శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational


మార్పు మంచిదే

మార్పు మంచిదే

2 mins 291 2 mins 291


          మార్పు మంచిదే

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

   "ఏవండోయ్ వింటున్నారా...? నామట్టుకు నేను చెప్పుకుపోతున్నాను గానీ...మీకేమీ చెవికెక్కుతున్నట్టు లేదు" భర్తను ఈలోకంలోకి తీసుకొస్తూ రెట్టించింది సుగుణ.

 అరగంట నుంచి అదే పనిగా భార్య తన కోరికల చిట్టాను విప్పుతుంటే..ఏమని బదులివ్వగలడు...? చిన్నమ్మాయి పెళ్లి కూడా పెద్దమ్మాయి పెళ్లిలాగే యాభై మందితో కానిస్తేనే బాగుంటుందని రమణ మనసుకు అనిపిస్తుంది.

  భార్య అంతలా రెట్టించి అడుగుతుంటే...అదే విషయాన్ని చెప్పాడు.

  "ఇది మరీ బాగుందండీ...మనకి ఎంత డబ్బుంటే ఏం లాభం...? 2020 లో వచ్చిన కరోనా కలకలంతో పెద్దపిల్ల పెళ్లి యే ఆర్భాటమూ లేకుండా తూతూమంత్రంగా యాభై మందితో కానిచ్చేసాం. ఈ 2021 లో కుదిరిన చిన్నపిల్ల పెళ్ళైనా...ఘనంగా చేసుకోవాలని తల్లిగా నేనెంత ఆరాటపడుతున్నానో మీకేం తెల్సు"...? దాదాపు ఏడ్చినంత పనిచేసింది సుగుణ.

  భార్యకు పరిస్థితిని ఎలా వివరించాలో అర్థం కాకపోయినా...ప్రసన్నంగా చెప్పడానికి ప్రయత్నించాడు రమణ.

  "చూడు సుగుణా...! నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. ఇప్పుడున్న పరిస్థితి నీకూ తెలిసిందే. 2020 వెళ్లిపోయినంత మాత్రాన్న ఈ కరోనా అంతరించిపోలేదు. ఈ 2021లో కూడా కరోనా సెకండ్ వేవ్స్ లో విజృంభిస్తుందని న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఆ వాక్సిన్ ఏదో వచ్చి అందరూ వేసుకునేవరకూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే". 

  "పెద్దపిల్ల పెళ్లి ఏ ఆర్భాటమూ లేకుండా ఎలా చేసామో... చిన్నదాని పెళ్లి కూడా అలాగే కానిచ్చేద్దాం. మగపెళ్ళివారు కూడా ఇదేగా కోరుకునేది. అయినా చెల్లి పెళ్లి ఘనంగా చేస్తే పెద్దదాని మనసు చిన్న బుచ్చుకోదూ...? మనం ఎంతోమందిని ఆహ్వానించి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నా... ఎంతమంది వస్తారో మానతారో మనకే తెలియని అయోమయం". 

   "ఇద్దరి పెళ్లిళ్లకూ మనకు మిగిలిపోయిన ఈపెళ్లి ఖర్చు చాలా ఉంటుంది కాబట్టి....నీకో చిన్న సలహా చెప్పనా"....? అడిగాడు భార్యను.

  ముఖం ముడుచుకుని వింటున్నదల్లా కుతూహలంగా ఏమిటన్నట్టు తల పైకెత్తి చూసింది భర్త వైపు సుగుణ.

  "నీకు సినిమా యాక్టర్ 'సోనూ సూద్' తెలుసుకదా. ఈ కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ఎక్కడివారు అక్కడే ఉండిపోయి...కూలిపనులు లేక, తిండి లేక, ప్రయాణాలు చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు లేక, నానా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు అతను తోడుగా తానున్నానంటూ తన దగ్గరున్న డబ్బునంతా ధారపోసి... వారందరినీ ఒడ్డుకు చేర్చగలిగాడు కాబట్టే...వారందరి మనసుల్లో దేవుడిలా నిలిచిపోయాడు".

   "అలాగే మనం కూడా కొందరి మనసుల్లో నిలిచిపోవాలను కుంటే గనుక...ఈ పెళ్లి కూడా నిరాడంబరంగా చేసేస్తే...ఇద్దరి పెళ్లిళ్లకూ వృధాగా ఖర్చవ్వకుండా మిగిలిన డబ్బు కనీసం కోటి రూపాయలు ఉంటాయి". 

   "ఈ డబ్బుతో ఓ పదిమంది పేదపిల్లల పెళ్లిళ్లు జరిపించామంటే...మనం ఎంతో కొంత పుణ్యం రాదంటావా...? ఈ 2021లో ఇలాంటి మార్పుకు మనం సిద్ధపడితే...మనతో పాటే చేతులు కలిపేవాళ్ళు రారంటావా"...? భార్యకు సున్నితంగా విడమరిచి చెప్పాడు రమణ.

   భర్త హితవు సుగుణ మనసుకు మరింత సున్నితంగా తాకిందేమో...భర్త అభిప్రాయానికే మనస్ఫూర్తిగా విలువిచ్చింది సుగుణ.

   ఈ కరోనా వచ్చి...మనుషులకు మంచి అలవాట్లతో పాటూ...దాగివున్న మానవత్వాన్ని కూడా తట్టి లేపేలా చేసింది. ఎంతైనా...ఈ కలికాలంలో ఇలాంటి మార్పు మంచిదే ఎవరికైనా....!!*


 
 


Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Inspirational