PVV Satyanarayana

Inspirational

5  

PVV Satyanarayana

Inspirational

కుబేరుడు

కుబేరుడు

8 mins
82


కథ

కుబేరుడు

రచన: తిరుమలశ్రీ

***

     "రేపటినుంచి మూడు రోజులపాటు మాధాపూర్ లో బ్యాంకులు లోన్ మేళా నిర్వహిస్తున్నాయట" అంది మహాలక్ష్మి, రాత్రి పని పూర్తిచేసుకుని వచ్చి భర్త పక్కలోకి చేరుతూ.

     "ఉహుఁ," అన్నాడు అప్పారావు.

     ఓ క్షణం ఆగి, "రేపు మీ తమ్ముడు కూడా వెళ్తున్నాట్ట కారు లోన్ తీసుకోవడానికి" అందామె మళ్ళీ.

     ఆశ్చర్యంతో చూసాడు అప్పారావు. "వాడికి ఆల్రెడీ మారుతీ ఎస్టీమ్ ఉందిగా! ఇప్పుడు ఇంకో కారెందుకు? అదీ, అప్పు చేసి మరీనూ...!?" అన్నాడు.

     "లోన్ దొరుకుతోంది కదా అని, మీ మరదలి కోసం మరో కారు కొంటాడట" చెప్పిందామె. "స్కూల్లో టీచరమ్మ కదా, సొంత కారు ఉండాలనేమో!"

     భుజాలు ఎగరేసాడు అతను.

        "ఏమండీ!" భర్త వక్షంపైన చేత్తో మెల్లగా రాస్తూ అంది మహాలక్ష్మి. "మనమూ ఓ కారు కొనుక్కుందామండీ".

     "మొబైక్ ఉండగా కారెందుకూ?".

     "మీ తమ్ముడికీ ఉందిగా మొబైక్? అలాగని కారు కొనడం మానేసాడా? దేని అవసరం దానిదే" అంది. "అందరూ రెండేసి మూడేసి బళ్ళు కొనుక్కుంటూంటే, మనమింకా ఆ పాత బైకే పట్టుకుని వ్రేలాడుతున్నాం".      

"పాతదో, కొత్తదో...బైకు బైకేగా! పాతబడిపోయిందని పెళ్ళాన్ని మార్చేస్తామా?" అన్న అతని వైపు చురుగ్గా చూసి, వీపు మీద ఒకటి వేసిందామె.

     నవ్వాడు అతను. "డబ్బుంటే కారేం ఖర్మ, మహీ! హెలికాప్టరే కొనొచ్చును". 

"అంటే, అందరూ డబ్బులుండే కొనుక్కుంటున్నారా అన్నీనూ?" నిష్ఠూరంగా అంది. "పిలిచి పిల్లనిస్తానంటే, మావాడికి ఏదో వంకర అన్నాట్ట వెనుకటికి ఎవడో! బ్యాంకులన్నీ ఋణాలిచ్చి కస్టమర్ల ఋణం తీర్చుకుంటామంటూ గళాలు చించుకుని అరుస్తూంటే...సిరి రా మోకాలు అడ్డినట్టు...వద్దు పొమ్మనే మనిషిని మిమ్మల్నే చూసాను!"

     "సాక్షాత్తూ మహలక్ష్మే అర్థంగి అయినప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం నా కేమిటే పిచ్చిమొద్దూ!" నవ్వేసాడు అతను.

     మూతి త్రిప్పుకుందామె. "ఈ కబుర్లకేమీ లోటు లేదు...మీ పేరు అప్పారావేగా? అప్పుచేస్తే తప్పేమిటటా?"

     "నా పేరు అప్పారావే కాని, అప్పుల్రావు కాదే! ఇక నీ అప్పుల భాగోతం ఆపి హాయిగా నిద్రపో. లేకపోతే, అప్పు చేయడం తప్పూ ముప్పూ కాదంటూ రాత్రంతా అప్పోపదేశంతో నా బుర్ర తినేయగలవు!" కించిత్తు విసుక్కున్నాడు అతను.

దాంతో ఆమె అలిగి అటు తిరిగి పడుకుంది. నడుంపైన వేసిన భర్త చేతిని విసురుగా త్రోసిపడేసింది. నవ్వుకున్నాడు అప్పారావు.

ఓ ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తూన్న అప్పారావు మధ్య వయస్కుడు. నెలకు పాతికవేల జీతం. పన్నెండేళ్ళ బాబు, పదేళ్ళ పాపాను. చింతలు లేని చిరు కుటుంబం.

     దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన అప్పారావుకు, అప్పుకూ చుక్కెదురు. ఉన్నంతలోనే పొదుపుగా గడుపుకోవడం అలవాటు అతనికి. దానికి తోడు మహాలక్ష్మి వంటి అనుకూలవతి ఐన భార్య దొరికితే, అంతకంటె అదృష్టం ఏముంటుంది మగాడికి! అవసరమైతే పస్తులు ఉన్నా పరవాలేదు కాని, అప్పు చేయరాదన్నది అతని సిద్ధాంతం! అప్పు, తప్పు, నిప్పు - ఈ మూడూ ఎప్పటికైనా ముప్పు తేగలవన్నది అతని నమ్మకం. అందుకే అప్పును నిప్పులా చూస్తాడు. నెలసరి ఆదాయంలో నెలనెలా కొంత వెనకేసుకుంటూ ఓ ప్రణాళిక ప్రకారం నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటే అమర్చుకోసాగాడు.

     జీవితంలో ఒక్క సారైనా అప్పు చేయనివాడంటూ ఉండడంటారు. కాని, అవసరమని అర్థించిన వారికి ఉన్నంతలోనే చేతనైన ఆర్థిక సాయం చేయడమే తప్ప, ఒకరి దగ్గర పైసా అప్పు చేసి ఎరుగడు అప్పారావు. అవసరమైనప్పుడు ఆఫీసులో తన సొంత ప్రావిడెంట్ ఫండ్ లోంచి డ్రా చేసి, వాయిదాల పద్ధతిలో నెలనెలా జీతం ద్వారా తిరిగి చెల్లిస్తూంటాడు. ఎందరు ఎన్ని బ్రాండ్స్ మార్చినా, పదేళ్ళ క్రితం కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ హీరో హోండా మోటార్ బైక్ తోనే ఇప్పటికీ కాలక్షేపం చేస్తున్నాడు.

     అప్పారావు తమ్ముడు పాపారావు అతనికంటె రెండేళ్ళు చిన్నవాడు. ఓ ఎమ్మెన్సీలో పనిచేస్తున్నాడు. అన్న కంటె రెండు రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఒక్కడే కొడుకు. అన్నకంటె ఆర్థికంగా పైమెట్టులో ఉన్నా, సొంత సొమ్ముతో ఏ వస్తువూ కొని ఎరుగడు. అప్పు చేయడమంటే మహా సరదా! బ్యాంకులనుండో, ఇతర ఫైనాన్స్ సంస్థల నుండో అప్పులు తీసుకునే కొంటూవుంటాడు ఏ వస్తువైనా. ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాడు కనుక, బ్యాంక్స్ నుండి ఋణాలు తీసుకోవడం తన ’పన్ను హక్కు’ అంటాడు. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ తీసుకుని ఓ విధమైన రికార్డ్ కూడా సృష్టించాడు అతను.

     తండ్రి మరణానంతరం వారసత్వంగా సంక్రమించిన తాతలనాటి పాత ఇంటిని అన్నదమ్ములు పంచుకున్నారు. కొన్నాళ్ళకు పాపారావు బ్యాంక్ లో లోన్ తీసుకుని మాధాపూర్ లో కోటి రూపాయలతో ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నాడు. పాత ఇంటిని అద్దెకిచ్చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోయాడు. పాపారావుకు ఓ మోటార్ బైక్, ఓ కారు ఉన్నాయి. రెండు లక్షలతో మోడర్న్ కిచెన్ ని ఏర్పాటుచేసుకున్నాడు. ఇంట్లో అన్నీ మోడర్న్ యుటిలిటీసు, ఫెసిలిటీసే డిష్ వాషర్ తో సహా. ఖరీదైన ఫర్నిచర్, ఇంటెరియర్ డెకరేషన్ వగైరాలతో లైఫ్ ని ఎంతో రిచ్ గా మలచుకుని ఎంజాయ్ చేస్తూంటాడు - పిలిచి మరీ అప్పులిచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల పుణ్యమా అంటూ!

     తెల్లవారుతూనే అప్పారావు ఇంటికి అతని స్నేహితుడు కృష్ణయాదవ్ వచ్చాడు. "ఇవాళ బ్యాంకుల లోన్ మేళా ఉంది. చానాళ్ళుగా చెల్లెమ్మ కారు కావాలంటోందిగా. వెళ్దాం పద" అన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అతనిది. బ్యాంకులలోను, ఇతర ఫైనాన్స్ సంస్థలలోనూ లోన్స్ తీసుకుని స్థలాలు కొని డెవలప్ చేస్తాడు. వాటిని ప్లాట్స్ గా చేసి అమ్ముతూంటాడు. ఆమధ్య కారణాంతరాలవల్ల బిజినెస్ డల్ గా ఉంది. ఎదురుచూసిన రీతిలో ప్లాట్స్ అమ్ముడుపోవడంలేదు. ఐనా ఇస్తున్నారు కనుక ఋణాలు తీసుకుని స్థలాలను కొనడం మాత్రం మానడు అతను.

     బలవంతం చేస్తూన్న మిత్రుడితో, "నా పాలసీ నువ్వు ఎరిగిందే కదా! మీరంతా అప్పుల సముద్రంలో పీకలదాకా మునిగిపోయారు. నన్ను కూడా ఆ ఊబిలోకి దించాలనుకుంటున్నారా? అది కుదరదు" అన్నాడు అప్పారావు దృఢంగా.

     కాఫీ కప్పులతో అక్కడికి వచ్చిన మహాలక్ష్మి భర్త పలుకులకు నుదురు కొట్టుకుంటే, "వీడు మహా మొండిఘటం! వీణ్ణి మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదు చెల్లెమ్మా!" అన్నాడు యాదవ్ కప్పు అందుకుంటూ.

     మిత్రుడు వెళ్ళిపోయాక, "అప్పు దొరుకుతోంది కదాని ఎడాపెడా స్థలాలు కొనిపారేస్తున్నాడు. ప్లాట్లు అమ్ముడుపోకపోతే ఉంటాయి వీడి పాట్లు" అన్నాడు అప్పారావు.

     మహాలక్ష్మి మూతి త్రిప్పుకుంటూ, "అందరూ మనలాంటి చేతకానివాళ్ళే ఉండరు లెండి!" అనేసి ఖాళీ కప్పులు తీసుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.

     భార్య పలుకులకు అప్పారావు మనసు చివుక్కుమనడంతో చిన్నగా నిట్టూర్చాడు.

#

     కళ్ళాలు లేని కాలం మరో పదేళ్ళు ఎడతెరిపిలేకుండా పరుగెత్తింది... ఆమధ్య కాలంలో అప్పారావు తన పొదుపరితనంతో నాలుగు రాళ్ళు వెనకేసుకుని ఓ ప్లాట్ కొనుక్కున్నాడు. ఇంట్లోకి చిన్న, పెద్ద వస్తువులను అమర్చాడు. అంతేకాదు, ఎక్ఛేంజ్ ఆఫర్లో పాత బైక్ ని ఇచ్చేసి కొత్త బైక్ కూడా కొనుక్కున్నాడు. మహాలక్ష్మిలో అసంతృప్తి సెగలు అలాగే ఉన్నాయి, కాలం చెల్లిన ఆదర్శాలను పట్టుకుని వ్రేలాడుతున్నాడని!

     పాపారావు, కిష్ణయాదవ్ లు తమ ఋణపురాణ పారాయణాన్ని కొనసాగిస్తూ లక్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. అప్పారావును తెలివితక్కువవాడిలా జమకట్టి జాలిపడేవారు. సకాలంలో వాయిదాలు చెల్లించలేక బ్యాంకుల నుండి నోటీసులు అందుకుంటున్నా, ఆ సందర్భంగా ఒకటి రెండు కోర్ట్ కేసులు ఉన్నా బెదరడంలేదు. అవకాశం లభించినపుడల్లా అప్పులు చేస్తూనే ఉన్నారు.

     పాపారావు కొడుకు ఎమ్సెట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఐనా డొనేషన్ కట్టి ఓ పొరుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్స్ లో చేర్పించాడు పాపారావు. ఆ సందర్భంగా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవడం మరచిపోలేదు అతను.

     అప్పారావు కొడుక్కి ఎమ్సెట్ లో యావరేజ్ ర్యాంక్ వచ్చింది. దానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలలో సీటు రాదు. ప్రైవేట్ కాలేజెస్ లో డొనేషన్లు, ఫీజులు కట్టి చదివించే స్థోమత అప్పారావుకు లేదు. "మీ తమ్ముడు లోన్ తీసుకుని కొడుకును ఇంజనీరింగులో చేర్పించాడట. మన బాబు బాగా చదువుతాడు. మీరు కూడా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్తుకు పనికిరాని ఆదర్శాలు...ఎవరికోసం!?" అంది మహాలక్ష్మి నిష్ఠూరంగా. అందరు పిల్లల్లాగే తన కొడుకూ ఇంజనీరు కావలన్న కోరిక ఆమెకూ ఉంది.

     "ఇది కేవలం డబ్బు సమస్యే కాదు. యావరేజ్ స్టూడెంట్ మీద మన ఆశయాలు రుద్దాలనుకోవడం అవివేకం. మనవాణ్ణి డిగ్రీ చదివించి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ చేయిస్తాను. నా కొడుకును ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ని చేస్తాను" అన్నాడు అప్పారావు. అన్నట్లే కొడుకును ఓ పేరున్న కాలేజ్ లో డిగ్రీలో చేర్పించాడు.

ఐతే ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేకపోయింది మహాలక్ష్మి. లోగడ కారు కొనుక్కున్నప్పుడు తోటికోడలు మహాలక్ష్మికి ఫోన్ చేసి, ’పాత మోడల్ ఐన మారుతీ ఎస్టీమ్ లో స్కూల్ కి వెళ్తే నా ఎస్టీమ్ ఏం కాను! అందుకే మీ మరదిగారితో పోట్లాడి నాకోసమని స్విఫ్ట్ డిజైర్ కొనిపించుకున్నాను. అంతా పాత వెహికిల్స్ లో ఎలా తిరుగుతారోనబ్బా!’ అంది. అది సూటిగా తగులుకుంది ఆమెకు. భర్త కారు కొననందుకు కాక, తోటికోడలి అహంభావానికి, దెప్పుళ్ళకు తీవ్రంగా బాధపడింది. అంతేకాదు, ఆడవాళ్ళంతా కిట్టీ పార్టీలలోనో, పేరంటకాలలోనో కలుసుకున్నప్పుడు...’నేనెప్పుడూ పట్టుచీరలు, పాతికవేలకు తగ్గని ఫ్యాన్సీ డ్రెస్ లే కడతాను. తక్కువ రకపు దుస్తులు కడితే మావారు ఊరుకోరు’ అంటూ గొప్పలు పోతూ ఉంటుంది తోటికోడలు, ఎప్పుడూ వెంకటగిరి కాటన్ శారీస్ లో ఉండే తన వంక ఓరగా చూస్తూ. మహలక్ష్మి లోలోపలే ఉడుక్కునేది. నీళ్ళున్న చోటకే కప్పలు కుప్పలుతెప్పలుగా చేరినట్టు, ఆడవాళ్ళంతా తోటికోడలి చుట్టూ మూగి ఆవిడ కబుర్లను ఆసక్తిగా ఆలకించడం మహాలక్ష్మికి ఒళ్ళు మండించేది. 

మరోసారి ఎవరింటికో ఏదో ఫంక్షన్ కి వెళ్తే, ’ఏమ్మా, మహాలక్ష్మమ్మా! మీ మరది ఖరీదైన ఫ్లాట్స్ కొనుక్కుని బ్రాండ్ న్యూ కార్లలో తిరుగుతూంటే, మీరింకా ఆ పాత కొంపను వదలరా? కారేదీ కొనుక్కోరా?’ అంటూ ఎవరో మేళమాడడంతో, ఎలాగో అయిపోయింది తనకు...అలాంటి సంఘటనలెన్నో! భర్త ఆదర్శాల మూలంగా ఎన్నో సందర్భాలలో చిన్నతనానికి గురయింది తాను. ఇప్పుడు కొడుకును ఇంజనీరింగ్ చదివించాలన్న తన కల కల్ల కావడం జీర్ణించుకోలేకపోయింది. భర్తపైన మౌనపోరాటం ఆరంభించింది.

     బంధువర్గంలో, స్నేతులలో అప్పారావుకూ అటువంటి అనుభవాలు కలుగకపోలేదు. అలాగని అతను తన పంధా మార్చుకోలేదు. ’వాయిదాల పద్ధతిన మెల్లగా కట్టవచ్చునులే, రెండు ప్లాట్లు ఇస్తాను, తీసుకో’ అని కృష్ణయాదవ్ ఎంత బ్రతిమాలినా ససేమిరా అన్నాడు. కూడబెట్టుకున్న సొమ్ముతోనే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు...వాయిదాలు కట్టడానికి అవస్థపడుతూ, ’అప్పారావుకేమయ్యా, అపర కుబేరుడు! అప్పులు చేసి వాటిని తీర్చడానికి మనలా ఆపసోపాలు పడవలసిన ఖర్మేమిటి!’ అని ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే - ’నేను కుబేరుణ్ణి కాకపోవచ్చును. కాని, పరుగెత్తి పాలుత్రాగడం కంటె నిల్చుని నిదానంగా నీరు త్రాగడమే నాకిష్టం. సులభంగా దొరుకుతున్నాయి కదా అని, లెఫ్ట్ అండ్ రైట్ అప్పులు చేసేసి అప్పులవాళ్ళకు ముఖం చాటేస్తూ బ్రతుకలేను నేను. ఉన్నంతలోనే కలో గంజో త్రాగి...ఇన్స్టాల్మెంట్లు, ఇ.ఎమ్.ఐ. లను గూర్చి పీడకలలు కనకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను,’ అని జవాబిచ్చేవాడు. అలా అంటూంటే అతని వదనంలో సంతృప్తి మెరిసేది. బ్యాంక్ రిప్రెజెంటేటివ్స్ ఎందరో క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటూ అతని వెంట పడి నిరాశకు గురయ్యేవారు.

     అప్పారావుకు అప్పు చేయడమంటే ఎలర్జీకి గల కారణం లేకపోలేదు. చిన్నతనంలో తమ బంధువులలో ఒకతను గొప్పలకోసం దుబారాగా ఖర్చు చేయడమూ, అందుకు ఊరంతా అప్పులు చేయడమూ జరిగింది. చివరికి రోజులు తారుమారు కావడంతో వంద ఎకరాల పొలమూ అమ్ముకుని బికారిలా రోడ్డున పడ్డాడు అతను. ఆ ఉదంతం ఎప్పటికీ మరచిపోలేదు అప్పారావు. ఆనాడే నిశ్చయించుకున్నాడు, జీవితంలో అప్పు చేయరాదని.

#

     రోజులన్నీ ఒకేలా ఉండవు. ప్రపంచాన్ని హఠాత్తుగా ’రిసెషన్ భూతం’ ఆవహించింది. ఆ ప్రభావం దేశం మీద కూడా పడింది. ఫలితంగా, అకాలంలో వచ్చిన గాలివానకు మామిడిపూతంతా రాలిపోయినట్టు, ఉద్యోగాలు - ముఖ్యంగా ఐ.టి. రంగానికి చెందినవి - చాలమందివి ఊడిపోయాయి. మిగిలినవారి జీతభత్యాలు కోతలకు గురయ్యాయి. రిసెషన్ భూతం ఎందరినో కబళించింది. పలు కుటుంబాలను నాశనం చేసింది. అందుక్కారణం - జీవితాలను ప్లాస్టిక్ కార్డులుగా మార్చుకుని, ’ఇ.ఎమ్.ఐ.’ లతో ముడిపెట్టుకోవడమేనంటే అతిశయోక్తి కాదు! 

     రిసెషన్ కి తోడు ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఆ పరిణామాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలూ హుషారయిపోయాయి. మిలియన్లకొద్దీ ఇచ్చిన ఋణాలను రికవర్ చేయడం హెర్క్యూలియన్ టాస్క్ ఐపోయింది. అప్పులు తీర్చవలసిందిగా లబ్ధిదారులపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. చర, స్థిరాస్థులను జప్తుచేసుకున్నాయి. ఫలితంగా కొందరు - కొండొకచో కుటుంబాలతో సహా - ఆత్మహత్యలు చేసుకోవడం కద్దు. వారిలో కృష్ణయాదవ్ ఒకడు!

     కృష్ణయాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త అశనిపాతంలా తగిలింది అప్పారావును...ఆర్థిక సంక్షోభానికి తోడు రాష్ట్ర విభజన ఆందోళనలు ముమ్మరం కావడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిపోయింది. కృష్ణయాదవ్ స్థితి అధోగతి అయింది. ఋణదాతల ఒత్తిడి అధికమయింది. అన్నేళ్ళూ దర్జాగా బ్రతికిన యాదవ్ ఆ ఒత్తిడికి తట్టుకోలేక జీవితం చాలించాడు...శవమై ఉన్న మిత్రుణ్ణి చూసి మౌనంగా రోదించాడు అప్పారావు. రోడ్డున పడ్డ అతని కుటుంబాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది.

     రిసెషన్ వాతను పడ్డవారిలో పాపారావు కూడా ఉండడం విశేషం. అతను పనిచేసే కంపెనీ పలు ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో అతనూ ఒకడు కావడం దురదృష్టకరం... అప్పులు తీర్చడానికి స్థిరచరాస్థులను అమ్ముకోక తప్పలేదు అతను. తాతలనాటి పాత ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. సంస్థలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలదొక్కుకునేందుకు ఉన్న ఉద్యోగులనే వదిలించుకుంటూన్న నేపథ్యంలో, మరో ఉద్యోగం దొరకలేదు. రాజాలా బ్రతికినవాడు, ప్రస్తుతం కుటుంబం ఎలా గడుస్తుందా అన్న బెంగతో చిక్కి శల్యమైపోయాడు. పులి మీద పుట్రలా ఇంజనీరింగ్ పైన యాప్టిట్యూడ్ లేని అతని కొడుకు పరీక్షలలో తప్పుతూ వస్తున్నాడు.

     కృష్ణయాదవ్ ఆత్మహత్య తో, తమ్ముడు ఏమైపోతాడోనన్న భయం పట్టుకుంది అప్పారావును. రోజూ తమ్ముణ్ణి కలుస్తూ ధైర్యం చెప్పసాగాడు. తమ్ముడి కుటుంబం పస్తులు ఉండకుండా తగు ఆదరువులు కూడా పంపించసాగాడు. కష్టాలు కలకాలం ఉండవంటూ తమ్ముడికి నచ్చజెబుతూ, పరిస్థితులు చక్కబడేంతవరకు ఏ అఘాయిత్యమూ చేసుకోనంటూ ప్రమాణం కూడా చేయించుకున్నాడు. మరో ఉద్యోగం దొరికేంతవరకు స్వయంగా ప్రోజెక్ట్ కన్సెల్టెన్సీని ఆరంభించవలసిందిగా సలహా ఇచ్చాడు. అందుకు పెట్టుబడిగా తన ప్రావిడెంట్ ఫండ్ లోంచి సొమ్ము తెచ్చి ఇచ్చాడు...దాంతో పాపారావుకు కొంత ధైర్యం చిక్కింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పలు సంస్థలు ’ఔట్ సోర్సింగ్’ పద్ధతిని అవలంబించడంతో, పాపారావు కన్సల్టెన్సీ సర్వీసెస్ కి గిరాకీ తగిలింది. అది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

     కొన్ని నెలలుగా జరుగుతూన్న ఆ పరిణామాలను మౌనంగా గమనిస్తూన్న మహాలక్ష్మిలో అంతర్మథనం ఆరంభమైంది. తమ కన్నుల ముందే కృష్ణయాదవ్ కుటుంబం అనాథలు కావడం...మరది కుటుంబం చితికిపోవడం...విభ్రాంతికి గురిచేసాయి ఆమెను. ఎప్పుడూ కార్లలో తిరుగుతూ అతిశయంతో ప్రవర్తించే తోటికోడలు ఇప్పుడు సిటీబస్ లో స్కూల్ కి వెళ్తూంటే, అంతవరకూ చిన్నచూపు చూసిన కాటన్ శారీస్ నే కడుతూంటే... ఆమె పట్ల జాలి. సానుభూతీ తప్ప వేరే భావం కలగలేదు. ఆ మార్పును ఆమె తట్టుకునేందుకు అవసరమైన సహకారాన్ని తన వంతుగా అందించింది. అప్పును నిప్పుగా భావించే తన భర్త గొప్పదనం మహాలక్ష్మికి ఆకళింపుకు వచ్చింది. అనవసరపు ఆడంబరాలకు పోయి తాము కూడా అప్పుల పాలయి ఉంటే...తమ బతుకులు ఏమయివుండేవా అన్న ఆలోచనే ఆమెను కలవరపరచింది.

     పాపారావు నిలద్రొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది. అతని కొడుకు ఇంజనీరింగ్ బ్యాక్ లాగ్ అలాగే ఉండిపోయింది...అప్పారావు కొడుకు డిగ్రీ తరువాత, సివిల్స్ మెయిన్స్ కూడా పాసయ్యాడు. మౌఖిక పరీక్షకు ప్రిపేర్ కాసాగాడు. కూతురికి తమ పరిధిలో తగు సంబంధం చూసి నిశ్చితార్థం జరిపించేసాడు అప్పారావు.

     ఫంక్షన్ కి వచ్చినవారంతా అప్పులు చేయకుండా సమర్థవంతంగా సంసారసాగరాన్ని ఈదుకుంటూ వస్తూన్న అప్పారావు తెలివితేటల్ని శ్లాఘిస్తూంటే - అర్థాంగి అయ్యుండీ భర్త గొప్పదనాన్ని అర్థంచేసుకోలేకపోయిన తన బుద్ధిమాంద్యాన్ని నిందించుకోకుండా ఉండలేకపోయింది మహాలక్ష్మి. ఆ రాత్రి పడకగదిలో అదే విషయం ప్రస్తావిస్తూ, "ఇన్నాళ్ళూ అప్పులు చేసి విల్లాలూ, కార్లూ కొనుక్కునేవారిని చూసి వాళ్ళంతా మనకన్నా ఎంతో ఎత్తున ఉన్నారనుకునేదాన్ని. ఇప్పుడు నా కళ్ళు తెరచుకున్నాయి. అప్పు లేనివాడే అధిక సంపన్నుడన్న సత్యం గ్రహించలేక మీ మనసు బాధపెట్టాను. నన్ను క్షమించండీ!" అంటూన్న భార్యను మందహాసంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు అప్పారావు.

                                                                  ******


Rate this content
Log in

Similar telugu story from Inspirational