Hitesh Kollipara

Drama

4.6  

Hitesh Kollipara

Drama

లవ్ ఇన్ అమెరికా – 2

లవ్ ఇన్ అమెరికా – 2

5 mins
555


#దొరికిపోయామా(నా)!?


గతం(కొంతకాలం క్రితం):

పున్నమి రాత్రి. అనకోస్టియ ఫ్రీవే - అర్ధరాత్రి సమయం. ఫ్రీవే మీద ఎలాంటి సంచారం లేదు. మేము నిలిపిన కార్ కూడా మాకు వంద అడుగుల దూరంలో సిగ్నల్ లైట్స్ ని ఆర్పుతూ, వెలిగిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. మేము ఫ్రీవే పక్కన గడ్డి మీద నించుని ఉన్నాం. నేను వేసుకున్న హై హీల్స్ గడ్డిలో దిగబడిపోగా అతడి షూస్ మాత్రం గడ్డిని అణిచివేస్తుంది. అతడి చేయి నా నడుము మీద ఉంది. నా చేతులు అతడి మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. కురుస్తున్న చల్లటి మంచు నా బ్యాక్ లెస్ వీపుని తడుపుతూ గిలిగింతలు పెడుతుంది. ఇలా ఎంతసేపటి నుంచి నించుని ఉన్నామో గుర్తులేదు గాని కాలం గడుస్తున్న అనుభూతైతే లేదు. కాలం స్తభించిపోయిన అనుభూతి.

అతడు తన తలని వంచి నా నుదుటికి ఆనించాడు. ఇప్పుడు వెనుక వీపుని తాకుతున్న మంచుబిందువుల కంటే చెక్కిలి మీటుతున్న అతడి ఊపిరే గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. నేను ప్రతిస్పందించేలోపే అతడు నా నడుము పట్టి ఎత్తి గాల్లోకి లేపాడు. అద్భుతం! ప్రపంచాన్ని గెలిచిన అనుభూతి.

“ఊఊఊఊవో...... ఊఊవోవో.....” చేతులు చాపి గట్టిగా అరిచాను. ఆ వెంటనే అతడి ముఖంలోకి చూశాను.

నక్షత్ర మెరుపు తళుక్కుమంది అతడి కళ్ళలో. పున్నమి చంద్రుడికి దీటుగా నవ్వుతున్నాడు.

“నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు” నా కళ్లలోకి చూస్తూ అన్నాడు.          

నవ్వాను.

“ఇప్పుడు.., ఇక్కడ.., ఈ క్షణంలో నిన్ను ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది?” అన్నాడు.

“తప్పకుండా కానీ అంతకన్నా ముందు నువ్వు నన్ను కిందకి దించాలి...”

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుని అన్నట్టు నెమ్మదిగా కిందకి దించాడు. నడుము మీది చేతుల్ని వెనుక వీపుని తడుముతూ పైకి తీసుకొచ్చి నా ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు. అతడి చేతి వేళ్ళు నా వీపుని తాకిన క్షణం.., ఆ అనుభూతి కోసం... అప్పటికప్పుడు చచ్చి కాలంలో వెనక్కి వెళ్ళి మరొక్కసారి జన్మించి ఆ క్షణంలో జీవించాలని ఉంది.

అతడు నా ముఖాన్ని కప్పుతున్న ముంగురులుని చూపుడువేలితో చెవి వెనక్కి నెట్టి మళ్ళీ నవ్వాడు. ఈసారి అతడి నవ్వు చూడటానికి మళ్ళీ కాలంలోకి వెనక్కి వెళ్లాలని ఉంది. కానీ ఈసారి చచ్చి మళ్ళీ జన్మించేంత సమయం కూడా ఆగలేను. అతడు గుండెల నిండుగా గాలి పీల్చి వదిలి అతడి పెదాలని నా పెదాలకి దగ్గరగా తెచ్చాడు. ఇంకొక్క క్షణంలో మా నాలుగు పెదాలు కలవబోతున్నాయి. అతడు మరింత ముందుకొచ్చాడు -..

టక్... టక్... టక్...

అతడు ఇంకాస్త ముందుకొచ్చాడు. ఇక మా పెదాలు కలవటమే తరువాయి -..

టక్... టక్... టక్...

“ఓపెన్ ద డోర్. ఇట్స్ అర్జెంట్...”

అరుపుకి గబుక్కున కళ్ళు తెరిచాను.

నా కల చెదిరిపోయింది. ఎవడు నా కలని పాడుచేసింది? మంచం మీద నుంచే టైమ్ ని చూశాను. తెల్లవారుఝాము 5:40 అవుతుంది. ఈ టైమ్ లో ఎవరు అరుస్తుంది? అఫ్కోర్స్ ఆ గొంతు ఆల్బర్ట్ దే. నేను గుర్తుపట్టగలను. కానీ ఇంత పొద్దున్నేనా??... విసురుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తెరిచాను. ఊహించినట్టు ఎదురుగా ఆల్బర్టే ఉన్నాడు. ఇందాకటి కలలో నా ప్రేమికుడు, ఇక్కడ ఇలలో నా స్నేహితుడు.

“హాయ్ మగ్...” ముఖమంతా నవ్వు చేసుకుని నన్ను తోసుకుంటూ విసురుగా లోపలికి వచ్చేశాడు.

“మగ్ కాదు. మేఘన! కనీసం మేఘ్ అని అన్నా పిలువు. ఈ మగ్, జగ్ అని ఏంటి?..” కొంచెం గట్టిగానే అన్నాను.

“వాటెవర్!” మంచం మీద వాలిపోతూ అన్నాడు.

“ఎందుకొచ్చావ్?”

“బిగ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్!”

“తెల్లవారుఝామున ఐదు నలభైకి మా ఇంట్లోకి జొరబడి నా రూమ్ డోర్ పగలగొట్టుకుని వచ్చి నీ స్వంత మంచం మీద అన్నట్టు పడుకుండిపోయావు, పైగా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అంటున్నావు?... అసలు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో ఉంది నువ్వా, నేనా??”

“ఉమ్... పాయింట్ వన్.., నేను నీ రూమ్ డోర్ పగలగొట్టుకుని జొరబడలేదు. కింద అంట్ పర్మిషన్ తీసుకునే వచ్చా...”

“ఆంట్ కాదు.., ఆంటీ!..”

“వాటెవర్!”

“ఐ యామ్ సీరియస్”

“ఓకే ఓకే. ఆంటీ! ఓకేనా?... కింద ఆంటీ పర్మిషిన్ తీసుకునే వచ్చాను. అండ్ పాయింట్ టు...” వాల్ క్లాక్ వంక చూస్తూ.., “ఇప్పుడు టైమ్ మార్నింగ్ 5:40 కాదు, 5:30నే. నీ క్లాకే 10mఐn ఫాస్ట్. టిపికల్ ఇండియన్ గర్ల్ వి కదా.., అక్కడలాగే టైమ్ 10mఐn ఫాస్ట్ సెట్ చేశావ్..” పరిహాసంగా అన్నాడు.

“షటప్!”

నవ్వాడు.

నేను నిట్టూర్చి వెళ్ళి తన పక్కనే మంచం మీద కూర్చున్నాను. నా లూజ్ హెయిర్ ని ముడి వేసుకున్నాను. రాత్రుళ్లు నేను ఎప్పుడూ వేసుకునే టైట్ టీ-షర్ట్, తొడల పైకి ఉండే షార్ట్స్ లోనే ఉన్నాను. ఒకరకంగా ఫ్రీ షో ఇస్తున్నట్టు ప్రొవకేటివ్ గానే ఉన్నాను. వేరే మగాడు ఐతే అసలు అక్కడ్నించే వెళ్లిపోయేదాన్ని. కానీ ఆల్బర్ట్ ముందు నాకు అలాంటి సిగ్గేం కలగట్లేదు. ఐనా నేను ప్రేమించిన మగాడి ముందు నాకు సిగ్గు ఎందుకు?.., ఏం దాచుకోవాలి??.

ఆల్బర్ట్ మాత్రం మాట్లాడకుండా అలానే పడుకుని ఉన్నాడు.

“ఏంటి?” విసుగ్గా అతడి ముఖంకేసి చూస్తూ నిద్రమత్తుతో అన్నా.

“నేను క్రిస్టీతో బ్రేక్ అప్ అయిపోయా...” ఆల్బర్ట్ మాత్రం కళ్ళు తెరవకుండానే చేత్తో నుదుటిని సదురుకుంటూ సమాధానమిచ్చాడు.

‘హమ్మయ!...’ మనసులోనే ఆనందించాను.

పదిహేను రోజుల క్రితం ఆల్బర్ట్ ఆమెతో డేటింగ్ స్టార్ట్ చేస్తునట్టు చెప్పాడు. వారి రిలేషన్ ఎంతోకాలం కొనసాగదని నాకు తెలుసు. ఐనా సరే నేను ప్రేమిస్తున్న వ్యక్తి వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బయటకి వ్యక్తపరచకపోయినా లోపల కూడా బాధ పడనంతటి అమాయకురాల్ని కాదు, బ్రేక్ అప్ అయిపోయాక ఆనందించని స్థితప్రజ్ఞురాల్ని అంతకన్నా కాదు.

“క్రిస్టీ అంటే..., నీ పదిహేనవ గర్ల్ ఫ్రెండ్, ఆమె...” అంటుంటే, “కాదు పద్నాలుగో గర్ల్ ఫ్రెండ్...” మధ్యలోనే నా మాటని తుంచేసి సరిచేశాడు.

ఇహ సహనం చచ్చిపోయింది నాకు. ఇందాక డోర్ దగ్గర కంటే గట్టి స్వరంతో, “ఆల్బర్ట్..., నువ్వు ఇలా నీకున్న వందలమంది గర్ల్ ఫ్రెండ్స్ లో ఎవత్తో ఒకదానితో బ్రేక్ అప్ అయిన ప్రతిసారి అర్ధరాత్రి, అబ్బరాత్రి అని లేకుండా నా రూమ్ లోకి జొరబడి, నా నిద్రని పాడు చేసి, నేను కంటున్న అందమైన కలని భగ్నం చేసి నన్ను విసిగించాలని చూస్తే చెప్తున్నా.., మీ ఏసుక్రీస్తు తను శిలువ దిగి నిన్ను దానిమీద కూర్చోబెడతాడు. ఇదే నీకు నా శాపం” కోపంగా అరిచాను.

“నేను దేవుడ్ని నమ్మను..” కూల్ గా అన్నాడు.

“మంచిది. నేను ఇప్పుడు నీ సోధి వినను..”

అమాంతం ఒక పిల్లో వచ్చి నా ముఖాన్ని తాకి కింద పడింది. దాని దెబ్బకి నేను కూడా కింద పడిపోతుంటే ఆపుకునే ప్రయత్నంలో బలాన్నంతా ఇటువైపుకి తెచ్చి ఆల్బర్ట్ పక్కనే పరుపు మీద పడిపోయాను.

“చెప్పేది విను... ఎమర్జెన్సీ ఇది..” అంటూ లేచి నా వైపుకి తిరిగాడు ఆల్బర్ట్.

“ఏంట్రా ఎమర్జెన్సీ...” నేను అతడి డొక్కలోకి పొడుస్తూ అన్నాను. ఇందాక పిల్లో విసిరినందుకు రివెంజ్.

“ఔచ్!!...” గట్టిగానే తగిలినట్టుంది అరిచి మంచం మీదకి పడిపోయాడు అతడు.

ఆ వెంటనే.., “నన్నే కొడతావా?....” అంటూ నా గొంతుని పట్టుకునే క్రమంలో జుత్తు ముడిని లాగాడు. జుత్తు ఊడిపోయి లూజ్ అయిపోయింది. నాకు పట్టరాని కోపం వచ్చేసింది. ఇది రూమ్ అని, తలుపు తీసి ఉందని కూడా మర్చిపోయి లేచి వాడిమీదకి వాలిపోయి గుద్దటం స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కేసానో తెలీదు గాని నేను ఆల్బట్ పొట్ట మీద ఆటోకాలు, ఇటోకాలు వేసి ఎక్కేసి కూర్చుని గుండెల మీద గుద్దుతున్నాను. నా దెబ్బలకి అతడి షర్ట్ బటన్స్ తెగిపోయాయి కూడా.

“సిస్స్.. స్....!!” తలుపు వైపు నుంచి వచ్చిన పిలుపుకి ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చాము నేనూ, ఆల్బర్ట్.

తలక్రిందులుగా తలవంచి తలుపుకేసి చూశాను. గుమ్మం దగ్గర ఆర్యన్ గాడు నించుని ఉన్నాడు. వాడు నా తమ్ముడు!!

దిమ్మతిరిగిపోయింది నాకు. వెంటనే లేచి నేల మీద నించున్నాను. ఆల్బర్ట్ మాత్రం మంచం మీదే లేచి కూర్చున్నాడు. ఆర్యన్ గాడు పెద్ద డైనోసార్ కళ్లెసుకుని నన్ను, షర్ట్ బటన్స్ ఊడిపోయిన ఆల్బర్ట్ ని, షార్ట్స్ లో ఉన్న నా కాళ్లనీ మార్చిమార్చి చూస్తున్నాడు. వాడి చూపుని గ్రహించి వెంటనే కింద పడి ఉన్న పిల్లో అందుకుని నా తొడల్ని కవర్ చేసేవిధంగా అడ్డం పెట్టుకున్నాను.

“దేవుడా..., ఏమిటిది?... ఆర్యన్ గాడు నన్ను, ఆల్బర్ట్ ని ఆ పొజిషన్ లో, అదీ ఈ అవతారంలో చూడటం?... ఏమిటి స్వామి నీ లీల??” మనసులోనే అనుకున్నాను.

ఆర్యన్ గాడు మాత్రం ఇంకా మిడిగుడ్లేనుకుని అలానే చూస్తూ నించున్నాడు.

దొరికిపోయామా(నా)??!!...



Rate this content
Log in

Similar telugu story from Drama