచ్చిన సలహాను పాటించకపోవడం ఎంతవరకూ సమంజసమో నాకు అర్ధం కాదు సర్. ఏది ఏమైనా మిమ్మల్ని కించపరుస్తూ నాన్నగారు మీకు రాసిన ఉత్తరాంకి నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను సర్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను సర్. ఎప్పటిలా నాతొ చాట్ చేస్తూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా నా ప్రార్ధన సర్.

నమస్కారాలతో - మీ శిష్యుడు శేఖరం. ''


శేఖరానికి తనపట్ల గల గురుభక్తి కి తేలికపడిన మనసుతో ఆశీర్వదించాడు దయానిధి.Rate this content
Log in

More telugu story from ఉదయబాబు కొత్తపల్లి

Similar telugu story from Drama